వద్దురా —
గోలోకం –నాదా కృష్ణా !మురళి వాయిస్తూ భూలోకం వెళ్ళకు .అందులోంచి తు౦పురులు బయటకొచ్చి నీకూ గోపాలురకు ఇబ్బంది కలిగించి అదేదో ‘’కరోడా ‘’అట అంటుకుంటుంది .నువ్వు అసలే పిచ్చిమారాజువు .అది ఇక్కడికి తెస్తే మనం ఏమీ చెయ్యలేం . చద్దన్నాలని ఎంగిళ్ళ ని ,మురళి వాయిస్తామని ,నీ మురళి లాక్కోవచ్చు ‘’అంటు’’తో అంటుకునే మహమ్మారి అట .నువ్వు దయార్ద్ర హృదయుడివి .చిన్ననాటి నెచ్చెలి అని కుచేలుని అటుకులు తినేవ్ .ఆయన ఎంగిలి నీకు అభ్యంతరం లేదు కాని, నా జాగ్రత్త నేను పడాలిగా .నిరంతరం నీ వెంటే నేనుంటున్నా ఎప్పుడో కనుమాయచేసి వ్రేపల్లె గొల్ల వనితలతో సరసాలాడి, ‘’కిందా మీదా ‘’అవుతావ్ .ఇకిలి౦పులు ,సకిలింపులు కౌగిళ్ళు, వేధింపులు ,సాధింపులు ,లాలనలు ,పాలనలు తో ఆ సూక్ష్మజీవి ప్రకోపిస్తే కొ౦ప లంటుకుంటాయి .మీ అమ్మ వడిలో గారాలుపోయినా ముప్పే ముకుందా .మీ అన్న గారిని వెంటేసుకొని అడవులు ,లోయలు తిరగద్దు. యమునా నదీ విహారం ,వెన్నెల్లొడపిల్లల్తొ జల్సాలు చేస్తే నా వల్ల కాదు వేణుగోపాలా !పాలు వెన్నామింగి కొంప కొల్లేరు చేయకు కొంటె కృష్ణా. కాళింది మడుగు బురదమయం ట .ఆ నీళ్లు ప్రమాదమట .పడగలపై అడకయ్యా పావన నామా .రోలు ముట్టుకున్నా, మద్ది చెట్లు కూల్చినా చేతులు తాకటమే కదా త్వరగా ఆ జీవులు వ్యాపిస్తాయట .బండీ ,ఎద్దు , ధేనువుల జోలికి వెళ్ళద్దు దేవకీ నందనా .తేరగా ఇస్తోందని పూతన పాలు తాగితే, రోగం అంటుకొని రొస్టున పడతావ్ .అసలే శరదృతువు .నీకు మరింత ఉద్దీపనకలిగిస్తుంది .రాసక్రీడల మొనగాడివి . చెట్ల వెంటా, పుట్టలవెంటా చెట్టాపట్టాలేసుకొని ఆలింగనం తో మై మరచిపోతే అసలుకే మోసం రాస విహారీ .అస్టభార్యలూ ,పదహారు వేల కన్యలూ మర్చిపో .ఇది నా ఆన .అందుకే నిన్ను నా ఇంట్లోనే బందీ చేస్తా .నా గదిలోనే అన్నిజాగ్రత్తలతో అదేదో’’ క్వారన్ టైన్’’ ట అందులో ఉంచినట్లు ఉంచేస్తా .కనుక ఒద్దురా కన్నయ్యా ,పోవద్దురా అయ్యా ‘’.
కైలాసం –వినాయకుడు -ఒరేయ్ అనిన్ద్యా !నా దగ్గర అయిదు నిమిషాలు ఉండవ్ ఎప్పుడూ కలుగుల్లో నక్కుతావ్ .సుస్టుగా నాతో భో౦ చేస్తున్నా ,ఇంకా కక్కుర్తి ఎందుకు .భూలోకం పోయి మూతలు పడేసి ఉన్నవి హుష్ కాకీ చేసి చటుక్కున తిరిగోస్తావ్ .ఇక అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు .అత్యవసర పరిస్థితి ఉందక్కడ .స్పర్శ తో వచ్చే జబ్బు ట ప్రపంచమంతా వ్యాపించి భీభత్సం చేస్తోంది .నువ్వు అక్కడ ఎంగిలి చేసి ఇక్కడికొస్తే ఇక్కడా అదే భీభత్సం వచ్చి దిక్కుండదు .నాన్నగారు కూడా ఏమీచేయలేరు .శక్తిమయి అమ్మ వల్లాకాదు.కుడుములు ఉండ్రాళ్ళు అటుకులు నానుబెల్లం చలిమిడి ,పానకాలు ముట్టుకోకు .అన్నీ బంద్. మాంసాహారం అనర్ధం తెస్తోంది .ఒళ్ళు దగ్గర పెట్టుకో .ఆ జబ్బు అంటుకుంటే అంతే. మందూ లేదు మాకూ లేదు .అందుకే నిన్ను నా కాలి కింద గూట్లో బంధిస్తున్నా .వద్దురా ,ఎక్కడికీ వెళ్ళద్దురా’’.
పార్వతి శివుడితో –‘’ప్రాణేశ్వరా ! భూలోకం భయానకంగా ఉందని నారదుడు చెప్పి వెళ్ళాడు ఇప్పుడే .కొత్త వైరస్ వ్యాపించి అల్లకల్లోలం చేస్తోందట .మందులేదట .అంటుకుంటే వస్తుందట ఆ జబ్బు .మీరేమో భోళా శంకరులాయే.ఏ నరుడో వానరుడో దానవుడో కొ౦పమునిగే తపస్సు చేస్తే ,మీ అర్ద భాగం గా ఉన్న నాకే తెలీకుండా, గుట్టు చప్పుడు కాకుండా పరిగెత్తుకెళ్ళి వాళ్ళకు అడ్డదిడ్డమైన వరాలు ఇచ్చేసి చక్కారావటం, వాళ్ళు లోక భీకరులై ప్రవర్తించటం ,డీలా పడి మీరుంటే, అన్నయ్య విష్ణుమూర్తి వచ్చి ఏదో చిట్కాతో పరిష్కరించటం జరిగింది ఇన్నాళ్ళూ .మళ్ళీ ఏ భస్మాసురుడు లాంటి వాడో తపస్సు చేస్తే జాలిపడి వరం ఇస్తే వాడు మీ నెత్తిన చెయ్యి పెడితే సర్వమంగళ నైన నాకు కూడా దిక్కు ఉండదు .మీ తలద్వారా నాకు అంటుకొని కైలాసం గోవిందో హారి . నెత్తికెక్కి కూర్చున్నమీ ముద్దులావిడ తో సరసం బంద్ చేయకపోతే ప్రళయమే .నీటి వలన వ్యాపించే క్రిమిట ఇప్పుడు విశ్వాన్ని అంతట్నీ వణికించేది . మీ పాములూ పుర్రెలు చర్మాలు తాకితే చాలు క్రిములు విపరీతంగా పెరిగి పోతాయట.వీటన్నిటిని కట్టడి చేయటం నా వల్ల కాదు భూతనాథా,పశుపతీ ఈశ్వరా , పరమేశ్వరా . కనుక ఇక మీరెక్కడికీ వెళ్ళటానికి ఒప్పుకోను .క్వారంటైన్ లాంటి ‘’డీప్ ఫ్రిజ్ ‘’పెట్టె తయారు చేయించాను .అందులోనే మీమకాం .వద్దురా వృషాధిపతీ !త్వరపడి ఎక్కడికీ పోవద్దురా శంభూ .’’
‘’వద్దురా కన్నయ్యా ,పోవద్దురా వృషాదిపతీ, వెళ్ళోద్దురా -వెళ్ళద్దు వెళ్ళద్దు వెళ్ళద్దు ‘’
అంటూ పలవరిస్తుంటే మా ఆవిడ వచ్చి’’ ఏమిటీ కూని రాగాలు పొద్దున్నే .పనీ పాటా లేకపోతె సరి ‘’ అని నాలుగు ఝాడిస్తే కాని అది కల అని తెలియలేదు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-20-ఉయ్యూరు