ప్రపంచ కుగ్రామం ప్రచండంగా కునారిల్లుతోంది
ప్రపంచమొక కుగ్రామం మనమంతా ఆ గ్రామవాసులం
అని చాతీ విరిచి రొమ్ము చరఛి నిన్నటి దాకా చెప్పుకున్న మనం
ఇవాళ కరోనా కల్లోలంతో మనిషి మనిషికీ
బారెడు దూరం పాటిస్తున్నాం ,
కలుసుకోవటానికి భయపడి పోతున్నాం .
లాక్ డౌన్, లాకౌట్ లతో ఏకాకులమై
ఏకాంత కూ దగ్గరకాకుండా
ఏకాంతవాసం చేస్తున్నాం
మన సైన్స్ టెక్నాలజీ లు
కలిపి ఉంచాల్సిన మనల్ని
క్వారంటైన్ లలోకి నెట్టి 14రోజులు శిక్షిస్తున్నాయి
రెక్కాడితేకాని డొక్కాడని నిర్భాగ్యులు
ఇటు ఆకలి కేకలతో అటు కరోనా కోరలతో
విలవిలలాడుతూ దిక్కుతోచక దిగాలుగా ఉన్నారు
సుమారు అరవై ఏళ్ళక్రితం చైనా కవ్విస్తే
యుద్ధానికి దిగి తుప్పు తుపాకులతోపోరాడి
బదులు చెప్పలేకకుప్పకూలి ఓడిపోయాం
నాటి ప్రధాని అవమానభారంతో మంచం పట్టాడు కూడా
ఇప్పుడు మళ్ళీ అదే చైనాలో ప్రకోపించిన కరోనా ను
ముందు నష్టపోయినా తర్వాత తెలివిగా ప్రవర్తించి
ఉపద్రవంనుంచి కాపాడుకొన్నదా దేశం
వనరులు సమకూర్చుకొని మళ్ళీ ప్రపంచాన్ని శాసిస్తోంది
‘’నాగరకతా వ్యామోహంలో కన్నీళ్ళ నడుక్కుంటున్న
యుగ భిక్షువును నేను ‘’అని ఆనాడేప్పుడో
చెప్పిన కవి వాక్యం నేడు రుజువైంది.
సుమారు యాభై ఏళ్ళ హస్తం పాలన ను
అపహాస్యం చేసి ,పొడిచేస్తాం నలిపేస్తాం
ఉషస్సులు కుమ్మరిస్తామని గద్దెనెక్కిన నేతలు
ఆర్ధిక పరిపుష్టి సంగతి వదిలేసి వ్యంగ్యబాణాలతో
వ్యవస్థలన్నీ ధ్వంసం చేసి ప్రజాస్వామ్యం అంటే ఇదా
అని ముక్కున వ్రేలేసుకోనేట్లు చేసి
తమాషా చూస్తున్నారు చేతకాక
తలలు బ్రద్దలు కొట్టుకొంటున్నారు
యాభై ఆరు అంగుళాల ఛాతీలో
నాలుగంగుళాల హృదయం
మనసు వికసశించలేక అనర్ధంసృష్టి స్తోంది
నిబద్ధతలేని పాలన,ఆలోచనలేని ఆచరణ ,
తొందరపాటు నిర్ణయాలతో ఇప్పటికే
ఆరేళ్ళు కష్టనష్టాలు పడ్డాం
కరోనా రూపు మాపటానికి లాకౌట్లు గట్రా
తాత్కాలిక ఉపశమనాలే తప్ప
పూర్తి పరిష్కారాలు కాదు
సమర్ధ నాయకత్వం నిస్వార్ధ జీవనం
ఆడంబరరహిత పాలన మాత్రమే పరిష్కారం
ఆరోగ్యం పై డబ్బు ఖర్చు చేయలేని ప్రభుత
సువ్యవస్థ లేని ప్రజారోగ్య పధకాలు
మనపాలిటి ఇప్పటిశాపాలు
సంకల్ప శక్తి లేని వాగాడంబరం తెచ్చిన ,తెస్తున్న
అనర్ధాన్ని నేడు మనం అనుభవిస్తున్నాం
తగినన్ని ఆస్పత్రుల్లేవు పడకల్లేవు మందుల్లేవు
మాస్కులులేవు వెంటిలేటర్లు లేవు
చేతులుకాలాక ఆకులు పట్టుకొన్న చందం
ఘనత వహించిన మన ప్రభుత్వాలది
ఎన్నికలలో ఎలాగైనా,ఎన్ని కోట్లు గుమ్మరించైనా,
ప్రత్యర్ధుల ను అన్ని సామదాన భేద దండోపాయాలతో
ఎన్నిక యంత్రాలనూ మంత్ర జాలం తో
నియంత్రించి, పీ.కే .లాంటి వారికి సలహా వ్యూహాలకోసం
కోట్లు మంచినీరులా ప్రవహింపజేసి
గెలవాలన్న ధ్యేయం ఉండి గెలిచిన పాలకులకు
ప్రజారోగ్యం తో పనేమిటి ?
అలాంటి పకడ్బందీ వ్యూహాలు ప్రజారోగ్యం కోసం
ఆర్ధిక పరిపుష్టి కోసం వెచ్చిస్తే యెంత బాగుండును ?
ఎవర్ని లాకప్ లో పెడదామా ఎక్కడ కబ్జా చేద్దామా
ఎవరి ఇజ్జత్ నాశనం చేద్దామా
అన్న వాటిపై పై ఉన్నయావ
ప్రజా సంక్షేమం కోసం పెడితే దేశం నందనవనం కాదా !
ప్రక్కదేశం పై సైనిక దాడి చేసి ఎన్నిక ఫలితం
రాబట్టే నాయకులకు
రైతుల కూలీలనిరుద్యోగుల ప్రభుత్వ వ్యవస్థల
బాగుకోసం ఆలోచించే తీరిక లేకపోబట్టే ఇంత
ఆర్ధిక విష విలయం చుట్టూ ముట్టేసింది
కరోనానే వణకించే శక్తి సామర్ధ్యాలున్న
వారికి ప్రజలతో సంబంధమేమిటి
ఎలెక్షన్ రోజుల్లో తప్ప ?
ఇలాగే ఉంటే పాలించే మీరు .
పాలించటానికి ప్రజలు మిగలరని
ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి
అన్నిటికీ రాజకీయం చేస్తే
చరిత్ర హీనులై మిగిలిపోతారు
తస్మాత్ జాగ్రత జాగ్రత
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-3-20-ఉయ్యూరు