కరోనా కల్యాణం
రాముడు –ఏమిటిపూజారీ !నాకు ఆరు గజాల దూరం లో కూర్చుని నాపై పూలు విసురుతూ పూజచేస్తూ ముక్కుకేదో గుడ్డ కట్టుకొని మంత్రాలు చదూతున్నావ్ .అసలు మామూలుగా నువ్వు చదివితేనే మంత్రాలని తెలీదు ఈ ముక్కు గుడ్డతో ముక్కుమూతతో నన్ను తిడుతున్నావో పొగుడుతున్నావో అర్ధం కావట౦ లేదు . అదీకాక ఆ కర్ర ఏమిటి కర్ర చివర గిన్నె మేకుతో బిగించి అందులో నాకు నైవేద్యం పెడుతున్నావ్ పోకిరి సినిమాలో ఆలీ అలాటి కర్ర డిప్ప తో అడుక్కున్నట్లు .
పూజారి -క్షమించాలి రామయ్యా .కరోనా వైరస్ భయం వల్ల అలాచేస్తున్నాను .ఇంకో పదిహేను రోజులు తప్పదు .
రామ- –నీ భయం చూస్తె –కమలహాసన్ ‘’తెనాలి’’ సినిమాలో బతుకు ,భయం చావు భయం ,తింటే భయం, తినకపోతే భయం, కూచుంటే భయం, నుంచుంటే భయం అంటూ డాక్టర్ తో ‘’భయం దండకం’’ చదివినట్లుంది .అది సరే .పొద్దున్న సుప్రభాతం లేదు ,బాలభోగం లేదు, నైవేద్యమూ అంత౦త మాత్రమె,వండిన గిన్నెలుమాత్రం పెద్దవే తెస్తున్నావ్ .నాకుమాత్రం మూతికి వాసన చూపిస్తూ కాలక్షేపం చేస్తున్నావ్ .భక్తులరద్దీ కూడా లేదు .అప్పుడొకరు అప్పుడొకరు తప్ప.
పూజారి –స్వామీ !ఇది దేవరహస్యం .ఎవరికీచెప్పలేను .తప్పనిపించినా తప్పటం లేదు ప్రభూ
దేవుడు -అదేదో బద్దలు చెయ్యి
పూజారి –కష్టం స్వామీ .
రామ- –నన్నే చెప్పమంటావా .నువ్వే చెబుతావా
పూజారి –సర్వాంతర్యామివి నీకు తెలియని రహస్యాలు౦టాయా రామయతండ్రీ .నువ్వెందుకు లే. నేనే చెప్పి పాపప్రక్షాళన చేసుకొంటా.ఆలయ చైర్మన్ ,కమిటీ మెంబర్లు అందరికీ ఇళ్ళకు ప్రసాదాలు పంపకపోతే రోజూ ప్రసాదం ‘’పడి ‘’మంజూరు చేయరు .నువ్వు తినేదిలేదు, నేనూ నాపిల్లలూ తినేది లేదు .దేవుడి సొమ్ము దెయ్యాలపాలు అంటే ఇదేనేమో స్వామీ మన్నించు .
అయినా ఇన్ని సినిమా కబుర్లు చెబుతున్నావ్ నీకెలా తెలుసు ?
రామ- –గుడిలో టివి ఉందిగా .నువ్వు ఆన్ చేసి నీమానాన నువ్వు పొతే కాలక్షేపం లేక చెత్తలన్నీ చూడాల్సోస్తోంది .ఖర్మ .అది సరే ఇవాళ శ్రీరామనవమి కదా విశేషం ,కల్యాణం ఉన్నాయా ?ఇవాళాపస్తేనా ?
పూజారి- లేకేం ప్రభో .అన్నీ జరిపిస్తా .ట్రస్టీ గారు 10కిలోలబెల్లం ,దానికి సరిపడా దినుసులు పానకం కోసం కొన్నారని చక్రపొంగలి పులిహోర నైవేద్యాలకూ భారీ ఏర్పాటు చేశారని కబురపి౦చారు .
రామ –ఐతే నా పుణ్యం ఈరోజు పుచ్చిన్దన్నమాట .ఆ సరుకు లేవీ ఇక్కడ కనబడటం లేదే .
పూజారి –ఓయి తెలివి తక్కువ రామయ్యా !అవి రసీదులకు ,బిల్లులకే కాని వినియోగానికి కాదని నీకు తెలీదా”?
రామ –అయ్యో రామ .ఇదో భాగవతమా ?ఇంతకీ కల్యాణం అయినా ఘనం గా చేస్తావా ?దాని ఏర్పాట్లు ఎలా ఉన్నాయ్ ?
పూజారి –ఘనంగానే మాటల్లో .చేతల్లో మాత్రం ఏమీ ఉండదు .అరె గుట్టుచేప్పేశానే ..నూతనవస్త్రాలు ,పూజా సామగ్రి,తలంబ్రాల బియ్యం ,దండలు మేళాలు –
రామ –ఎంతకమ్మని మాటలు చెప్పావయ్యా
పూజారి –నీకు ఆత్రం ఎక్కువ కోదండ రామా .అవి కొందామంటే దుకాణాలు ఉదయం 9కే బంద్ ట .అవేమీ కుదరవన్నాడు ట్రస్టీ .
రామ –నాసంతోషం పై పానకం నీళ్ళు కుమ్మరించావు కదయ్యా .ఇవీ కొంటాడా కొన్నట్లే అనుకోమంటాడా
పూజారి –ప్రత్యేకించిచెప్పేదేమీ లేదు స్వామీ .అన్నిటికీ ల కేత్వమిస్తే , దాకు కొమ్మిస్తేనే.అంటే ‘’లేదు ‘’అని అర్ధం అని చెప్పాలా ,సర్వాంతర్యామి ?
రామా –అసలు రేపు కల్యాణం ఎలా నిర్వహిస్తావ్ ?
పూజారి –సీతమ్మతల్లి నీ ప్రక్కన కూర్చోబెడదామంటే ‘’టచ్ ‘’భయం .నిరుటి కొబ్బరి చిప్పలు లు మంగళసూత్రాలు మట్టెలూ ,ఉత్తర జంధ్యాలు ఉన్నాయిలే .నిత్యపూజకు పూవులేలేవు .ఇక దండలేక్కడి నుంచి తేనయ్యా ,?అర్ధం చేసుకోవూ .మామూలుగా వాడే అక్షితలే తలంబ్రాలుగా వాడుతా .పీటలపై కూర్చుని కల్యాణం జరిపేవారు ఉండరుకనుక .కూతా మేతా రెండూ నేనే . భక్తులకూ ప్రవేశం లేదు కనుక ఇంట్లో చేసిన వంటలే నైవేద్యం .ఎలాగూ జీలకర్రా బెల్లం ఇంట్లో ఉండేవే కనుక నూరించి తెచ్చి మీ దంపతుల శిరసులపై నేనే ఉంచి మా౦గల్యాలూ వగైరా మీరు చేసినట్లే యాక్ట్ చేసి ,మా౦గల్య ధారణా నేనే చేసి సారీస్వామీ నువ్వు చేసినట్లుగా నేనే నటించి ఆపనీ చేస్తాను .తలంబ్రాలు కూడా నేనే పోస్తాను మీ ఇద్దరికీ .మేళాలు తాళాలు ఉండరాదుకనుక దేవుడిగంటే ‘’నౌబత్ ఖానా ‘’అనుకోని నెమ్మదిగా వినిపించీ వినిపిచాకుండా ఆ ఆవిడతో కొట్టించి తంతు జరిపిస్తా . సమ్మతమేనా రామా ?
రామ –ఇదోటా నా ఇస్టా యిష్టా లతోనే ఇవన్నీ చేస్తున్నట్లు ఆపోజోకటి .సరే అలాగే అఘోరించు .
పూజారి –కోపం వచ్చింది దేవరకు . స్వామీ –మొత్తం పావుగంటలో గుంటకొట్టిగంట వాయి౦ చేస్తాగా డోంట్ వర్రీ.
రామ –వర్రీ లేదు కర్రీ లేదు .ఇక ఆలస్యం చేయకుండా తంతు పూర్తి చెయ్యి .ఇవీ ‘’ఆలీ చిప్పలతోనే ‘’చేస్తావా ?
పూజారి –ఎంతమాట .తప్పదు స్వామి .కనీస దూరం ,ముక్కుకు’’ ముసుగు ‘’అదే లే స్వామీ ‘’మాస్కు ‘’ నాకూ ,మీ దంపతులకూ తప్పదు.
రామ –అంటే’’ కరోనా కల్యాణం’’ జరిపిస్తావన్నమాట.
పూజారి –అంతేగా ,అంతే మరి.
సీన్ -2-వైకుంఠం
లక్ష్మి -నాథా! వామా౦క౦ మీద ఎప్పుడూ ఉండే నన్ను దూరంగా పీఠం మీద కూర్చోపెట్టి వినోదం చూస్తున్నారు .అంత అంటరాని దానినైపోయానా ?
విష్ణు –లేదు శ్రీదేవీ !జాగ్రత్త పడుతున్నా .అదేదో క్రిమి ప్రపంచమంతా పాకి భయపెడుతోందట .ఇక్కడికి కూడా వచ్చిందేమో అని భయం
లక్ష్మి –వస్తే ఏం చేస్తుంది .అసలు ఎలా వస్తుంది ఇక్కడికి .
విష్ణు –మనభక్తులు ఇప్పుడు భారత దేశం లోనే కాదు ప్రపంచమంతా ఉన్నారు ఎక్కడ ఏ దేశం లో ఏ భక్తుడి పుణ్యమో పుచ్చి ఇక్కడికి రావచ్చు. అతడు కరోనా బాదితుడూకావచ్చు.
లక్ష్మి -ఐతే
విష్ణు –ఆతను వెంటతెచ్చే క్రిమి మనం తాకితే దాని బారి పడినట్లే .స్పర్శ వల్ల వ్యాపిస్తుందట ఆజబ్బు .అందుకే నీకూ నాకూ అంత౦ దూరం .మన మధ్య ముద్దులు ముచ్చట్లు సరసాలు సల్లాపాలు కౌగిలింతలూ కేరింతలు ఇక బంద్.సమాన దూరమే మనల్ని కాపాడేది .
లక్ష్మి –మన౦ అన్నిటికీ అతీతులం .మనల్నేవరూ ఎమీచేయ లేరని ధీమాతో ఉన్నాం .మనకీ కస్టాలేమిటి స్వామీ ?
విష్ణు –ఆ క్రిమి మనకంటే శక్తివంతం .దానిముందు నా చక్రాయుధం శివుడి త్రిశూలం ఇంద్రుని వజ్రాయుధం కూడా బలాదూర్ .అందుకే అన్ని జాగ్రత్తలు .
లక్ష్మి –మూతికి ఎదోకట్టుకొన్నారేమిటి నాధా?
విష్ణు –అదే ఇప్పుడు వజ్రకవచం అందరి పాలిట .నీకూ ఒకటి తయారు చేయించా ఇదిగో కట్టుకో .
లక్ష్మి –ఇదికట్టుకొని మాట్లాడితే పెదిమలుకదుల్తున్నాయేకాని శబ్దం బయటికి రావట్లేదు .అగ్గి రాముడు సినిమాలో మూతికీ ముక్కుకూ కళ్ళకూ రామారావు గుడ్డకట్టుకొన్నట్లుంది .
ఈ బాధ తప్పదా నాధా?
విష్ణు –ఇంకో పదిహేను రోజులు ఈ అవస్థ తప్పదు దేవీ భరించాలి. మనకోసం మన లోకం మన పిల్లలు మనవలు మనవరాళ్ళు ,దాస దాసీ జనం కోసం కోసం .వాళ్ళకీ ఈ గుడ్డలు తయారు చేయిస్తున్నాను .
శ్రీరామనవమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-4-20-ఉయ్యూరు