ప్రపంచమానవాళి కరోన వైరస్ ,కోవిద్

విలవిల-కలకల
ప్రపంచమానవాళి కరోన వైరస్ ,కోవిద్ వ్యాధులతో అలమటిస్తూ ,ప్రభుత్వాలు విధిస్తున్న అంతులేని లాకౌట్లు, లాక్ డౌన్లు విధిగా భరిస్తూ ఇల్లే ‘’క్వార౦టైన్’’గా గృహనిర్బంధం లో ఉంటూ, అన్ని పనులు ఇంట్లోనే కానిస్తూ ,బయటి ప్రపంచం లోకి వీలయితే ఒక గంటో,రెండుగంటలో ముసుగువీరుల్లా తిరిగొస్తూ, వీధులన్నీ నిర్మానుష్యం చేస్తూ ,’’ఇక్కడ అసలు జనాభా ఉండేవారా ?’’అనేట్లు ప్రవర్తిస్తూ దాదాపు 15రోజులు గడిపారు .పత్రికలూ టివి లలో మృత్యుభయం వార్తలు చూడలేక ,చూసిన వే మళ్ళీగా సీరియల్స్ చూస్తూ ,పిల్లలను యేమీ అనలేక, వాళ్ళు సెల్ లో ,టాబ్లెట్ లలో గేమ్స్ ఆడుకుంటుంటే మందలించలేక, చదూ కోమని చెప్పాలేక ,ఆడుకోమనటానికి వీలూ లేక ,భార్యపై కోపం ప్రదర్శించలేక భర్తలు ,భర్తలపై సాఫ్ట్ కార్నర్ తో భార్యలూ అత్తామామలపై సాధింపులు మానిన కోడళ్ళు అన్నీ మూసుకొని ఇళ్లలోనే మగ్గిపోతూ ఇదే ఆనందం పరమానందం అనుకొంటూ కన్నీరు పెట్టుకోలేక’’ విలవిల ‘’లాడుతున్నారు మనస్వాతంత్ర్యాన్ని మరెవరో కాజేశారని భ్రమలో .అంతేకాని ఇదంతా మనం చేసుకొన్నప్రారబ్ధమే అనే ‘’ఎరుక’’ రాక పోవటం బాధాకరమే .నరసంచారం లేని రోడ్లు పార్కులు పబ్బులు క్లబ్బులు బార్లు ఆటలు వినోదాలు విందులు ,డేటింగులు ,అర్ధరాత్రి స్వైర విహారాలు పార్కుల్లో అసభ్య శృంగార కేళీ విలాసాలు ,దైవ కళ్యాణాలు మనిషిని అంతర్ముఖం చేశాయా ?చేసి ఉంటె ఎంతో మేలు సమాజానికి కుటుంబాలకు దేశానికీ .ఇదీ జన కీకారణ్యం సంగతి ఇప్పుడు .
ఒక్కసారి అటు అసలు అరణ్యం లోకి తొంగి చూద్దాం .వేటగాళ్ళు రాకపోవటం వలన జంతువులూ ,పక్షులు ‘’కిలకిల’’నవ్వుకొంటున్నాయి ప్రాణహాని తప్పి పోయింది తాత్కాలికంగా నైనా అని ఊపిరి పీల్చుకొంటున్నాయి .’’హమ్మయ్య’’ మళ్ళీ మనజోలికి మనిషి రాకుండా ఉంటె బాగుండునని భావిస్తున్నాయి .చెట్లు ,పొదలు ,లతలు ని౦డుపూలతో ఫలాలతో కనువిందు చేస్తున్నాయి .శుకపికాలు కోయిలలు గొంతెత్తి స్వాతంత్ర్య గీతాలు పాడుతున్నాయా అన్నట్లు కలకల రవాలు చేస్తూ ఆనందంగా పల్టీలు కొడుతూ ,ఇక ఆనందమే అంబరమైతే అన్నట్లు మహా భోగాన్ని అనుభవిస్తున్నాయి .సింహ శార్దూలాలు తమ పెద్దరికం నిలుపుకొంటూ జంతుజాలంతో సఖ్యతగా మెలుగుతున్నాయి .నక్కలు స్వతహాగా వచ్చిన తమజాతి లక్షణాలు జిత్తులు ఎత్తులూ మానేసి ‘’కరటక దమనకుల్లా’’కాకుండా మహా బుద్ధిగా ఉన్నాయి .అడవి పందులు ముస్టులతో నేల త్రవ్వుకొంటూ వీర విహారం చేస్తున్నాయి .భల్లూకాలు’’తమజాతి పిత ‘’జాంబవంతుని పెద్దరికం గుర్తు చేసుకొని పెద్దరికంతో ప్రవర్తిస్తున్నాయి .అడవి ఏనుగులు ,గుర్రాలు పరుగు పందాలు పెట్టుకొని ఆనందం పంచుతున్నాయి .తేనెటీగలు వికసించిన పూల మకరందాన్ని హాయిగా గ్రోలుతూ తుట్టెలు ఇబ్బదడిముబ్బడిగాపెట్టి వాటిని దొంగిలించే దొంగ మానవులు లేక, రాకపోవటంతో అడవి లో’’ తేనె వాకల’’ను ప్రవహింప జేస్తున్నాయి .పూర్వం రుష్యాశ్రమాలుగా ఇప్పుడు అడవి గోచరిస్తోంది సహజీవన సౌందర్యం వికసిస్తోంది .నెమళ్ళు పురి విప్పి ఆనంద నాట్యం చేసి అడవిలో ఇంద్రధనుసులను సృస్టిస్తున్నాయా అనిపిస్తున్నాయి .గుడ్లగూబలు రాత్రిళ్ళే కాక ,పగలూ కళ్ళు ‘’పొడుచు’’కొంటూ మసక కనులతో ఎగురుతున్నాయి .ఎందుకు వీటికి ఆనందం అంటే చైనాలో గబ్బిలాలు పీక్కు తినటం మానేసినందుకు తమజాతి సంపద నష్టం కాకుండా ఉన్నదుకు .
ఎప్పుడో ఎరుక ,ఏనాదులు తిండికి గతిలేక ‘అడవులలో ‘’అలుగు’’లను వేటాడి తినేవారు .నాగరకత బలిసిన దేశాలలో ఇప్పుడు నానా ‘’అలగా జాతులు’’ వాటిని తినటం ఫ్యాషనయి తమ ఉనికికే ప్రమాద ఘంటికలు మ్రోగాక తప్పు తెలుసుకొని అలుగులపై ఆశ హరి౦చు కొని బతుకుతున్నారని సంతోషం వాటిల్లో కనిపిస్తోంది .ఇవే కాదు పాములపై తేళ్ళు జెర్రులూ ఎక్కి స్వారీ చేస్తున్నా కిమ్మనటం లేదు .ఆవులూ దూడలు ఎద్దులూ తమ మాంసం తినటానికి మనుషులు భయపడుతు౦డ టంతో కేరింతలు అ౦బారవాలు రంకెలతో అడవి అంతా ‘’క్షీర సాగరమై’’ అడవిలో ‘’నాద కచేరీ ‘’చేస్తున్నాయి విస్త్రుతానందం తో.కాకులు కోకిలలను సాకుతున్నాయి. గోరువంకలు చిలుకలతో సంసార సౌఖ్యం అనుభవిస్తున్నాయి .వాల్మీకి వచ్చి ‘’మా నిషాద ‘’అంటూ ఆక్రోశించాల్సిన అవసరమే కనిపించటంలేదు .చిట్టిపొట్టి పిచుకలు గూళ్ళు అనంతంగా కట్టుకొని గుట్టుగా గూళ్ళల్లో కాపురాలు చేసుకొంటూ కిచకిచలతో సంతోషం పంచుతున్నాయి . దంతాలు పీక్కుపోయే వారి భయం లేకపోవటం తో, హాయిగా సరస్సులలో జలక్రీడలాడుతూ తొండాలతో నీళ్ళు చల్లుకొంటూ ,రతికేళి లో మైమరచి మదస్రావంతో వి౦త వాసనలు వ్యాపింపజేస్తూ తిరుగుతున్నాయి .సరస్సుల్లో ‘’మకరి’’ఉన్నా , ,’’కరి’’ని ఏమీ చేయకుండా ,’’గజేంద్ర మోక్షం’’ దృశ్యం పునరావృత్తం కాకుండా స్నేహహస్తం చాచి’’ హస్తి’’తో కరచాలనం చేస్తోందా అనిపిస్తోంది .చారల చారల జీబ్రాలుదుముకుతూ పరుగులు తీస్తూ తమ అందాన్నీ హోయలను ఒలకబోస్తున్నాయి . ఒంటెలు, అల్ జజీరాలు మెడ సాచే అవసరం లేకుండా చెట్లు కిందకి వంగి మిత్రత్వం నెరుపుతున్నాయి .ఉడతలు ,కుందేళ్ళు ,జింకలు, దుప్పులు వేటగాళ్ళ భయం లేనదున మహా ఆనందంగా యెగిరి గంతులేస్తున్నాయి .వాటి ఆనందానికి పట్టపగ్గాలు లేవు .ఖడ్గమృగాలు చూపుల గా౦భీర్యమే కాని హింసా ధోరణి ప్రదర్శించటం లేదు.అడవి దున్నలు స్వైర విహారం చేస్తున్నాయి.కోతులు కొండముచ్చుల ‘’కిచకిచ’’లతో మర్కట కిశోర న్యాయంగా తమపిల్లలను పొట్ట కింద కరుచుకొని గెంతుతూ దుముకుతూ పళ్ళు తింటూ తినిపిస్తూ శాఖాచంక్రమణాలు చేస్తూ ఉయ్యాలలూగుతూ చెట్లకు వింత శోభనే తెస్తున్నాయి. మరి ఈజంతు, పక్షులకు’’ అంటు’’’’అంటూ ఏమీ లేదు .స్వేచ్చగా జీవిస్తున్నాయి కరోనా భయం లేని జీవరాశి గా మన్ననలు పొందుతున్నాయి .అరణ్య౦ లో మానవ మృగాలు కలిగించిన భీభత్సం ,ప్రకృతి వినాశనం ,దెబ్బతీసిన పర్యావరణ సమతౌల్యం ,జంతుహింస అంతా వాటికి ఒకప్పుడు ‘’విల విల ‘’గా ఉన్నా, నేడు కరోనా పుణ్యమా అని అక్కడ అంతా’’కలకలా’’ రావాలే .శృతిసౌభగాలే . మనకు మాత్రం ‘’విల విల ‘’లే .మనం చేసుకొన్న పాపమే అదంతా . ఆరణ్య కలకలలు చూస్తుంటే సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారి శివతాండవం లోని ‘’ఏమానందము ఇలాతలమున ‘’అన్న గేయభాగం గుర్తుకొస్తోంది .ఇంత ఆనందం ఇంతకు ముందెన్నడూ అడవి జీవజాలం అనుభవించి ఉండదు . మనకొక జాగృతి ,వాటికొక సుకృతి .
కొసమెరుపు –మూడు రోజులక్రితం మా అబ్బాయి శర్మ మెయిల్ లో ఇలా ఆలోచించి రాస్తే ఎలా ఉంటుందో చూడమని హింట్ ఇచ్చాడు .వాడు ఊహించినట్లు వచ్చిందో లేదో నాకు తెలీదుకాని ఈ సాయంత్రం కంప్యూటర్ ముదు కూచుని శీర్షిక కోసం తడుముకొని, తట్టగానే ఇక ‘’కొట్టటం’’ ప్రారంభించి నాన్ స్టాప్ గా రాసి పూర్తి చేశాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-4-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.