కరోనా కు ‘’ కరోనా’’ చెప్పు
కరోనా ను ‘’కరోనా ‘’చెప్పుతో
ముట్టుకోకుండా కొట్టి తరిమేద్దాం
ఊహాన్ లో పుట్టిన మహమ్మారిని
వ్యూహాత్మకంగా ఊర్లనుంచి గెంటేద్దాం
కోవిద్ జబ్బును జబ్బ చరచి
గోవిందా అనేట్లు మట్టిలో పూడుద్దాం
సబ్సిడీలతో జీతాలతో బతికే మనకు
అడవి మనుషుల బాధలేం తెలుసు
వైద్య౦ కోసం గర్భిణీలను ‘
ముసలీ ముతకాను మంచాలపై
మైళ్ళకు మైళ్ళు మోసుకు వెళ్ళే వారు
తిన్నారో పస్తున్నారో మనకు తెలుసా ?
మన ప్రభుత్వాలకు కళ్ళున్నా చూస్తున్నాయా ?
చెవులున్నా వినిపిస్తున్నాయా ?
తిండి దొరక్క అడవి అక్కలు
‘’పామోలివ్’’ గుత్తుల్ని కోసుకొని
ఆబగా తింటూ ఆకలి తీర్చుకొంటు౦టే
మనం ఇళ్ళల్లో దీపాలు వెలిగిస్తూ
బయటికొచ్చి చప్పట్లు చరుస్తూ
ఓ పోయిందే –ఇట్స్ గాన్, పోయిచ్చే
అని జబ్బలు చరుస్తున్నాం .
అన్నం వండుకోలేని, తినని,ఎప్పుడూ
బయటికి రాని రాలేని మనుషులను
గుర్తించి ఇళ్ళకు వెళ్లి ఉదార హృదయాలు
ఆహార పొట్లాలు అందించి మా ఊళ్ళో
అదుకొంటు౦టే ఫోటోలు తీసి పేపర్లలో వేయరు
కాని అధికారులు చేసే గోరంత
సాయానికి కొండంత ప్రచారం చేసి
ఊదర కొట్టి ఉబ్బేసి కనుసన్నలలో ఉంటారు
మానవత్వమా నువ్వెక్కడ ?
ప్రచారం మత్తులో మునిగిపోయావా ?
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-4-20-ఉయ్యూరు