ప్రపంచ దేశాల సారస్వతం
41-ఫ్రెంచ్ సాహిత్యం -1
ఫ్రెంచి భాష –ఇండో –యూరోపియన్ కుటుంబం లో లాటిన్ భాష నుంచి పుట్టిన రోమాన్స్ భాషలలో ఫ్రెంచి భాష బాగా ప్రసిద్ధమైనది .రోమన్ సామ్రాజ్యం లో ‘’గాల్’’అని పిలువబడిన ఫ్రెంచ్ ప్రదేశం లో వ్యాపించిన అపభ్రంశ లాటిన్ ,కాలక్రమంలో వికృతి చెంది క్రీ.శ 9వ శతాబ్దికి ప్రాచీన ఫ్రెంచ్ భాష అయింది .17వ శతాబ్దినాటికి ఇందులోని మా౦డలీకాలన్నీ కలిసిపోయి ఆధునిక ఫ్రెంచ్ అయింది .ఫ్రాన్స్ దేశపు జాతీయ భాష ఫ్రెంచ్ .బెల్జియం లక్సెంబర్గ్ ,స్విట్జర్లాండ్ ,ఇటలి ,కెనడా దేశాలలో కూడా లక్షలాది జనానికి మాతృభాష .కెనడాలో ఇంగ్లీష్ తోపాటు జాతీయ భాషా ప్రతిపత్తి పొందింది .ఆఫ్రికాలో ఫ్రెంచ్ వలస రాజ్యాలలో ,పరిణతి చెందని మాతృభాషలున్న ఆఫ్రికన్ వారికీ సామాన్యభాష అయింది ఫ్రెంచ్ .
ఫ్రెంచ్ లోని శబ్దజాలం ఎక్కువభాగం లాటిన్ నుంచి వచ్చి చేరిందే .గ్రీక్ ,అరబిక్ ,ఇంగ్లిష్ ,స్కాండినేవియన్ ,,ఇటాలియన్ భాషా పదాలు కూడా వచ్చి చేరాయి .వాక్యనిర్మాణం లో కర్త ,క్రియ ,కర్మ అనే వరుసలో ఉంటుంది చాలాపదాలకు ఉచ్చారణ కనిపించదు సాధారణంగా పదం చివరి హల్లు వదిలేయ బడుతుంది .లిపి రోమన్ లిపి .
ఫ్రెంచ్ సాహిత్యం –ఇంగ్లీష్ తర్వాత ఎక్కువ ప్రాచుర్యం పొందింది ఫ్రెంచ్ .ఫ్రెంచ్ సాహిత్యం మధ్యయుగాలనుండి ఇప్పటిదాకా అవిచ్చిన్నంగా,అనేక ప్రక్రియలతో శోభాయమానంగా వికసించింది .అనేక యూరోపియన్ సాహిత్యాలపై ఎక్కువ ప్రభావం అన్ని ప్రక్రియల్లో చూపి,మార్గ దర్శనం చేసింది .ఫ్రెంచ్ ప్రజలు గొప్ప సౌ౦ద ర్యారాధకులు .అదంతా సాహిత్యం లో ప్రతిఫలించింది .మొదట్లో వివిధ మా౦డలికాలలో సాహిత్యం వచ్చింది .చివరికి ఫ్రాన్సియన్ అనే మాండలికం ఎక్కువ ప్రజాదరణ పొందటం తో ,అదే సాహిత్యం లో ప్రవేశించింది .12వశతాబ్దానికే ఈ భాషలో గ్రంథాలువచ్చాయి .వాటిలో ‘’షేన్సన్ డీ రోలాండ్ ‘’అంటే రోలాండ్ గీతం అనే ఇతిహాసం సర్వోత్కృస్టం గా అందరూ భావించారు.ఇప్పటికీ కథా విధానం ,శైలిలి లలో దీనికి మించింది లేదు అంటారు .కాని కవి పేరు మాత్రం తెలీదు .అంటే అజ్ఞాతకవి కర్తృత్వం అన్నమాట .ఫ్రెంచ్ జాతీయ వీరుడైన షేర్ల మెన్ కాలం లో క్రైస్తవమతాన్ని రక్షించటం కోసం ముస్లిం లతో పోరాడి మరణించిన అమరవీరుని ఇతి వృత్తం ఇది .తర్వాత ఇందులోని ఛందస్సునే ఉపయోగించి ,దేశచరిత్ర ను వస్తువుగా తీసుకొని చాలామందిచాలా రాచనలు చేశారు .కానీ దేనికీ రోలాండ్ కొచ్చినంత ఖ్యాతిరాలేదు..ఇలాంటిరచనలు 12వ శతాబ్ది మొదటివరకు తామర తంపరగా వచ్చాయి .
తర్వాత ఫ్రెంచ్ కవులు ఇంగ్లాండ్ మొదలైన దేశాల చారిత్రిక వీరుల సాహసాలను వస్తువుగా తీసుకొని కావ్యాలు అల్లారు .ఆదర్శం లోనూ మార్పు వచ్చింది .మొదట్లో ఉన్న క్రైస్తవ రక్షణ స్థానం లో క్రమంగా ప్రేమారాధన స్థానం పొందింది .ఈ ప్రేమకావ్య రచనలో పండిపోయిన కవి ‘’క్రీటిన్ డిట్రాయి’’కథలు అల్లటం ,పాత్ర పోషణ లలో అద్వితీయ ప్రతిభ చూపాడు .ఇతని నాయికా నాయకులను అనుకరించటానికి మధ్యయుగ ఫ్రెంచ్ ఉన్నతవర్గాలు తహతహ లాడేవి .ఇలా 60ఏళ్ళు గడిచిపోయాయి .పద్యం వదిలి ఇలాంటికథలనే వచనం లోనూ రాశారు కొందరు .ఇవీ బాగా ప్రచారంయ్యాయి .కానీ క్రమగా ఇవీ బోర్ కొట్టేశాయి .
కవులు ,రచయితలలో స్వతంత్ర భావన పెరిగి ఇతిహాస కథల జోలికి పోకుండా స్వంత కథలతో కావ్యాలు రాసి మార్గాన్ని మళ్ళించారు .వీరిలో ప్రసిద్ధుడు ‘’రోమన్ డీ రేనా ‘’కవి రాసిన కావ్య సంపుటి .ఇందులో జంతువులూ పాత్రలై మానవ సమాజపు లోటుపాట్లను వ్యంగ్యం తో బయట పెట్టి అందర్నీ మెప్పించాయి,ఆకర్షించాయి .13వ శతాబ్దికి గేయకవిత్వానికి సుస్థిరత ఏర్పడింది .దీనికి ప్రశస్తితెచ్చినవాడు మాత్రం 15వ శతాబ్ది కవి’’విల్లోన్ ‘’మాత్రమె క్లిష్టమైన ఛందస్సులుప్రయోగిస్తూ జీవితానుభవాలను అంతర్లీనంగా జోడిస్తూ అద్భుత రచనలు చేశాడు ,మధ్యయుగం లో నాటక రచనకూడా పురుడు పోసుకొన్నది .కవులు రెండు రకాలైన వారుగా ఉన్నారు. కొందరు మతవిషయాలకు ప్రాదాన్యతనిస్తే,మిగిలినవారు ఐహిక మానసిక అనుభూతులకు ప్రాముఖ్యమిచ్చారు .మొదటి వర్గానికి అర్నూల్ గ్రీబాన్ -15శతాబ్ది ,రెండవ వర్గానికి ఆడం డీ లా హెలీ -13శతాబ్ది ప్రతినిధులుగా నిలిచారు. రెండవ వర్గం వారు రాసిన నాటకాలు చాలా సరళంగా ,మనోరంజకాలుగా ఉండటం తో ప్రజాదరణ వీరికే ఎక్కువగా ఉండేది .
వీటితోపాటు నీతి బధకాలు ,హాస్యాన్ని పండించే ప్రహసనాలు కూడా మధ్యయుగం లోనే వచ్చాయి. వీటి నన్నిటినీ త్రోసి రాజని , రెండు భాగాలుగా వచ్చిన ‘’రోమాన్ డీ రోజా ‘’గ్రంథం.మొదటిభాగాన్ని 13వ శతాబ్దిలో గిలోమీ డీ లారీ రాస్తే ,రెండవభాగాన్ని అదేకాలం లో జాన్ డీ మోన్ రాశాడు .ఇది గొప్ప ప్రేమరస కావ్యం అయినా హాస్యం తొణికిసలాడటం విశేషం .ఇలా మధ్యయుగం లోనే వివిధ సాహిత్య ప్రకియలకు అంకురారోపణ జరిగింది .వీటికి ప్రేరణమాత్రం యూరోపియన్ రినైసేన్స్ –అంటే పునరుజ్జీవన యుగమే .
ఫ్రెంచ్ సాహిత్యం లో నిజంగా పునరుజ్జీవన యుగం 16వ శతాబ్దం లో మొదలైంది .దీనికి వైతాళికుడు – కవి ,పండిత వంశం లో పుట్టి ,నూతన శైలికి మార్గదర్శి అయిన క్లెమెంట్ మరో అనే మహా కవి.ఈయనను అనుసరించినకవులు విక్టర్ బ్రోడో,మారిస్ సివ్ మొదలైన వారు .ఆ శతాబ్ది మొదట్లో పియరీ డీ రోన్ అనే గొప్పకవి జన్మించి రచనా రీతిలో మరొక నూత్న శైలి ప్రవేశ పెట్టాడు .ఇతడు మిత్రులతో కలిసి ‘’ప్లీడీ ‘’అనే ఉత్తమగ్రంథాన్నిసంకలం చేసి మహోపకారం చేశాడు ..యూరోపియన్ సంస్కృతికి పట్టు కొమ్మలైన గ్రీకు ,లాటిన్ ల స్థాయికి ఫ్రెంచ్ సాహిత్యాన్ని తీసుకు వెళ్ళటమే తన లక్ష్యం అన్నాడు .అందుకే ఆ ప్రాచీన భాషలనుంచి అనేక పదాలు గ్రహించి ,ఫ్రెంచ్ భాషలో స్థానం కల్పించి ,భాషా సాహిత్యాలకు పరిపుష్టి కల్గించతటమే తన సంకలనానికి ముఖ్య ధ్యేయం అన్నాడు .ఈ ప్రయత్నం బాగానే సఫలం అయినా విమర్శకూడా ఎదుర్కొన్నది .కాని అత్యధిక కవులు రచయితలూ ‘’ప్లీడీ ‘’ని నెత్తి కెత్తుకొని గౌరవించారు .ఈ రకమైఅన సమర్ధన చేసినవారిలో ‘’రోన్ సార్డ్ ప్రముఖుడు .ఫ్రెంచ్ భాషా సంస్కరణకు మద్దతు తెలియజేస్తూ ‘’డిఫెన్స్ ఎట్ ఇలస్ట్రేషన్ డీలాంగ్వే ఫ్రాన్కేయిస్’’అనే గ్రంథం రాయటమే కాక ,ఇలాంటి భాషా శైలి ఉన్న రచనలు కూడా చేసి, సత్తా చూపించాడు .ఇతని అభిమాన వృత్తాలు ఓడ్ మరియు సానెట్ .ఇతనికావ్యాలలో ‘’యాంటి క్విటీస్ డీ రోమ్’’అంటే రోమ్ నగర ప్రాచీన విషయాలు ఉత్తమమైనది .16వ శతాబ్ది ఫ్రెంచ్ రచయితలంతా ఈ బాణీ నే అనుసరింఛి సాహిత్యానికి పరిపుష్టి చేకూర్చారు .ఆ శతాబ్ది చివరిలో ఉన్న కవి ‘’మల్ హెర్బి’’ గణనీయుడు .శైలికంటే అర్ధ గాంభీర్యానికి అధిక ప్రాదాన్యమిచ్చాడు .ఇతని రచనలో ముఖ్యమైనవి –కామెంటైర్ సర్ డెస్ పోర్ టీ’’,కన్సొలేషన్ డీ మాన్ స్యుయర్ డు పిరియర్ ‘’.మొదటిది లక్షణ గ్రంథం.దీనిలోఅవలంబించాల్సిన భాషా పరమైన ,ఛందో పరమైన సంస్కరణలను చర్చించాడు .రెండవది ఈలక్షణాలకు లక్ష్య గ్రంథం.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-4-20-ఉయ్యూరు