ప్రపంచ దేశాల సారస్వతం
41-ఫ్రెంచ్ సాహిత్యం -3(చివరిభాగం )
18వ శతాబ్దం లో ఫ్రెంచ్ సాహిత్యం హేతువాద యుగంగా మారింది .జీవిత విలువలన్నిటినీ హేతు వాద దృష్టితో బేరీజు వేసి ,సరికాదు అనుకొంటే ఉల్టా సీదా చేయటమే ధ్యేయమైంది .ఆస్తికత ,మతవిశ్వాసం ,పరంపరగా వస్తున్న ఆర్ధిక వ్యవస్థ ,ఆస్తి హక్కు మొదలైనవన్నీ ఈ కొత్త భావనలకు చెల్లా చెదరరై పోయాయి .ఇంగ్లాండ్ విజ్ఞానం ,రాజకీయం కూడా బాగా ప్రభావితం చేశాయి .ఇవే సాహిత్యం లో ప్రతిబింబించాయి .దీనికి ఆద్యుడు –పెయరి బెయిలి .ఆనాటి మత నైతికత ,పవిత్రత లపై విరుచుకు పడ్డాడు .కానీ ఇవే భావాలతో ప్రజలను రచనలద్వారా ఆకర్షించినవాడు మాత్రం వాల్టేర్..ఇతనికి ప్రేరణ రూసో ,మాన్టేస్కి,డెనిస్ డీ డేరో,లెసాగీ ,మేరీవా లు .ఈ శతాబ్దం లో దాదాపు 80ఏళ్ళు జీవించిన వాల్టేర్ వివిధ సాహిత్య ప్రక్రియలతో సమానత్వ భావాన్ని పాదుకొల్పాడు .బహుముఖ ప్రజ్ఞాశీలి కనుక ఉత్తరాలు కరపత్రాలు ,కావ్యాలు ,కథలు,వ్యంగ్యరచనలు పద్యగద్యాలలో విశ్రుమ్ఖలంగా రాసి వినుతి కెక్కటమే కాక ఎందరినో ప్రభావితం చేశాడు .అన్నిట్లో మానవ శ్రేయస్సు మాత్రమె ధ్యేయం గా రాశాడు .స్వేచ్చకు విలువ నిచ్చాడు .సునిసిత హాస్యం అండర్ కరెంట్ గా ఉండేది .సజీవపాత్రలతో ఆకర్షణీయ సన్ని వేశాలతో ప్రతిదీ మనసుకు హత్తుకోనేట్లు రాశాడు .రాజకీయంగానే కాక సరళ వచన రచయితగా ప్రసిద్ధి చెందాడు మా౦టేస్కో .కొత్తరకం నవలలతో ఆకర్షించినవాడు లెసాగీ .మానవ మానసిక సంఘర్షణకు చోటు కల్పించి నవలలు రాశాడు –మెరీనా .నవలా రచనకు ఉత్కృష్ట స్థితి కల్పించింది మాత్రం –యాబీ ప్రవోస్ట్..వైజ్ఞానిక భావుకుడైన డెనిస్ ఓడోరబ్ సృష్టి పరిణామ రహస్యాలను భావనాబలంతో సాహిత్యం రూపంగా రాశాడు .జీన్ లీ రాండ్ ద లెంబర్ట్అనే పండితుడితో కలిసి ఫ్రెంచ్ భాషలో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వం రూపొందించాడు .ఆనాటి. విప్లవ భావాలకు సిద్ధాంత రూపం ఇచ్చినవాడు రూసో .వీరందరివల్ల ఫ్రెంచ్ సాహిత్యం నవనవోన్మేషణం పొందిది,ఫ్రెంచ్ విప్లవానికి దారితీసింది .
19వ శతాబ్దిలో ఫ్రెంచ్ సాహిత్యం లో ఆధునికయుగావిర్భావం జరిగింది .దీని వైతాళికులు-మేడం స్టేల్ ,షెటో బ్రా లు .నవలలలను నూతన విధానం లో,కళాత్మకంగా అత్యున్నత స్థాయిలో స్టేల్ రాసి నవలకు పెద్ద పీట వేసింది ,తర్వాత వచ్చిన షెటో బ్రా మాత్రం కాల్పనిక వాద వికాసానికి తోడ్పడింది .గేయకవిత్వం మళ్ళీ చిగురించి ,పూర్వం కంటే గొప్పగా వికసించింది .19వ శతాబ్ది కవితా సామ్రాజ్య చక్రవర్తులుగా –లా మార్టిన్ ,మస్సేట్,వీనీ ,హ్యూగో లు .విఫలప్రేమను చిత్రిస్తూ ఉత్తమకావ్యాలు రాసినవాడు లామార్టిన్ ఆల్ఫ్రెడ్ మస్సేట్ వ్యంగ్య చతుర,దారాళ ,కదన నైపుణ్య కవిత్వానికి ఆటపట్టు .మానవ స్వభావ లోతుపాతులను వెలికి తీయటానికి సాహిత్యాన్ని ఊతంగా తీసుకొన్నవాడు ఆల్ఫ్రెడ్ డీ వీనీ .ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కభావానికి ప్రాముఖ్యమిస్తూ ,వస్తు ,సన్నివేశాలకు తగిన శైలిని ఎన్నుకొని ,అన్ని రీతులలో అందర్నీ జయిస్తూ విశ్వ సాహిత్య క్షేత్రం లో విరాజిల్లినవాడు విక్టర్ హ్యూగో .జీవితం లో 60 ఏళ్ళు సాహిత్యానికే ధారపోసినమహా రచయిత హ్యూగో .ఫ్రాన్స్ లో మహాగొప్ప రొమాంటిక్ కవిగా గుర్తింపు పొందినా అంతర్జాతీయంగా ,సింబాలిజం ,ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రేషనిజం లలో మార్గదర్శి అయ్యాడు .ఇతనినవలలు ‘’దిహన్చ్ బాక్ ఆఫ్ నోటర్ డాం ‘’’’లెస్ మిజరబుల్స్ ‘’అన్ని దేశాలలనూ ఆకర్షించాయి ప్రభావితం చేశాయి .రెండవది యదార్ధ కథ.మనోరంజకమైన కొత్త కథలకు హ్యూగో మార్గదర్శి .హ్యూగో తరవాత పేర్కొనదగిన వారు థియో ఫైల్,గౌటియర్,చార్లెస్ బాడర్లైర్ లు . ఈశాతాబ్ది చివర్లో ‘’సాంకేతిక వాదం ‘’అనే కొత్త వాదం బయల్దేరింది .అసలైన అర్ధాన్ని కొన్ని సాంకేతికాల మాటున చిత్రించి చెప్పటం దీని పధ్ధతి .వీరిలో వేర్లైన్,మలోర్మి ,రింబా లు ముఖ్యులు .హ్యూగో తర్వాత నవలలలు రాసినవాడు ‘’స్టెన్ డాల్’’అనే మారు పేరుతొ రాసిన హెన్రి బెయిల్ .ఇతనితోపాటు ప్రముఖ నవలాకర్తలు –అనరి డీ బాల్జాక్ ,ఫ్లాబర్ట్ ,అలేక్జాండర్ డ్యూమాస్,గైడి మపాసా .ఈ శతాబ్ది ప్రముఖ నవలాకారుడు ఎమిలీ జోలా ప్రభావం పడని రచయితలు లేరు .నేచురలిజం దియేటర్ నేచురలిజం ,సైకలాజికల్ నవలా రచనలతో గొప్ప జ్వాజ్వల్యమానంగా వెలిగాడు జోలా రాసిన దేరేసే రాక్విన్ నవల నేచురలిజానికి ప్రతీక . మంచి ప్రతిభావంతమైన నాటకాలూ ఈ శతాబ్దిలో వచ్చాయి .
20వ శతాబ్దం లో ఫ్రెంచ్ నవల కొత్త అందాన్ని పొందింది .నేరేషన్ లో విప్లవం తెచ్చారు నవలాకారులు .వీరిలో ముఖ్యుడు అనటోల్ ఫ్రాన్స్ .19వ శతాబ్దం చివరినుంచే నవలలు రాయటం మొదలు పెట్టాడు .1921నోబెల్ ప్రైజ్ విన్నర్ .ఈ కాలం లో ఆత్మ పరిశీలనతో రచనలు చేశాడు మార్సెల్ ప్రౌస్ట్ .ఇతని 7భాగాల మాన్యుమెంటల్ నవల –‘’లా రిచెర్చేడు టెమ్ప్స్ పెర్డు’’.ఇతనిని 20వ శతాబ్ది అత్యధిక ప్రేరణాత్మక నవలాకారునిగా విశ్లేషకులు భావించారు . యాండ్రి గైడ్ అక్రమ లైంగిక వ్యవహారాలను ఇతి వృత్తంగా తీసుకొని కళాత్మక నవలలు అల్లాడు .సింబాలిక్ నవలలు యాంటి కలోనిజం నవలలు రాసి ప్రసిద్దిపొంది 1947 నోబెల్ ప్రైజ్ అందుకొన్నాడు .దివాటికన్ సేల్లార్స్ ,దిపాస్టోరల్ సింఫనీ ,దికౌంటర్ ఫీటర్స్ ప్రముఖ నవలలు .నాటకరచనలూ చేశాడు కథా కథన చాతుర్యం ,పాత్ర పోషణ ,వస్తు చిత్రణలలో అద్వితీయుడు .ఈ కాలపు మరో ముఖ్య ప్రక్రియ ‘’సైక్లిక్ నావెల్ ‘’సృష్టికర్త –రోమేన్ రోలాండ్ .10 భాగాల ‘’సీక్వెన్స్ జీన్ క్రిస్టో ఫే ‘’నవల యిది . ఒక వ్యక్తీ జీవిత కధను ఇంట విస్తృతంగా చిత్రించటం అరుదైన విషయం .కథైక్యం చెడకుండా ,సంఘటనలకు ప్రాధాన్యమిచ్చి మణిహారం కూర్చి నట్లు రాశాడు .నాటకాలు రాశాడు .హిస్టోరియన్ కూడా .ఇతని ఆదర్శ వాద రచనలకు 1915లో నోబెల్ పురస్కారం వచ్చింది .ఇదే బాటలో జూలిస్ రోమేస్ కూడా రాశాడు .’’టిబాల్ట్స్’’అనే చంక్రమ నవల అంటే సైక్లిక్ నవల ను మార్టిన్ డు గార్డ్ రాసి 1937 సాహిత్య నోబెల్ పొందాడు .
20వ శతాబ్దం లో పద్య కవిత్వం కూడా వచ్చింది అధివాస్తవిక వాదమూ ప్రవేశించింది .పద్యకవుల్లో పాల్ వేలేరీ సుప్రసిద్ధుడు. తాత్విక విషయాలను ఆలంకారిక శైలిలో సరళ సుందరం గా రాయటం ఇతని ప్రత్యేకత .నాటకాలకు స్వర్ణయుగమే .కొత్త ఆలోచనలు నాటక విధానం లో వినూత్నత ప్రత్యేకాలు .ఐతే ‘’మేటర్ లింక్ ‘’నాటకాలు బహుళ ఆదరణీయాలైనాయి .ఇతని ఇంట్రూడర్ ,ది బ్లైండ్ ,ది బ్లూ బర్డ్ మొదలైన నాటకాలు ప్రపంచ ప్రసిద్ధాలు .చావు ,జీవిత పరమార్ధం ఇతనికథా వస్తువులు ,ఇతనికి విభిన్న నాటక రచనకు 1911లో నోబెల్ బహుమతి లభించింది .అలౌకిక విషయాలను వస్తువుగా తీసుకొని గోప్పనాటకాలు రాసినవాడు పాల్ క్లాడెల్.అనేక ఫ్రెంచ్ ప్రభుత్వ ప్రైజులు పొందాడు .
కొత్త వైజ్ఞానిక ఆవిష్కరణలు ,కొత్త రాజకీయాలు ఫ్రెంచ్ సాహిత్యం పై ప్రభావం చూపించాయి .ప్రపంచయుద్ధం దేశాన్ని సంక్షోభం లోకి నెట్టింది ఫలితంగా మత నైతికత లలో అవిశ్వాసం పెరిగి రచనలలో చోటు చేసుకొన్నాయి .దీన్ని ఎదుర్కోవటానికి క్లాడేల్ లాంటి కవులు కృషి చేశారు .ప్రాచీన –ఆధునికాలకు సమన్వయము చేకూర్చినవాడు ,తాత్విక సందేశంతో ప్రభావితం చేసినవాడు హెన్రి బెర్గ్ సన్.ఇతని తత్వ గ్రంథాలు మహా కావ్యాలుగా పరిగణించారు ఇవి నవ్యరచయితలకు కవులకు మార్గ దర్శకాలైనాయి .తక్షణ అనుభవం -ఇమ్మీడియేట్ ఎక్స్ పీరిఎన్స్ ,అంతర్ దృష్టి-ఇంట్యూషన్లు రేషనలిజం ,సైన్స్ లకన్నా సత్యాన్ని తెలుసుకోవటానికి ముఖ్య సాధనాలుగా భావించాడు .దీనికి ఫ్రాన్స్ దేశపు అత్యున్నత పురస్కారం –గ్రాండ్ క్రోయిక్స్ డీ లా లీజియన్ డీ ఆనర్ ‘’1930లో అందుకొన్నాడు .భారతీయ తాత్విక చి౦తనలన్నీ ఇతని రచనలలో దర్శనమిస్తాయని అభిజ్ఞులు గుర్తించారు .
21వ శతాబ్ది ఫ్రెంచ్ రచయితలు –గాలియా ఆకర్మన్ ,నికోల్ బాచ్ రాన్ ,పియర్రీ చావోట్ ,హ్యూబర్ట్ డామిష్,జీన్ పాల్ ఏర్దోవెన్ , పాస్కల్ ఏంజెల్ ,ఎలిశే ఫిషర్ ,రోజేర్ గరూడీ,జీన్ క్లాడ్ గుల్లెబాడ్,లారా హైం,అలాన్ జాబెర్ట్ ,జులివా క్రిస్తీవా ,బెర్నార్డ్ హెన్రి లేవి ,రాబర్ట్ మిస్రాహి ,లారే మూరట్,మైకేల్ ఒర్సేల్ ,నిటా రూసో ,పీటర్ జెండి,క్సేవియర్ టిల్లెట్టీ,ఆల్బర్ట్ ఉదెర్జో,పియర్రీ వేలిటేట్ మొదలైనవారెందరో ఉన్నారు
నోబెల్ ప్రైజ్ పొందినవారు –సల్లీ పృదోం-1901,ఫ్రెడరిక్ మిస్ట్రెల్-1904,మారిస్ మీటర్లింక్ -1911,రోమిన్ రోలాండ్ -1915,అనటోల్ ఫ్రాన్స్ -1921,హెన్రి బెర్గ్ సన్-1927,రోజేర్ మార్టిన్ డు గార్డ్ -1935.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-20