సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-2
సుగ్రీవుని పనుపున శ్రీ రామాజ్ఞ గా దక్షిణ వైపు సీతా దేవిని వెతకటానికి అంగదుని నాయకత్వం లో జాంబవంత ఆన్జనేయాదులు బయల్దేరి దక్షిణ సముద్రం చేరి అలసి కాసేపు విశ్రమించి సముద్ర లంఘనం విషయమై చర్చి౦చు కొంటున్నారు .ఇదేమీ తనపనికానట్లు నిర్లిప్తంగా ఒక ఎత్తైన బండమీద హనుమ శ్రీరామనామ ధ్యానం చేస్తూ పులకించి మైమరిచిపోతూ విభూతి పొందుతున్నాడు .వానరనాయకులు తమ బలాబలాలను నిక్కచ్చిగా బేరీజు వేసుకొంటున్నారు .శత యోజన విస్తీర్ణ సముద్రాన్ని లంఘించి అమ్మవారి జాడ కనిపెట్టి తిరిగి రాగల సమర్ధుడు వారిలో ఎవరూ లేరని చివరికి తేల్చుకొన్నారు .కిం కర్తవ్యమ్ ?తమలో హనుమ లేడేమీ అని వితర్కించారు .సకల బల తేజస్సంపన్నుడు ధీర వీర శౌర్య హనుమాన్ కు మాత్రమె సముద్ర లంఘనం చేయగలవాడని జామ్బవాన్ తెలియ జేయగా ,ఆయన ఉన్న చోటుకు వెళ్లి ,అతని ధ్యానం అయేదాకా వేచి ఉండి,ముక్త కంఠం గా హనుమ మాత్రమె లంకను చేరగలడు అని చెప్పి అది ప్రభు ,రామకార్యం అనీ గుర్తు చేశారు .యోగబలం సాధించి స్పృహలోకి వచ్చి న హనుమకు వారి మాటలు వినిపించాయి .వారిలో దైన్యం ప్రస్పుటంగా కనిపిస్తోంది .చిన్న వారు చేతులు జోడించి నిలిచారు .అది సుగ్రీవాజ్ఞ గా జా౦బవాన్ నిర్ణయంగా ,యువరాజు కోరికగా గుర్తించాడు .’’నేనా !సముద్ర లంఘనమా మహాత్ములారా !పరాచికాలాడుతున్నారా ?అంతటి శక్తి సామర్ధ్యాలు నాకెక్కడివి ?సామాన్య వానరుడను .శక్తికి మించిన భారం నాపై పెట్టటం సముచితమా .చిన్నప్పుడు సూర్యుని దగ్గరకు బాల్య చాపల్యం తో తెలిసీ తెలియని వయసులో వెళ్లానేమో ?దానికి ప్రాయశ్చిత్తమూ అనుభవించి దవడ వాయ గొట్టి౦చు కొన్నాను కూడా .ఇది అలవిగాని పనినాకు అని సవినయంగా విన్న విస్తున్నాను ‘’అన్నాడు వృద్ధ జాంబవంతునితో .ఆయన చిరునవ్వు నవ్వి ‘’ఆ౦జ నేయా !మేమందరం మా శక్తిసామర్ధ్యాలను చెప్పుకొని మా లో ఎవరివల్లా ఈ ఘనకార్యం సాధ్యం కాదని ఏకాభి ప్రాయానికి వచ్చి ,నీ శక్తి, యుక్తి ,ధీ శక్తి ,యోగ తేజస్సులన్నీ పరిగణనలోకి తీసుకొని కార్యభారాన్ని నీకు అప్పగిస్తున్నాం .క్షేమ౦గా వెళ్లి లాభంగా తిరిగిరా .మా అ౦దరి ఆశీస్సులు ,రాజు సుగ్రీవుని ఆజ్ఞ,శ్రీరామ అంగీకారం మా మాటల్లో ఉన్నాయి. సందేహింప పని లేదు .అమృత ఘడియలు సమీపిస్తున్నాయి .ఈ సమయంలో ప్రయాణం సర్వ విధ విజయకారకం అవుతుంది ‘’అన్నాడు .లేచి నుంచొని పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం పొందాడు.అయినా హనుమమనసులో ఎక్కడో సందేహ బీజం మొలకెత్తింది .పరే౦గిత గ్రాహి ,జ్ఞాన వయో వృద్దు జామ్బవాన్ ఇక ఆ సందేహ బీజం వృక్షం కాకూడదని అక్కడికక్కడే చిదిమేయాలని భావించి ,అక్కడి వానరులందరి చేతా శ్రీరామ నామం బిగ్గరగా చేయించాడు మాట చెప్పకుండా కను సైగలతో .ఇంకేముంది .పరవశించి పోయాడు వీర ధీర బుద్ధ్హిమాన్ హనుమ .రామ నామో చ్చారణతో పాటు హనుమ గుణ గానం బాల్యాది చేసిన సాహస కృత్యాలు గేయాలుగా పాడించాడు .ఒక్కో గేయానికి ఒక్కో అంగుళం పెరిగిపోయాడు హనుమ .పూర్తిగా ఎదిగి పోయి యోగీశ్వరుడై ముకుళిత హస్తాలతో నిలుచున్నాడు .ఒకరకంగా స్తుతులకు ఉబ్బి పోయాడు .తన బలం తనకు తెలిసి వచ్చింది .తాను తప్ప ఈ అఘటనఘటనా సామర్ధ్యం ఎవ్వరికీలేదని పూర్తి విశ్వాసం ,నిశ్చయం కలిగింది .’’వానరుడే మహనీయుడు శక్తియుతుడు ,యుక్తి యుతుడు వానరుడే ‘’అనిపించాడు .ఈ ఉత్సాహపు పొంగు చల్లార కుండ కపి సైన్యం హనుమపై పుష్ప వృష్టి కురిపించారు .అంతే అదే గొప్ప బలవర్ధక టానిక్ గా పని చేసింది .అందరి వద్దా సెలవు తీసుకొని’’ జై శ్రీరాం’’ అంటూ ఉచ్చ్చైస్వరం తో దిక్కులు పిక్కటిల్లేట్లు నినాదం చేయగా కపి సేన కూడా గొంతు కలుపగా ,అప్పటికే విజయోత్సవ వాతారణం కనిపించింది అందరి ముఖాలలో .ఆనందం బాష్పాలుగా కన్నులనుండి స్రవించింది .’’విజయోస్తు దిగ్విజయోస్తు ‘’నాదాలు దశ దిశలా మారు మ్రోగాయి .’’ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదా౦-లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ‘’శ్లోకం అందరి నోటామంగళ తూర్య ధ్వని లా వినిపించి౦ది .
‘’తతో రావణ నీతాయా స్సీతాయా శ్శత్రు కర్శనః –ఇయేష పద మన్వేస్టు౦ చారణే చరితే పథి’’
ఇదీ సుందరకాండలో మహర్షి వాల్మీకి ప్రధమ శ్లోకం .స్వకార్య విరోదాలను రూపు మాపే వాడూ ,సర్వ సమర్ధుడు హనుమంతుడు ,రావణుడు అపహరించిన సీతాదేవి ఉండే చోటుకు వెతకటానికి సిద్ధ సాధ్యులు దేవతలు తిరుగాడే ఆకాశ మార్గం లో బయల్దేరాలని భావించాడు .శ్రీరాముని అభ్యుదయం కోరుతూ ,పర్వ దినాలలో సముద్రం ఉప్పొంగినట్లు తన శరీరాన్ని పెంచేశాడు .తానున్న మహేంద్ర పర్వతాన్ని కాలితో ఒక్క నొక్కు నొక్కగా దానిపై ఉన్న సకల వృక్ష ప్రసూనాలు ఆయనపై రాలిపడి పూజ చేస్తున్నట్లు కనిపించాయి .అక్కడి విద్యాధరులు భయపడి ఆకాశమార్గం పట్టారు .హనుమ పని రామకార్యం వానరకార్యం కూడా .ఋషులు ఆకాశం లో నిలబడి ఆశీర్మంత్రాలు చదివి దీవించారు .ముడుచుకొని ఉన్న తోకను ఒక్క సారి ఝాడించగా అది సర్పం లాగా భయభ్రాంతుల్ని చేస్తూ ,గరుత్మంతుడు కాళ్ళతో తీసుకు పోయే కాల సర్పం లా భాసించింది .నడుం సన్నగా చేసుకొని కాళ్ళను,చేతులు మెడ కుంచించి ,తనలో నిక్షిప్తమైన మహా తేజస్సును .మరింత పెరిగేట్లు చేసుకొని ముఖం పైకెత్తి ,తోటి వానరులతో ‘’యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః -గచ్ఛేత్తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం-నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం -అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం ‘’విడువబడిన రామబాణం లక్ష్యం వైపు ఎలా దూసుకుపోతుందో అంటే ఎన్ని విఘ్నాలు మధ్యలో వచ్చినా ఆగకుండా ,నేను కూడా రావణపాలిత లంకకు చేరతాను .అక్కడ సీతా దేవి కనపడకపోతే ,అదే వేగంతో స్వర్గం వెళ్లి వెతుకుతా .అక్కడా జాడ దొరక్కపోతే ,క్షణం ఆలస్యం చేయక రాక్షసరాజు రావణుడిని లంకతో సహా పెకలించి బంధించి తీసుకు వస్తా ‘’అని వానరులకు ఉత్సాహం కలిగించి తన దైన మార్గం లో ప్రయాణం సాగించాడు .
ఒక్కసారి వెనక్కి చూస్తె నిర్లిప్తంగా తపస్సు చేసుకొంటున్న హనుమ పరిసరాలనే మర్చిపోయాడు .మంత్రాంగం సంగతి తెలీదు .తనపై ఇంత పెను భారం పెడతారని ఊహించలేదు .అక్కడి వారి పెద్దరికాన్ని మాటను గౌరవించి సముద్ర లంఘనకు బయల్దేరాడు .కానీ చపల చిత్తం కదా ,తనబలమేమిటో తనకు తెలీదు .దీన్ని బయటికి తేవటానికి జాంబవంతుని తెలివి కలిసొచ్చింది .ఉబ్బేయించాడు స్తోత్రాలతో ,ముఖ స్తుతి ఎంతటి సాహసానికైనా పురిగొల్పుతుంది .సమయోచిత ధర్మం అంటే ఇదే .తన బలపరాక్రమాలు వారి నోటి వెంట విని పొంగి ,యదార్ధమని గ్రహించి కార్యోన్ముఖుడయ్యాడు .అజ్ఞానం పొర తొలగి జ్ఞాన జ్యోతిస్సు దర్శించాడు .ప్రభుకార్యం తన దైవం రామకార్యయజ్ఞానికి తాను ఒక సమిధను మాత్రమె అనే ఎరుకకలిగింది .ఎరుకకలిగితే శరీరం లో సర్వ శక్తులూ శత పత్ర పద్మ౦ లాగా విచ్చుకొంటాయి .ఇక ఎదురన్నది ఉండదు .అసాధ్యం సుసాధ్యమౌతుంది .అందుకే వీడ్కోలు పలుకుతూ రాముడు విడిచిన బాణ౦ లాగా లక్ష్యాన్ని చేరతాను అన్నాడు .అప్పటికే రామబాణ మహాత్మ్యం అతినికి వాలివదఘట్టం లో అంతకుముందు సప్తతాల భంజనం లో ప్రత్యక్షంగా చూసి ఉన్నాడుగా .కనుకనే అలా పలకగలిగాడు .సీతమ్మ జాడ దొరక్కపోతే ఏం చేస్తానో అన్నదికూడా విస్పష్టంగా చెప్పాడు మహా మతిమంతుడు హనుమ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-4-20-ఉయ్యూరు