సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం
సుందరకాండ మనోభీస్టాలను ఫలప్రదం చేసే ,మధుర కాండ .నాకు ఇందులో ఆంజనేయుడు బహు పార్శ్వాలతో ,విభిన్న భావాలతో కనిపిస్తాడు .వీటిలో జాతి లక్షణమైన వానర లక్షణం తో పాటు ,అమాయక ,,తొందరపాటు ,ఆలోచనారహిత ,నిశ్చేష్ట ,నిర్లిప్త లక్షణాలూ ,ధీర వీర ,పరాక్రమ శౌర్య పార్శ్వాలూ ,ధీశక్తి ,మతిమంతత్వం ,రామభక్తి ,ప్రభుభక్తి ,కార్య నిర్వహణ దీక్ష ,అమ్మను చూడలేకపోయానన్న వేదన ఎవరినినో చూసి సీతమ్మ అని భావించి పొరబడిన విధం ,తప్పు చేసి వెంటనే సరి దిద్దుకొనే మాన్యలక్షణం అన్నిటికీ మించి తన శక్తియుక్తుల సమాహారమైన విశ్వరూప సందర్శనం చూస్తె, ఇంతింతై ఎదిగి మహోన్నతుడైన తీరు కనిపిస్తుంది .చంచలత్వం కోతిలక్షణ .దాని నుంచి పరిణతి సాధించిన వృషా కపి ,హరి మనకు దర్శనమిస్తాడు .ఒకరకంగా స్ప్లిట్ పర్సనాలిటి అనిపిస్తుంది .కాని అది వినాశనానికి కాక మానవోద్ధరణకు ,సకల జన శ్రేయస్సుకు, లోకకల్యాణానికి ,ఆది దంపతుల సమాగమానికి రామనామ నిర్నిద్రతకు పరాకాష్ట గా వెలుగొందాడు అని నాకు అనిపిస్తుంది .ఈ భావాలు చాలాకాలం గా మనసులో గూడు కట్టుకొని ఉన్నాయికాని ,ఈ భావాలతో జనుల మనస్సులలో ఇప్పటికే సుప్రతిస్టితమైన భావాలను కి౦చ పరచానను కొంటారేమో అనే సందేహం ఉండటం వలన ఇప్పటి వరకు సాహసించలేక పోయాను .కానీ వారం పది రోజులనుంచి భావాలు సుళ్ళు తిరుగుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆయనమీదే భారం వేసి అడుగు ము౦దుకేస్తున్నాను. దీనికో నేపధ్యంకూడా ఉన్నది సుమారు పాతికేళ్ళ క్రితం కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన,రామాయణ సుందరకాండ ప్రవచన నిష్ణాతులు బ్రహ్మశ్రీ పరిమి రామకృష్ణ శాస్త్రి గారు రోజూ అక్కడినుంచి ఉయ్యూరువచ్చి సాయంత్రం ఖచ్చితంగా 6-30నుంచి 8గంటలవరకు ఉయ్యూరు విష్ణ్వాలయం లో ప్రవచనాలు చేశారు .నేను రోజూ వెళ్లి ఆసక్తిగా వినేవాడిని .ఆయన నా శ్రద్ధకు చాలా సంతోషించేవారు .వారికి చేతిలో పుస్తకం అవసరం లేదు.అంతా వాచో విదేయమే .అనర్గళ ధారా పాతమే .ఒకసారి సుందర కాండ ప్రవచనం అయ్యాక వారికి సత్కారం చేస్తూ నన్ను మాట్లాడమన్నారు .నేను బ్రహ్మశ్రీ జనమంచి శేషాద్రి శర్మగారి రామాయణ సారం రోజూ చదివి రెడీ గా వెళ్ళేవాడిని ,అంతకు మించి కొత్తవిషయాలు చెబుతారేమోనన్న ఆలోచనతో .నన్ను మాట్లాడమంటే ‘’అంతా బాగానే ఉంది కాని శాస్త్రిగారు హనుమ లంకలో కాలుపెట్టి చంద్రుని చూసి పొంగిపోవటం ,మధువనం లో అందరితోపాటు మధువు ఆస్వాదిస్తూ నృత్యం చేయటం వంటి కొన్ని ఘట్టాలు మన దృష్టికి తీసుకు రాలేదు .జనమంచి వారి వ్యాఖ్యానం చాలా విషయాలు తెలియ జేస్తాయి .శాస్త్రిగారు దాన్ని చూసినట్లు లేదు అనిపించింది అని నిర్మొహమాటంగా చెప్పాను ‘’ ఆయన ప్రవచన తీరును బాగాహైలైట్ చేసి మాట్లాడాను .ఆయనతానూ జనమంచి వారి రచన చదవలేదనీ ,కాని అందులో విషయాలు నేను చెప్పిందుకు చాలా సంతోషించారు .మళ్ళీ అక్కడే రామాయణం చెప్పెటప్పుడూ వెళ్ళేవాడిని .నన్ను చూసి దగ్గరగా కూర్చోమని సౌ౦జ్ఞ చేసేవారు నిత్యం .ఎవరైనా ఏదైనా కొత్తగా తెలుసుకోవాలన్నది నూతనంగా చెప్పాలన్నది నా దృష్టి .ఆ వేడిలోనే అప్పుడే ‘’శ్రీహరి ద్యూతం ‘’అనే పేరుతో హరి అంటే కోతి, వానరమనే అర్ధంతో సుందరకాండ హనుమ దౌత్యం గురించి పాతిక ముప్ఫై పేజీలు రాశాను పెద్ద బారు నోట్ పుస్తకం లో ..అది నా సర్వస్వం అనుకొన్నాను .ఆసమయం లో నేనుజగ్గయ్యపేట దగ్గర గండ్రాయి హైస్కూల్ లో సైన్స్ మేస్టర్ గా పని చేయటం, మా అన్నయ్యగారబ్బాయి రా౦ బాబు పెళ్లికుదరటం, నేను అక్కడే ఉండటం వలన ఇంటికి సున్నాలు వగైరా రిపేర్ పనులతో వాళ్ళే సర్దటం తో నేను వచ్చిచూశాక ఆపుస్తకం నాకు కనపడకకపోవటం తీవ్ర నిరాశ కలిగించింది .చాలాకష్టపడి రాసిన రచన అది .తర్వాత సుందరకాండ పుస్తకం మా బావగారు శ్రీ వివేకాంద్ గారు ఇస్తే పారాయణ చేయటం ఆతర్వాత అడ్డాడ హైస్కూల్ లో హెడ్ మాస్టర్ గా 1987జూన్ నెలాఖరుకు రిటైరయ్యేటప్పుడు స్కూల్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు డా శ్రీ మేడూరి బాల రత్నవర ప్రసాద్ ఆప్యాయంగా నాకు శ్రీమాన్ చలమచర్ల వెంకట శేషా చార్యుల వారి వ్యాఖ్యానంతో ఉన్న సుందరకాండ పవిత్ర గ్రంధాన్ని కానుకగా అంద జేశారు .అదొక సువర్ణ అవకాశంగా భావించి అప్పటినుంచి క్రమం తప్పకుండా వీలైనప్పుడల్లా పారాయణ చేస్తూ ధనుర్మాసం లో మా సువర్చలాన్జనేయ దేవాలయం లో కనీసం 3సార్లు అయినా పారాయణ చేస్తూ ఈ 2020ధనుర్మాసానికి 67సార్లు పారాయణం చేసిన అదృష్టవంతుడిని అయ్యాను .ఇంతమాత్రం చేత అదంతా నాకు మనసుకు పట్టిందనికానీ అందులోని లోతులు అర్ధమయ్యాయనికానీ అనుకోవటం లేదు .విపులాచ పృధ్వీ .ఈ నేపధ్యం లో ఈ ‘’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం ‘’మొదలు పెట్టి రాస్తున్నాను .దీనికి నాకు ప్రణాళిక లేదు .లాప్ టాప్ ముందు కూర్చుని ,తోచింది సందర్భ శుద్ధిగా రాయటమే నాపని .ఫలితం దైవా దీనం .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-20-ఉయ్యూరు