సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-3
ఆకాశం లో చేతులు సాఛి హనుమ ఎగురుతుంటే ,ఆ చేతులు పర్వత శిఖరాలనుంచి వస్తున్న అయిదు తలల సర్పాలులాగా ఉన్నాయి .ఒక్కోసారి మరీ కిందకు దిగి ఎగురుతుంటే సముద్రజలాలను తాగుతున్నాడేమో అనిపించింది .రెండుకళ్ళుమెరుపులతో ఉన్న అగ్నిగోళాలుగా,ఉదయించే సూర్య చంద్రుల్లా దర్శనమిచ్చాయి .ఎర్రని ముక్కు కాంతి వలన ముఖం సంధ్యారాగ సూర్యుని తలపిస్తోంది .తోక ఇంద్రధ్వజమే అనిపించింది .తోకను తన చుట్టూ చక్రాకారం గా ముడుచుకొని ఎగురుతుంటే సూర్యుని కిరీటం లాగా అందులోని సూర్యునిలాగా భాసించాడు .వాల మూలం చీల్చబడిన గైరికాది ధాతుమయమైన గిరిలా కనిపించాడు .కటి ప్రదేశంనుంచి వెళ్తున్నగాలి మేఘ గర్జనలా ఉన్నది .ఉత్తరదిక్కులో కనిపించే తోకతో ఉండే ఉల్క ఏమో అనే భ్రమకలిగిస్తోంది .ఆకాశం లో హనుమ ,క్రింది జలరాశిలో ఆయన ప్రతిబింబం చూస్తె తెరచాప తో గాలి వేగానికి అతి వేగంగా వెడుతున్న నావ లాగా ఉన్నాడు .ఆయనగమన వేగానికి గాలి భయంకరంగా గర్జించే సముద్రం కూడా అందర్నీ కలవర పరుస్తున్నాయి.ఆయన గమన వేగానికి సముద్ర జలం మేఘ మండలం దాకా వ్యాపించి శరత్కాల మేఘ సదృశంగా ఉన్నది .సముద్ర సర్పాలు అల్లకల్లోల జలదినుంచి భయంతో పైకెగసి ఆయన తమను భక్షి౦చ టానికి వస్తున్న గరుత్మ౦తుడేమో అనుకొన్నాయి .హరి వీరుని నీడ పది యోజనాల వెడల్పు ,ముప్ఫై యోజనాల పొడవుతో సముద్ర జలం పై బహు సుందరంగా భాసించింది .అది సముద్రంలో వ్యాపించిన దట్టమైన నిర్మల మేఘాల వరుస లాగా ఉన్నది .సముద్రజలం అతని వేగానికి అడుగంటి ద్రోణి ఏర్పడినట్లు,ఏదో ఉపద్రవం రాబోతున్న సూచనగా ఉన్నది .రంగురంగుల మేఘాలమధ్య ,మబ్బుల చాటున దాగి మళ్ళీ బయటికి వస్తుంటే చంద్రునిలా అనిపించాడు .తనవంశ పావనుడైన శ్రీ రాముని కార్య దురంధరుడు కనుక గురువు సూర్యుడు, తండ్రి వాయువు తమప్రతాపాలను చూపక చల్లగా కనికరంగా ఉన్నారు .యక్షకిన్నెర కింపురుషాదులు ఋషులు హనుమ ను చూసి స్తోత్రాలు చేసి ,మానసికోల్లాసం కలిగించారు .
ఇక్ష్వాకు వంశజులైన సగర పుత్రులతో వర్ధిల్లిన,ఆ వంశ క్షేమం గౌరవం కోరే సాగరుడు తనలో తానూ వితర్కి౦చు కొన్నాడు .’’వానరకుల శ్రేష్టుడు హనుమకు నేనిప్పుడు ఏదో కొంత సాయం చేయకపోతే లోకం నన్ను నిందిస్తుంది .ఇఖ్వాకు వంశకులజుడైన శ్రీరాముని దూత హనుమ .అతనికార్యానికి ఏ కష్టమూ రాకూడదు .అలసి పోయి ఉంటాడు కనుక కాస్త విశ్రాంతి పొందే ఆలోచన చేయాలి .విశ్రాంతి తర్వాత యధాప్రకారం రెట్టించిన ఉత్సాహంతో గమ్యానికి బయల్దేరి వెడతాడు ‘’అని భావించాడు .తనలో దాగిఉన్న మైనాక పర్వతం ఇప్పుడు తోడుపదటాడని అనుకోని ,పిలఛి ‘’మైనాకా !పాతాళం లో ఉన్న రాక్షసులు భూమిపైకి రాకుండా ఉండటానికి ఇంద్రుడు నిన్ను నాలో ఇనుప గడియగా అడ్డంగా ఉంచాడు .నువ్వు రాక్షసమూకలు పైకి వచ్చి చెలరేగకుండా పాతాలలోక ద్వారాన్ని బాగా కప్పేశావు .నువ్వు అన్ని వైపులా పెరగగల సామర్ధ్యమున్నవాడివి .కనుక ‘’సంచోదయామి త్వాముత్తిస్ట గిరి సత్తమ –స ఏష కపి శార్దూల స్త్వా ముపర్యేతివీర్యవాన్ –హనుమాన్ రామకార్యార్ధం భీమకర్మా ఖ మాప్లుతః –అస్య కార్యం మయాకార్య మిక్ష్వాకు కులవర్తినః ‘’అంటూ సీతాన్వేషణ అనే పవిత్రకార్యం పై వచ్చిన హనుమ మనకు అతిధి .పూజనీయుడు .కనుక నీటిపైకి వచ్చి నీ శిఖరం పై కాసేపు విశ్రమించమని నాతరఫున అర్ధించు ‘’అని కోరాడు .
సముద్రుని మాటకు గౌరవమిచ్చి మైనాకుడు పెద్ద చెట్టు, తీగలతో పైకి వచ్చి తనశిఖర దర్శనం కల్గించి నూరుమంది సూర్యులు ఒకే సారి ఉదయించినట్లు అధికకా౦తితో విరాజిల్లాడు .ఇది తన ప్రయాణం లో తొలి విఘ్నం గా భావించి హనుమ ,తానూ మహావేగంగా పెరిగి మేఘాన్ని వాయువు చెదరగోట్టినట్లు తన రొమ్ము దెబ్బతో సునాయాసంగా పడేశాడు .అకస్మాత్తుగా ఇలా జరుగుతుందని భావించని మైనాకుడు బిత్తరపోయి ,హనుమ వేగాన్ని మెచ్చుకొని పులకించి ఆనందించి .మానవ రూపం పొంది ‘’కపి శ్రేస్టా! హనుమంతా !ఎవ్వరికీ సాధ్యంకాని పని చేస్తున్నావు అభినందనలు .కాసేపు నా శిఖరం పై విశ్రమించి సేద తీర్చుకొని మళ్ళీ ప్రయాణం సాగించు .సముద్రుడు రాముని పూర్వులచే వర్దిల్లినవాడు .కనుక రామహితం కోసం నన్ను ఇలా చేయమని చెప్పించాడు .నీకు ఆతిధ్యమిచ్చి తనకోరిక తీర్చుకోవాలని తలచాడు .మాకూ మీకూ చాలాకాలం నుంచి సత్సంబంధాలున్నాయి .ఇది అతిధి ధర్మమే .నీకు నేను చేసే పూజ మీ తండ్రి వాయు దేవునికిచేసే పూజ అవుతుంది .కృత యుగం లో పర్వతాలకు రెక్కలు ఉండేవి .గరుత్మ౦తు నిలాగా ,వాయువు లాగా అన్ని దిక్కులకు యెగిరి పోయేవి .సకల జీవరాసులు మా గమనానికి భయపడి పోయాయి .ఇంద్రుని ప్రార్ధించాయి .శతక్రతువు ఐన దేవేంద్రుడు పర్వతాల రెక్కలను తన వజ్రాయుధంతో ఖండించాడు .నాపైకి కూడా రాగా మీ తండ్రి దయతో అతనికి అందకుండా నన్ను విసిరేశాడు .నేను వచ్చి ఈ సముద్రం లో పడటం వలన నా రెక్కలు అలాగే సురక్షితంగా ఉన్నాయి .కనుక సాగరుడికీ నాకూ పరమ ఆత్మీయుడవుకనుక మా ఆతిధ్యం పొంది వెళ్ళు ‘’అని వేడుకొన్నాడు .మతిమాన్ హనుమ ‘’నీఆదరణకు సంతోషం .నీ దర్శనమే నాకు ఆతిధ్యం .నేను కర్తవ్యమ్ మరువరాదు .చీకటిపడే లోగా లంకకు చేరాలి .నేను చేసిన ప్రతిజ్ఞప్రకారం ఎక్కడా క్షణం కూడా ఆగకూడదు ‘’అని చిరునవ్వుతో సమాధానం చెప్పి తన పవిత్ర హస్తం తో మైనాకుని తాకగా సముద్ర ,మైనాకులు ‘’నీ వల్ల రామకార్యం సఫలీకృతం అవుగాక ‘’అని రామకార్యానికి తగ్గట్లు ఆశీర్వదించగా రివ్వున ఆకాశానికి యెగిరి హనుమ వాయుమార్గాన గమనం సాగించాడు .
ఈ భాగం లో హనుమ ను సూర్య చంద్ర అగ్ని వాయు రూపాలుగా వర్ణించాడు వాల్మీకి మహర్షి .వారి ప్రతాపాలన్నీ ఆయనలో నిండి నిబిడీకృతం అయ్యాయని భావన .కనుక కార్యం అసాధ్యం కాదని సూచన .సూర్య వాయుదేవులు కూడాఆయనకు అనుకూలంగా ఉండి సాయం చేస్తున్నారు ప్రతాపాలు చూపక తగ్గి ఉన్నారు .మహర్షులు ,దేవతలు మొదలైనవారు ఆశీర్వదించారు.వారి ఆశీస్సులు అమోఘం కనుక తప్పక ఫలిస్తాయి .ఇక్కడ సాగరుని ఆలోచనా అభినందనీయమే .హనుమకు కాసింత విశ్రాంతి నివ్వాలని ఆతిధ్యమిచ్చి ధన్యత చెందాలని భావించటం సహజం .కనుక హనుమ తండ్రి మైనాకుడికి చేసినసాయం గుర్తుకొచ్చి అతని ద్వారా తన కోరిక తీర్చుకోవాలనుకొన్నాడు .మైనాకుడూ తనవంతు ధర్మం నెరవేర్చాడు .మైనాకుని రెక్కలు కత్తిరి౦పబడ లేదనే సత్యమూ మనకు తెలిసింది ఇక్కడ .కారణం వాయువు అన్న విషయమూ అర్ధమైంది . కానీ వీరిద్దరికీ హనుమ చేసిన ప్రతిజ్ఞ తెలీదు .ఆతిధ్యం ఇద్దాము అనే ధ్యాసతప్ప రామ కార్యానికి ఆలస్యకారణం అవుతాము అన్న ఆలోచన లేదు వారికి .అందుకే సంస్కార వంతుడు హనుమ సున్నితంగా వారి మర్యాదలకు అది సమయం కాదని తన ప్రతిన విషయం చెప్పి నిరుత్తరులనుచేసి తెలివిగా బయట పడ్డాడు .తక్షణ వివేకమే ఎప్పటికీ ఉత్తమ ఫలితమిస్తుందని మనకు కూడా ఎరుక పరచాడు ఆంజనేయుడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-4-20-ఉయ్యూరు