హనుమ చేసినపనికి దేవేంద్రునితో సహా సకల దేవతలు మెచ్చి ఆశీర్వదించారు .మైనాకునితో ఇంద్రుడు ‘’నీ పనికి ప్రీతి చెందాను .ఇకపై నావలన నీకు అపకారం జరగదని హామీ ఇస్తున్నాను .జంకు గొంకులు లేకుండా సుఖంగా వర్ధిల్లు .మహా సాహసకార్యానికి వొడిగట్టినహనుమకు వందయోజనాలు దాటగానే అతనికి ఏ అపాయం వస్తుందో అని భయపడ్డాం .ఏమాత్రం భయపడని హనుమ కు నువ్వు చేసిన సాయం విలువలేనిది .రామదూతకు నువ్వు చేసిన సత్కారానికి అత్యంత ప్రీతి చెందాను ‘’అని నిండుమనసుతో అభినందించాడు. హనుమ తిరిగి వచ్చేటప్పుడైనా తనా ఆతిధ్యం గ్రహిస్తాడన్న కొండంత ఆశతో మైనాకుడు నీటిలో మునగకుండా ,ఇంద్రుడిచ్చిన అభయ౦ తో అలాగే ఉండిపోయాడు .
.ఇందరి ఆశీస్సులు దండిగా పొందిన హనుమ అత్యుత్సాహంతో ఆకాశం లో సముద్రాన్ని క్షణకాలం లో దాటగా ,దేవ, గ౦ధర్వ ,సిద్ధ, మహర్షులు సూర్యతేజం తో ఉన్న నాగమాత సరస తో క్రూర రాక్షస రూపం దాల్చి నోటిని ఆకాశమంత చాచి హనుమ ప్రయాణానికి ముహూర్తకాలం విఘ్నం కలిగించమని,అతని బలపరాక్రమాలు తెలుసుకోవటానికి అది పనికొస్తుందని ,ఉపాయంతో అపాయం ఎలా తప్పించుకొంటాడో చూద్దామని కోరారు .ఆమె అలాంటి రూపమేదాల్చి హనుమమార్గానికి అడ్డు నిల్చి,’’దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపారు .నిన్ను తినేస్తాను నా నోట్లో ప్రవేశించు ‘’అన్నది .చాలా ఆనందంగా ఆమెకు నమస్కరించి ‘’రాముడు తమ్ముడు లక్ష్మణుడు భార్య సీతతో తండ్రి దశరధుని ఆజ్ఞగా దండకారణ్యం ప్రవేశిస్తే మాయా వేషంతో సీతను రావణుడు అపహరించుకొని పోయి లంకలో దాచాడు .సీత జాడ తెలుసుకొని రమ్మన్న రామాజ్ఞతో దూతగా వెడుతున్నాను .నువ్వు ఇప్పుడు రామ రాజ్యం లోనే ఉన్నావని గ్రహించు .కనుక ప్రభువుకు సాయం చేయటం నీ విధి .కాదంటావా రామకార్యం పూర్తి చేసి తిరిగి వచ్చినీ నోట ప్రవేశించి నీకు ఆహారమౌతాను అని ప్రతిన చేస్తున్నాను నమ్ము ‘’అన్నాడు ,తనను దాటి ఎవరూ ముందుకు పోలేరని ,తనకు కబ్రహ్మ వరం ఉంది ‘’అన్నది కామరూపిణి సరస .బుద్ధిమాన్ హనుమ వెంటనే ఆమె నోట్లో ప్రవేశించి క్షణం లో బయటికి వచ్చేసి ‘’దాక్షాయణీ !నీవు కోరినట్లే నీ నోట్లో దూరాను బయటికి వచ్చేశాను. బ్రహ్మవరం సార్ధకమైంది కదా. నమస్కారం ‘’అన్నాడు .ఆమె తన సహజ రూపం పొంది ‘’హరి శ్రేస్టా!ఇక సుఖంగా ప్రయాణం సాగించు సీతాదేవినీ, రాముడిని కలిపి పుణ్యం కట్టుకో ‘’అని దీవించింది .దీనితో నాగమాత ఆశీస్సులూ దక్కి మరింత ఉత్సాహం తోప్రయాణం సాగించాడు .క్రిందికి ముడుచుకొన్న రెక్కలతో నాలుగు దిక్కులకు వ్యాపించిన పర్వత రాజు లాగా హనుమ కనిపించాడు .
ఈఘట్టం లో దేవతలు హనుమ ధీశక్తిని పరీక్షించారు .వివేకంతో అతడు సురస నోట్లో దూరి అవ్యవధానం గా బయటికొచ్చి తన తెలివి తేటలు ప్రదర్శించి సురసద్వారా దేవ యక్ష గ౦ధర్వ మహర్షుల అభిమానాన్ని పొంది ఆశీస్సుల౦దు కొన్నాడు .ఇవన్నీ అతని బలాన్ని మరింతగా పెంచాయి .మేధస్సును పదును పెట్టాయి .అఘటన ఘటనా సమర్ధుడు అనిపించుకొన్నాడు .కనుక అతనికి దుష్కరకార్యం ఉండదు అని తేట తెల్లమైంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-4-20-ఉయ్యూరు