ఇంకో విషమ పరీక్షను ఎదుర్కున్నాడు హనుమ .కామరూపి సింహిక చాలాకాలం తర్వాత తనకు మంచి ఆహారం గా అతి పెద్ద ప్రాణి లభిస్తోందని ఎంచి ,హనుమ నీడను పట్టి గుంజింది .ఈఅకస్మాత్తు ఘటనకు ఆశ్చర్యపోయి ,ప్రచండమైన ఎదురుగాలి చే వెనక్కి నడుస్తున్న పడవలాగా తనపని అయిందని ,అన్ని వైపులకు పరికించి చూడగా ,నీటి నుంచి పైకి లేచిన ఒక పెద్ద జంతువు కనిపించగా ,తమకు ఒకప్పుడు సుగ్రీవుడు సముద్రం లో నీడను బట్టి వెనక్కి లాగే అతిపెద్ద జంతువు ఒకటి ఉంది అని హెచ్చరించిన విషయం చటుక్కున స్పురించి,ఆజంతువు అదే అయి ఉంటుందని నిశ్చయించి ,వర్షాకాల మేఘం లా తన దేహాన్ని మరింత పెంచాడు .సింహిక కూడా ఆశ్చర్యపోయి,పాతాళ బిలం లాంటి తననోరు విస్తృతంగా తెరచి,హనుమను తరమసాగింది .అంత విశాలమైన నోటితో తనను కబళిస్తుంది అని వెంటనే గ్రహించి ,దాని నోరు ,దేహ పరిణామం ,ప్రాణస్థానం సూక్షం బుద్ధితో చూసి గ్రహించి ,మహా చాకచాక్యంగా తన శరీరాన్ని అత్యంత వేగం గా తగ్గించుకొంటూ దాని నోట్లోకి దూరిపోయాడు .రాహువు మింగుతున్న చంద్రుడులాగా కనిపించాడు సిద్ధచారణులకు .వెంటనే సింహిక ఆయువు పట్లను గోళ్ళతో అత్యంత వేగంగా అది నోరు మూయక ముందే చీల్చి ,ఉపాయంగా మనోవేగం తో పైకి ఎగిరిపోయాడు .అది విగత జీవియై సముద్ర జలాలపై పడిపోయింది .అప్పుడు ఆకాశ దేవతలు –‘’తాం హతాంవానరే ణాషు పతితాంవీక్ష్య సింహికాం-భూతా న్యాకాష చారీణి తమూచుః ప్లవగోత్తమం ‘’అంటే వానరశ్రేస్టా ,హనుమా !ఒకగొప్ప జంతువును చంపి భయంకర కార్యం సాధించావు .ఇక నీ అభీష్టానికి తిరుగు లేదు .’’ధృతి,ర్దృష్టిర్మతిర్దాక్క్ష్యం స కర్మసు న సీదతి.’’-సతైస్సంభావితః పూజ్యః ప్రతి పన్న ప్రయోజనః ‘’’నీలాగా ధైర్య ,సూక్ష్మబుద్ధి ,బుద్ధి కుశలత ,సామర్ధ్యం ఉన్నవాడు ఎప్పుడూ పరాజయం పొందడు ‘’అని ఆకాశ భూత సంతతి అభినందించి ఆశీర్వదించాయి .ఇలా సింహికను సంహరించి దాదాపు సముద్రం అంతా దాటేసి ,ఒక్కసారి అన్ని వైపులకు చూడగా మనోహరమైన వృక్షజాలం తో లంకానగరం ,దక్షిణ తీర మలయపర్వతం .దానిపై తోటలు కనిపించాయి .
ఇప్పటిదాకా అతి పెద్దగా ఉన్న తన దేహాన్ని ఒక్క సారి చూసుకొని ,అంతపెద్ద రూపంతో రాక్షసులకు కనిపిస్తే తానెవ్వరో తెలుసుకోవాలనే తపనఉత్సుకత ,తన్నుపట్టుకొనే పన్నాగం చేస్తారని గ్రహించాడు .చిటికలో విరాట్ రూపాన్ని,మూడడుగుల దానం కోరి బలిని పాతాళానికి తొక్కేసిన వామన మూర్తిగా రూపం మార్చుకొని మామూలు కోతిలాగా కనిపించాడు .అవ్వలి తీరాన్ని ఎవరూ చూడకుండా చేరి ,లంబగిరి శిఖరం పై దిగాడు .అక్కడ నుంచి దేవతల రాజధాని అమరావతి లాగా ఉన్న లంకానగారాన్ని చూశాడు –
‘’ససాగరం దానవ పన్నగాయుతం –బలేన విక్రమ్య మహోర్మి మాలినం –నిపత్య తీరే చ మహోదధే స్తదా –దదర్శ లంకా మమరావతీ మివ ‘’
రాక్షసులు ,పన్నగులు ఉండే ,పెద్ద అలలల్తో కూడిన శతయోజన విస్తీర్ణ మహా సముద్రాన్ని తన స్వీయ బలంతోదాటి ,తీరం చేరి ,అపర అమరావతి లాగా ఉన్న లంకానగారాన్ని కనులారా సాయం వేళ చూశాడు .
202శ్లోకాల ఈ ప్రధమ సర్గ లో హనుమ బయల్దేరిన దగ్గరనుంచి నాన్ స్టాప్ గా ప్రయాణం చేసి విడువబడిన రామబాణం లక్ష్యం చేరినట్లు లంక కు చేరాడు .మధ్యలో ఎన్నో హుషారురుకలిగించేవి భయపెట్టేవి సంగతులు ఉన్నాయి .లక్ష్యం వైపు సాగే మనిషి ఎక్కడా అలసత్వం చూపరాదు .అనుకోకుండా ఎదురయ్యే భ్రమ ప్రమాదాలను సూక్ష్మ బుద్ధితో వివేకాన్ని జోడించి పరిష్కరించుకోవాలే కాని భయపడి వెనకడుగు వేయరాదు అనే సత్యాన్ని లోకానికి చాటాడు .మంచి పనికి దేవతలుకూడా ఆమోదం చూపి ఆశీర్వదిస్తారని తెలియ జేశాడు .వారికి కావాల్సింది లోకకల్యాణమేగా .ఆత్మీయత చూపినవారిపట్ల మైనాకుని ఆదరించినట్లు ఆదరించి ఆనందం చేకూర్చాలి .పరీక్షా సమయంలో సూక్ష్మగ్రాహి గా ఉండాలి .తననే చంపాలనుకొన్న సింహిక గర్వాన్ని నేర్పుగా ఖర్వం చేసిట్లు ,దారికి అడ్డం తొలగించు కోవాలి .అప్పుడే తధాస్తు దేవతలు సంపూర్ణ అనుగ్రం చూపి కార్యానికి సానుకూల వాతావరణం కలిగిస్తారు .ఇలా ఎక్కడ ఒడిదుడుకు లేర్పడినా హనుమ ధైర్య శోర్య సాహస బుద్ధి వివేకాలతో అధిగమించి అనుకొన్నది సాధించాడు ఇదే ఈ సర్గలో మనం గ్రహించాల్సింది .సముద్రం లో ఎలాంటి తమాషా జీవులు౦టాయో ,వాటి సవ్రూప స్వభావాలేలా ఉంటాయో మహర్షి చూపించాడు .సింహిక లాంటి ప్రమాదకర జంతుఉ ఉంటుందని రాజుసుగ్రీవుడు చెప్పిన విషయాన్ని సద్యో స్పురణకు తెచ్చుకోవటం మహామతిమంతుడైన హనుమ వివేకం .అదే మర్చి పోయి ఉంటె లేనిపోని ప్రమాదం లో పడేవాడు .తక్షణ ఆలోచన తటిల్లత లాగా రావాలి అప్పుడే గొప్ప ఫలితం లభిస్తుంది .ట్యూబ్ లైట్ బుర్ర ఐతే వెలిగే లోపు జీవితం ఆరిపోవచ్చు . .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-4-20-ఉయ్యూరు