సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-6
సముద్రం లంఘించి త్రికూట పర్వత శిఖరం పై ఉన్న లంకా నగరం చూశాడు హనుమ .హరి దర్శనానికి పులకి౦చా యేమో చెట్లు అన్నట్లు సువాసన వెదజల్లే పూల వర్షం కురిపిస్తే ,పూలతో చేయబడిన కోతిలా ఉన్నాడు .అలసట నిట్టూర్పులు లేకుండా ఉన్న అతడు ‘’వందేమిటి సహస్ర యోజనాలున్న సముద్రమైనా దాటేయ గలను ‘’అని కించిత్ గర్వంతో రొమ్ము విరుచుకొన్నాడు .ఇది సహజ మానవ లక్షణం .కంటితో ఎటు చూసినా లంక మహా శోభాయమానంగా పచ్చ పరుపు పరచినట్లు కనిపించి,జయధ్వానాలతో ‘’పచ్చ జెండా ‘’ఊపుతున్నట్లని పించింది .ప్రతిప్రాకారం స్వర్ణమయం .కళ్ళు జిగేలు మనే కాంతి మయం .విశ్వకర్మ నిర్మించిన ఈ నగరం త్రికూట శిఖరం పై ఉండటం తో ఆకాశం లో తేలుతున్నట్లు అనిపిస్తుంది .సంకల్పమాత్రం తో సృష్టించిన విశ్వకర్మ శిల్ప నైపుణ్యానికి అబ్బురపడ్డాడు .కోటలు అగడ్తలు రమ్య భర్మ్య హర్మ్యాలు కను విందు చేశాయి .క్రూర రాక్షసులచేత అనుక్షణం కాపాడబడే లంక ఒకప్పుడు కుబేరుడిది. అతన్ని నెట్టేసి ఆక్రమించాడు రావణా బ్రహ్మ .
ఇప్పుడు విచికిత్సకు లోనయ్యాడు మారుతి .’’వానరులు ఇక్కడికి వచ్చినా ఏమీ చేయలేరు .దేవతలు కూడా లంకను జయించలేరు .సప్తతాళ భంజనాన్ని ఒకే బాణం తో చేసిన రాముడు కూడా ఏమీ చేయలేడేమో ఇక్కడికి వచ్చి .’’ప్రాప్యాపి మహా బాహుః కిం కరిష్యతి రాఘవః ‘’అసుర ప్రవృత్తి కల రాక్షసులముందుసాంత్వనం పని చేయదు .వారు సంపన్నులు కనుక దానమూ పని చేయదు .బలగర్వమున్నవారు కనుక భేదమూ కుదరదు .బలపరాక్రమబుద్ధి విశేషం ఉన్నవారుకనుక యుద్ధం చేత కూడా నిగ్రహింప బడరు .లంకకు రావటానికి అంగదుడు ,నీలుడు ,మా రాజు సుగ్రీవుడు నాకు మాత్రమె సాధ్యం .ముందు సీతాదేవి జాడ వెతికి ,ఆతర్వాత కర్తవ్యమ్ ఆలోచిస్తాను ‘’అని ఆలోచించి ,మళ్ళీక్షణం ఆలోచించి ‘’నేను ప్రస్తుతం ఉన్న రూపం లో లంకలో ప్రవేశించకూడదు .కపట క్రూర వర్తనులైన రాక్షసులను వంచించటం ప్రస్తుతం తప్పదు.ఇలా కనిపిస్తే దొరికి పోతా .చిన్న రూపం లో ఇంత లంకంతా వెదకటం చాలాకష్టం .కనుక మధ్యే మార్గం గా చిన్నదీ కాక పెద్దదీకాని మద్యం రూపం పొంది రాత్రి వేళ లంక చేరి అనుకున్నపని సాధిస్తాను .
ఇంతటి మహా నగరం లో సీతాదేవి ఎక్కడ ఉన్నదో ఎక్కడ రావణుడు దాచిపెట్టాడో తెలుసుకోవటం మహా కష్టం .ఆమె ఒంటరిగా ఉంటె నేను ఒంటరిగా చూస్తాను .వివేకం ప్రదర్శించకపోతే ,కావాల్సిన పనికూడా దూత చేతిలో విఫలమౌతుంది .రాజు మంత్రిఎంతో ఎన్నివిదాలో ఆలోచించి పని నిర్ణయిస్తారు .అవివేకి ఐన దూత దాన్ని చెడ గొట్ట వచ్చు ‘’ఘాతయంతి హి కార్యాణిదూతాః పండిత మానినః ‘’అని ఆర్యోక్తి .అంటే అన్నీ తమకే తెలుసు అనుకునే దూతలు ఇచ్చిన పనులు చెడగొట్టి చెడ్డ పేరు తెచ్చుకొంటారు రాజకార్యం విఫలమౌతుంది .శ్రీరామకార్యం నా మూలాన చెడిపోవటానికి వీల్లేదు .నేను అవివేకి గా ఉండక పోవటం ఎలా అనేది పెద్ద సమస్య .సముద్ర లంఘనం విఫలం కారాదు .రాక్షస రూపం దాల్చినా ,రాక్షసులు తేలికగా గుర్తించే బుద్ధి సూక్షం కలవారు .ఇక్కడ రాక్షసులకు తెలీకుండా గాలికూడా వీయదుఅని నా అభిప్రాయం .వాళ్లకు తెలీనిది ఏదీ ఉండదు .కనుక చిన్న కోతి రూపం లోనే రాత్రిపూట లంక ప్రవేశం చేస్తాను .రాత్రి పూట ఎవరికీ కనిపించకుండా లంకానగరం అంతా వెదకి అమ్మవారి జాడ తెలుసుకొంటాను ‘’అని బహువిధాల ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చి సూర్యాస్తమయం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూశాడు .
రాత్రికాగానే ‘’పిల్లి అంత’’రూపం పొంది ,విశాల లంకానగరమంతా గాలి౦చటానికి సిద్ధమయ్యాడు .శుభకార్యానికి సముద్రుడు ,మైనాకుడు,సూర్యుని వంటి తానూ చుక్కల మధ్య ప్రకాశించే చంద్రుడు కూడా హనుమకార్యానికి సాయం చేస్తున్నట్లు వెన్నెల కురిపించాడు .అప్పుడు శంఖం ,పాలు, తామర తూడులు లాగా తెల్లగా సరస్సులో నుంచి పైకొచ్చిన హంస లాగా తారాపతి చంద్రుడు మార్జాల హనుమకు దర్శనభాగ్యం కలిగించాడు అని58శ్లోకాల ద్వితీయోధ్యాయం .-‘’శంఖప్రభం క్షీర మృణాల వర్ణ –ముద్గచ్చ మానం వ్యవ భాసమానం –దదర్శ చంద్రం స హరి ప్రవీరః –పోప్లూయ మాన౦ సరసీవ హంసం ‘’
ఈ సర్గలో హనుమ ఆలోచనలు యెంత విస్తృతంగా ఉన్నాయో ,దూతకార్యం ఎలా కత్తిమీద సాములాగా ఉంటుందో .కార్యం సఫలం అవటానికి ఎంతగా వివేకం బుద్ధి సూక్ష్మత అవసరమో నిరూపించాడు ,ఒక్కటే ధ్యేయం హనుమది –అదే రామకార్య సాఫల్యత .అందుకే వచ్చిన తాను పరిపరి విధాల వితర్కించి ‘’నేతి నేతి ‘’అని పండితులు తర్కించి బ్రహ్మాన్ని దర్శించే ప్రయత్నం చేశారో అలా చేసి ఆదర్శ దూత అనిపించాడు .చంద్ర ప్రకాశమూ ఆతనికి గొప్పగా సహకరించింది .అందుకే వాల్మీకి రసవత్తర శ్లోకం లో ఉప్పొంగి పోయి వర్ణించాడు . ’ఘాతయంతి హి కార్యాణిదూతాః పండిత మానినః’’ అన్న రుషి వాల్మీకి వాక్యం లోకం లో నానుడిగా నలుగుతోంది ఇప్పటికీ .రస స్వరూపుడు పరమాత్మ కనుక కవితా రసప్రవాహమే ఇక్కడ కనిపించింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-4-20-ఉయ్యూరు