సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-7
కాలోచిత ఆలోచన హనుమ ప్రత్యేకత .బలమైన సైనికులు అకుక్షణం పహారా కాస్తున్న ,వైభవం లోకుబేరుని అలకానగరం లా ,దేవేంద్రని అమరావతిలా ,స్వర్ణద్వారాలు వైడూర్యవేదికలు నేలంతా రత్నఖచితంగా వైడూర్యాలమెట్లతో సుందర వైభవ లంకను హనుమ చూశాడు .దానిగురించి మనసులో ‘’ఈ లంక గొప్పతనం కుముడుడికి ,అ౦గ దుడికి సుషేణుడికి,మైంద ద్వివిదులకు ,సుగ్రీవ కుశపర్వవానరరాజుకు రుక్షునకు కేతుమాలికి మాత్రమేచేరటానికి సాధ్యం ఇది .’’అనుకొన్నాడు .మరి తానూ వచ్చాడుగా ,దాన్ని గురించి చెప్పుకోకపోవటం వినయ లక్షణం ఇక్కడ భాసించింది .ఇతరుల బలపరాక్రమాలు తెలిసి పొగడటం వీర ధీర లక్షణం .హనుమ అదే పాటించి సుభాష్ అనిపించుకొన్నాడు .రామ ,లక్ష్మణ శౌర్య పరాక్రమాలు ఒకసారి గుర్తు చేసుకొని వారిద్దరూ అనాయాసంగా లంకను జయించగలరు అని నమ్మకం కలిగింది .లంక ‘’రత్నాలే వస్త్రాలుగా ,సామాగ్రి నిలవచేసే కొట్లే కర్ణాభరణాలుగా ,యంత్రాగారాలే స్తనాలుగా ఉన్న సర్వ శోభిత అయిన యువతి’’లాగా కనిపించి౦ది కుర్రాడికి .అప్పుడు మరో పరీక్ష ఎదుర్కొన్నాడు .
లంకా నగర దేవత వికృతముఖం ,భయంకరమైన కళ్ళు ,అయిన నిజ రూపం తో కనపడి పెద్దగా అరుస్తూ ,హనుమను చూసి ‘’ఓకోతీ! నువ్వెవరవు .ఎందుకొచ్చావ్ నీ ప్రాణాలు తీసే లోపు నిజం చెప్పు .సర్వ సురక్షమైన లంకలో నీకు ప్రవేశం లేదు ‘’అనగా అత్యంత వినయంగా ‘’అమ్మా !అంతా నిజమే చెప్తా అబద్ధం చెప్పను .అసలు నువ్వు ఎవరు తల్లీ .ఎందుకు భయంకర రూపంతో నన్ను అడ్డుకున్తున్నావు ,బెదిరిస్తున్నావు ?’’అడిగాడు .కామరూపి ఐన ఆమె ‘’రాక్షసరాజు రావణ ఆజ్ఞావర్తిని .నగరాన్ని కాపాడటం నా విధి నన్ను ఎదిరించటం ఎవరికీ సాధ్యం కాదు .నా ప్రమేయం లేకుండా లంకలో నువ్వు ప్రవేశించలేవు .నిన్ను ఇప్పుడే దీర్ఘ నిద్రలోకి పంపిస్తా .’’అన్నది .పర్వతాకారంలా ఉన్న దాన్ని చూసి ఇక యుద్ధమే తక్షణ కర్తవ్యం అనుకోని ,ఎందుకైనా మంచిదని ‘’అందంగా ఆకర్షణగా ఉన్న ఈ నగరాన్ని చూడాలనే కోరిక కలిగింది .ఇక్కడి వనాలు ఉపవనాలు అడవులు ముఖ్యమైన ఇల్లు చూడటానికి మాత్రమె వచ్చాను ‘’అన్నాడు
వికృతంగా వికటాట్టహాసం చేస్తూ అది ‘నీ దుర్బుద్ధి నాకు తెలిసింది నన్ను ఓడించాకుండా లంకానగర సందర్శనం నీకు శక్యం కాదు ‘’అని దబాయించింది .తగ్గు బాలయ్యా తగ్గు అన్నట్లు హనుమ ‘’మంగళాకారిణీ !నేను ఈ పట్టణం అలాఅలా చూసి వెళ్లి పోతానేం’’అన్నాడు .ఇక ఆలస్యం చేయటం మంచిదికాదని ఆ రాక్షసి అరచేతితోచాచి హనుమను గట్టిగా కొట్టింది .ఆమెకంటే పెద్ద ధ్వని చేసి హనుమ ఎడమ చేతి వ్రేళ్ళు ముడిచి పిడికిలితో బాదాడు .ఆ దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మకనిపించి నేలపై పడిపోయింది .స్త్రీ కదా అని జాలిపడగా గర్వం ఖర్వమైన అది హీన స్వరంతో ‘’మహా బలా హనుమా ! ప్రసన్నుడవు కా .కాపాడు స్త్రీలను ధీర వీర శూరులు చంపరాదు .కనిపించే లంకాపురిని నేనే మహాబలుడవుకనుక నన్ను జయించావు .పూర్వం బ్రహ్మ నాకు ఒక వరం ఇచ్చాడు .దానిప్రకారం ఎప్పుడు వానరుడు తనపరాక్రమంతో నన్ను వశం చేసుకొంటాడో ,అప్పుడు రాక్షసులకు భయమేర్పడుతుంది .అది నిజమైంది నీ దర్శనం తో .బ్రహ్మమాట యదార్ధం .దానికి తిరుగే లేదు .దుర్మార్గ రావణుడు సీతాపహరణం కారణం గా సకల రాక్షస సమూహంతో వినాశనం చెందే కాలం నీ రాకతో సమీపించింది .కనుక ఏ పనిమీద శాపగ్రస్త మై బలహీనపడిన ఈ లంకకు వచ్చావో ,ఆపనులన్నీ యధేచ్చగా నెరవేర్చుకొని , నీ ఇష్టం వచ్చినట్లు తిరిగి ,సీతామాత దర్శనం చేసుకొని వెళ్ళు ‘’అని దీవించింది-‘’ప్రవిశ్య శాపోహతాం పురీం –యదృచ్చయా త్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతో యధా సుఖం ‘’
52శోకాల తృతీయ సర్గ ఇది .లంకను అందమైన సర్వాభరణ శోభిత యువతిగా వాల్మీకి హనుమ చేత వర్ణింపజేయటం సరదాగా బాగుంది.అన్ని వేళలా బలం ఉపయోగించరాదు కనుక అంత భీకరాకారంగా ఉన్న లంకా ధీ దేవత కనిపించినా ‘’మంగళస్వరూపిణీ ‘’అని సంబోధించటం హనుమ లోని వెటకారం కన్పిస్తుంది .ఆమె ప్రసన్నతకూ కారణమ మయింది ఆమాట .ఎవరైనా ఎందుకొచ్చావని అడిగితె లోక సహజంగా ‘’ఊరికే చూట్టానికి వచ్చాను ‘’అంటాం .హనుమా అలానే అన్నాడు .దెబ్బకు దెయ్యం పరిగెత్తినట్లు ఒక్క ముష్టిఘాతానికి దాని నిజస్వరూపం బయట పడేట్లు కొట్టాడు హను .కనుక సమయం చూసి బలం ప్రదర్శించాలి ఇక్కడ తప్పలేదు .లంక దేవత యదార్ధం చెప్పేసింది .బ్రహ్మవరం కూడా వివరించి చెప్పి లంకా నగర సందర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పచ్చ జెండా ఊపింది .హనుమకు మరో రహస్యం ఆమె వలన తెలిసింది .శాపోపహత లంక అనే పరమ రహస్యం కూడా తెలిసింది .అంటే ఆయువు పట్టు చిక్కింది .అడగకుండా ఆమె సీతా దేవి ఇక్కడే ఉంది అని రూఢిగా చెప్పటమే కాదు భవిష్యత్ ద్రష్టగా హనుమ ఆమెను దర్శించి వెడతాడు అని నమ్మి ఆశీర్వదించింది .మహర్షి ఏది చెప్పినా ఇంత క్రాంత దర్శనంగా ఉండటం విశేషం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-4-20-ఉయ్యూరు