సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-8
లంకా దేవతను చంపి హనుమ ద్వారం కాని ప్రదేశంద్వారా ప్రాకారం దాటి ,శత్రు శిరసుపై కాలు పెట్టినట్లు ఎడమ పాదం పెట్టాడు .శుభానికి కుడికాలు పెట్టాలి అశుభానికి ఎడమపాదం అన్నది మన సంప్రదాయం .అది తెలిసిన ప్రజ్ఞా శీలి .రాత్రి వేళ యధేచ్చగా లంకలో తిరిగి చూశాడు .గాన నృత్యాలతో నగరం అట్టహాసంగా ఉన్నది .అభి వృద్ధికి చిహ్నాలైన పద్మ స్వస్తిక అనే నిర్మాణ విశేషాలు చూశాడు .అన్నీ అత్యుత్తమ గృహ సముదాయాలే .అంటే వాస్తు ప్రకారం సర్వతో భద్రంగా నిర్మించినవే. ‘దుష్ప్రదేశమైన లంకలో ప్రవేశించగలిగాను కనుక రామ సుగ్రీవుల మనోరధం ఈడేరుగాక ‘’అని సంకల్పం చెప్పుకొని ఆన౦దించాడు ‘’సుశ్రావ మధురం గీతం త్రిస్థాన స్వరభూషితం’’అప్సరసలులాగా రొమ్ము .కంఠం, శిరస్సు అనే మూడు స్థానాలనుంచి పుట్టిన మధురగీతాలు విన్నాడు .అనేక రకాల భవనాలు వివిదాకృతులున్న స్త్రీలు కనిపించారు .రెండు చేతులు వ్యత్యస్తం గా పెట్టి ,భుజాలను తడుతూ వచ్చే ధ్వనితో సింహనాదాలను జపంగా చేస్తూ ఉన్న వారి వేద మంత్రాలు విన్నాడు .బ్రహ్మభాగం పఠించే వారు ,రావణ స్తోత్రం చేస్తూ గర్జి౦చేవారి నాదాలు విన్నాడు .నగరం మధ్యలో ఉన్న గూఢచారులను ,రాక్షస సేన నూ చూశాడు .దీక్షలో ఉన్నవారు జడలు కట్టినవారు ,బోడితలలవారు ,ఎద్దుతోలు కట్టినవారు దిగంబరులు ,పిడికిలి నిండా ఆయుధాలు ధరించినవారు ,జయ హోమం చేసేవారు ,కూట,ముద్గర ,దండాయుధ దారులు ,ఒంటి కన్ను అంటే ‘’ఏకాకన్నయ్యలు’’ ,ఒంటి చెవి ఏకా కర్ణయ్యలు ,వ్రేలాడే పొట్టి స్తనాలవారు ,వంకర మొహాలవారు ,అవయవాలు విషమంగా ఉన్నవారు ,విల్లు కత్తి శతఘ్నిఅంటే ఇనుపగద ఆయుదాలున్నవారు ,జానెడు ఉండే ముసలం,పరిఘ ఆయుధంగా ఉన్నవారుకనిపించారు .ఆశ్చర్యమైన కనులతో ,దున్నపోతుల్లాంటి వారు ,పొట్లకాయలాంటి సన్న వారు ,మరుగుజ్జులు, లాంగ్ పోల్ లాగా బారైనవారు ,తెల్ల నల్లముఖాలవారు ,గూని వాళ్ళు ,తేజస్సున్నవారు ,రాజచిహ్నాలైన టెక్కాలు పట్టుకొన్నవారు మొదలైన వారందర్నీ చూశాడు హనుమ .శక్తి ,వృక్షం ఆశని ,పడవ తెడ్లు ,త్రాళ్ళు ఆయుధాలు గా ఉన్నవారు కనిపించారు .ఉష్పమాలలు చందనం లతో బహువేషాల లవారు ,శూల వజ్రాయుధ ధారులు ఐన మహాబలవంతులైన రాక్షసులను చూశాడు .రావణ అంతః పురం ఎదుట లక్షమంది సైనికులు కాపలా కాయటం చూసి ఆశ్చర్యపడ్డాడు .బంగారు ద్వారాలున్న రావణ భవనం చూశాడు .దాని చుట్టూ లోతైన అగడ్తలు ఉన్నాయి .ఏమరు పాటు లేకుండా అందరూ విధులు నిర్వహిస్తున్నారు .గుర్రాల సకిలింపులు ,స్త్రీపురుషుల కంకణ మణిమంజీరాది భూషణ ధ్వనులు వినిపించాయి .రథాలు ,పల్లకీలు తెల్ల ఏనుగులు ,బాగా మేసి మత్తుగా పడుకొన్న మృగాలు ,రకరకాల పక్షులు కనిపించాయి ‘’స హేమ జామ్బూ నదచక్రవాళం-మహార్హ ముక్తా మణిభూషితాంతం-పరార్ధ్య కాలాగరు చందనాక్తం –స రావనణా౦తఃపుర మా వివేశ ‘’-జంబూ నదిలో, ఇతర చోట్లా లభించే రెండు రకాల బంగారం చేత పూయబడిన ప్రాకారం ,విలువైన ముత్యాలతో అలంకరింపబడిన అగరు ,చందనాలు పూయబడిన రావణుని అంతః పురం లో హనుమ ప్రవేశించాడు .
ఇది 27శ్లోకాలనాలుగవ సర్గ .దీనిలో రావణ భవన వైభవంమందీ,మార్బలం , నిశాచరుల నిరంతర పహారా ,గాన గీత నాట్య విశేషాలు తోపాటు ,వివిధ రకాలైన రాక్షసులు ,వారు ధరించే ఆయుధ విశేషాలు ,వారి బలపరాక్రమాలు అన్నీ చూడగలిగి ఒక ఎస్టిమేషన్ కు రాగలిగాడు భవిష్యత్ కార్యం కోసం ఇంతమంది కన్ను కప్పి తిరగటం ఎంత ప్రమాదమో అర్ధమైంది .అయినా బురిడీ కొట్టించాడు .తనపని తానూ హాయిగా చేసేసుకొన్నాడు సూక్ష్మ బుద్ధి ఉన్న ఆంజనేయుడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -24-4-20-ఉయ్యూరు