బావగారు 2-నమస్కారం బావగారు .బహుకాల దర్శనం .కులాసానా
బావగారు 1-రండి బావగారు క్షేమమే .అవును నిజంగా నే మనం కలుసుకొని కబుర్లు చెప్పుకొని దాదాపు యాభై ఏళ్ళయింది .ఏమిటి విశేషాలు ఇలా దయ చేశారు
2బా- ఇవాళ పరశురామ జయంతి అని జ్ఞాపకం వచ్చి ఆ వివరాలు మీ ద్వారా వింటేనే సంతృప్తి అనుకోని వచ్చాను బావగారు .నాలుగు ముక్కలు చేవినేసి పుణ్యం కట్టుకోరూ
1-బా –అదెంతహాగ్యం బావగారూ .మన౦ కలిసేది మంచి విషయాలు అందరికీ చెప్పటానికేగా .ఇవాళ వైశాఖ శుద్ధ తదియ పరశురామ జయంతి .విష్ణుమూర్తి అవతారాలలో ఆయనది 6వ అవతారం .కొందరు ఈ రోజు ఉపవాసం చేసి ఆయనకు షోడశ ఉపచారాలతో పూజ చేసి ‘’జమదగ్ని సుత వీర ,క్షత్రియా౦తక ప్రభో –గృహాణార్ఘ్యంమయా దత్తం కృపయా పరమేశ్వరా ‘’అని అర్ఘ్యం ఇస్తారు .
2-కొత్త విషయం చెప్పారు బావగారు .అయినా ఆయన పరమ కోపిస్టి ఆయనకు ఎందుకు జయంతి
1-గాది కొడుకు విశ్వామిత్రుడు .జమదగ్ని రేణుకల కొడుకే విష్ణు అంశతో పరశురాముడిగా పుట్టాడు .ఆవంశ కోపం తరతరాలుగా సంక్రమించింది .శివుడిదగ్గర అస్త్ర విద్యలు నేర్చి అవక్రపరాక్రము డయ్యాడు
2-బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడికి ఈకోపం ఏమిటి మహాత్మా
1-మంచి ప్రశ్న .కుశ వంశ రాజు గాది దగ్గరకు భ్రుగు వంశ రుచీక వెళ్లి ఆయనకూతురు సత్యవతిని తనకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు .నల్లటి చెవులున్న వెయ్యి గుర్రాలిస్తే పెళ్లి చేస్తానన్నాడు రాజు .వరునణదేవుడిని ప్రసన్నం చేసుకొని వాటిని పొంది ఇచ్చి సత్యవతిని పెళ్లి చేసుకొన్నాడు .ఒకరోజు సత్యవతి భర్తను తనకు, తనతల్లికి పుత్ర సంతానం ప్రసాదించమని వేడింది .బ్రాహ్మణ మంత్ర పూతమైన ఒక హవిస్సు ,రాజమంత్ర పూతమైన మరో హవిస్సు ఆయన తయారు చేసి స్నానానికి వెళ్ళగా ,విషయం తెలియక రాజమంత్ర హవిస్సును తానూ తీసుకొని విప్రహవిస్సు తల్లికిచ్చింది .రుచీకుడికి విషయం తెలిపి, ప్రాధేయపడగా పుట్టే కొడుకు సాత్వికుడుగా ఉండి మనుమడు మాత్రం ఉగ్రుడుగా ఉంటాడు అని చెప్పాడు .కనుక జమదగ్ని సాత్వికుడుగా ఆయనకొడుకు పరశురాముడు ఉగ్రరూపంగా విష్ణు అంశతో జన్మించాడు బావగారు .
2-అబ్బో దీనిలో ఇంత తిరకాసున్నదా బావగారూ .మరి క్షత్రియుల్ని చంపాల్సిన అవసరం ఆయనకు ఎందుకొచ్చింది బావగారూ
1-అవసరమైన ప్రశ్న ఇది బావగారు .హైహయ రాజు కార్త వీర్యుడు చేతులు లేకుండా పుట్టగా దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకొని వెయ్యి చేతులతో మహా పరాక్రముడయ్యాడు .ఒకరోజు వేటలో అలసి జమదగ్ని ఆశ్రమానికి రాగా గొప్ప విందుతోఅతనికీ, పరివారానికి ఆతిధ్యమిస్తాడు .ఇంతమందికి ఎలా సాధ్యం అని మహర్షిని అడిగితె తన కామధేనువు సంతానమైన ఆవు అని చెప్పాడు .దాని తనకు ఇవ్వమని అడిగితె ఇవ్వను అంటే ,బలవంతంగా లాక్కు పోతాడు .ఇంటికి వచ్చిన పరశురాముడికి విషయం తెలిసి మాహిష్మతీ పురం వెళ్లి అతడి వెయ్యి చేతులను తలను తన గండ్ర గొడ్డలి అనే పరశువుతో ఖండిస్తాడు .తండ్రికి చెబితే పాప ప్రక్షాళనం కోసం తీర్ధయాత్రలు చేయమని పంపిస్తాడు .అందుకే ఆయన గొడ్డలికి ‘’ధర్మ పరశు ‘’అనిపేరు
2-కార్తునిపై కోపం సకల రాజ వంశ నిర్మూలనానికి ఎలా దారితీసిందో అర్ధం కావటంలేదు బావగారూ
1-కొంతకాలం గడిచింది .ఒకరోజు రేణుకాదేవి చెరువుకు నీటికోసం వెడితే గంధర్వుల జలకేళి చూడటం వలన ఇంటికి రావటం ఆలస్యమైతే ,శంకించి కోపించిన జమదగ్ని ఆమెను హతమార్చమని కొడుకుల్ని ఆదేశిస్తాడు .వాళ్ళు ఒప్పుకోరు .పరశురాముడిని తల్లినీ సోదరులను చంపమని ఆదేశించగా ,క్షణం ఆలోచించకుండా నేరవేర్చగా, సంతృప్తి చెంది వరం కోరుకోమంటే తల్లినీ సోదరులను బ్రతికించమంటే బతికిస్తాడు మహర్షి .
2-ఇదీ బానేఉంది కానీ నేను అడిగిన అసలు విషయం—
1-తొందర పడకండి .అక్కడికే వస్తున్నా .ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని వేళ,కార్తవీర్యుని కొడుకులు తండ్రి మనశ్శాంతికోసం జమదగ్ని తలనరికి తమ పట్టటానికి తీసుకు వెడుతుంటే రోదిస్తూ రేణుకా దేవి 21సార్లు గుండె బాదుకొని రోదించింది .ఇంటికి వచ్చిన పరశురాముడు తీవ్రకోపం తో మాహిష్మతికి వెళ్లి కార్తవీర్యుని కొడుకుల్ని గొడ్డలితో చంపి ,తండ్రి తల తెచ్చి మొండానికి అంటించి బ్రతికిస్తాడు .తనతల్లి 21సార్లు రోదించటం తెలిసి క్షత్రియజాతిపై ద్వేషంతో నిర్వంశం చేయాలని 21సార్లు దండెత్తి సర్వ శత్రు సంహారం చేసి సంతృప్తి చెందటమే కాక శ్యమంత పంచకం అనే అయిదు సరస్సులను క్షత్రియ రక్తం తో నింపి తలిదండ్రులకు తర్పణ చేస్తాడు .
2-గొప్ప విషయం చెప్పారు బావగారు .మరి సూర్యవంశం ఎలా బతికి బట్టకట్టింది
1-దశరధుడు మరికోద్దిమంది రాజులు ఆవులమందాలో ఆడవేషాలలో దాక్కొని తప్పించుకొన్నారు .తాను సాధించిన శక భూమండలాన్నీ పరశురాముడు కశ్యప మహర్షికి దానం చేసిన మహా దాతకూడా బావగారూ ,తపస్సు కోసం వెళ్ళిపోయాడు
2-రామాయణం లో పరశురాముడు మళ్ళీ కనిపిస్తాడుకదా బావగారూ
1-సీతారామ కల్యాణం తర్వాత ,తనగురువు శివుని విల్లు విరిచిన రాముడి పై యుద్ధానికి వస్తాడు .దశరదుడితో సహా శాంతించమని కోరినా వినక ,అంత పరాక్రమవంతుడైతే తన ‘’విష్ణు చాపం ‘’ఎక్కు పెట్టమని ఇవ్వగా అవలీలగా ఎక్కుపెట్టగా అందులోని విష్ణు తేజం రామునిలో చేరింది . బాణం ఎక్కడ వదలాలని అడిగితె తన తపోశక్తిని కొట్టేయ్యమని చెప్పి అలా చేయగా ,లోకం లో ఒకడే రాముడు ఉండాలని రాముని ఆశీర్వదించి తాను మహేంద్రగిరిపై తపస్సుకు వెళ్ళిపోయాడు పరశురాముడు
2-ఇద్దరూ విష్ణు స్వరూపులే .పరశురాముని అవసరం ఇక లోకానికి లేదు కనుక ,రామ అవసరం పుష్కలంగా ఉంది కనుక నిష్క్రమించాడు .మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తాడా బావగారు
1-బాగా చెప్పారు బావగారు .ద్వాపరయుగం లో మహా భారత కాలం లో భీష్మునికి గురువై అస్త్రవిద్య నేర్పాడు .అంబికను పెళ్లి చేసుకోమని గుర్వాజ్ఞగా చెప్పినా, తాను చేసిన ప్రతిజ్ఞకు బద్ధుడై నిరాకరించగా ,యుద్ధానికి దిగగా ఘోర యుద్ధం జరిగి, దేవతల అభ్యర్ధనమేరకు ఇద్దరూ శాంతించారు
2-కర్ణుడు కూడా శిష్యుడని విన్నాను
1-అవును బ్రాహ్మణవేషం లో కర్ణుడు పరశురామ శిష్యుడై అస్త్రవిద్య నేర్చి ,తర్వాత అతని అబద్ధం గ్రహించి యుద్ధకాలంలో అస్త్రవిద్య గుర్తుకు రాదనీ కర్ణుడిని శపించాడు .అంతేకాదు బావగారు కురుపాండవులకు అస్త్రవిద్యా గురువు ద్రోణా చార్యుడూ పరశురామిని దగ్గరే అస్త్ర విద్య నేర్చాడు .మహేంద్ర పర్వతంపై తపస్సులో ఉన్న పరశురాముని అర్జునుడు దర్శించి ఆశీస్సులు పో౦దాడుకూడా.
2-ఇంకేవైనా విశేషాలుంటే తెలియజేయండి బావగారు
1-నిరభ్యంతరంగా .ఒకసారి పరశురాముడు శివదర్శనానికి కైలాసం వెడితే ,ద్వార పాలకుడు వినాయకుడు అడ్డగిస్తే గొడ్డలి విసిరితే ,శివ ప్రసాదమైన పరశుపై గౌరవంతో తన దంతాన్ని ఒకటి సమర్పించాడు దానికి .కనుకనే ఏకదంతుడు .పరశురాముడు చిరంజీవి కల్క్యావతారం లో విద్యలు ఉపదేశిస్తాడని ,తర్వాత మన్వంతరం లో సప్తర్షులలో ఒకరు గా అవుతాడని కధనం ఉంది
2-అంతా కొత్తగా ఉంది .ఇంకా విశేషాలు చెప్పండి
1-క్షణికావేశ పరుడైన పరశురాముడు తాను సాధించిన సమస్త భూభాగాన్నీ కశ్యపుడికి దానం చేసినట్లు చెప్పుకొన్నాం కదా .మరి ఆయన తపస్సు చేసుకోవటానికి స్థానం లేకపోయింది .తన పరశువును సముద్రం లోకి విసిరేశాడు సముద్రుడు వరుణుడు ఆయనపై ఉన్న గౌరవంతో పరశువు పడినంత మేరకు గోకర్ణం ,కన్యాకుమారి లమధ్య వెనక్కి తగ్గాడట.అలా వెలువడిన భూభాగమే కేరళ రాష్ట్ర౦ అంటారు .కేరళలో అందుకే 7పరశురామ క్షేత్రాలు ఆయనగౌరవంగా వెలశాయి బావగారూ .దేశం మొత్తంపై 108పరశురామాలయాలున్నాయి
2-అందులో ఏదైనా ఒకదాని గురించి —
1-కేరళ తిరువనంతపురం దగ్గర’’ తిరు వళ్లం’’లో కరమణ నదీ తీరం లో 2వేల ఏళ్ళనాటి పురాతన పరశురామ మందిరం ఉన్నది .ఇక్కడ పితృ దేవతలను పూజించటం మరో విశేషం
2-ఇంతటి మహా నుభావుడిపై కవులు ఏమైనా రాశారా బావగారూ
1-జయదేవ మహాకవి రసమయ శ్లోకంగా దశావతార స్తుతిలో రాశాడు-
‘’క్షత్రియ రుదిరమయేజగదపగత పాపం-స్నపయసి పయసి శమిత భవతాపం – కేశవ!ధృత భృగుపతి రూప –జయ జగదీశ హరే ‘’
2-బాగుంది బావగారు .మన తెలుగులో అంతసాహసం ఎవరూ చెయ్యలేదా
1-చెయ్యకేం –దాశరధీ శతకం లో భక్తరామదాసు గారు పరశురామ స్తుతి చేశారు –
ఇరువదియొక్క మాఱు ధరణీశులనెల్ల వధించి తత్కళే
బర రుధిర ప్రవాహమున బైతృక తర్పణమొప్పజేసి భూ
సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసంగితీవె కద దాశరధీ కరుణా పయోనిధీ.
బావగారు -2-ధన్యుణ్ణి బావగారు .పరశురామ జయంతి నాడు పరశురామ వృత్తా౦తం సాకల్యంగా చెప్పి నాకు మహోపకారం చేశారు .మళ్ళీ కలుస్తాను. వస్తా బావగారూ
బావగారు -1-సంతోషం బావగారూ .వస్తూ ఉండండి ఇలానే మంచి విషయాలతో కాలక్షేపం చేద్దాం .
అంకితం-మద్రాస్ తెలుగు రేడియోలో బావగారి కబుర్లు సాయంత్రం వేళ ప్రసారమయ్యేవి .అందులో ఒక బావగారు శ్రీ గాడేపల్లి చిన సూర్యనారాయణ గారు . తన ప్రత్యేక కంఠస్వరంతో ఖంగుమని పలుకుతూ, జానపద శైలిలో పాడుతూ శ్రోతల్ని వుర్రూత లూగించిన రెండవ వారు శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రి. మూడు దశాబ్దాలు ఆకాశవాణిలో పనిచేసి ‘ సెబాస్ ‘ అనిపించుకొన్న వ్యక్తి. 1936 లో ప్రయాగ ఆకాశవాణి మదరాసు కేంద్రంలో నిలయ విద్వాంసుడుగా చేరారు. ‘ బావగారి కబుర్ల ద్వారా వీరు శ్రోతలకి చేరువయ్యారు. వీరు, గాడేపల్లి సూర్యనారాయణ గారు కలిసి బావగారి కబుర్లు నిర్వహించేవారు. అవి శ్రోతల జీవనంలో భాగమైపోయాయి. ‘ ఏమండోయ్ బావగారు ! రావాలి ! రావాలి ! ‘ అనే పలకరింపులు సహజమయ్యాయి. స్క్రిప్టు లేకుండా యధాలాపంగా అనర్గళంగా తన సంభాషణలతో వినోదాన్ని అందించేవారు ప్రయాగ..చినసూర్యనారాయణ గారు మద్రాస్ లో ఉంటున్న మా పెద్ద బావగారు అంటే మా పెద్దక్కయ్య లోపాముద్ర భర్త గాడేపల్లి కృపానిధి గారి తండ్రి’’ పండిట్ రావు’’ గా ప్రసిద్ధుడైన , రోషనార,చంద్రగుప్త మొదలైన హిందీనాటకాలలో నటించి ,పాత వెంకటేశ్వర మహాత్మ్యం సినిమాలో భ్రుగు మహర్షిగా నిర్దోషి మొదలైన సినిమాలలో నటించిన శ్రీ గాడేపల్లి సూర్యనారాయణ గారికి స్వయాన తమ్ముడే .ఈయన్ను పెద సూర్యనారాయణ అనేవారు .అలాగే శ్రీ గాడేపల్లి శంకరం గారు కూడా ఒక తమ్ముడే .ఈయన భార్య దుర్గాబాయి గారి మహిళా సభ స్కూల్ లో హిందీ పండిట్ గా ఉండేవారు ..ఈ కుటుంబాలన్నీ మా బావ గారింట్లో ఏ కార్యక్రమం జరిగినా ,పిల్లాపాపలతో హాజరయేవారు . ఇప్పుడూ అలానే వస్తున్నారు మా అక్కయ్యా బావ చనిపోయినా వారూ గతి౦చినా వారిపిల్లలుకూడా మా మేనల్లుడు మేన కోడళ్ళ ఇంటికి . నాకు గుర్తున్నంతవరకు చినసూర్యనారాయణగారిఅల్లుడే దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు .కృష్ణ శాస్త్రిగారిని అయిదారు సార్లు వారింటి వద్దే చూసి మాట్లాడాను .1950ప్రాంతం లో కృష్ణ శాస్త్రిగారు ,కాటూరి వెంకటేశ్వరరావు గారు ఒకసారి ఉయ్యూరులో మా ఇంటికి వచ్చి గంట సేపు కూర్చుని మాట్లాడటం నేను ఎప్పటికీ మరచిపోలేని విషయం .
ఇలా బావగారి కబుర్లతో గాడేపల్లి,ప్రయాగ గార్లు చక్కని వాచకం తో ,విషయాలను సూటిగాస్పస్టంగా చెప్పి రక్తి కట్టించటం నాకు ఇంకా గుర్తు ఉంది .
విజయవాడ రేడియోలో 1971నుంచి 75వరకు’’ సాయంత్రం 6-50నుంచి పదినిమిషాలు 7గంటల వార్తల వరకు బావగారి కబుర్లు’’ శ్రీ సి.రామమోహనరావుఅనే చివుకుల రామమోహనరావు , శ్రీ నండూరి సుబ్బారావు ద్వయం చెప్పి ఉత్సుకత కలిగించేవారు …వినసొంపుగా ఉండేవి అలవోకగా చెప్పేవారు ఏ విషయమైనా .1971లో యుద్ధం ,బంగ్లాదేశ ఆవిర్భావం విశేషాలు కబుర్లద్వారా ప్రజలలోకి సూటిగా తీసుకు వెళ్ళేవారు .వీటిని టేపులపై భద్రపరచినట్లు లేదు .ఉంటె ఎంతటి ప్రేరణకలిగించేవో .ఒక్కోసారి ‘’ధరవరలు ‘’కూడా చదివే వారని గుర్తు .’’పంది’’వారు’’ధర చెబుతుంటే తమాషాగా ముక్కు మూసుకొనే వాడిని ఎన్నో నాటికలలో హాస్య సన్నివేశాలలో వీరి వాచిక నటన అనన్య సామాన్యంగా ఉండేది. ప్రతిదీ చిరస్మరణీయం చేసెవారు ఈ జంట .
ఒక సారి వీరందరినీ స్మరించాలన్న తలంపుతో ఇవాళ ‘’రేడియో బావగారికబుర్లు ‘’ ప్రారంభించాను .ఈ ఎపిసోడ్ లన్నీ రేడియో ద్వారా బావగారి కబుర్లు చిరస్మరణీయం చేసిన శ్రీ గాడేపల్లి సూర్యనారాయణ ,శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రి ,శ్రీ సి.రామమోహనరావు ,శ్రీ నండూరి సుబ్బారావు గార్లకు అంకితమిస్తూ ధన్యత పొందుతున్నాను
సశేషం
పరశురామ జయ౦తి శుభాకా౦క్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-4-20-ఉయ్యూరు .