సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-9
నెన్నెల మెండుగా ఆకాశం లో కురిపిస్తున్న చందమామను హనుమ చూసి పరవశించాడు జనుల దుఖాల్ని పోగొట్టి సముద్రానికి వృద్ధి కలిగింఛి ప్రాణికోటికి ప్రకాశం కలిగించే చంద్రుని దర్శించాడు .మందర పర్వత కాంతి ,సాయం సముద్రానికి ఉన్న ప్రకాశం జలకమలలకున్న వెలుగువంటి కాంతితో చంద్రుడు శోభాయమానంగా ఉన్నాడు .వెండి పంజరపు హంసలా , ,మందరపర్వత సింహం లా ,మదించిన ఏనుగు ఎక్కిన వీరుడిలా కనిపించాడు ఉడురాజు.వాడి కొమ్ములున్న తెల్లని వృషభంలా ,ఎత్తైన శిఖరాలున్న కొండ లా ,బంగారు తొడుగు గల కోరలున్న ఐరావతంగా సకల కళా పరిపూర్ణుడు గా వెలిగిపోతున్నాడు విను వీధిలో .మంచు అనే మాలిన్యం వదలి ,శుక్ర గురు గ్రహాలను కప్పి విడిచిన నిర్మలత్వంతో ,మహాగ్రహమైన సూర్యుని కిరణాలు పొందటం చేత మహా అంధకారం తొలగి ,బాగా కనిపించే మచ్చ తో ప్రభావశాలిగా చంద్రుడు వెలిగిపోతున్నాడు .ప్రదోషకాలం అయిన సాయంకాలం గడిచింది .రాత్రి అయేసరికి పతివ్రతలు తమ భర్తలతో శయనిస్తున్నారు .రాక్షసులు నిశాచరులు కనుక మహాదానందంగా విహరిస్తున్నారు .మద్యం తో మదించి ,ఏమరు పాటున్న జనాలతో ఉన్న వివిధ రథ తురగ గజాలతో వీరలక్ష్మి లాగా వెలిగే గృహాలను ఆ వెన్నెల్లో దర్శించాడు హనుమ .తాగుబోతుల ప్రేలాపనలు ,మత్తెక్కి తమనే తాము తిట్టుకోనేవారు ,రొమ్ములు విరిచి ,భార్యల అవయవాలపై పై కాళ్ళూ చేతులూ వేసి పడుకున్నవారినీ ,విచిత్ర వేషగాళ్ళను ,విల్లు ఎక్కుపెట్టి తిరిగే వారినీ చూశాడు .
చందన లేపం ఒంటికి పట్టించుకొనే వారు నవ్వేవారు కోపం నిట్టూర్పులు విడిచే స్త్రీలను చూశాడు .పూజి౦పతగిన సత్పురుషులు లేక ,యుద్ధం చేయటానికి సరిపోయే ప్రతి వీరులు లేక ,ఆ లంకా పట్టణం నిట్టూర్పు పాములతో ఉన్న మడుగు లాగా అనిపించింది .ఉత్తమ గుణాలకు తగ్గ ప్రవర్తనతో ఉన్న సుందరాకారులు ,తేజోవంతంగా దానికి తగ్గ నడవడి ఉన్న వికృతాకార రాక్షసులనూ చూశాడు .పతుల చేష్టలకు సిగ్గుపడేవారు వారు, చల్లినపూలరాశిలో కప్పుకు పోయినవారు అయిన స్త్రీలను చూశాడు .మేడలపై మొగుడి తొడలపై కూర్చుని విలాసం వొలికించే స్త్రీలు ,మదన పరవశంతో భర్తలకు అమితానందం చేకూర్చేవారు కనిపించారు .ముసుగు తొలగిన స్త్రీలు బంగారు తీగల్లా ,కొందరు మేలిమి బంగారం లా ,పతులను ఎడబాసి చంద్రునిలాగా పాలిపోయిన వారినీ చూశాడు .అభిసారికలను ,మధుర మనోహరగనలను చూశాడు. కానీ
‘’న త్వేవ సీతాంపరామాభిజాతాం-పథి స్థితే రాజకులే ప్రజాతాం-లతాం ప్రఫుల్లా మివ సాధు జాతాం-దరర్శ తన్వీం మనసాభి జాతాం’’
అంటే పరమ సౌందర్యవతి ,సన్మార్గ నిష్టమైన రాజవంశం లో పుట్టి , ,గారాబ౦గా పెరిగి వికసించే పూల తీగలాగా నాజూకుగా ,సంకల్ప మాత్రంగా అయోనిజగా జన్మించిన తన్వి సీతామాతను మాత్రం చూడలేక పోయాడు .పాతివ్రత్య ధర్మంతో ,రామదర్శనం కోసం పరితపించే నిశ్చయ నిర్మల బుద్ధి కలిగి రామహృద్యాన్ని ఆకర్షించిన ఉత్తమ వనితా రత్నం,పూర్వం’’ నిష్కం’’ అనే ఆభరణం ధరించి,ఇప్పుడు కన్నీరే ఆభరణంగా ఉంటున్న సు౦దరవదన,స్పష్టంగా కనిపించని చంద్ర రేఖలా ఉండే ,దుమ్ముతో కాంతి హీనమైన బంగారు కడ్డీలా ఉండే ,గాలిచే చెదరగొట్టబడిన మేఘ రేఖలా ఉండే శ్రీరాముని అర్ధాంగి సీతాదేవి మాత్రం కనిపించక మూఢమతిలాగా దుఖి౦చాడు హనుమ .
ఇది 27శోకాల అయిదవ సర్గ. దీనిలో చంద్రుడు ఎన్నిరకాలుగా ప్రకాశామానంగా కనిపించాడో వాల్మీకి మహర్షి చల్లని వెన్నెల కురిపించి మానసిక ఆనందాన్ని ఇచ్చే ఉదాత్త ఉత్తమ శ్లోకాలలో అభి వర్ణించాడు .తెల్లదనం అంతా మూర్తీభావి౦చినట్లు చెప్పాడు .ఎవ్వరికైనా ఆనందం ప్రత్యక్షానుభవం అవుతుంది .మరి వానర రూప హనుమ కు మరింత ఆనందం .తర్వాత రాక్షసాగ నలు, వారి వివిధ భంగిమలు శయన విలాసాలూ చూశాడు .కానీ అమ్మవారు వీరెవరిలాగా ఉండదు అనే నిశ్చయమనస్సున్నవాడు కనుక వీరంతా సామాన్య రాక్షస స్త్రీలని గ్రహించి ,వీరిలో సీతా దేవి ఉండదనిపించి౦ది .కానీ తాను వెదకే, వెతకాల్సిన సాధ్వి ఎలా ఉంటుందో మనసులో భావన చేశాడు .వీరంతా మదమత్తులులాగా ప్రవర్తిస్తున్నారు .సీత మాత్రం భోగాలనీడ పడకుండా భర్తకోసం కుంగి కృశించి మకిలి పట్టిన బంగారు తీగలాగా ఉంటుందని తెలుసుకొన్నాడు .అలాంటి సాధ్వి సీతా దేవి సందర్శనం ఈ సామాన్య రాక్షస గృహాలలో లభించదు అనుకొన్నాడు .కాని ప్రయత్నం వృధా అయింది ..కనుక పామరత్వం ప్రవేశించగా దుఃఖించాడు మహా మతిమంతహనుమాన్ .
సశేషం
పరశురామ జయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-4-20-ఉయ్యూరు