సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-10
సీతాదేవి కనిపించలేదని బాధపడి దుఖించిన హనుమ మరింత వేగంగా వెదకటానికి బయల్దేరి రావణ గృహం చేరాడు .అది బంగారు వెండి ద్వారాలతో ,మేలిమిగుర్రాలు రథాలతో ,సింహాల ,పులుల చర్మాలతో కప్పబడిన దంతం వెండి బంగారం కదిలితే వినసొంపైన శబ్దాలు చేసే సుందర రథలతో ,రాత్నాసనాలు నానామృగ పక్షి సందోహాలతో కూడిన రావణ గృహం చూశాడు .సుందర స్త్రీలతోభేరీ శంఖ మృదంగ వాద్య ధ్వనులతో ,ఛత్ర చామరాది రాజలక్షణాలతో,సముద్ర గంభీరం తో ఉన్న ఆభవనం చూసి సీత కనిపించకపోవటం తో రావణకుమారులు ,మంత్రుల గృహాలు వరుసగా చూస్తూ ,ప్రహస్త,మహాపార్శ్వ ,కుంభకర్ణ ,విభీషణ గృహాలు దాటి ,మహోదర ,విరూపాక్ష ,విద్యుజ్జిహ్వ ,వజ్ర దంష్ట్ర ,శకరక్షస గృహాలు కూడా పరికించి ,సారణుడి ఇంటికినీ దాటి ,ఇంద్రజిత్ ,జంబుమాలి ,సుమాలి ,రశ్మి కేతు ,సూర్య శత్రు ,వజ్రకాయ గృహాలు వెదికి ,ధూమ్రాక్ష ,సంపాతి ,విద్యుద్రూప ,భీమ ,ఘన ,విఘ్న ,శుకనాస ,వక్త్ర శఠ,వికట ,బ్రహ్మకర్ణ ,దంష్ట్ర ,రోమశ ,యుద్దోన్మత్త,మత్త,ధ్వజగ్రీవ ,నాది,విజ్యుజ్జిహ్వ ,ఇంద్రజిహ్వ ,హస్తిముఖ ,కరాళ,పిశాచ ,శోణిటాక్ష గృహాలు వెతికి,వారి సపదలకు ఆశ్చర్యపోయి ,పీచే మూడ్ అన్నట్లు మళ్ళీ రావణ గృహానికి వచ్చి అక్కడ అతడు నిద్రిస్తుండగా మేల్కొని కావలికాసే రాక్షస స్త్రీలను చూశాడు .సైన్యమక్కడనిరంతరం పహరాకాస్తోంది.అనేక ఆకారాల పల్లకీలు లతా చిత్ర శాలలు క్రీడాభవనం ,క్రీడా శైలం ,దేవగృహాలు చూశాడు.అనేక నిధులు రత్నాలు ఉన్న రావణ ధనాగార౦ ,రత్నకాంతులు రావణ తేజం తో ఆభవనం సూర్యునిలాగా తేజరిల్లింది .నేలఅంతా తేనెతో తయారైనమద్యం తో తడిసి ఉంది .మణిమయ పాత్రలు ఎన్నో ఉన్నాయి .వందలాది స్త్రీ లతో వ్యాప్తమైన ఆ రావణ భవనం ప్రవేశించాడు హనుమ .
44శ్లోకాల ఆరవ సర్గ ఇది .ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ,ఎక్కడా ఏ భవనమూ వదలకుండా అన్నిటినీ జాగ్రత్తగా సీతా దేవికోసం గాలించాడు దర్పానికి కారణమైనరావణ అనంత ఐశ్వర్యాన్ని స్వయంగా చూసి తెలుసుకొన్నాడు. దేనిపైనా ఆసక్తికాని ,అసూయ కాని కలుగలేని స్థిత ప్రజ్ఞత హనుమలో మనం చూస్తాం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-4-20-ఉయ్యూరు