సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-11
మళ్ళీ రావణ సౌధానికి వచ్చిన హనుమ అక్కడి భోగ ఐశ్వర్యాలను శిల్పకళను చూసి సాక్షాత్తు ’మయుడే వచ్చి నిర్మించాదేమో ‘’అనుకొన్నాడు .ఇంతలో పుష్పక విమానం కనిపించింది .దాని శోభా వర్ణనానాతీతం .అది అనేక దాతువులచేత ,పుష్పాల పుప్పొడితో ఉన్న కొండ లాగా కనిపించింది .దాని రత్నకాంతులు కళ్ళు జిగేలుమనిపిస్తున్నాయి .అందులో సుందరీమణులున్నారు . ఆకాశం లో మేఘంలా ,మబ్బులు కమ్మిన చిత్ర వర్ణం లా ఉంది. ఆ విమానం లో తెల్లని భవనాలు అందమైన పూలతోటలు వికసించిన తామరపూలున్న కొలనులు ,విశేష వనాలు ఉన్నాయి .పుష్పకం పై కొన్ని పక్షులు వైడూర్య,కొన్ని వెండి,మరికొన్ని పగడ నిర్మితాలు .దానిపై గుర్రాలు పాములు ,అందమైన పక్షులు రత్నాలతో చెక్కబడినాయి .బంగారు పూలతో ఉన్నాయి .ఇదంతా మన్మధుడికి సహాయకారి గా అనిపించింది ఘోటక బ్రహ్మ చారికి .తామరకొలనులు ,అందులో లక్ష్మీదేవి ఆమెకు అభిషేకం చేసే స్త్రీలు విస్పష్టంగా చిత్రి౦ప బడినాయి .మొత్తం చుట్టి వచ్చినా స్త్రీ సౌఖ్యం పొందుతున్న రావణుడు కనిపించలేదు ,జానకీ మాత దర్శనం కాలేదని పరితపించాడు –
‘’తతస్తదాబహువిధ భావితాత్మనః –కృతాత్మనో జనక సుతాం సువర్త్మనః –అపశ్యతో భవ దతి దుఖితం మనః –సుచాక్షుషః ప్రవి చరతో మహాత్మనః ‘’
అనేక రకాలుగా ఆలోచించే నిశ్చలబుద్ధి ,సదాచార సంపన్నతఉన్న మహాత్ముడు ,ఉత్తమ దర్శన శక్తి కలవాడు అయిన హనుమ సీతా దేవి కనిపించక చింతా క్రాంతుడయ్యాడు
ఇది 17శ్లోకాల ఏడవ సర్గ .ఇందులో పుష్పకం అనే అత్యంత పెద్ద విమానం కూడా రావణుడి భవనం లో ఉన్నది అంటే అది ఎంత విస్తీర్ణం తో ఉందో ఆలోచించాలి .అంతేకాదు ఆ విమానం లో సకల సౌకర్యాలు ,అత్యంత విలాస విషయాలు ఉద్యానవనాలతో సహా ఉన్నాయట .కనుక ఇది మయుడి నిర్మాణమే అనే నిశ్చయానికి హనుమ వచ్చాడు .
దూరం నుంచి మాత్రమే చూసి వర్ణించిన తీరుమాత్రమే ఇది .తర్వాత సర్గ లో మహర్షి హనుమ లోపలి చూసిన పుష్పక వర్ణన ఉంటుంది .అ అరుదైన విమానం కిటికీలు మేలిమి బంగారు నిర్మితాలు .అతి వైభవోపేతంగా అత్యంత సుందరంగా దాన్ని నిర్మించి విశ్వకర్మ తన నిర్మాణ చాతుర్యానికి తానే బోలెడు ఆశ్చర్యం ప్రకటించుకొన్నాడు –
‘’తదప్రమేయా ప్రతికార కృత్రిమం –కృతం స్వయం సాధ్వితి విశ్వకర్మణా-దివం గతం వాయు పథ ప్రతిష్టిత౦ –వ్యరాజతా దిత్య పథస్య లక్ష్మ్య వత్ ‘’
అంతేకాదు దానికి చోదకుడు అంటే పైలట్ అక్కర్లేదు ,రావణుడు మనసులో ఎలా తలచుకొంటే అలా గమనం చేస్తుంది .ఇంకెవరికీ అది నడపటం సాధ్యంకాదు .ఇంద్రుడి విమానం కూడా దీనిముందు దిగదుడుపే .దాన్ని వేలాది రాక్షసులు ,భూతగణాలు మోస్తున్నట్లు చిత్రించటం మరీ విశేషం
‘’మనోభిరామం శరదిందు నిర్మలం –విచిత్ర కూటం శిఖరం గిరేర్యథా
వహంతి యంకుండల శోభితాననా –మహాజనా భూత గణా స్సహస్ర శః
‘’వసంత పుష్పోత్కర చారు దర్శనం –వసంత మాసాదపి కాంత దర్శనం –సపుష్పకం తత్ర విమాన ముత్తమం –దదర్శ త ద్వానర వీర ముత్తమం ‘’
వసంత పుష్ప సమూహాలలాగా కనిపించే సుందరమైన ,వసంత మాసం కంటే మనోహరమైన ,సర్వ శ్రేష్టమైన పుష్పక విమానాన్ని కపి శ్రేష్ట హనుమాన్ దర్శించి పులకి౦చాడు ‘’
8శ్లోకాలు మాత్రమే ఉన్న ఈ ఎనిమిదవ సర్గ లో మహర్షి రెండు తమాషాలు చెప్పాడు .లోకం లో ఎవరైనా ఒక గొప్ప పని చేస్తే ,ఒక్కోసారి అతడికే తన పని అమితాశ్చర్యం కలిగిస్తుంది .ఆ లక్షణాన్ని విశ్వకర్మ కు కూడా ఉన్నట్లు చూపించాడు .ఎంతటి వారైనా ఇలాంటి మనోభావాలకు అతీతులు కారు అనే లోక సహజ విషయాన్ని బయట పెట్టాడు విశ్వకర్మ చేస్టద్వారా .పుష్పకం పేరులోనే పుష్ప సౌందర్యం భాసిస్తుంది .మరి దాని అందాలు చూస్తే మనసు సంపూర్ణ వికసిత శతపత్రమే అవుతుంది .అలాంటి అనుభూతి పొందాడు హనుమ .అంతేకాదు వసంతం మనసును హసితం చేస్తుంది .ఆహ్లాద పరచి ఉల్లాసం కలిగిస్తుంది .అందుకే వసంత నవరాత్రులు చేస్తాం .అలాంటి వసంత శోభకంటే విశిష్టమైన శోభ పుష్పక విమానానికి ఉండటం తో ఇప్పటిదాకా కల్లోలంగా ఉన్న హనుమ మనసు కొంత సేద తీరిందని గ్లాని తగ్గిందని ,కొద్ది కాలం లో ఏదో తెలీని మధు మధుర విషయాలు జరిగి తాను వచ్చిన పనికి సార్ధకత తెస్తుందనీ మహర్షి వాల్మీకి సూచ్యార్ధం గా చూచి౦చాడేమో అని పించింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-4-20-ఉయ్యూరు