2-బావగారు –శ్రీమతే రానుజాయనమః శివగోవిందగోవింద –నమస్కారం బావగారు .ఎండలు మెండుగా కాయుచున్నవి దేవుడు గుర్తుకొచ్చాడు
1-బావగారు –రండి బావగారు .మీ రాకతోనే ఇవాళ రెండు గొప్ప విషయాలు తెలీకుండా చెప్పారు .
2-అవేమిటోసెలవియ్యండి బావగారు
1-ఇవాళవైశాఖ శుద్ద పంచమి జగద్గురువు,అద్వైత మత స్థాపచార్య శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి ఈ రోజే విశిష్టాద్వైత మత స్థాపకులు భగవాన్ రామానుజా చార్యుల వారి జయంతి కూడా .మీనోటితోనే మీకు తెలీకుండానే ఆ ఇద్దరు మహాపురుషుల నామం ఉచ్చరించారు సందర్భ శుద్ధిగా
2-అలాగా బావగారూ ఆ ఇద్దరు మహానుభావుల విశేషాలు మీ నోటితో వినే అదృష్టం కలిగిందన్నమాట నాకు .సెలవియ్యండి .
1-వైశాఖ మాసం లో కారణజన్ముల జయంతులు చాలా వస్తాయి .మొన్న చెప్పుకున్న పరశురామ జయంతి ,ఇవాల్టి శంకర ,రామానుజ జయంతి ,శుద్ధ చతుర్దశి శ్రీ నృసింహ జయంతి ,పౌర్ణమినాడు బుద్ధ జయంతి ,అన్నమయ్య జయంతి ,బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి .అన్నీ విశేషమైనవే
2-నిజమే బావగారూ వీటిని పూర్వకాలం లో బాగా జరిపేవారని మా పెద్దలు చెప్పేవారు
1-ఇది వేసవికాలం కనుక దేవుడికీ మనకూ దాహ, తాప ఉపశాంతికి బెల్లం మిరియాలు ఏలకులతో పానకం తయారు చేసి నైవేద్యం పెట్టి అందరికీ పంచే వారు .తాటాకు విసినకర్రలతో వీచి బహూక రించేవారు ,మామిడిపళ్ళకాలం కనుక పండిన మామిడిపళ్ళు కూడా నైవేద్యం పెట్టి అందించటం అరిగేది .వీటితోపాటు దక్షణా తాంబూల ,వడపప్పు ,చలిమిడి కూడా ఇచ్చేవారు ఇక అడవారికితలనిండా మల్లెపూల దండలు కూడా ఇచ్చేవారు .ఆ గుమాయింపు పరమ మనోహరంగా ఉండేది .
2-ఇవాళ ఫ్యాన్లు వచ్చి, విసనకర్రలు వెనకబడి పోయాయి బావగారూ .ఇంతకీ శంకర జయంతి విశేషాలు చెప్పారు కారు బావగారూ
1-వస్తున్నా –శంకర భగవత్పాదుల గురించి యెంత చెప్పినా తనివి తీరదు .ఆయన సాక్షాత్తు శివావతారమే .ఆయన వేద విద్యలో బ్రహ్మ .వేదా౦గమైన ఉపనిషత్తులలో గార్గ్యుడు,వేదాంత వివేచనలో బృహస్పతి ,వేద కర్మ భాష్యానికి జైమిని ,వేద తత్వమూలానికి భగవాన్ వ్యాసమహర్షి .అంటే మూర్తీభవి౦చినననూతన వ్యాసుడే శ్రీ శంకరులు బావగారూ
2 –సూక్ష్మలో మోక్షం లాగా ఎంతబాగా చెప్పారు బావగారూ .ఇంకా
1-8ఏళ్ళ వయసులో కపిలుని సాంఖ్యం ,పతంజలి యోగశాస్త్రం ఔపోసనపట్టిన బాలమేధావి విజ్ఞానఖని .భట్టపాదుల వార్తికం ,అర్ధం చేసుకొని అద్వైత సుఖాన్ని పొందిన మహానుభావుడు
2-భేష్ భేష్ బావగారు ఆయన మూర్తిమత్వం యెలాఉండేది
1-ఒక చేతిలో అద్వైతసారం ,రెండవ చేతిలో జ్ఞానముద్ర ధరించి ఎదుటి వారి వాదనలోని స్కాలిత్య౦ అంటే దోష౦ ను రెండు చేతులతో తీసి వేస్తున్నట్లు బాల శంకరుడు కనిపించేవాడట బావగారు
2-అద్భుతం ,పరమాద్భుతం బావగారు ఇంకా
1-చంద్రుడూ ,శంకరుడూ అమృతాన్నే ఇస్తారట .ఎలాగంటే చంద్రుడు కాంతి రూపం లో శంకరుడు వేదాంత భావ నిరూపకంగా .కానీ చంద్రుడు నక్షత్ర కాంతిని హరిస్తాడు .కాని శంకరుని ముఖ చంద్రుడు సజ్జనులకు తేజస్సును అనుగ్రహిస్తాడు
2-ఇదివరకు వినని విషయాలు మహా బాగా చెబుతున్నారు బావగారూ –మరింత –
1-శంకరుడు ఫాలభాగం పై ధరించే విభూతి గంగాయమునా సరస్వతీ త్రివేణీ సంగమం .అవి మూడు వేదాల శిరస్సులు అనే ఉపనిషత్తుల వ్యాఖ్యానాలు అనే 3 కీర్తులట
2-ఒళ్ళంతా పులకోస్తోంది బావగారు –మరేమైనా –
1-నిజమే ఆ అనుభవం అలాంటిదే బావగారూ .అజ్ఞాన అరణ్యం లో పుత్ర ,స్త్రీ అనే కార్చిచ్చు మంటలచే తపిస్తున్న జనాలకు ,ఆత్మ విద్య ఉపదేశించటానికి సాక్షాత్తూ శ్రీ మేధా దక్షిణా మూర్తి మౌనముద్ర వదలి శంకరుడిగా అవతరించాడు .శివుడికీ ఈ శంకరుని పోలికలు చాలా ఉన్నా ముఖ్య భేదం మాత్రం ఒకటి ఉందట .భగవత్పాదులు వైదిక మార్గావలంబి యై యజ్ఞాలు చేశాడు చేయించాడు .కానీ ఆ మహేశ్వర శివుడు మామగారైన దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు ఇదొక్కటే భేదం ట
2-దుస్టవాదాలు హరించి శంకర వాక్ ఝరి ఎలా ఉండేది బావగారూ
1-శ్రీ శంకరాచార్య అనే హిమవత్పర్వతం నుంచి బయల్దేరిన ‘’వాక్కు ‘’అనే గంగా ప్రవాహం దుష్టవాదాలు అనే కలపు మొక్కలను హరించి వైదిక పంటలు ఇబ్బడి ముబ్బడిగా పండించింది .ఆయన వాక్ పరిమళాన్ని పచ్చకర్పూరం అప్పుగా ,కస్తూరి పరిమాణ౦గా ,కుంకుమ పువ్వు కొనుబడి చేస్తే ,చందనం ఏకంగా దొంగిలించిందట అని విద్యారణ్య మహర్షి చమత్కరించారు బావగారూ
2-ఒక గొప్పవాని గుణగణాలుమరొక గొప్ప వాడే గ్రహిచగలడు కదా బావగారూ .మీరు అంతకు ముందు చెప్పిన విషయాలన్నీ విద్యారణ్యు లవె కదా బావగారు
1-సూక్ష్మగ్రాహి మీరు బావగారు సరిగ్గా చెప్పారు .ఇదంతా విద్యారణ్య మహర్షి రాసిన ‘’శంకర విజయం ‘’లోనిదే .ఆయనే రాయక పొతే లోకానికి యదార్ధమైన శంకరాచార్య చరిత్ర తెలిసి ఉండేదికాదు .ఆస్తికజనం ఆయనకు ఎంతో రుణపడి ఉన్నది బావగారూ
2-ఆధునికంగా శంకరులను ఎలా చెప్పాలి బావగారూ
1-మంచి ప్రశ్న బావగారూ .’’అద్వైతం పూర్వం అరణ్యాలలో ఉండే మహర్షులు మాత్రమెఆచరి౦ చేవారు కనుక ‘’ఆరణ్యకం ‘’అయింది .బుద్ధుడు దాన్ని జనసామాన్యం లోకి తెచ్చాడు .కానీ తర్వాత అది భ్రష్టు పట్టింది .మళ్ళీ శంకరుడు నిలబెట్టాడు .ఒకరకంగా నైతిక దృక్పధంతో బుద్ధుడు ,శాస్త్రీయ భావనతో శంకరుడు అద్వైతాన్ని నిలబెట్టారు ‘’అన్నాడుస్వామి వివేకానంద
2-చాలాబాగుంది బావగారూ –ఇంకా –
1-ఈ నాటిసమాజానికి శంకరునిమేధస్సు బుద్ధుని కారుణ్యం కలిసి వియ్యమందితేనే సమాజ కల్యాణం సాధ్యం .అంటే అద్వైతం ఆచరణలో కనబడాలి మానవునిలో బ్రహ్మాన్ని చూడగలగాలి .కనుక మొదట అనుష్టానం తర్వాతే జ్ఞానం .ప్రతిదానిలో బ్రహ్మ ఉన్నాడన్న ఎరుక రావాలి
2-దాన్ని శంకరులు ఆచరణ సాధ్యం చేశారా బావగారూ
1-వేద సంహిత కాలం లో భయం ఉండేది .ఉపనిషత్ కాలం లో అదిపోయి నిర్గుణ భావం వ్యాపించింది .విజ్ఞాన సర్వస్వం అనిపించే శంకరుడు పలికిన ప్రతిపలుకు ,శ్లోకం ,స్తవం స్తోత్రం లో వాత్సల్యం భక్తీ జ్ఞానం త్రివేణీ సంగమమై ,అందిన చోటు నుండి అందనంత దూరానికి తీసుకు వెళ్ళే సామర్ధ్యం ఉన్నది
2-అద్భుత ఆవిష్కరణ బావగారూ .శంకర స్తోత్రాల విశిష్టత ఏమిటి
1-సంస్కృత వాజ్మయానికి గొప్ప ప్రచారం సాధించిన పెట్టాయి అవి .వాటిని రచించి సూక్ష్మమార్గం లో మోక్షం అందుబాటు లోకి తెచ్చిన సాదు సద్గురువు ఆయన .ప్రతిశ్లోక౦ అమృతోపమానమే జ్ఞానగంగాస్నాన ఫలదాయకమే ,వైరాగ్య ఉషోదయమే .జీవన్ముక్తి సాధించటానికి ఆయన స్తోత్రాలూ భాష్యాలూ అద్భుత సాధనాలే .అంతటి మహా విజ్ఞాని మళ్ళీ పుట్టలేదు బావగారూ .వ్యాసమహర్షి శ్రీ మహా విష్ణువు అవతారమైతే ,ఆదిశంకరాచార్య సాక్షాత్తు శ్రీ శంకరావతారమే
2-విన్నకొద్దీ వినాలనిపిస్తోంది బావగారూ .ఇంకా శంకరు గురించి ఎవరేమేమి అన్నారో చెప్పరా
1-In Shankara we see tremendous intellectual power ,throwing scorching light reason upon every thing ‘’అన్నాడు వివేకానంద .ఏ కే బెనర్జీ ‘’Sankara was not merely a philosopher ,not merely a religious leader ,but he was the greatest nation bulider and thought leader ‘’అని గొప్పగా కీర్తించాడు
2-అద్భుతః బావగారూ –ఇక రామానుజా చార్యుల వారి విశేషాలు శాయించండి
1-ప్రస్థాన త్రయం అయిన ఉపనిషత్ లు ,బ్రహ్మ సూత్రాలు భగవద్గీత లను జనసామాన్యం లోకి తెచ్చిన మాన్యుడు రామానుజాచార్య విశిస్టాద్వైతం అప్పటికే ఉన్నా ,దానికొక సిద్ధాంత కల్పన చేసి ప్రజా బాహుళ్యానికి దగ్గర చేశాడు .దీనికి ఒక్క ఉదాహరణ –గురువు అంగీకారం లేకున్నా ,వద్దని వారించినా ,గుడిగోపురం ఎక్కి తిరుమంత్రాన్ని అక్కడ హాజరైన వేలాది ప్రజలకు తరతమ భేదాలు లేకుండా బిగ్గరగా అరచి చెప్పి అందించైనా పరమ కారుణ్య మూర్తి
2-అంత సాహసం ఎలా చేశాడు బావగారూ
1-బహుజన హితం ఆయన ధ్యేయం .తాను అలాచేసినందువల్ల దుష్ఫలితం అనుభవించినా అందరికీ ముక్తి లభిస్తుంది కదా అని ఆయన మనోభావం .బ్రహ్మ సూత్రాలకు ఆయన రాసిన భాష్యానికి ‘’శ్రీ భాష్యం ‘’అనే గొప్ప పేరు పెట్టాడు .అందరికి అందుబాటులో ఉండేట్లు వేదాంత సారం వేదాంత దీపిక ,వేదార్ధ సంగ్రహం ,శ్రీరంగ గద్యం మొదలైనవి రాశాడు .విశిష్టాద్వైత ప్రచారానికి రాజులను ,జియ్యంగార్లను ,పరమై కాంతులను నియమించాడు
2-నియమం నిస్టా ఉండేవా బావగారూ
1-మాలమాదిగలు కూడా దేవుడిని అర్చి౦చ టానికివైష్ణవ దాసులను ఏర్పరచాడు .చాత్తాడ వైష్ణవులు,అమ్మ౦గార్లు ఆయన ఏర్పరచినవారే .అందరికీ ముక్తిపొందే అవకాశం ఉందనే ఇలా చేశారు
2-బహుజన ముక్తికోసం ఇంతగా పరితపించిన వారు లేరనుకొంటా మరిన్ని విశేషాలు తెలియజేయండి బావగారూ
1-తిరుమల మూల విరాట్టు ను’’ ధ్రువ బేరం’’ అంటారు .అది శైవులదనీ, కాదు వైష్ణవులదనీ వాదం కొనసాగిన రోజుల్లో శైవులు ప్రత్యక్ష ప్రమాణం కోరితే , స్వామి విగ్రహం ఎదుట రెండు మతాలకు చెందిన బంగారు ఆయుధాలు చేయించి పెట్టి ఒకరోజు గుడి తలుపులు మూసేస్తే మర్నాడు దయానికి ధ్రువ బేరానికి శంఖు చక్రాలుఆయుదాలుగా కనిపించాయట .కనుక పాలకుడు యాదవ రాజుకు మూలవిరాట్టు శ్రీనివాసుడిదే అని నమ్మకం కలిగించి అప్పటినుంచి వైష్ణవారాదనను అమలు చేయించాడు రామానుజా చార్య. తర్వాత కై౦ర్యాలు సక్రమంగా నిర్వహించటానికి ‘’ఏకాంగి వ్యవస్థ ‘’ఏర్పాటు చేశాడు ఆచార్య .తర్వాతకాలం లో అదే జియ్యర్ల వ్యవస్థగా మారింది
2-ఇవి నాకు కొత్తవిషయాలు బావగారూ ఇంకా –
1-గురువు చెప్పింది గుడ్డిగా నమ్మవద్దు అని ఆయన అభిప్రాయం తర్కం తో అసలు విషయం తెలుసుకోమని చెప్పాడు .సంప్రదాయంగా వస్తున్న ఆచారాలవలన చాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డు రాకముందే గుర్తించి వాటిని మానటమో,మార్చటమో చేయాలని సూచించాడు .ఆయన జీవితానంతరం విశిష్టాద్వైతం ద్రావిడ ,విడ సంస్కృత ప్రాబల్యాన్ని బట్టి తె౦గలై,వడగలై అనే అనే రెండు శాఖలుగా మారిందని ఆచార్య తిరుమల రామ చంద్ర చెప్పాడు .ఆయన భక్తి గరీయసి బావగారూ
‘’విషీదితానాథ-విషానలోపనం –విషాద భూమౌ భావసాగరే హరే –వరం ప్రతీకార మపశ్య సాధునాం –మయాయమాత్మా భవతీ నివేదితః’’అని దేవుడికి మొరపెట్టుకొన్నాడు
దీని భావం –విషాగ్ని సమానం ,సర్వ దుఖకారకం అయిన ఈ సంసార సాగరం లో, నా రక్షణ ఎక్కడా కనిపించటం లేక పోవటం తో ఓ ప్రభూ !నీదాసుడినై నన్ను నీకే సమర్పించుకొంటున్నాను
2-పరమ భక్తాగ్రేసర చక్రవర్తి రామానుజా చార్య బావగారూ –మరిన్ని విశేషాలు –
1-రామానుజుడు వేదా౦తులకు తాము కోల్పోయిన ఆత్మను తిరిగి ఇచ్చాడు అంతకు ముందు శంకరాద్వైతం తో బ్రహ్మలో అదృశ్యమైంది .ప్రేమ తత్త్వం మీద నిర్మించబడింది విశిష్టాద్వైతం .భక్తిమార్గమే భగవంతుడిని చేరే సులభమార్గం అన్నదామతం
2-శంకరాచార్యకు ,రామానుజాచార్యకు ఉన్న సారూప్యం వివరించండి బావగారూ
1-ఇదీ అసలు ప్రశ్నఈ రోజు అడగాల్సిన ముఖ్య ప్రశ్న కూడా .’’శంకరుడు జ్ఞాన యోగాన్ని ప్రచారం చేసి 32సంవత్సరాలకు పరమ పదించారు .రామానుజులు శంకరుని అభిప్రాయమైన భక్తిమార్గాన్ని ప్రచారం చేశారు. ప్రపత్తి అంటే సర్వ సమర్పణ మార్గాన్ని సంపన్నం చేశారు 32ఏళ్ళు పూర్వ మతాలన్నీ అవలోడనం చేసి ,33వ ఏట విశిష్టాద్వైత మత ప్రచారం తురీయ ఆశ్రమంలో ప్రారంభించారు 120 ఏళ్ళు సార్ధకంగా జీవించారు .శంకర రామానులు జన్మించిన మాసాలూ నక్షత్రాలూ ఒకటే .ఇద్దరి ప్రమాణ గ్రంధాలూ ప్రచార విధానాలూ ఒకటే .విశిష్టాద్వైత
మత స్థాపనకు శంకరాచార్య అవతారం పూర్వ రూపం అయితే ,రామానుజావతారం ఉత్తర రంగం .బ్రహ్మం శంకరులనుండి రామానుజాచార్యులవరకు క్రమంగా సూక్ష్మం నుంచి స్థూలానికి పరిణమించింది ‘’అని రెండుమతాలను,ఇద్దరు స్థాపనా చార్యులను క్షుణ్ణంగా పరి శోధించిన సారాంశంగా’’ నారాయణ కీర్తి కౌముది’’లో శ్రీ నారాయణ జీయర్ వెలిబుచ్చిన విలువైన విశేషం .
2-చక్కని విశ్లేషణ బావగారూ .ఇప్పుడు శంకరాచార్య శ్లోకాలు నాలుగు వినిపించి చెవుల తుప్పు వదిలించండి బావగారూ
1-ఓ దానికేం భాగ్యం –వినండి
‘’చామ్పేయ గౌరార్ధ శరీరకాయై –కర్పూర గౌరార్ధ శరీరకాయ –ధమ్మిల్లకాయై చ జటాధరాయై-నమః శివాయైచ నమః శివాయ
‘’పశూనాం పతిం పాపనాశం పరేశం –గజేంద్రస్య కృత్తింవసానం వరేణ్యం –జటాజూట మధ్యే స్పురద్గాంగవారి౦ మహాదేవ మేకం స్మరామి స్మరారిన్
‘’కలాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాంనిజతపః-ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే –శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృదిపున-ర్భవాభ్యామానంద స్ఫుర దనుభావాభ్యాం నతి రియం ‘’
‘’కదాచిత్కాలిందీ తటవిపిన సంగీతక వరో-ముదా గోపీ నారీ వదన కమలా స్వాద మధుపః –రమాశంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో-జగన్నాథస్వామీ నయనపథ గామీ భవతుమే ‘’
‘’నమంతం నో యంత్రం తదపి చనజానే స్తుతి మహో –నచాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కదా-నజానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం –పరం జానే మాతస్త్వనుసరణం క్లేశహరణం’’
‘’ఉద్యద్భాను సహస్ర కోటి సదృశా౦ కేయూర హారోజ్వలాం –బింబోస్టీంస్మితదంత పంక్తి రుచిరాం పీతాంబరాలం కృతాం-విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాంతత్వ స్వరూపం శివాం-మీనాక్షీం ప్రణతోస్మిసంతతమహం కారుణ్య వారాం నిధిం ‘’
‘’నమస్తే శారదా దేవీ కాశ్మీర పురవాసినీ –త్వామహం ప్రార్ధయే నిత్యం విద్యా దానం చ దేహిమే ‘’‘’శివః శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం –న చే దేవం దేవో న ఖలు కుశలః స్పందితు మపి –అతస్త్వా మారాధ్యాం హరిహర విరించచాదిభిరపి-ప్రణంతు స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి ‘’
2-శివ కర్ణామృతం గ్రోలినట్లున్నాయి శ్లోకాలు బావగారూ ధన్యవాదాలు మళ్ళీ కలుస్తా నమస్కారం
1-వెళ్ళిరండి బావగారూ శివోహం
సశేషం
శ్రీ శంకర రామానుజ జయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-4-20-ఉయ్యూరు