సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-12
మూడవసారి హనుమ రావణ భవన ౦ లో వెదికాడు .ఆమడ పొడవు అరామడ వెడల్పు ఎన్నో మేడలతో అలరారింది పుష్పకం మధ్యలో నివాసం ఉన్న రావణ ప్రధాన గృహం చేరాడు .అక్కడి ఏనుగులు నాలుగు ,మూడు దంతాలతో విచిత్రంగా ఉన్నాయి .అతని రాక్షసభార్యలు, చెరబట్టి తెచ్చిన రాజకన్యలు ఉన్నారు .ఆప్రాసదం పెద్దపెద్ద చేపలు మొసళ్ళు తిమింగిలాలు పాములు తో కల్లోలం చెందిన సముద్రంలాగా కనిపించింది .కుబేరుని,పచ్చని గుర్రాలున్న దేవేంద్రునికి ఉన్న సంపద అంతా ఇక్కడే కనిపించింది .మళ్ళీ పుష్పకాన్ని చూశాడు .బ్రహ్మకోసం విశ్వకర్మ దీన్ని నిర్మిస్తే ,కుబేరుడు తపస్సుతో బ్రహ్మనుమెప్పించి దాన్ని వరంగా పొందాడు .రావణుడు అన్నకుబేరుని జయించి దీన్ని స్వాధీనం చేసుకొన్నాడు .సర్వతో భద్రాకారంగా ఉన్న జాలాలు అంటే వెంటి లెటర్లు కిటికీలు మణిఖచిత వేదికలు ఉన్నాయి .సరదాగా పుష్పకం ఎక్కి సరదా తీర్చుకొన్నాడు మహాకపి .దివ్యగందాల పరిమళం వ్యాపించి,తనను ఆహ్వానిస్తోందానిపించింది ..అది స్వర్గమా, 33దేవతలకు ఆవాస భూమియా అనిపించింది .దీపకాంతి ,ఆభరణాల ప్రకాశం అ౦తటావ్యాపించి ‘’తగలబడుతున్న శాల ‘’లాగా కనిపించింది భవిష్యత్తులో జరిగేది ఇదే కదా .దానికి సూచ్యార్ధ సూచన చేశాడు మహాకవి వాల్మీకి .
కంబళాలపై వివిధ భంగిమలలో నిద్రించేఉత్తమజాతి స్త్రీలను చూశాడు .వారిముఖాలు పద్మ గంధాన్ని కలిగి ఉన్నాయి .అవి వికసించిన పద్మాలు గా భావించి మకరందం ఆశతో తుమ్మెదలు వాలుతాయేమో అని శంకించాడు .వనితామధ్యమాన నక్షత్రాలతో ఉన్న చంద్రుడిలాగా రావణుడు కనిపించాడు .మితిమీరిన మధుపానం ఆతర్వాత యెడ తెగని రతికేళి తో పుష్పమాలలు ఆభరణాలు స్థాన భ్రంశమయ్యాయి .కొందరి ముఖాల తిలకాలు తుడిచి వేయబడగా ,కొందరి మొలత్రాళ్ళు వదులై మార్గాయాసంతో నేలపై పొరలే ఆడ గుర్ర్రాల్లా కనిపించారు .నిద్రావస్తలో విశాల పిరుదులున్న స్త్రీలు హంస కారండక చక్రవాకాలతో ఉన్న ఇసుక తిన్నెలున్న నదులుగా భాసి౦చారు .రావణుడు నానావిధ భంగిమల సుఖాలు వారివల్ల అనుభవించి అలసి సొలసి నిద్రించాడు .అతనికి భయపడి దీపాలుకూడా నిశ్చల కాంతి వెదజల్లుతున్నాయి. వీరంతా రాజర్షుల ,పితరుల ,దైత్య,గ౦ధర్వ ,రాక్షస కన్యలు తమంత తాము రావణుని వలచి వచ్చినవాళ్ళే .ఒక్క సీతా దేవి తప్ప ఎవరూ బలాత్కారం గా తేబడిన వారుకాదు .హనుమ మనసులో ‘’ఈ రావణుడు ఎప్పుడూ తన తేజస్సును యెడ బాయకుండా ఉన్నాడో ,అలాగే సీత కూడా రాముడిని ఎడబాయకుండా ఉండేట్లు రావణుడు ఆమెను రామునికి అర్పిస్తే ,అతని సంపద అవిచ్చిన్నంగా ఉంటుంది కదా ‘’అనుకొన్నాడు శత్రుహితం కోరి .
‘’బభూవ బుద్ధి స్తు హరీశ్వరస్య –యదీ దృశీ రాఘవ ధర్మపత్నీ –ఇమా యథా రాక్షస రాజ భార్యాః -సుజాత మస్యేతి హాయ్ సాదు బుద్ధేః’’
సీతాదేవి పాతివ్రత్య గుణంతో విశిస్టురాలు . వీడు సీతాపహరణ అనే నీచ కార్యం చేసిపెద్దపాపం చేశాడు .కనుక ఆమె పాతివ్రత్యానికి ఎలాంటి భంగం కలుగదు అని భావించాడు హనుమ .
73శ్లోకాల తొమ్మిదవ సర్గ ఇది .క్షుణ్ణంగా వెతికాను అనే మానసిక సంతృప్తికోసం హనుమ మూడుసార్లు రావణ భవనం వెదికాడు .అక్కడి స్త్రీలు వారి భంగిఅమలు చూసి పతివ్రతా శిరోమణి సీత ఇక్కడ ఉండదు అనిపించింది .మనషి పరహితం కోరుకోవాలి అదే అతని సహజ లక్షణం .ఆలక్షణాన్ని హనుమ చూపించాడు .రావణుడు సీతను స్వచ్చందం గా రామునికి సమర్పిస్తే వాడి వైభవం అలాగే కొనసాగుతుంది కదా అనుకొన్నాడు. అదీ మనీషి లక్షణం అలాంటి మనీషి గా హనుమ ఇక్కడ మనకు కనిపిస్తాడు’.
సశేషం
శ్రీశంకర రామానుజ జయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-4-20-ఉయ్యూరు