సుందర కాండ లో హనుమ బహుముఖీనవ్యక్తిత్వం-13
బుసకొట్టే సర్పం లాగా నిశ్వసిస్తున్న రావణుడి దగ్గరకు చేరి హనుమ భయపడినట్లు కనిపించి ,తర్వాత వెనక్కి తగ్గాడు .పాన్పుపై ఉన్న రావణ భుజాలు బంగారు బాహుపురులతో ఇంద్ర ధ్వజాల్లా కనిపించాయి పూర్వం ఐరావతం తో పోరాడినప్పుడు ఏర్పడిన గాయాలమచ్చలు ,,దేవేంద్రునితో తలపడినపుడు తిన్న వజ్రాయుధ గాట్లు ప్రకాశంగా కనిపించాయి .విష్ణు చక్రగాయాలమచ్చలూ ఉన్నాయి . మంచి మూపు ,మంచిలక్షణాల గోళ్ళు బొటన వ్రేళ్ళు ,అరచేతులు ఏనుగు తొండాలలాగా భుజాలపై అయిదు తలల నాగుపాము లాఉన్నాయి .మహా బలదర్పాలతో శోభాయమానంగా రెండు భుజాలు మండరపర్వత౦ మధ్య నిద్రించే మహా సర్పాల్లా ఉన్నాయి .రెండు శిఖరాల మందరం లా ఉన్నాడు .నోటినుంచి మామిడి ,పొన్న సుగంధం ,పొగడపూల గంధం ,శ్రేష్ట మద్య గంధం తో నిట్టూర్పులున్నాయి .నిగనిగ లాడే మినపరాసి లా ఉన్నాడు .గంగా జలాల్లో విశ్రమిస్తున్న ఏనుగు లా కనిపించాడు .రావణభార్యలు మహా అందగత్తెలు .నిద్రలోకూడా నాట్య స్త్రీ వాసనాబలంతో ముద్రలు వేస్తోంది .ఇంకొకామె స్తనాలను చేతులతో కప్పుకొని ఆదమరచి నిద్రిస్తోంది.
రావణ భార్య మండోదరి మహా సుందరంగా శయనిస్తోంది .ఆమె సౌందర్యం,యవ్వనం చూసి సీతా దేవి ఏమో అనుకొన్నాడు .సంతోషం కలిగింది .పులకింత వచ్చి౦ది కూడా .సీతా దేవి దర్శనభాగ్యం కలిగిందన్న పరమానదంలో సహజ వానర చేష్టలు చేశాడు వెనుకటి గుణమేల మాను అన్నట్లు ప్రవర్తి౦చాడన్నమాట .
‘’ఆస్ఫోట యామాస చుచుబ పుచ్చం-ననంద చిక్రీడ జగౌ జగామ –స్తంభా నారోహ న్నిపపాత భూమౌ –నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం ‘’
తన ఆనందాన్ని హనుమ వానర సహజమైన చేష్టలతో చేస్తూ జబ్బలు చరుస్తూ ,తోకను ముద్దాడుతూ ,ఆనంద పారవశ్యం చెందాడు .ఆడాడు పాడాడు ఇటూ అటూ తిరిగాడు .స్తంభం ఎక్కి కిచకిచమన్నాడు ,మళ్ళీ కిందికి దూకాడు.
ఇలాంటి కోతి చేష్టలను మనం చూసే ఉంటాం ,పూర్వం కోతుల్ని గొలుసుతో కట్టి తీసుకొని వచ్చి ఇళ్ళముందు ఆడించేవారు జ్ఞాపకం ఉందా.ఇలాంటి చేష్టలన్నీ వాటితో చేయించేవారు .నెత్తిన కుండ బుజాలపై కర్ర ,గబుక్కున స్తంభం ఎక్కి దిగటం పేలు తీసుకోవటం ,దువ్వెనతో దువ్వుకోవటం, అద్దం చూసుకోవటం చొక్కాలాగూ తోడుక్కోవటం విప్పెయ్యటం ,తలపాగా పెట్టుకోవటం కర్రతో ఇంటికాపలా కాయటం వంటివన్నీ కోతులతో చేయించి వినోదం పంచి డబ్బులు అడుక్కునేవారు .వాటి ప్రాణాలకు హింస, మనకు వినోదం .దేనికోసం వచ్చాడో ఆపని నెరవేరింది అన్న పిచ్చిఅనందంలో హనుమ ప్రవర్తించాడు సహజ సిద్ధం గా .
ఇది 54శ్లోకాల పదవ సర్గ
కాసేపటికి అసలు రంగు బయటపడి తాను చూసింది సీత కాదు మండోదరి అని గ్రహించాడు హనుమ .అప్పుడు వివేకం ప్రవేశించింది .ఆలోచన పెరిగింది యదార్ధం గ్రహింపు కు వచ్చింది .రామ వియోగంతో సీతా దేవి నిద్రపోదు ,భుజించదు అల౦క రించు కోదు . ,ఏదీ తాగదుకూడా .దేవేంద్రుడు వచ్చినా తిరస్కరిస్తుంది .శ్రీరాముడి కి సాటి అందగాడు ఉండడు.వీళ్ళు అంతా మధుపానమత్తులు .మృష్టాన్న భోజనులు .రతికేళీ తత్పరులు .వాళ్ళు ఆవులమంద ఐతే రావండు వాటిమధ్య ఉన్న వృషభం అనిపించింది .అదొక పానభూమిగా దున్నలు పందులు మాంసాల కుప్పలతో వెండి పాత్రల్లో సగం నమిలి వదిలేసిన నెమలి కోడి మాంసాలు ,ఖడ్గ మృగ ,అడవి పందుల ,లేళ్ళు నెమలళ్ళ మాంసాలు పాలు పెరుగు ,నంజుకోవటానికి ‘’సువర్చలం ‘’అనే లవణం పాత్రలనిండా ఉన్నాయి .కొక్కెర చకోర ,మేక మాంసాలు వాటి పచ్చళ్ళు ,పాయసాదులు మొదలైన భోజ్య పదార్ధాలు కనిపించాయి .అమృత మదన౦ లో వచ్చిన మద్యాలు అవికాక వేరేరకాలైన అనేక మద్యాలు పాత్రల నిండా ఉన్నాయి
ఆడవాళ్ళూ ఒకరినొకరు కౌగిలించుకొని పడుకున్నారు .రతి లో అలసి పోయారు చాలామంది .మద్యం మాంసం మగువ మకారత్రయం తో మోగిపోతోంది భీభత్సంగా రావణ అంతపురం .ఒక్క అంగుళం భూమికూడా వదలుండా రావణ భవనాలు గాలించాడు .కాని సీత కనపడలేదు .మళ్ళీ అంతర్ముఖుడయ్యాడు .’’ఇంతమంది పరస్త్రీలను నిద్రలో అనేక భంగిమలలో చూశానునాకు ధర్మలోపం జరుగు తుందేమో .కానీ నామనసు రవంత కూడా చలించలేదు .అవయవాలను నడిపేది మనసు .అది నా స్వాదీనం లోనే ఉన్నది .ఇంకో చోట సీత ను వెదకకూడదు .అక్కడా స్త్రీలే ఉంటారు కదా. తప్పిపోయిన వనితను ఆడు లేళ్ళలో వెదకటం వివేకం కాదు .అత్య౦త పరిశుద్ధమనస్సుతో వెతికాను. కానీదేవి కనిపించలేదు ‘’అనుకొని దేవ ,గ౦ధర్వ నాగకన్యలలో వెదికాడు లాభం లేదు .చివరికి ఈ పాడు పానభూమిలో వెదకటం నిష్ప్రయోజనం అని నిశ్చయంగా భావించి రావణ భవనం వదిలేసి బయటికి వచ్చి వేరేప్రదేశాలలో వెతకాలనుకొన్నాడు హనుమ –
‘’తామపశ్యన్ కపి స్తత్ర పశ్యం శ్చాన్యా వరస్త్రియః –అపక్రమ్య తదా వీరః ప్రధ్యాతు ముప చక్రమే ‘’’’స భూయస్తు పరం శ్రీమాన్ మారుతి ర్యత్న మాస్థితః-ఆపానభూమి ముత్శుజ్య తాంవిచేతుం ప్రచక్రమే ‘’
ఉత్తమకాన్తలను చాలామందిని చూసి సీత కానరాక ,శ్రీమాన్ హనుమ ద్విగుణీకృత ఉత్సాహం తో ,ఆ పాడు పానభూమి విసర్జించి వెదకటానికి నిశ్చయించాడు .
ఇది 47 శ్లోకాల పదకొండవ సర్గ .మహర్షి ఇక్కడి మొదటి శ్లోకం లో హనుమను ‘’కపి ‘’అని ,రెండవ శ్లోకం లో శ్రీమాన్ మారుతి అనటం లో చాలా విశేషం ఉన్నది .ఆయనలోని కపిత్వం పోయి ,సర్వ శ్రేష్ట మారుతిత్వం కనిపించింది అన్నమాట .ఎరుక అంతర్ముఖత్వం అతడిస్థాయిని పెంచింది . అంటే కార్యం త్వరలోనే సానుకూలమౌతు౦దన్న మాట .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-20-ఉయ్యూరు