సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-14
వెతకటంలో అలసత్వం చూపానేమో అనే అనుమానం తో లతా గృహాలు ఉద్యానవనాలు ,నైట్ హాల్టింగ్ ప్రదేశాలు కూడా వెతికినా సీతా దేవి కనిపించలేదు .ఒకరకమైన వైరాగ్యభావం సహజం గా వచ్చేసి ‘’సీత చనిపోయే ఉంటుంది లేకపోతె కనిపించేదే గా .రావణుడు ఎన్ని క్రూర ప్రయత్నాలు చేసినా ,తనశీల రక్షణకోసం ఆమె తీవ్రంగా ప్రయత్నించి ఆ దుర్మార్గుడి చేతిలో హతమై ఉండచ్చు .లేక అనేక వికృతాకారులైన రావణభార్యలు, దాసీ స్త్రీలను చూసి ఆమె భయపడిమరణి౦చి కూడా ఉండచ్చు .సీత కనపడక పోవటం శత్రువులపై నా పరాక్రమం చూపక పోవటం వల రాజు సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళటానికి మొహం చెల్లటం లేదు .అన్ని చోట్లా నా శక్తికొద్దీ వెతికినా నిష్ఫలమై, సీత కనిపించలేదు .సరే ఇక్కడే ఎక్కువకాలం ఉండలేను కదా .ఒట్టి చేతులతో కిష్కింధకు తిరిగి వెడితే నా సహచర వానరులు లంకలో ఏమి సాధించావు ?అని అడిగితె నాకు సమాధానం లేదు కదా .యువరాజు అంగదుడు వృద్ధుడు జాంబవంతుడు నన్ను ఎన్నో మాటలు అంటారు ‘’అని విచారించి –
‘’అనిర్వేదః శ్రియో మూల మనిర్వేదః పరం సుఖం –అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తకః ‘’
‘’న కరోతి సఫలం జంతోః కర్మ యత్తత్ కరోతి సహః –తస్మాదనిర్వేద కృతం యత్నం చేస్టే హ ముత్తమం ‘’అని ఆలోచించాడు .అంటే ఉత్సాహమే సంపదకు మూలం .ఉత్సాహమే పరమ సుఖం .ఉత్సాహమే అన్ని పనులను చేయిస్తుంది .చేద్దాము అనుకొన్న పనిని ఉత్సాహం సఫలం చేస్తుంది .కనుక నీరు కారిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో సీతాన్వేషణ చేస్తాను .పిరికివాడిలా వెనక్కి తిరిగి వెళ్ళను .అని నిర్ణయానికి వచ్చాడు .పై రెండు శ్లోకాలో మహర్షి ఉత్సాహ సామర్ధ్యాన్ని అత్యంత స్పష్టంగా తేట తెల్లం చేయించాడు లోకానికి హనుమ ద్వారా .ఈ శ్లోకాలులోకం లో ‘’సూక్తి ముక్తావళి ‘’అయ్యాయి .
ఇదివరకు వెతకని భూగృహాలు, చతుఃపథ మంటపాలు ,స్వేచ్చా విహారం కోసం మారు మూల ఉన్న గృహాలు అన్నీ తలుపులు తెరిచి లోపలి వెళ్లి చూస్తూ, మళ్ళీ మూసేస్తూ ,దిగుడుబావులు కొలనులు అన్నీ చూసి నిరాశ చెందాడు .అప్పుడు మనసులో
‘’చతురంగుళ మాత్రోపి నావకాశ స్స విద్యతే రావణా౦తః పురే తస్మిన్ యం కపి ర్నజగామ సః’’అంటే లంకలో ‘’నాలుగు అంగుళాల’’ మేరకూడా వదలకుండా వెతికాను .కానీ నిష్ప్రయోజనం అయింది .ఇక్కడ పండితులు చతురంగ స్థలానికి చక్కని వేదాంత పరమైన అర్ధం చెప్పారు .మనగుండె చతురంగుళ పరిమాణం .కనుక బయట అంతా వెదికాడు కాని లోన వెదక లేదు అన్నారు .విద్యాధర నాగ స్త్రీలు కనిపించారు .ఇందరు కనిపించినా సీత జాడ కనిపించలేదు అని నిర్వేదం చెందాడు మళ్ళీ .తన సముద్ర లంఘనం వ్యర్ధమైనదని బాధ పడ్డాడు .శోక మోహ పీడుతుడై దుఃఖించాడు .ఇప్పుడుహనుమ ఒకసారి ‘’లో దృష్టి’’తో పరిశీలించుకోవాలి .ఇప్పటిదాకా తన ప్రయత్నం వల్లే సాధ్యమౌతుందని తలచాడు .ఇక భగవంతుని తోడ్పాటు కావాలని ,అది జతకలిస్తేనే కార్యం సఫలమౌతుందనే ఎరుక అతనికి కలుగ బోతోంది .
ఇది25శ్లోకాల పన్నెండవ సర్గ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-30-4-20-ఉయ్యూరు