సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-15
విమానం నుంచి ప్రాకారం పై దూకి ,మేఘాలమధ్య మెరుపులా వేగంగా వెళ్ళాడు హనుమ .అన్ని చోట్లా వెదికినా సీత కనపడనందుకు విచారించి ,సంపాతి చెప్పిన దానిప్రకారం సీత లంక లోనే ఉండాలి .అయోనిజ సీతామాత రావణుని వశం కాదు .రావణుడు ఆమెను ఎత్తుకొని వచ్చేటప్పుడు జారి కిందపడి పోయిందేమో ,లేక సముద్రంలో పడిపోయిందేమో ,లేక రావణుడి కబంధహస్తాలలో నలిగి చనిపోయిందేమో ,వాడుఆమెతో సముద్రం దాటుతుంటే నెమ్మదిగా విదిలించుకొని సముద్రం లో పడి పోయిందేమో ,ఒక వేళ దుష్ట రాక్షస రాజు రావణుడే ఆమెను తినేశాడేమో,లేక రావణభార్యలే భక్షించారేమో ,రాముడిని తలచుకొంటూ చనిపోయిందేమో .రామలక్ష్మణ అయోధ్యలను స్మరిస్తూ ప్రాణం విడిచిందేమో పంజరం లో బంధింపబడిన చిలక లాగా దుఖిస్తోందేమో .నా పిచ్చకాని ఆమె ఎట్టిపరిస్థితులలోనూ రావణుడికి లొంగనే లొంగదు .సీత లేదనే వార్త రాముడికి ఎలా చెప్పను .నిజం చెప్పకపోతే దోషం అని పరిపరి విధాల ఆలోచి౦చాడుకాని ఒక నిర్ణయానికి రాలేకపోయాడు ,
సీతను చూడకుండా కిష్కింధకు వెళ్లి ఏం ప్రయోజనం .అక్కడి వారు అడిగే ప్రశ్నల వర్షానికి నా దగ్గరం ఏం సమాధానం ఉంది .సీతకనపడలేదని చెబితే దుఖం ఆపుకోలేక రాముడు బతుకుతాడా ,ఆయన లేకపోతె తమ్ముడు లక్ష్మణుడు ఉంటాడా .ఈ ఇద్దరూ లేరని తెలిస్తే భరతుడు జీవిస్తాడా ,శత్రుఘ్నుడు కూడా అంతేగా .వీరి మరణం చూసి తల్లులు కౌసల్య సుమిత్ర కైకలు బతుకుతారా .ఇది తెలిసి సుగ్రీవుడు రుమ ,తార అంగదుడు చనిపోరా .వానరరాజులందరి మరణం జీర్ణించుకోలేక వానరులు రాళ్ళతో తలలు బద్దలు కొట్టుకొంటారు .విషం తాగి చస్తారు అడవులు పట్టిపోతారు .కనుక నేను కిష్కిందకు వెడితే భయంకర రోదనమాత్రమే చూస్తాను .ఎవ్వరిముఖంలోనూ సంతోషం జాడ కనిపించనే కనిపించదు .కనుక సీతను చూడకుండా కిష్కింధకు వెళ్ళనే వెళ్ళను.నేను ఇక్కడే ఉంటె వారంతా ఎప్పుడో ఒకప్పుడు సీతను చూస్తాము అనే నమ్మకంతో బతుకుతారు .నిశ్చయంగా ఇక్కడే ఉంటూ దొరికింది తింటూ వానప్రస్థం గడుపుతా .లేకపోతేసముద్ర తీరం లో చితి పేర్చుకొని అగ్నికి ఆహుతి అవుతా .ఒక వేళ సన్యాసి గా ఇక్కడే ఉండిచనిపోతే ఆ శరీరాన్ని కాకులు గద్దలూ తినేస్తాయి .ఇదిమహర్షులు ఉపదేశించిన మార్గమే .పోనీ నీటిలో పడి చనిపోతే ?అని మళ్ళీమళ్ళీ ఆలోచించాడు .చివరి సారిగా తాను లంకలో ప్రవేశించిన రాత్రి గురించి గుర్తు చేసుకొన్నాడు . ఈ రాత్రే లంకాధి దేవతను చంపాడు చంద్రోదయంతో సుందరమైన లంక చూశాడు శక్తివంచన లేకుండా సీతకోసం వెతికాడు .ఇలాటి రాత్రి గురించి లోకం గొప్పగా చెప్పు కొంటుంది . ఆ కీర్తిమాల వాడిపోకూడదు. సువాసనలు వెదజల్లుతూ ఉండాలి .ఈ శుభరాత్రి ఫలప్రదం అవ్వాలి .చిరస్మరణీయం గా నిలిచి పోవాలి .కనుక మరింత ఉత్సాహంతో మళ్ళీ అన్వేషిస్తాను .ఆహార నియమాలు పాటిస్తూ జితే౦ద్రి యుడను అయి అశోక వనం లో వెతికిచూస్తాను .సకల రాక్షసులను జయించి ,తపస్వికి తపస్సిద్ధి లాగా ,ఇక్ష్వాకు వంశానికి ఆనందం కలిగించే సీతాదేవిని రాముడికి అప్పగిస్తాను అనుకొన్నాడు
ఇంతగా మనసును మధించాక అంతర్జ్వలనం అయ్యాక హనుమకు వివేక సూర్యోదయం అయింది .దేవుడు గుర్తుకువచ్చాడు పురుషకార్యానికి దైవీ శక్తి తోడ్పడితేనే కార్యం సాఫల్యమౌతుందని అర్ధమైంది .దండం అంటే నమస్కారం దశగుణం భవేత్ అన్నట్లుగాలేచిను౦చుని చేతులు జోడించి తూర్పుకు తిరిగి దణ్ణం పెడుతూ శ్రీరామ లక్ష్మణ సీతాదేవులకు నమస్కరించాడు .తర్వాత దిక్పాలకులు,సూర్య చంద్ర మరుత్తులు గుర్తొచ్చి వారికీ నమస్సులు అర్పించాడు .మనసు ప్రశాంతమైంది .అంటే ఇప్పుడు కార్య సాఫల్యత భగవంతుడి పై వేశడన్నమాట .నీవే తప్ప ఇతః పరం బెరుగ అన్న గజేంద్ర సద్రుశుడు అయ్యాడు .అశోకవనం ప్రవేశించటానికి సంకల్పించి దానికి తగ్గట్లు శరీరాన్ని సూక్ష్మ రూపం లోకి మార్చుకొని ,సకల దేవతలు సకల భూతాలూ వీరికి ప్రభువైన శ్రీ మహా విష్ణువు మహర్షులు కార్య సిద్ధికలిగించాలని ప్రార్ధించాడు .సీతామాత ఎప్పుడు కనిపిస్తుందా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మళ్ళీ వెతకటం ప్రారంభించాడు .
‘’నమోస్తు రామాయ స లక్ష్మణాయ-దేవ్యై చ తస్మై జనకాత్మజాయై –నమోస్తు రుద్రేంద్ర యమాని లేభ్యో –నమోస్తు చంద్రార్క మరుద్గాణేభ్యః ‘’
‘’సిద్ధిం మే సంవిదాస్యంతి దేవా స్సర్షి గణాస్త్విహ
‘’బ్రహ్మా స్వయంభూ ర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే
సిద్ధి మగ్నిశ్చ వాయుశ్చ పురుహూత శ్చవజ్ర భ్రుత్ ‘’
‘’సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః
దాస్యంతి మమ యే చాన్యేహ్యదృస్టాః పథి గోచరాః’’
ఇది 60శ్లోకాల 13వ సర్గ .
సాధకుడు సర్వ సన్యాసం చేసి పరమేశ్వరార్పణ బుద్ధితో పని చేస్తే ఫలితం సిద్ధిస్తుంది అన్న పరమ సత్యాన్ని విడమరచిన కాండ ఇది .ఒక విషమ సమస్య వచ్చినపుడు మనిషి ఎన్ని విధాల ఆలోచించి ,ఫలప్రదానికి ఉత్తమమైన మార్గం ఎంచు కోవాలన్న ఎరుకకూడా కలి గించింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-20-ఉయ్యూరు