సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-16
అశోక వనం చేరిన హనుమ అక్కడ వస౦తోదయం తో పులకించిన వృక్షజాలాన్ని చూశాడు .మృగగాపక్షి సంతతి మహాదానంద౦ తో కనిపించాయి .పక్షులకిలకిలారవాలు వీనుల వి౦దు చేశాయి వనాలు ఉపవనాలతో అది ఉదయించే సూర్యునిలా కనిపించింది .అతని సంచారంతో నిద్రిస్తున్నపక్షులు మేల్కొన్నాయి .రకరకాల పుష్పాలు పుష్ప వర్షం కురిపిస్తూ హర్షం కలిగింఛి పూలకొండ లాగా ఉన్నాడు .చెట్లమధ్య పరిగెత్తే అతడు వసంతు డేమో నన్న భ్రమకలిగించాడు భూతజాలానికి .భూమిపై రాలిన పుష్పాలు అలంకరించుకొన్నభూ దేవిగా కనిపించింది .పులకించిన వృక్షాలు తమసర్వస్వమైన పుష్పాలన్నీ రాల్చేసి జూదం లో నగలు వస్త్రాలు సంపద అన్నీ ఓడిపోయిన జూదరులులాగా ఉన్నాయి .ఆన౦ద౦ తో కోతి చేస్టలుగా చేతులు ,కాళ్ళు తోక తో పరవశంగా శ్రేష్టమైన వృక్షాల కొమ్మలు విరగగోట్టగా అవి అశోక వనిక జుట్టు ముడి వీడి చందనం మొదలైన అలంకారాలు తొలగి ,చు౦బి౦పబడిన దంతాలు పెదవులు కలదై శరీరం పై నఖక్షత దంతక్షతాలున్న యువతి లాగా కనిపించాయి .అల్లిబిల్లిగా అల్లుకున్న తీగెల సముదాయాన్ని తెంపి చెల్లాచెదరు చేశాడు .అక్కడ మణులతో వెండి బంగారు రేకులతో కప్పబడిన నేలను చూశాడు .అనేక ఆకృతుల దిగుడు బావులు వాటికి మణులతో చేయబడిన మెట్లు చూశాడు .ముత్యాల పగడాల పొడులు వాటి చుట్టూ మొలచిన కాంచన వృక్షాల్లా ఉన్నాయి .బావుల్లో తామర కలువ పూల శోభ ,చక్రవాకాల కూజితాలు భరత పక్షుల అరుపులు హంస ,సారసాల నాదాలతో పరమ మనోహరంగా ఉన్నాయి .బావులకు రెండువైపులా అమృతంలాగా రుచిగా ఉన్న జలాలున్న వాగులు వాటి తీరాలపై చెట్లు రమ్యంగా ఉన్నాయి .వేలాది దట్టమైన పొదరిళ్ళు వాటిమధ్య గన్నేరు చెట్లు కను విందు చేశాయి .అక్కడ అందమైన ఒక పర్వతం ఎత్తైన శిఖరాలతో మేఘంలాగా గుహలు వృక్షాలతో ఉన్నది .దానిపైనుండి నీటితో కింద పడుతున్న నది ప్రియుని తొడ వదిలి క్రిందపడుతున్న ప్రియురాలులాఉంది .ఎత్తైన చెట్ల శాఖాగ్రాలు నీటిలో వంగి ప్రణయ కోపంతో వెళ్ళిపోయే ప్రియురాలులాగా అనిపించింది .ఆనది కొంత దూరం ముందుకు ప్రవహించి అకస్మాత్తుగా వెనక్కి తిరిగిన నదీ జలాలు పతిపై కోపం వదిలి ,ప్రసన్నురాలై మళ్ళీ తిరిగి వచ్చినకాంత లాగా ఉంది .ఇలా అనంత వృక్ష సమూహంతో అశోక వనం కనిపించి పులకిపచేసింది .అక్కడే బంగారు రంగు శింశుపా వృక్షం ,ఆకులు లతలతో చుట్టూ బంగారు అరుగుతో కనిపించింది .కొన్ని చెట్లు అగ్నిలాగా ప్రకాశామానంగా కనిపించాయి .ఆ కాంతుల మధ్య ఉన్న హనుమదేహం మేరుపర్వత కాంతులతో శోభించే సూర్యునిలాగా బంగారు కాంతులు చిమ్మింది .అది ఆయనకే ఆశ్చర్యం కలిగించింది –
‘’సో పశ్య ద్భూమి భాగా౦ శ్చగర్త ప్రస్రవణానిచ –సువర్ణ వృక్షా నపరాన్ దదర్శ శిఖి సన్నిభాన్ ‘’తేషాం ద్రుమాణా౦ ప్రభయా మేరోరివదివాకరః –అమన్యత తదా వీరః కాంచనోస్మీతి వానరః ‘’
ఇక ఊరుకోగలడా మహాకపి వెంటనే పుష్పించిన కొమ్మలతో ఉన్న శింశుపా వృక్షం ఎక్కి –
‘’ఇతో ద్రక్ష్యామి వైదీహీం రామదర్శన లాలసాం –ఇతి శ్చేతశ్చదుఖార్తాంసంపతంతీం యదృచ్ఛయా’’అనుకొన్నాడు అంటే –రాముడిని చూడాలన్న కాంక్షతో ఉవ్విళ్ళూరే సీతను ఇక్కడే చూస్తాను .దుఃఖ పీడితయై,అప్రయత్నంగా ఇక్కడే ఎక్కడో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది .పవిత్ర జలాలున్న ఈ నదికి సంధ్యోపాసనకోసం తప్పక వస్తుంది .అత్యంత శుభప్రదమైన ఈ అశోక వనం లోనే సీతామాత దర్శనం నాకు తప్పక కలుగుంది ‘’అనే మనో నిశ్చయం తో దట్టంగా పూసి ఆకులు ,కమ్ముకున్న ఆ వృక్షంపై సీత దర్శనం కోసం నిరీక్షిస్తూ చుట్టూ కలయ ఊస్తున్నాడు నేత్రాలతో .
52శ్లోకాల 14వ సర్గ ఇది .అప్పటిదాకా హనుమకు ఉన్న సంశయాలన్నీ తొలగిపోయాయి వసంతం కూడా హసించింది కనుక అన్నీ మాంచి శకునములే –సీతా దర్శన లాభాలే .అశోక వన ప్రవేశంతో .శోకం లేనిదే అశోకం .కనుక ఇక తనకూ సీతకు శోకం ఉండదు . తప్పక ఇక్కడ సీత కనిపిస్తుంది అనే నమ్మకం కలిగింది .దైవాలన్నీ అనుకూలిస్తున్నాయి .
శింశుపా వృక్షం అంటే ఇరుగుడు చెట్టు .దాదాపు 40 మీటర్ల ఎత్తుతో సతత హరితంగా ఉంటుంది .ఉపాంత రహిత అండాకార పత్రాలుంటాయి .తెలుపు రంగు పుష్పాలు పూస్తాయి .ఏక విత్తనం ఉన్న దీర్ఘ వృత్తాకార రెక్క లున్న ఫలాలు కాస్తాయి.బెరడు గాయాలనుంచి స్రవించే ద్రవం కారకుండా చేస్తుంది .దీని కలప గిటార్ తయారీలో ఉపయోగపడుతుంది .జావా దీవులలో బాగా పెరిగే వృక్షం . భేతాళకథల్లో విక్రమార్కమహారాజు శి౦శుపా వృక్షానికి వ్రేలాడే శవాన్ని కిందకు దింపి బుజాన వేసుకొంటాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-5-20-ఉయ్యూరు