సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-17

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-17

అశోక వనం అంతా’’సంతానకం ‘’అనే తీగెలతో పూలు కాయలు పండ్లు ఉండే చెట్లతో కళకళలాడుతోంది .ప్రతిక్షణం రెక్కలల్లార్చే పక్షులతో ఆకులు ,రెమ్మలు లేని అశోకవనం లా ఉంది .ఎర్రని అశోక పుష్పాలు భూమిపైరాలి నిప్పు కణికలేమో అనిపిస్తున్నాయి .అప్పుడు శింశుపా వృక్షం కింద మలిన దేహంతో ,నిట్టూర్పు కన్నీళ్ళతో  బాగా శుష్కించిన చంద్ర రేఖలాగా ఒక వనితా రత్నం కనిపించింది హనుమకు .అగ్నిజ్వాలగా భాసిస్తున్న ఆమె సీతా దేవే అనే నమ్మకం కలిగింది .జీర్ణమయిన పసుపు పచ్చని ఏకవస్త్రగా స్నానాదులు,ఆబహరణాలు  లేకపోవటం వలన భూమిలోంచి పుట్టిన పద్మాలు లేని కొలను అనిపించింది .మూర్తీభవించిన దైన్యం తో శోక దేవతగా సాక్షాత్కరించింది .కుజగ్రహం తో పీడింపబడిన రోహిణి లాఉన్నది .కృష్ణ సర్పం లాంటి ఒకే జడ ,వేటకుక్కలమధ్య  భయంగా ఉన్న లేడిఅనిపించింది .రావణుడు అపహరించుకొని వెళ్ళినప్పుడు ఎలాంటి రూపం లో ఉందని విన్నాడో ఇపుడూ అలాంటి రూపం తోనే కనిపించింది .తపస్సులో ఉన్న  సుందర తపస్విని లా,అగ్ని జ్వాలగా  ఉన్నది –

‘’తాం స్మృతీమివ సందిగ్ధామృద్ధిం నిపతితామివ –విహతామివచ శ్రద్ధామాశాం ప్రతిహతా మివ’’

‘’సోపసర్గా౦ యధా సిద్ధిం బుద్ధిం కలుషామివ –అభూతే నాపవాదేన కీర్తిం నిపతితామివ ‘’

అంటే –సందేహం కలిగించే స్మృతి వాక్యం లాగా ,క్షీణించిన సంపద లాగా ,సడలిన శ్రద్ధ లాగా ,ప్రయోజనం లేని ఆశలాగా ,విఘ్నాలతో కూడిన కార్య సిద్ధిలా ,కపటం తో ఉన్న ఆలోచన లా,మిధ్యాపవాదం తో పతనమైన కీర్తిలాగా సీతా దేవి ఆ౦జ నేయునికి కనిపించింది

 ఇవన్నీ సార్ధకమైన ఉపమానాలే .భవిష్యత్ దర్శనాలే అనిపించింది నాకుమాత్రం మహర్షి వాక్య విన్యాసం కదా క్రాంత దర్శికదా ఆయన ,ఒక్కసారి ఇక్కడే నిలిచి ఆలోచిద్దాం .స్మృతివాక్యం పరమ ప్రమాణీయమే.కానీ దీని తస్సా చెక్కా ,అనేక అనుమానాల ప్రోగుకూడా .ఒక్కొక్కదాన్నీ విప్పుకుంటూ పోతేకాని సత్యం రుతం బయట పడవు .అలాగే సీతాదేవి అనే అనుమానం  ఉన్నా రూఢిగా చెప్పలేని  సందిగ్ధ స్థితి .సంపద క్షీణించినా దాని పూర్వవైభవం తగ్గదు.ఒక్కోసారి శ్రద్ధ సడలి పోవచ్చు కానీ కొంచెం జాగరూకత వహిస్తే మళ్ళీ పొందచ్చు .ఆశ ప్రయోజనకారి కాదు కొన్ని వేళల్లో అనిపిస్తుంది .ఆ ఆశ లేకపోతె జీవితం చీకటి మయమే .ఇవన్నీ తాత్కాలికాలే .శాశ్వత సత్యం నెమ్మదిగా ఆవిష్కారమౌతుంది అనే సూచ్యార్ధం మహర్షి ఉపమానాలో నాకు కనిపించాయి .అలాగే కార్యం మొదలుపెడితే తెలిసీతెలీకుండా అనేక విఘ్నాలు ఆవరిస్తాయి .ధైర్యంతో ముందడుగు వేస్తె ఫల సిద్ధికలుగుతుంది భయపడి వెనకడుగు వేస్తె విధి వెక్కిరిస్తుంది ప్రమాదో ధీమతామపి అన్నారు .మన ఆలోచనమనకే అబద్ధం అనిపిస్తుంది అనువుగాని వేళ.కాస్త నిదానిస్తే సంయమనం పాటించి మరి రెండుమూడు సార్లు దృష్టిపెడితే మనది రాజమార్గమే అని రుజువవుతుంది .మనం యెంత జాగ్రత్తగా ఉన్నా మంచి దారిలో నడుస్తున్నామని నమ్మినా లోకం మిధ్యాపవాదాలు వేసి ధ్యేయాన్ని ఆట౦క పరుస్తారు .ఇది విపరీతం కాదు లోకసహజమే .అప్పుడు మనకు ఆత్మనిబ్బరం మనం చేసేది యదార్ధం అనే నమ్మికా  ఉంటె,అవన్నీమబ్బు పింజేల్లా దూది పింజేల్లా   ఎగిరిపోయి సత్యం బయట పడి ధ్యేయానికి  విజయం కలుగుతుంది కీర్తి పున్నమి వికసిస్తుంది .ఇన్ని భావాలు ఇమిడ్చాడు వాల్మీకి మహర్షి ఈ సందర్భంగా .అంతేకాదు భవిష్యత్తులో సీతా దేవి పై లోక నింద మోపబడే విషయమూ సూచ్యార్ధమే అనిపిస్తుంది .మహా పండితుడు కనుక అతనికి ఇన్నిభావాలుకలిగాయి సీతాదేవిని చూడగానే .

  పూర్వం ఋష్యమూక పర్వతం పై జారవిడిచిన ఆభరణములు ఇప్పుడు ఈమెకు లేవు .విడువని నగలుమాత్రమే ఉన్నాయి అని గుర్తించాడు కనుక అనుమానం తీర్చుకోవటానికి ఇదొక బలమైన ఆధారం అయింది .ఋష్యమూక పర్వతం పై ఆమె జారవిడిచిన పసుపు పచ్చని ఉత్తరీయం ను సుగ్రీవాదులు చూశారు .నగలను జారవిడుస్తుండగా కూడా వాళ్ళు చూశారు .ఇప్పుడు ఈమెకు ఆ ఉత్తరీయం లేదు ఆనగలూ లేవు కనుక రెండవ బలీయమైన అనుమానం రుజువైంది .ఇంతటి సాద్వికనుకనే శ్రీరాముడు  అనుతాపం ,దుఖం ,ప్రేమలతో బాధపడుతున్నాడు అనుకొన్నాడు.సీత శరీరాకృతి ,రాముని శరీరాకృతి ఒకటిగానే ఉన్నందువలననే వారికి ఒకరికొకరు తోడూ అయ్యారు అని నిశ్చయించాడు .ఇద్దరి మనస్సులు ఒక్కటే అత్యంత స్థిరంగా ఉన్నాయి .అందుకే సీతాదేవి. ధర్మాత్ముడు రాముడు జీవించగలుగుతున్నారు .సీతా వియోగం ఆయన భరించలేడు.రాముని విడిచి ఈమె బ్రతుక లేదు .సీతను చూస్తె రాముని మనసు పూర్ణ చంద్రునిలా ఉప్పొంగిపోతుంది . రామచంద్ర దర్శనం తో సీత పులకించిపోతుంది .వీరిద్దరూ జీవికా జీవులు .అని బాధ సంతోషం తో ఉన్నాడు హనుమ .

‘’అస్యా దేవ్యా యథారూప మంగ ప్రత్యంగ సౌష్ఠవం –రామస్య చయథారూపం  తస్యేయ మసితేక్షణా’’

‘’తస్యా దేవ్యా మనస్తస్మిం స్తస్య చాస్యాం ప్రతిష్ఠితమ్-తేనేయం స చ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి ‘’

వాల్మీక రామాయణాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని రామాయణ కల్ప వృక్షం అనే అమృత కావ్యం రాశాడు కవిసామ్రాట్ విశ్వనాథ .అందులో సీతారాములకుఉన్న  అభేదాన్ని ఒక గొప్పపద్యంలో చొప్పించాడు

‘’ఆకృతి రామచంద్రు విభావాకృతి ,కన్బొమ తీరు స్వామి చాపాకృతి-కన్నులన్ ప్రభు కృపాకృతి  ,కైశికమందురామ దేహాకృతి,సర్వ దేహ –మునయందున ,రాఘవ వంశమౌళిధర్మాకృతి  -కూరుచున్న  విధమంతయు  స్వామి ప్రతిజ్ఞ మూర్తియై’’

 ఇంతకంటే గొప్పపద్యం లేదు ఆ ఇద్దరి అవినాభావ సంబంధానికి .అన్యోన్యానికి .

ఇది 55శ్లోకాల 15వ సర్గ

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-5-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.