బావ 2-ప్రహ్లాద వరద గోవి౦దా హరి –నమస్కారం బావగారూ
బావ1-నమస్కారం రండి .సాభిప్రాయంగా నే పలకరించారు బావగారు
2-అదేమిటి బావగారూ
1-ఇవాళ ప్రహ్లాద వరదుడైన విష్ణుమూర్తి తన నాల్గవ అవతారంగా శ్రీ నృసింహావతారం దాల్చిన శుభదినం అంటే నృసింహ జయంతి
2-అలాగా యాదాలాపంగా అన్నదాన్ని చక్కగా సమన్వయం చేశారు బావగారూ .ఐతే ఆ అవతార విశేషాలు సెలవీయండి
1-అలాగే బావగారూ .విష్ణువు నృసింహావతారం దాల్చాటానికి తనభక్తుడైన ప్రహ్లాదుడికి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకొవటానికే అన్నారువ విజ్ఞులు.ఆ విశేషాలు తెలుసుకొందాం .ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు బ్రహ్మనుండి ,ఆయన సృష్టించిన వాటి వలన మరణం రాకూడదని వరం పొందిన మేధావి .కనుక ఆ వరాలు అబద్ధం కాకూడదుకదా .విష్ణులోకం నుంచే ఏ చక్రాన్నో పంపి వాడిని చంపవచ్చు .కస్టపడి ఈ అవతారం దాల్చనక్కర లేదు .భాగవతం సప్తమ స్కంధం లో –‘’సత్యం విధాతుం నిజభ్రుత్య భాషితం –వ్యాప్తించ స్వస్య అఖిలభూత గమ్యతాం –అదృశ్యత ,అత్యద్భుత రూపం ఉద్వహన్ –స్తంభే సభాయా౦ న మృగ౦చ మానుషం ‘’అని ఉన్నది బావగారూ –దీని అర్ధం ఏమిటంటే –తనభక్తుడు చెప్పిన మాటను నిజం చేయటానికి ,తన సకల భూత వ్యాప్తినీ నిరూపించుకోవటానికి సభామధ్యస్తంభం నుంచి నరసింహ స్వామి ఆవిర్భవించాడు అని భావం .ఇందులో ఎక్కడా హిరణ్యకశిపుని వధ కోసం అనే మాట లేదుకదా .
2-మంచి లా పాయింట్ లాగారు బావగారు .ఆ తర్వాత
1-‘’ఇందుగలడు అందు లేడు అనే సందేహం వలదు-చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు’’అని తండ్రికికొడుకు ఢంకా బజాయించి చెప్పాడాయెను.పైగా అనుమానం అక్కర్లేదనీ అన్నాడు .తల్లి కడుపులో ఉండగానే ప్రహ్లాదుడికి హరి సర్వాంతర్యామి అని స్పష్టం గా చెప్పాడు నారద మహర్షి .నారదుడికి ఈ రహస్యం చెప్పినవాడుసాక్షాత్తుఆయనతండ్రి బ్రహ్మ . అది అతడికి నరనరానా జీర్ణించుకు పోయింది .వీరంతా విష్ణుభక్తులే వారి నమ్మకం ,మాట నిలబెట్టటం భగవంతుని తక్షణ కర్తవ్యమ్ .భక్తుడు అన్నమాట నిజం చేయకపోతే దేవుడికి పుట్టగతులు౦ టాయా బావగారు ,అందుకే దైత్యరాజుస్తంభం లో చూపించమని దానిపై ఒక దెబ్బవేస్తే ,అందులోనుంచి ప్రళయరుద్రుడిలా ప్రత్యక్షమై భక్తుని మాట నిజం అని నిరూపించిన అవతారమిది .దీనికి తోడూ ‘’పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ‘’అని మనకు తెలిసిన విషయమే .మరో కిటుకు కూడాఉంది
2-ఎక్కడో ముడి పెట్టి నెమ్మదిగా విడదీస్తూ అసలు విషయం చెబుతారుమీరు .ఆకిటుకేమిటోవిప్పండి బావగారూ టెన్షన్ గా ఉంది
1-భక్తులకు నిజమైన ఆపద భగవంతుడు కనిపించకపోవటమే అన్నారు పెద్దలు .భగవంతుని దివ్య మూర్తి స్వరూపాన్ని ఒక్క త్రుటి కాలం కూడా చూడలేకపోతే భక్తులు బ్రతకలేరు అన్నది సత్యం –‘’త్రుటి యుగాయతే తామవపశ్యతాం ‘’అని రోదిస్తాడు భక్తుడు .త్రుటి అంటే క్షణం లో 60వ వంతు .ఈ త్రుటి కాలం కనిపించకపోయినా అది భక్తులకు ఒక యుగం అనిపిస్తుందట .మరి ఇలాంటి పరమభాగావతోత్తముడైన భక్తుడికి భగవంతుడు యెంత ఇచ్చినా ,ఏమిచ్చినా సంతృప్తి ఉండనే ఉండదు .కనుక స్వామి తన స్వస్వరూపాన్ని భక్తులకు చూపించి పరమ సంతృప్తి కలిగించాడు నృసింహావతారం లో .భక్త ప్రహ్లాదుని మాట నిలబెట్టి ,ఆపద నివారించటమే ఈ నరసింహావతార పరమార్ధం అన్నారు తలపండిన విజ్ఞులు బావగారూ
2-భేషైన విశ్లేషణ బావగారూ .ఇంతదూరం అలోచించి వివరించిన వారి గురించి తెలుసుకోవాలని ఉంది
1-పరమ వైష్ణవ శిరోమణి డా కందాడై రామానుజా చార్య గారు బావగారూ .మనం వారికి కృతజ్ఞులం .
2-నృసింహ ఆవిర్భావం ఏ సమయంలో జరిగిందో ,ఆ రోజు ఏం చేయాలో వివరాలు అందించండి బావగారూ
1-వైశాఖ శుద్ధ చతుర్దశి సాయంత్రం హిరణ్య కశిపుని ఆస్థాన మండపం లో ఉన్న స్తంభం పై అతడు దెబ్బకోట్టగా స్వామి అవతరించాడు
వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్,
మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్”
అని నరసింహుడు ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణములో ఉంది.బావగారూ .ఇదంతా ఒకప్లాన్ ప్రకారమే జరిగింది నృసింహ జయంతి నాడు ఉపవాసం ఉంటూ సాయం వేళ అ౦టే ప్రదోష కాలం లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహానికి పూజ చేసి ,మామిడిపళ్ళు ,పానకం ,వడపప్పు చలిమిడి నైవేద్యం పెట్టి బంధుమిత్రులకు వాటిని ప్రసాదంగా ఇస్తూ తాటాకు విసనకర్రలతో వీచి అందజేస్తారు .పిండి వండి మడితో ఉపాహారం గా సేవిస్తారు .ఓపిక ఉంటె బంగారు నరసింహవిగ్రహం దానం చేసి రాత్రి జాగరణ చేస్తారు .మర్నాడు బంధువులను ఇంటికి పిలిచి షడ్ర సోపేత భోజనం పెట్ట దక్షిణ తాంబూలం ఇస్తారు
2-ఇంకా
1-నృసింహ పురాణం లో ఉన్న ప్రహ్లాదుని పూర్వ జన్మ కథ చదువుతారు .
2-ప్రహ్లాదుడికి కూడా ఫ్లాష్ బాకా బావగారూ
1-అవును ఉంది .నరసింహ పురాణంలో ఆకథ ఉంది
అవంతీ నగరంలో సుశర్మ అనే వేద వేదాంగ పారంగతుడు ఉండేవాడు .భార్య సుశీల ఉత్తమ ఇల్లాలు .వీరికి 5గురు కొడుకులు .చివరి వాడు వాసు దేవుడు వేశ్యాలోలుది అకృత్యాలు చేసేవాడు .ఒక రోజు వీరిద్దరికీ కలహం సంభవిస్తే వాసుదేవుడు అలిగి ఆ రాత్రి అన్నం తినలేదు .ఆ రోజు నరసింహ జయంతి కూడా .వేశ్య నిద్రపట్టక జాగరణ చేశాడు .వేశ్యకూడా అలానే చేసింది .ఇలా తమకు తెలియకుండానే వారిద్దరూ నరసింహజయంతి నాడు ఉపవాసం జాగరణ చేయటం వలన వారిద్దరి పుణ్యం పుచ్చి ముక్తి పొందారు .ప్రహ్లాడుడే పూర్వ అన్మలో వాసు దేవుడు .
2-ఎప్పుడూ వినని కధ చెప్పారు తెలిసో తెలీకో మంచిచేస్తే కూడా గోప్పఫలితం కలుగుతుంది అని దీని అర్ధం కదా బావగారూ .నరసింహుడు ఆవిర్భ విన్చినప్పుడు కోలాహలం ఏమీ జరగా లేదా బావగారూ
1-ఎందుకు జాగలేదు ?ఆ విషయాన్నే గద్యంలో వివరించారు హృద్యంగా –వినండి
బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, ………. కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు” స్తంభమునుండి ఆవిర్భవించాడు.
2-మహా భీకరంగా కళ్ళకు కట్టినట్లుంది బావగారూ .మరి బాలప్రహ్లాదుడు భయపడలేదా
1-లేదు పరమానదించి ఆ మూర్తిని –
‘’లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం పక్షీంద్రశైలభవనం భవనాశమీశం గోక్షీరసార ఘనసార పటీరవర్ణం వందే కృపానిధిం అహోబలనారసింహం ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం వందే కృపానిధిం అహోబలనారసింహం’’
అని స్తుతించాడు భక్తిప్రపత్తులతో
‘’ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్
నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం’ అనే మంత్రాన్ని పఠించినా మృత్యువు సైతం ఆమడదూరంలో నిలిచిపోతుందని నమ్మకం బావగారు
2-నవనార సింహ క్షేత్రాలు అంటారు ఏమిటి బావగారూ
1- హిరణ్య కసపుడిని సంహరించి వికటాట్టహాసాలు చేస్తూ అహోబిల౦ కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో నరసింహ స్వామి వెలసారని ప్రతీతి .వాటినే నవనారసింహ క్షేత్రాలు అంటారు
(1) భార్గవ నరసింహ స్వామి
(2) యోగానంద నరసింహ స్వామి
(3) చత్రపట నరసింహ స్వామి
(4) ఉగ్ర నరసింహ స్వామి
(5) వరాహ నరసింహ స్వామి
(6) మాలోల నరసింహ స్వామి
(7) జ్వాల నరసింహ స్వామి
(8) పావన నరసింహ స్వామి
(9) కారంజ నరసింహ స్వామి
2-శంకరాచార్య జీవితం లో నరసింహ వృత్తాంతం ఉందని విన్నా నిజమేనా బావగారూ
1-బావగారూ మీరు అఖండులు.సమయానికి బాగా జ్ఞాపకం చేశారు చెబుతా వినండి –
శ్రీ శంకరులు శ్రీశైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచార౦ చేస్తున్నప్పుడు కొందరు కాపాలికులు అది నచ్చక ,ఆయనను అంతమొంది౦చే ప్రయత్నంతో ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత డబ్బిచ్చి పంపించారు. వాడు పెద్ద కత్తితో సమయం కోసం ఎదురు చూస్తూ ఒక రోజు శంకరుల వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టె ప్రయత్న౦తో ముందుకురికాడు. అదేసమయంలో శంకరుల ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లిఖార్జునుని దేవాలయ౦లోఈశ్వరుని ధ్యానించుచూ కూర్చున్నాడు . మనసున లో హఠాత్తుగా ఈ దృశ్యము కనిపించింది . వెంటనే అతడు మహోగ్రుడై శ్రీలక్షీనృసింహుని వేడుకున్నాడు. ఇక్కడ శంకరులను వధించటానికి ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండో హటాత్తుగా ఒక సింహము దాడి చేసి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎలా వచ్చిందో అలాగే మాయమైంది . ఇదంతా నరసింహస్వామి మహాత్మ్యం అని పద్మపాదుడు గ్రహించాడు .తమగురువు శంకర భగవత్పాదులను తగిన సమయంలో కాపాడిన ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు తర్వాత మిగిలిన శిష్యులకు ఈ విషయంతెలిసి పద్మపాదుని అభినందించారు బావగారూ .
2-ఇవాళ నరసింహ జయంతిని మహా సార్ధకం చేశారు బావగారూ .ధన్యవాదాలు .నమస్కారం వెళ్లి వస్తా
1-సరే బావగారూ రేపు తప్పకరండి
సశేషం
నృసింహజయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-5-20-ఉయ్యూరు