సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-20
ఇంత జరిగే సరికి రాత్రి మూడుజాములసమయం దాటి,చివరిజాము మాత్రమే మిగిలింది .అప్పుడు సాంగ వేదపండితులు , ,శ్రేస్ట యాగాలు చేయించగల సమర్ధులు ఐన బ్రహ్మరక్షస్సుల వేద ఘోష వినబడింది .మంగళవాద్యాలు మ్రోగాయి .రావణుడు వెంటనే నిద్ర లేచి జారినమాలలు ,వస్త్రాలతో సీతను తలచుకొన్నాడు .మదంతోమదించిన వాడు ,మదన ప్రేరితుడై ,కామాన్ని అదుపులో పెట్టుకోలేక పోయాడు .వెంటనే సర్వాభరణ భూషితుడై ,మందీమార్బలంతో అశోకవనానికి వంద మంది రాక్షస స్త్రీలతో బయల్దేరాడు .అందులో కొందరు బంగారు దీపస్తంభాలు పట్టుకొన్నారు ,కొందరు చామరాలు వీస్తూ అనుసరించి వస్తున్నారు .కొందరు బంగారు కలశాలలో నీరు పట్టుకొని ముందు నడిచారు .కొందరు కత్తులు, తివాసీలుతీసుకొని వెనక నడిచారు .ఒకామె మణిమయ మద్య పాత్ర పట్టుకొన్నది .ఇంకొకామె ఛత్రం పట్టుకొన్నది .మత్తుతో ఉన్న ఆతని కాంతలు మెరుపుతీగాల్లా వె౦టనడిచారు.కామ పరవశంతో మత్తెక్కిన రావణుడు విలాసంగా నడుస్తున్నాడు .మహాతేజశ్శాలిగా కనిపించాడు చెట్టుపై ఆకులమాటున నక్కి చూస్తున్న హనుమకు .
ఇది 32శ్లోకాల 18వ సర్గ
రావణుడి రాక గ్రహించి భయవిహ్వల మైన సీతాదేవి పెనుగాలికి కదలిపోయే అరటి చెట్టు అయింది .వెంటనే తేరుకొని భయంతో తొడలు ,ఉదరం బాహువులచేత స్తనాలను కప్పేసుకోన్నది –పరపురుషుడు కనిపిస్తే కులాంగన లోకం లో సహజంగా ఇలానే చేస్తుంది .
‘’ఉపవిస్టా విశాలాక్షీ రుదంతీ వరవర్ణినీ – దశగ్రీవస్తు వైదీహీం రక్షితాంరాక్షసీ గణైః’’
మలినవస్త్రాలు, నిరాభరణ ,శోక దెవతలాఉన్న సీతను చూశాడు ఆమె రాజశ్రేస్తుడు ,ఆత్మవిడుడు ఐన రాముడి దగ్గరకు సంకల్పం అనే గుర్రాలతో కట్టబడిన మనో రథం లో పోతోందా అనిపించింది –
‘’సమీపం రాజసి౦హస్య రామస్య విదితాత్మనః –సంకల్ప హయ సంయుక్తైః యాన్తీమివ మనో రధై’’
అసత్య అపవాదం చేత చెడిన కీర్తిలాగా ,పునరావృత్తి లేకపోవటం వలన మరుగుపడిన విద్యలాగా సీత ఉన్నది .తరిగిన ధనలాభ౦లా ,చేయని యజ్ఞం లా ఉత్పాత సమయంలో మండే దిశలా ,దొంగిలిపబడిన పూజా ద్రవ్యంలా కనిపించింది .తాకకూడని వాడు తాకిన యజ్ఞ వేదికలా ,ఆరిపోయిన అగ్నిజ్వాల లా , రాహువు కబళించిన చంద్రునిలా ఉన్నది .తనవారి గుంపు నుంచి వేరు చేయబడి బంధింపబడి నిట్టూరుస్తూ దుఖపడే గజరాజు భార్యలా ఉన్నది .మనసులో రాముడు వచ్చి రావణ సంహారం చేయాలని దుఖంతో అ౦జలి ఘటించి దేవతలను ప్రార్ధించే పతివ్రతా శిరోమణి లా కనిపించింది .రావణుడు మాత్రం ఆమెను మచిమాటలతో దారిలో పెట్టాలనే సంకల్పం లో ఉన్నాడు .ఇవన్నీ ప్రేక్షకపాత్ర వహించి హనుమ చూస్తున్నాడు అంతకంటే ప్రస్తుతం ఏమీ చేయలేడు కదా .
‘’సమీక్ష మాణా౦ రుదతీ మనిందితాం-సుపక్ష్మ తామ్రాయత శుక్ల లోచనాం-అనువ్రతాం రామ మతీవ మైథిలీం –ప్రలోభయామాస వధాయ రావణః ‘’
ఇది 23శ్లోకాల 19వ సర్గ
ఈ రెండు సర్గలలో మహర్షి వాల్మీకి చిత్రించిన ఉపమానాలన్నీ సర్వోత్క్రు స్టంగా ,సందర్భానికి తగినట్లున్నాయి .సీత విషయంలో వాడిన ఉపమానాలు ఆమె కీర్తిని శీలాన్నీ ,నిజాయితీని ధర్మతత్పర్తను ,దృఢ సంకల్పాన్నీ ,రామునిపై ఉన్నఅపారమైన అనురాగాన్ని ,నమ్మకాన్నీ ,విశ్వాసాన్నీ తెలియబరచేవే .ఆమె గుణాన్ని మరింత గా పెంచేవే .అందుకే మహాకవి కాళిదాసుకు ఉపమానాలకు మార్గదర్శి వాల్మీకి అంటారు బుధులు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-5-20-ఉయ్యూరు