ప్రపంచ దేశాల సారస్వతం
59-హంగేరియన్ సాహిత్యం
హంగేరియన్ భాష –ఫిన్నో –ఉగ్రియన్ భాషా కుటుంబానికి చెందింది .దీనికి ‘’మోడియర్’’అనే పేరుకూడా ఉన్నది .ధ్వని అనుకరణపదాలు తప్ప మిగిలినవేవీ సంయుక్తాక్షరాలతో మొదలుకావు అచ్చులు కూడా కొన్ని ఉపసర్గల్లాగానే వ్యవహరిప బడుతాయి .విభక్తి ప్రత్యయాలు పదం చివర ఉంటాయి. మొదట్లో టర్కీ రూని లిపిలో రాయబడేది. క్రీ.శ 1000నుంచి రోమన్ లిపి వాడుతున్నారు
సాహిత్యం -15వ శతాబ్ది దాకా లిఖిత సాహిత్యం లేదు .లాటిన్ లోనే రచన జరిగేది మతగ్రంథాలే ఎక్కువ.యూరప్ లో పునరుజ్జీవన యుగం ప్రారంభమయ్యాక ఆ కాక ఇక్కడ ఆలస్యంగా తాకింది .దీనిలో రాసిన మొదటికవి జాన్ వైటీజ్ .మొదట్లో నజివారాన్ పీఠ ఆచార్యుడై ,తర్వాత దేశానికే మతాచార్యుడయ్యాడు . మత్తయస్ రాజు -1458-1490కి ఆంతరంగికుడు ..కవిపండిత తాత్విక ఐతిహాసకులకు ఆస్థానం లో చోటు కల్పించాడు .ఇంతచేసినా హంగేరియన్ భాషలో ఉత్తమరచనలు రాలేదుకాని లాటిన్ లో వచ్చాయి .దిగువతరగతి ప్రజలలో విద్యా వ్యాప్తి బాగా రావటం తో దేశభాషపై ఆసక్తి వచ్చి అందులో రచనలుచేయాలనే కోరిక పెరిగింది .ఈ భావ పరివర్తనం తో 16వ శతాబ్దిలో ప్రోటేస్టెంట్ మతం బాగా వ్యాపించి దేశాభాషారచనలకు ప్రోత్సాహం కలిగింది .అనేక ప్రార్ధన గీతాలు లాటిన్ నుంచి అనువాదం చేశారు .కొన్ని స్వతంత్ర గీతాలు రాయబడినాయి .1590లో బైబిల్ హంగేరియన్ భాషలోకి మొదటిసారిగా అనువాదమైంది .జానపదసాహిత్యమూ బాగానే వచ్చింది .అప్పుడు ‘’విరాజీ నేకక్’’అంటే పుష్పగీతిక అనే సాహిత్య ప్రక్రియ బాగా వ్యాప్తి చెందింది .ప్రేమించిన స్త్రీని పుష్ప గీతికగా భావించి కవిత్వాలు రాశారు .పండితులు అడ్డుపెట్టినా యదేచ్చగా వస్తూనే ఉండేవి .చారిత్రకపురుషులు ‘’సాల్మన్ ‘’మొదలైన వారిపై ఫై ఐతిహాసిక కావ్యాలు వచ్చాయి .ఇలా రాసిన వారిలో పీటర్ సేలిమన్ డి ఇసోల్వా ,సెబాస్టియన్ టినోదీ మొదలైన వారున్నారు .గేయకవి వేలెంబియాన్ బలస్సా ప్రసిద్ధుడు .ఇతడే చివరికవి .
17వ శతాబ్దిలో రాజకీయ కల్లోలాల వలన సాహితీపోషణ జరగలేదు .స్వీయ చరిత్రలు చాలావచ్చాయి. ప్రముఖ తత్వ వేత్త జాన్ శేరి డి అపాజా దేశాన్ని తీర్చి దిద్దేది ఉపాధ్యాయులే కాని సైనికులు కాదు అని ప్రవచించాడు .పద్యరచన చేసినవాడు స్టీఫెన్ గయోన్ గ్యోసి .సరళ శైలి సంవిధాన నైపుణ్యం ఇతనిలో పుష్కలం ..
18వ శతాబ్దం లో కాల్పనికవాదం ప్రవేశించింది .ఫ్రెంచ్ సాహిత్య నేపధ్యం లో బెస్సేని అతని బృందం కావ్యాలురాశారు .ఈ వర్గానికి చెందని డుజో నిక్స్ ,గ్వడా నాయ్,షజేకా కవులకే విజయాలు లభించాయి .జర్మన్ కవితా సంప్రదాయం పాటించి ఫ్రాన్సిస్ కాజింసీ స్వతంత్ర రచనలు చేశాడు .షేక్స్పియర్ ,మోలియర్ రచనలను హంగేరియన్ భాషలోకి అనువాదం చేశాడు .ఈయుగ గేయకవులలో ఫ్రాన్సిస్ కొల్సీ ,జాన్ బక్సాన్యీ గొప్పవారు. కొల్సీ ‘’హంగేరియన్ జాతీయ గీతం ‘’రాసి సుప్రసిద్దుడయ్యాడు .
19వ శతాబ్ది రచయితలలో జోసెఫ్ కటోనా రాసిన ‘’బ్యాంక్ జెన్’’నాటకం హంగేరియన్ సాహిత్యం లో అత్యుత్తమనాటకం .1830లో హంగేరియన్ సాహిత్య అకాడెమి ఏర్పడింది .ఈ యుగ కాల్పనికకవులలో చార్లెస్ కిస్ ఫలూది,మైకేల్ పరో స్మర్తి స్మరణీయులు .నవలలు కథలు ఎక్కువగానే వచ్చాయి .వాస్తవికవాదం బలపడింది యాన్డ్రూఫే,జోసెఫ్ యోవోజ్ ,పీటర్ వాజడా గొప్ప నవలా కారులు ,అత్యుత్తమ గేయకవి అలెగ్జాండర్ పెటోఫీ.జానపద రచనలో ప్రసిద్ధుడు –జాన్ అరానీ .అత్యుత్తమ నవలా రచయిత మౌరన్ జోకాయ్.వాస్తవికవాద రచనలో సుప్రసిద్ధులు కాలోమన్ మిక్సి జాత్ ,ఫ్రాన్సిస్ హెర్ షె జెగ్ లు .
పారిశ్రామిక యుగం లో కొత్త కవితా సంప్రదాయానికి దారి చూపింది ‘’మ్యగాత్ ‘’అనే సాహిత్య పత్రిక .ఆ దారిలో నడచినవారు యాన్డ్రూ ఆడి,మైకేల్ జే బిట్స్,ఫ్రెడరిక్ కరింతి,సీజస్మండ్ మో రిజ్..మొదటి ప్రపంచయుద్ధం తర్వాత దేశం ఆర్ధికంగా చితికిపోయింది .అప్పటి సాంఘిక స్థితి గతులపై ఉత్తమనవలలు రాశారు –జూలియన్ క్రూడి,దెసిడర్ కొస్టో లాన్యి,లూయీ హత్వానీ బేలా శోల్ట్,జోలాస్ ఫోల్డిస్.
20వ శతాబ్దం లో ఎన్డ్రే ఆడి తన ‘’న్యు పోయెమ్స్ ‘’తో కొత్త శైలీ విధానం లో విరుచుకు పడ్డాడు ,హంగేరియన్ కవిత్వానికి కొత్త జవసత్వాలు కలుగజేశాడు .దీనికి 1908లో వచ్చిన ‘’న్యుగత్’’అంటే దివెస్ట్ పత్రిక బాగా దోహదపడింది .ఆండీ 1924లో జిగ్మండ్ మోరిజ్-ది స్టోరి ఆఫ్ మై వైఫ్ అనే అద్భుత నవల రాశాడు .గ్యూలా కుర్దీ స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్ టెక్నిక్ తో రాశాడు .డేస్జోస్జోబో ‘’ఎక్స్ప్రేషనిస్ట్ నవలగా ‘’అజ్ ఎల్సో డోర్ట్ ఫలు’’-ఊడ్చివేయబడిన ఊరు అనే అద్భుతనవల రాశాడు .బూర్జువాల జీవితాలను ఎండగట్టటానికి నవల గొప్ప వాహిక అయింది .జానోస్ కోడలాని లస్జో స్ జిలాది మొదలైనవారు వ్యక్తికీ సంఘానికి మధ్య సంఘర్షణలు నవలలలో చిత్రించారు .1948-53లో చాలామంది రచయితలలు సోషలిస్ట్ రియలిజం చూసి సైలెంట్ అయిపోయారు .
20వ శతాబ్ది చివరలో ,21వ శతాబ్ది ప్రారంభం లో గర్గి కొన్రాడ్,పీటర్ హేస్టర్ హేజి లు ది కేస్ వర్కర్ ,ది సిటి బిల్డర్ రచనలాలో తీవ్రమైన ఉద్విగ్నత లోతైన అవగాహన అద్భుత శైలీ విన్యాసం తో నూతనసమాజ ఆవిష్కరణ యెలాఉండాలో చెప్పారు .70ఏళ్ళ జీవితానుభవాలను ‘’నాట్ ఆర్ట్ –ఎ నావెల్ ‘’గా రాసి ప్రపంచ ప్రసిద్ధి చెందాడు .హేస్టర్ హేజి .సాండర్ ఒరేస్ ఫిలాసఫీ కవిత్వం బాలసాహిత్యం కూడా రాశాడు .ఆన్ద్రాస్ సూటో నాటక నవలాకర్త .హంగేరీ మైనారిటీలు జెకోస్లోవేకియా యుగోస్లేవియా మొదలైన చోట్ల పడే బాధలను కళ్ళకు కట్టించాడు .
8ప్రసిద్ధ హంగేరియన్ నవలలు –ది డోర్-మగ్డాస్జాబో ,ఎంబెర్స్ –సాండో మరాయ్,ఫేట్ లెస్ నెస్-ఇమ్రే కేర్తెజ్ ,దిపాల్ స్ట్రీట్ బాయ్స్-ఫెరెంక్ మోల్నార్,దిమాన్ విత్ ది గోల్డెన్ టచ్ –మోర్ జొకాయ్,ది కేస్ వర్కర్ –గోర్గి కొన్రాడ్,జర్నీ బై మూన్ లైట్ –అంటాల్ జేర్బ్ ,సత తాంగో-లస్జ్లో హోర్కాయ్
ఇమ్రే కెర్టేజ్- రచయితకు 2002లో సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ వచ్చింది .
కానీ సినిమాలో బెస్ట్ సినిమాలు ఆస్కార్ అవార్డ్ కు 9సార్లు నామినేట్ అయి ఒకసారి అవార్డ్ పొందింది హంగేరియన్ సినిమాలు చాలాఉన్నాయి .దిబాయ్స్ ఆఫ్ పాల్ స్ట్రీట్ ,కాట్స్ ప్లే ,హన్గేరియన్స్ ,కాన్ఫిడెన్స్ ,మెఫిస్టో-1891లో అవార్డ్ పొందింది-డైరెక్టర్ లస్జివో నెమెస్ ,జాబ్స్ రివోల్ట్ ,హనుస్సెన్,సన్ ఆఫ్ సాల్.ఈ హవా 1968నుంచి 2015వరకు సాగింది
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-5-20-ఉయ్యూరు