సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-21
రావణుడు సీతతో మాట్లాడాటం మొదలుపెట్టాడు ‘’భయంతో నీశరీరాన్ని దాస్తున్నావు సకలజన మనోభిరామ౦ గా ఉన్న నిన్ను నేను మోహిస్తున్నాను .నాపై వలపు చూపకపోతే నిన్ను తాకనే తాకను .నాశరీరంలో కామం వరదలై ప్రవహించినా సరే . ఇక్కడ నాకు తెలియకుండా ఎవరికీ ప్రవేశం లేదు. భయం వదిలి మాట్లాడు .పరస్త్రీలతోపొందు ,బలాత్కారంగా తీసుకురావటం రాక్షస ధర్మమే కనుక నేను చేసింది అధర్మం కాదు .నన్నుప్రేమించి శోకాన్ని పోగొట్టుకో .పరధ్యానంగా ఉంటూ కిందపడుకొని అలంకార రహితంగా ఉపవాసాలతో ఉండటం తగదు.నన్ను చేరితే సకల దేవేంద్ర భోగాలు అనుభవించవచ్చు .నీ యవ్వనం సౌందర్యం గడిచిపోతున్నాయి . వాటికి సార్ధకత కలిగించు .నిన్ను సృష్టించిన బ్రహ్మ ఇంతకంటే అందమైన స్త్రీని సృష్టించలేక సృష్టి మానుకొని ఉంటాడు .బ్రహ్మైనా నిన్ను చూస్తే ఆరాధిస్తాడు .నిస్సంకోచంగా నా భార్యగా ఉండు.నిన్నే పట్టమహిషిని చేస్తాను. ఈ లంకారాజ్యంతో సహా నా అధీనం లో ఉన్నదంతా నీదే.మేమంతా నీ సేవకులమే ఈ పృద్విని అంతా జయించి నీ తండ్రి జనకుడికి అర్పిస్తాను .నన్ను ఎదిరించే సాహసి పుట్టలేదు .చక్కగా అలంకరించుకొని నన్ను పొందు నువ్వు మంగళస్వరూపివి అందరి సుఖాన్నీ చూస్తావు రాముడు ఇక్కడికి రాలేదు .వచ్చినా నన్ను జయించలేడు.ప్రస్తుతం నువ్వులేక అడవులలో సంచరిస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు .అసలు బతికి ఉన్నాడో లేదో సందేహ౦ .ముందుభాగంలో కొంగలు ఉండటం వలన వెనకనల్లని మేఘాలలో మరుగు పడిన వెన్నెల ఎలా చూడటానికి వీలుకాదో రాముడు అలా నిన్ను చూడలేడు.
ఇంద్రుని కి దక్కిన కీర్తిని హిరణ్య కశిపుడు పొందినట్లు రాముడు నానుంచి నిన్ను పొందలేడు.విలాసినీ !సర్పాన్ని హరి౦చి నట్లు నువ్వు నామనసు హరి౦చావు .ననా అంతఃపురంలో నిన్ను శ్రీదేవిని అప్సరలు సేవించినట్లు సేవిస్తాను .దేవీ ! తపస్సు ,బలం ,పరాక్రమం ,దానం సంపద ,తేజం ,కీర్తి లతో నాకు రాముడు సాటిరానివాడు .నా యందు అనురాగం చూపించు. నిన్ను చూసి నీ బంధువులు సంతోషించాలి –
‘’పిబ విహర రమస్వ భు౦క్ష్వ భోగాన్ –ధన నిచయం చైవ ప్రదిశామి మేదినీం చ –మయి లాల లలనే యథాసుఖం త్వం-త్వయిచ సమేత్య లలంతు బంధవాస్తే’’
‘’కుసుమిత తరుజాల సంతసాని –భ్రమత యుతాని సముద్ర తీరజాని –కనక విమలహార భూషి తాంగీ-విహర మయా సహ భీరు కాననాని ‘’
36శ్లోకాల 20 వ సర్గ ఇది
ఇందులో మొదరి సారి రావణుడు సీత తో మాట్లాడాడు .ఇందులో సీతా దేవిపై ఆరాధనాభావమే కనిపిస్తోందినాకు .ఎక్కడా కామం తో మాట్లాడినట్లు నాకు అనిపించలేదు .అతడు ప్రయోగించిన శబ్దజాలం ఒక దేవికి చేసే స్త్రోత్రం లాగా ఉన్నట్లు అనిపించింది .కొంచెం వివరంగా చూద్దాం –అనేకపుష్పమాలలు చందనం ,అగరుపూట ,వివిధవస్త్రాలు ,దివ్యాభరణాలు పానీయాలు శయనఆసనాలు ,గీతం నృత్యం వాద్యం మొదలైన సకల భోగాలను అనుభవించమని కోరాడు .ఇవన్నీ ఒక అమ్మవారికి చేసే షోడశ ఉపచారాలుకావా ?బ్రహ్మ ఆమెను ఆరాధిస్తాడు అంటే త్రిమూర్తులు ముక్కోటి దేవతలు శ్రీదేవిని పూజిస్తారని అర్ధమే .ఆ శ్రీ దేవి వేరేవరోకాదు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన సీతాదేవి .శత్రువు అనే భావంవదిలెయ్యి అంటే మిత్రభావం దాసభావం చూపించు .అమ్మకరుణ అదే .సుందరీవిలాసవతీ,విలాసినీ ,మానినీ సుందరీ,మంగళ స్వరూపిణీ అనే సంబోధించాడు ఆరాధనాభావం తో .మబ్బుల మరుగున ఉన్న చంద్రుడు కనిపించడు నిజమే –కాని మబ్బులు తొలగితే కనిపించక ఎక్కడికి పోతాడు ?అలాగే రాముడు ప్రస్తుతం దూరంగా ఉన్నా త్వరలో వస్తాడు అనే నమ్మకం, సూచ్యార్ధం ఉన్నాయి .ఇంద్రుడు హిరణ్యకశిపుని భార్యను అపహరించాడు ఆమె యేకీర్తి .మళ్ళీ వాడు భార్యను సాధించుకొన్నాడు .ఇక్కడా అలాగే సీత రాముని చేరుతుందని వాడే చెప్పాడు .శ్రీదేవిని అప్సరసలు పూజించినట్లు ఇక్కడ అందరూ అల్లాగే చేస్తారు అంటే అమ్మవారు లలితా పరమేశ్వరిని పూజించినట్లు పూజిస్తారు .అందుకే కాటూరి వెంకటేశ్వరరావుగారు రావణ హృదయాన్ని ‘’పౌలస్త్య హృదయం ‘’కావ్యంలో ఇదే ఆరాధనా భావంతో రాశారు .రావణుడికి జన్మజన్మల అనుబంధం స్వామితో ,అమ్మవారితో తీరలేదన్నమాట .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-5-20-ఉయ్యూరు