సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-22
రావణుడి మాటలకు తల్లడిల్లి తనకు అతడికి మధ్య ఒక గడ్డిపోచనుంచి సీతాదేవి ‘’నాపై మనసు నీభార్యలపై మరల్చు పాపం చేస్తే మోక్షం రానట్లే నువ్వు నన్ను కోరటానికి అర్హుడవు కాదు .ఇక్ష్వాకు వంశ పతివ్రతను నేను .నీ నిన్ద్యమైనకొరిక అంగీకరించను .నేను పరభార్యను .సజ్జన ధర్మాన్ని పాటించు .నీ భార్యల శీల రక్షణ యెంత ముఖ్యమో పరభార్యల శీలరక్షణా అంతే ముఖ్యం .చపల చిత్తం , ఇంద్రియ చాపల్యం తో పరభార్యలను రమించేవాడు కీర్తి ఆయుస్సు ఐశ్వర్యం కోల్పోతాడు .నీ దుష్కార్యాన్ని మా౦ చేన్చే సజ్జనులు ఇక్కడ లేరా ?చెప్పినా వినక సకల రాక్షస వినాశానికి పూనుకొంటున్నావా .రాజు నీతిబాహ్య కర్మలు చేస్తే సుసంపన్న రాష్ట్రం నగర౦ వినాశనమౌతాయి .పాపాల చేతా, దూర దృష్టి లేమి చేతా పాపి నశిస్తే ,ప్రాణులన్నీ అభినందిస్తాయి ,ఆన౦దిస్తాయి .నీ ఐశ్వర్య భోగ రాజ్య ప్రలోభాలు నన్నేమీ చెయ్యలేవు .సూర్యుని కంటే వేరుకాని వెలుగును నేను .రాముడికంటేకూడా వేరైనదానినీ కాదని గ్రహించు .వేదవ్రత స్నాతుడు ,ఆత్మజ్ఞాన సంపన్నుడు అయినవాడికి యోగాభ్యాస రూప విద్య లాగా శీల వయో వృత్తులచే నేను రామునికే తగిన భార్యను .రామవిరహంతో దుఖితను .బంధించి తెచ్చిన నన్ను రాముడిని ఆహ్వానించి ఆయను అర్పించు .నీ వంశ నాశనం కాకుండా ఉండాలి అంటే రామునితో స్నేహమే నీకు మంచిది.
రాముడు ధర్మతత్పరుడు శరణాగత వత్సలుడు బతుకు మీద ఆశుంటే ఆయన చెలిమి నీకు శ్రేష్టం .శరణువేడి ఆయనను ప్రసన్నుని చేసుకో .శరణాగతుల తప్పులు క్షమించే ఉదారహృదయుడు నా స్వామి రాముడు .మనసులో చెడుభావంవదిలేసి నన్ను ఆయనకు సమర్పించి బతికిపో .శుభం పొందు .ఇంకోమార్గం లో ప్రవర్తిస్తే ,వజ్రాయుధం నిన్ను చంపకపోయినా యముడు నిన్ను వదిలేసినా లోకనాథుడు రాముడు నిన్ను వదిలిపెట్టడు అని గ్రహించు .త్వరలో రామ ధనుస్టంకారం విని మూర్చపోతావు .సకల లంకా వినాశనం చూస్తావు. సోదరులు రామలక్ష్మణులు లంకచేరి, నీ రాక్షస సమూహాలను చీల్చి చెండాడి ఎవరికీ బ్రతికే అవకాశం లేకుండా చేస్తారు .గరుత్మంతుని చేతిలోపాములులాగా, రామ గరుత్మంతుని చేత రాక్ష పాములు చావటం ఖాయం .బలిని మూడు అడుగులడిగి రాజ్యలక్ష్మిని దూరం చేసిన వామనుడిలాగా నన్ను నీనుంచి తప్పిస్తాడు .
జనస్తానం లో రామపరాక్రమ౦ వినికూడా ,సోదరులు లేని సమయంలో మాయోపాయంగా నన్ను అపహరించే పాపం మూటకట్టుకొన్నావు .పులుల వాసన చూసి కుక్క వాటి దగ్గరకు ఎలా వెళ్ళలేదో,రామలక్ష్మణుల గంధం తగిల్తే ఆదగ్గరకుకూడా రాలేవు .వొంటి చేతితో పోరాడిన వృత్రాసురుడు రేడు చేతులతో యుద్ధం చేసిన ఇంద్రుని చేతిలో చచ్చాడు .అలాగే నీ అపజయం నిజం .నీకు పోయేకాలం వచ్చింది .రాముడి నుండి పారిపోయి కైలాసం వెళ్ళినా, నీకు శనీశ్వరం తప్పదు,మహా వృక్షం పిడుగుపాటుకు కూలినట్లు రాముడినుంచి తప్పించుకో లేవు ‘’అని హెచ్చరించింది సీతామాత .
ఇది 34శ్లోకాల 21వ సర్గ
20నుంచి 26వ సర్గవరకు మనకు హనుమమాట వినబడదు .27త్రిజట స్వప్న వృత్తాంతం లోనే హనుమ దర్శనం మాట ఉంటాయి .
పరపురుషునితో కులస్త్రీలు సూటిగా మాట్లాడటంఅప్పటికి లేదు .అందుకే మధ్యలో గడ్డిపరక అడ్డం పెట్టుకొని సీత మాట్లాడి సంప్రదాయం నిలబెట్టింది .ఇక్కడ గడ్డిపరక పెట్టటం లో ఉద్దేశ్యం వాడిని తుచ్చ గడ్డిపరకగా ఆమె భావి౦చి౦దని భాష్యం చెప్పిన వారూ ఉన్నారు .సీత మనో నిశ్చయం సూటిగా అత్యంత స్పష్టంగా నిర్దుష్టంగా చెప్పింది .రామ శౌర్యపరాక్రమాదులు ఎంతగొప్పవని విస్పష్టంగా వివరించింది .అంతకు ముందు సర్గలో రావణుడు తన ప్రాభవపరాక్రమాలు ఏకరువు పెడితే ఇక్కడసీత దీటుగా రామ వీర విక్రమ విశేషాలను గొప్ప
దృష్టా౦తాలతో బోధపరచింది .వామనుడే రాముడు అని సూచ్యార్ధంగా చెప్పింది. బలి రాజ్యలక్ష్మి ఎలా చెయ్యి జారిపోయిందో వివరించింది .వృత్రాసుర వధ లోని మర్మ౦ కళ్ళకు కట్టించింది .గరుడ –సర్ప వృత్తాంతం జ్ఞప్తికి తెచ్చి నాగ వంశ నాశనం స్వయం గా కోరి తెచ్చుకోన్నట్లే రావణుడు రాక్షస వినాశనం ఆహ్వానిస్తున్నట్లు తెలియజేసింది .రామలక్ష్మణులు పులులు అని రావణుడు కుక్క అని తేల్చిచెప్పింది. రామశరణాగత ధర్మం వివరించి రాముని కాళ్ళమీద పడటం ,శత్రుత్వం వదిలి మిత్ర ధర్మం పాటించటం ,తనను రాముడికి వాడే స్వయంగా అర్పించటం అనే చాయిస్ లన్నీ ఇచ్చింది .వినకపోతే నీ ఖర్మం అని గట్టిగా చెప్పింది కాదు చెప్పించాడు మహర్షి వాల్మీకి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-5-20-ఉయ్యూరు