సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-24
రాక్షసరాజు వెళ్ళిపోగానే అక్కడి కావలి రాక్షసాంగనలు సీత దగ్గరకొచ్చి కోపంతోకూడిన కఠినమైన మాటలతో ‘’రావణుడు పులస్యబ్రహ్మ వంశం వాడు .నువ్వు అతనిభార్యవైతే నీకు గౌరవం ఎక్కువౌతుంది .ఏకజట’’మరీచి అత్రి ,అంగిరసుడు ,పులస్యుడు ,పులహుడు ,క్రతువు అనే నలుగురు ప్రజాపతులలో పులస్యుడు బ్రహ్మమానస పుత్రుడు .అతడి మనో సంకల్పంతో తేజశ్శాలి విశ్రవసు మహర్షి పుట్టాడు .అతడికొడుకే రావణుడు అంటే పులస్యునిమనుమడు పౌలస్యుడు .అందుకే నామాటవిని ఆ వైభవాన్ని వదులుకోకు ‘’అన్నది .పిల్లికళ్ళ హరిజట’’33కోట్ల దేవతలు ,దేవేంద్రునికూడా జయించినవాడు రావణుడు .అతని భార్యవు కా .’’ప్రఘస ‘’మహా తేజశ్శాలి వీర శూర ధీర రావణుడిని ఎందుకు కాదంటావు .ప్రియ భార్య మండోదరినికూడా విడిచి నిన్నేలుకొంటాడు మాస్వామి ‘’అనగా ‘’వికట ‘వికటాట్టహాసంతో ‘’సకల దేవ గంధర్వ యక్ష కిన్నెర కి౦పురుషాదులను జయించిన రావణుడు నీ దగ్గరకు కాళ్ళ బేరానికి వస్తేచులకన చేశావు .భార్యవై సకల సుఖాలు అనుభవించు’’అనగా ,దుర్ముఖి ‘’సూర్యుడుకూడా రావణభయంతో తీక్ష్ణ మైన ఎండ కాయడు,వాయువు వేగంగా వీచడు .అలాంటి రావణుడి పక్షాన ఎందుకు చేరవు ‘’అన్నది. ఇలా రావణుడి ఆజ్ఞ పాటించి వారంతా మాటలతో అతడి పరాక్రమాదులు వంశ ప్రతిష్టాదులు పొగడి సీతను అతడి భార్య కావలసినదని తీవ్రంగానే చెప్పి భ్రుత్య ధర్మం నిర్వర్తించారు .
ఇది 23శోకాల 23వ సర్గ
పై సర్గలో రాక్షస స్త్రీలు రావణుడు చెప్పిన సామ వచనాలతో హితవు చెప్పారు .ఇప్పుడు సెకండ్ డిగ్రీ ప్రయోగానికి సిద్ధమయ్యారు .అంతాసామూహికంగా ‘’మానవ స్త్రీవికనుక మానవుడైన రాముడినే కోరుతున్నావు .మనసు త్రిప్పుకో లేకపోతె బతకలేవు .కస్టాల అధ్యాయం ముగించుకొ .సుఖాల అధ్యాయం ప్రారంభించు .రాజ్యహీనుడు ,దుఖార్తుడు రాముడు చేయగలిగింది వీసం కూడా ఉ౦డదు .’’అని కోరస్ గా భయపెడితే సీత కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ‘’మీరంతా నన్ను జనని౦దితాలైన మాటలతో బాధపెడుతున్నారు ఇవి పాపపు మాటలని అనిపించటం లేదా ?మానవస్త్రీ రాక్షసభార్య అవటం లోక విరుద్ధం .మీరంతా కలిసి నన్ను తినేసినా మీ మాట విననే వినను .దీనుడే కాని రాజ్య హీనుడేకానీ ,పతి యే నాకు ప్రత్యక్ష దైవం .అతని యందె నా అనురాగం శాశ్వతం. శచీ దేవి ఇంద్రుని ,అరుంధతి వసిస్టుని ,రోహిణి చంద్రుని ,లోపాముద్ర అగస్త్యుని ,సుకన్య చ్యవన మహర్షి ని సావిత్రి సత్యవంతుని శ్రీమతి కపిలుని ,దమయంతి సౌదసుని, కేశిని సగరుని ,దమయంతి నలుని అను వర్తించినట్లే ,నేను ఇక్ష్వాకు వంశ్య శ్రేష్టుడైన శ్రీరాముని అనుసారిస్తాను ‘’అని దిమ్మ తిరిగే సమాధానం చెబితే దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది వాళ్లకు .వాళ్ళు చెప్పింది రావణుడి తండ్రి తాత గురించి మాత్రమె.కానీ సీత పురాణ పురుషుల నందర్నీ తెచ్చి వారి ధర్మపత్నులతో సహా వరుసలో నిలబెట్టింది ‘’.
ఈ సర్గలో మహర్షి సీతాదేవి చేత చెప్పించిన –‘’దీనోవా ,రాజ్యహీనోవా ,యోమే భర్తా స మే గురుః- తమ్ నిత్యం అనురక్తాస్మి యథా సూర్యం సువర్చలా ‘’అనేది లోకం లో ప్రతివ్రతా ధర్మం గురించి చెప్పేటప్పుడు అందరూ ఉదహరించే ముఖ్యశ్లోకం .అందుకే సీత అంత గొప్ప పతివ్రతగా గుర్తింపు పొందింది ,నిజానికి ఆవిడ పొందిన సుఖం తక్కువ. జీవితమంతా కష్టాలే .కాని సుఖ దుఖాలలో ఆమె మనసు రామవశమే .ఆయనకూ అంతే.అందుకే ఆదర్శ దంపతులు అంటాం .
ఇదొక మొండిఘటం మాటలతో లొంగదు ‘’ అని తీర్మానించి మళ్ళీ వికృత వికార భయంకర చేష్టలతో మీద పడుతూ చివరికి సత్యాన్ని వాళ్ళే వాళ్ళ మాటలతో’’ఛీ ఛీ ఈమె రాక్షసరాజు రావణునికి ఏ విదంగానూ తగింది కాదు ‘’అని అన్నారు .’’నేయ మర్హతి భర్తారం రావణం రాక్షసాధిపం .వాల్లమనసుల్లో ఉన్న అసలు విషయం ‘’నక్కకూ నాగలోకానికీ సాపత్యమా .పావని సీత పాపి రావణుడి భార్య అవటం లోక విరుద్ధం ‘’అని అనిపించి ఉండచ్చు నని నా ఊహ .‘’పాపం హనుమ శింశుప పైనే దాక్కొని గుడ్లనీరు కుక్కుకొంటూ ప్రేక్షకపాత్ర వహిస్తున్నాడు .సీతకూడా దుఖం తో ఆ చెట్టు కిందికే వచ్చి శోకం లో మునిగిపోయింది .కృశోదరి అనే రక్కసి ‘’ఇప్పటి దాకా నీ భర్తపై ప్రేమ చూపావ్. అదిమోతాదు మించింది .మోతాదు దాటితే ఏదైనా ప్రమాదమే .నీ మాటలు నేను కాదనను .నేను చెప్పే హితం తలకెక్కించుకో ‘’రాముడిని మర్చిపో నీ మనసులో రావణుడిని ప్రతిష్టింఛి సకలలోకేశ్వరి కా .రాముడి ఆయుస్సు తీరిపోయింది ఇక్కడికి రాడు రాలేడు.ఇంకా అతనితో నీకు పనిలేదు .రావణుడిని చేరి ఆనందం పొందు లేకపోతె మేమంతా నిన్ను చంపి తినేస్తాం ‘’అన్నది .
వికట పిడికిలి బిగించి గర్జిస్తూ ‘’ఎన్ని అప్రియాలు నువ్వు పలికినా నీమీద దయతో సహించాం.కాని మేము చెప్పింది నువ్వు చెవికి ఎక్కి౦చు కోలేదు .దేవేంద్రుడు వచ్చినా నిన్ను రక్షించలేడు.స్త్రీల యవ్వనం అస్థిరం .అదిగడిచేలోపే సుఖాలు అనుభవించాలి .ఏడు వేలమంది రాక్షసా౦గనలు నీ అధీనంలో ఉంటారు .నా మాట వినకపోతే నీ గుండె పీకి తినేస్తా ‘’అని బెదిరిస్తే ,మండోదరి(రావణపత్నికాదు ) అనే రాక్షసి శూలం తిప్పుతూ సీతను చూస్తె ఆబగా తినెయ్యాలని అనిపించిందని చెప్పి ‘’కడుపుకు కుడివైపున కాలఖండమనే మా౦సపిండం ,ఎడమవైపు గుల్మం అనే మాంసపిండం,దానిపై ఉండే మాంసం పద్మకోశం లాంటి హృదయం అనే మాంసం దానికింద అదోమా౦స౦ ,ప్రేగుల్ని ,తలనుకూడా తినేయ్యాలనిపిస్తోంది ‘’అని భయ పెట్టింది ,ఇంకో అడుగు ముందుకేసి ప్రఘస’’ఇంకా చూస్తారేమే.దీని మెడ పిసికి చంపి చచ్చిందని రాజుకు చెబుదాం ‘’అనగా అదోముఖి ‘’దీన్ని చంపి మాంసం తినే పనిలో పడదా౦ ముక్కలు చేసి పంచుకొని ,మద్యం ,తెనేలలో న౦చుకొని హాయిగా తిందాం .శూర్పణఖ అనే రాక్షసి (రావణ సోదరికాదు)అజాముఖి చెప్పింది బాగుంది .మాంసం తింటూ మద్యం తాగుతూ లంకానగర పడమటి ద్వారం దగ్గరున్న భద్రకాళి ప్రీతికోసం నాట్యం కూడా చేద్దాం ‘’అని థర్డ్ డిగ్రీ దాటిన మెజర్స్ ప్రయోగించి రాజు చెప్పిన దండాన్నికూడా ప్రయోగించే రీతిలో ప్రవర్తిస్తే భయ విహ్వల సీతామాత నిస్సహాయయై సహనం ధైర్యం కోల్పోయి విపరీతంగా ఏడవటం ప్రారంభించింది .
48 శ్లోకాల 24వ సర్గ ఇది
ఇక్కడ కావలి రాక్షసులు రాజుమాట నూటికి నూరుశాతం పాటించి తమవిధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చారు అని గ్రహించాలి
ఈ సర్గలో హనుమమాట వాల్మీకి మాటగా వచ్చింది తప్ప ఆయన పలికి౦దేమీ లేదు
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-5-20-ఉయ్యూరు