సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-26
‘’నాకు తెలియకుండా రావణుడు నన్ను ఇక్కడికి తెచ్చాడు .రాక్షసస్త్రీలు పెట్టె హింసలు భరించలేక పోతున్నాను .ఇక్కడి ఈ లంకా వైభవంతో నాకేం పని ?నాగుండె రాయి అయిపోయిందా లేక జరామరణాలు లేనిదా అర్ధం కావటం లేదు .ఎంతత ఏడ్చినా బద్దలు అవటం లేదు .రామవిరహం సహిస్తూ బతకటం నాకు నింద అవుతుంది .నా ప్రభువు ,పతి రాముడు లేని నాకు ఈ జీవితం ఎందుకు .రాక్షసుల్లారా నన్ను చీల్చండి చంపండి తినేయ్యండి .ఎలాగైనా ప్రాణాలు వదలాల్సిందే. ఈ దుఖం ఇక భరించలేను .రావణ రాక్షసుడిని ఎడమకాలితోనైనా తాకను .అలాంటి నేను వాడిని కామిస్తానా ?నన్ను ముక్కలు చేసినా ,అగ్నిలో పడేసికాల్చినా రావణుడిని మాటవినను .నా రాముడు కైకేయి లాంటి దోషవతులలోనూ మంచినే చూసే ప్రాజ్ఞుడు .’’ఖ్యాతః ప్రాజ్ఞః క్రుతజ్ఞశ్చసాను క్రోశశ్చ రాఘవః –సద్వ్రుత్తో నిరనుక్రోశ శ్శంకేమద్భాగ్య సంక్షయాత్ ‘’ అపకారం చేసినవాడికైనా ఉపకారమే చేస్తాడు,తనకు చిన్న ఉపకారం చేసినవారికైనా వారి దుఃఖ సమయంలో గొప్పగా అదుకొనెఉదారుడు.అలాంటి దయామయుడు నాపై దయ ఎందుకు చూపటం లేదో అర్ధం కావటం లేదు. నాకు అదృష్టం తగ్గిందేమో .నన్ను రావణుడు ఇక్కడికి తెచ్చాడని రాముడికి తెలిసి ఉండదు. తెలిసి ఉంటె ఈపాటికి వచ్చేసేవాడు .నా సంగతి తెలిసిన జటాయువునుకూడా రావణుడు యుద్ధంలో చ౦పాడు .లంకారాజ్య మార్గాలలో రామలక్ష్మణులు ఇక్కడికి వచ్చి కాల్చిన రాక్షసుల చితులనుంచి పైకి ఎగసిన పొగ క్రమ్మి గ్రద్దలు తిరుగుతూ లంక త్వరలోనే శ్మశానం అవుతుంది .త్వరలో నా కోరిక నెరవేరుతుంది ఇక్కడ కనిపించే అశుభాలు ఆవిషయాన్ని సూచిస్తున్నాయి
పాప రావణుడు చస్తే మహా తేజస్సున్న లంక తేజో విహీనమై స౦పదలన్నీ నశించి పతి చనిపోయిన పడతి లాగా ఉంటుంది .ఇంటింటా రాక్షస స్త్రీల రోదనం భరింప రానిదౌతుంది .నేను ఇక్కడ ఉన్నానని రాముడికి తెలిస్తే రామబాణం లంకను భస్మం చేస్తుంది .వాడు ఇచ్చిన 2నెలలగడువే ఉన్నదిమిగిలి .ఎవరైనా విషమిచ్చి పుణ్యం కట్టుకొంటే బాగుండును .నా విషయం తెలీక సోదరులు కాయ దుంపలు తింటూముని వృత్తిలో ఉంటూ ఆయుధాలు వదిలేశారా .?ప్రియమైన దాని వలన ప్రియమే కలుగుతుంది అప్రియమైనదానివలన సుఖం కలుగక దుఖమే కలుగుతుంది .ప్రియాప్రియ ద్వంద్వాలకు అతీతుడైన మహాత్ముడగు రాముడికి నమస్కారం .నేను రామునికి ప్రియపరురాలను. రాముడిని వదిలి జీవించలేను. ప్రాణాలు వదిలేస్తా ‘’అని దుఖపడింది .-‘’ప్రియా న్న సంభవే ద్దుఖ మప్రియాదధికం భయం –తాభ్యాం హి యేవియుజ్యన్తే నమస్తేషాం మహాత్మనాం’
సాహం త్యక్తా ప్రియార్హేణ రామేనా విదితాత్మనా –ప్రాణా౦ స్తక్ష్యామి పాపస్య రావణస్య గతావశం ‘’‘’
ఇది 51శ్లోకాల 26వ సర్గ .
ముందుగా రాముడు వస్తాడని ,రావాలని కోరుకున్న సీతకు సెకండ్ థాట్స్ వచ్చి ,అసలు తాను ఎక్కడ ఉన్నానో ఆయనకు తెలిసిందో లేదో అనుకోని తనవిషయం చెప్పటానికి మిగిలిన ఒకే ఒకడు జటాయువు కూడా తనకోసం రావణుడితో తీవ్ర యద్ధం చేసి చనిపోయాడు కనుక రాముడికి తన విషయం చెప్పటానికి ఎవరూ మిగల్లేదు అని అర్ధం చేసుకొన్నది .ఆయనకు తానిక్కడ ఉన్న విషయం తెలిస్తే ఆఘమేఘాల మీద రాకుండా ఉంటాడా అని ఊరట పొందింది .వస్తే ఏం జరుగుతుందో ముందే చెప్పింది సర్వరాక్షస హననం లంకాదహనం .ఆడవారికి దుఖంబాగావస్తే అది కలిగించిన ఎదుటి వారిని తిట్టటం ,శాపనార్ధాలు పెట్టటం సహజం .ఎంతైనా సీత స్త్రీయే కదా.ఆలక్షణం ఎక్కడికి పోతుంది ?రాక్షస్త్రీల మా౦గల్యాలు మాడిభస్మం అవ్వాలనుకున్నది .లంక బూడిదకావాలని కోరింది . భార్తలను కోల్పోయిన రాక్షస స్త్రీల రోదన లంక అంతా ప్రతిధ్వనించాలని తనకు జరిగిన అవమానానికి ఇదే ప్రతీకారమనీ భావించింది. ఇది అతి సహజం .అయితే అంతకు ముందు రామునిఉదార హృదయం చెప్పింది .తప్పు చేశానని రావణుడు ఒప్పుకొంటె ఆయన దయామయుడు కనుక అన్నీ మర్చిపోయి క్షమించి లంకను కాపాడుతాడు అని చెప్పింది అన్న సంగతి మనం మరువరాదు మహాశయులారా.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-20-ఉయ్యూరు