సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-28
‘’రాక్షసులు నన్ను ఇలా బాధ పెడుతున్నా పాపం చేశానేమో బతుకు తున్నాను .నేను ఆత్మహత్య చేసుకొంటే దోషం ఏమీ లేదు .రావణుడి చేతిలో చావు ఎలాగైనా తప్పదు.దానికంటే ఆత్మహత్య మేలే కదా .వాడు ఇచ్చిన రెండు నెలల గడువు లోపు రాముడు ఇక్కడికి రాకపోతే ఈ అయోగ్యుడు కడుపు లోనుంచి బయటికి రాని శిశువును శస్త్ర చికిత్సతో మృత శిశువును తీయటానికి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసినట్లు ,వాడి అయిన ఆయుధాలతో రాక్షసరాజు నా అవయవాలు ముక్కలు ముక్కలు చేస్తాడు .రామా ,లక్ష్మణా అత్తా కౌసల్యా సుమిత్రా సముద్రంలోసుడిగాలికిచిక్కిన ఓడలాగా దుఖాలు అనుభవిస్తున్నాను .రామ సోదరులు నాకారణంగా లేడి రూపంలో ఉన్న దుష్ట ప్రాణి చేత చంపబడ్డారేమో .యముడే అప్పుడు లేడి గా వచ్చి నన్ను ప్రలోభపెట్టగా సోదరులను పంపాను .రామా నన్ను రాక్షసులు చంపుతారని నీకు తెలీదు కదా .రాక్షసుల తీవ్రమైన మాటలు, భూశయనం, ,నువ్వే రక్షకుడవని నమ్మి నియమాలతో జీవించటం అనే ఈ వ్రతం అంతాకృతఘ్నులకు చేసిన ఉపకారం లా వ్యర్ధమయిందా.నా ధర్మాచరణ ,ఏకపత్నీ వ్రతం నిష్ప్రయోజనం నిరర్ధకం అయ్యాయి .వనవాస కాలం తీరి అయోధ్యలో వలచినస్త్రీలను పెళ్ళాడి నువ్వు సుఖిస్తావు .కాని నేనిక్కడ ఏ ఫలితమూ దక్కక ఉపవాసాలతో క్రుంగి కృశించి చనిపోతా .లేకపోతె విషం తాగి వాడి ఆయుధం ఉపయోగించి ఆత్మహత్య చేసుకొంటా .నాకు విషంకాని ఆయుధం కాని ఇచ్చే వారే లేరిక్కడ ‘’అనుకొంటూ శింశుప చేరి తనపొడవైన జడతో ఉరి పోసుకోవటానికి సిద్ధపడింది సీతాదేవి .కొమ్మను గట్టిగా పట్టుకొని ‘’ఈ కొమ్మ’’సీతమ్మ తన వంశాన్ని స్మరిస్తూ ఆత్మహత్యా ప్రయత్నం లో ఉండగా శుభ సూచనలు ,శుభ శకునాలు కనిపించాయి .
‘’ఉపస్తితా సా మృదు సర్వ గాత్రీ –శాఖాం గృహీత్వా థ నగస్య తస్య –తస్యాస్తూ రామం ప్రవిచింత యంత్యా –రామానుజం స్వం చ కులం శుభా౦ గ్యాః’’
‘’శోకా నిమిత్తాని తథా బహూని –ధైర్యార్దితాని ప్రవరాణి లోకే –ప్రాదుర్నిమిత్తాని తదాబభూవుః-పురాపి సిద్దా న్యుపలక్షితాని’’
ఇది 20 శ్లోకాల 28వ సర్గ .అన్ని ప్రయత్నాలూ ,అన్ని ఆశలూ విఫలమైతే చివరికి ఆత్మహత్యకు పూనుకోవటం లోక రివాజు .అవతలివారికి ఎన్నో చెప్పగలరు కాని తమ దగ్గరకు వచ్చేసరికి అవి అన్నీ మర్చిపోయి ఇదే రకంగా ప్రవర్తిస్తారు మానవులు .సీతకూడా మానవ మాత్ర స్త్రీయే .కనుక చివరగా ఆప్రయత్నం చేసింది .తన ఆత్మహత్యను తన కారణాలతో సమర్ది౦చు కొన్నదికూడా .ఇదే లోక సహజ విషయమే .అలా సమర్ధించుకొని ఆత్మను సంతృప్తి పరచుకోలేకపోతే ,ఆప్రయత్నం చేసే ధైర్యం రాదు కదా .ఇది వరకే చెప్పుకు న్నట్లు క్లైమాక్స్ లో సుభ శకునాలు శుభ సూచనలు కనిపించి ఆ ప్రయత్నానికి బ్రేక్ పడుతుంది అలాగే ఇప్పుడు సీత విషయం లోనూ జరిగింది .మానవ మనసులోని ఆంతర్యాలను ,ముఖ్యంగా స్త్రీ హృదయపులోపలి పొరల్ని మహా కవులు చక్కగా ఆవిష్కరిస్తారు .వాల్మీకి మహర్షి కవీ, క్రాంత దర్శి కనుక ఇలా ముగించాడు .
సశేషం
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -16-5-20-ఉయ్యూరు