సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-31
దురపిల్లుతున్న సీతను ఓదార్చే ప్రయత్నం లో హనుమ ఆమెతో ‘’అమ్మా !రాముడి సందేశం తెచ్చాను .ఆయన క్షేమం . మీ కుశలం అడిగాడు .మరిది లక్ష్మణస్వామి నీకు నమస్కారాలు చెప్పాడు ‘’అనగానే శరీరం పులకించి హనుమతో ‘’మనుషుడు బతికి ఉంటె నూరేళ్ళకైనా ఆన౦ద౦ కలుగుతుంది అని చెప్పిన పెద్దలమాట యదార్ధం-
‘’కళ్యాణీ బట గాథేయం లౌకికీ ప్రతిభాతిమా-యేతి జీవంత మానందోనరం వర్ష శతాదపి ‘’
ఇది వాల్మీకి కోటబుల్ కోట్స్ లో మరొకటి .
చెట్టు దిగి నెమ్మదిగా అమ్మ దగ్గరకు చేరగా ఇంకా అనుమానం తీరక రావణుడే అనుకొని ‘’నేను ఇతనితో మాట్లాడటం అనుచితం అనిపిస్తోంది వానర రూపం దాల్చిన రాక్షస రాజు కాదుకదా ‘’అనుకోని ,చెట్టుకొమ్మను వదిలేసి నేలపైనే కూర్చోగా హనుమ మళ్ళీ నమస్కరించగా ,దీర్ఘ నిట్టూర్పులతో ‘’మారు వేషం లో వచ్చిన రావణుడివా .మళ్ళీ నన్ను దుఃఖ పెడితే బాగుండదు. జనస్థానం లో సన్యాసిగా కామరూపం తో వచ్చావు .ఉపవాసాలతో చిక్కి శల్యమై దీనంగా బాధపడుతున్న నన్ను మరింత బాధించటం న్యాయం కాదు .ఒక వేళ నేను అనుకొన్నాది నిజం కాకపొతే ,నీ మాటలతో నా మనసు సంతోషం పొందింది .రామదూతవన్నమాట నిజమైతే నీకు శుభమస్తు .నాకు రామకథవినటం మహా దానందం .రామ కథ మళ్ళీ వినిపించు .నీమాటలు నా హృదయానికి ఆనందం కలిగించాయి .స్వప్నం యెంత మధురం .చాలాకాలం కిందటే ఇక్కడికి తీసుకు రాబడిన నేను ఇవాళ కలలో రాముడు పంపిన దూతను చూశాను ,కలలో రామ లక్ష్మణులను చూసి ఉంటె ఈదుఖం ఉండేదికాదు .స్వప్నం కూడా నాపై శఠించింది .కలలో కోతి ఆనందం కలిగించదు.మరి నాకు సంతోషం కలుగు తోందే .కనుక కలకాదు వాస్తవమే చూస్తున్నాను .చిత్తభ్రమకాని వాత ప్రకోపంకాని నాకు కలిగాయా ?లేక ఎండమావి యా?.ఇది ఉన్మాదం కాదు ,మోహమూ కాదు కారణం నన్ను నేను గుర్తిస్తున్నాను, వానరాన్నీ గుర్తిస్తున్నాను ‘’అనుకొని వానరుడు రావణుడే అని మళ్ళీ భావించి ఇక అతనితో మాట్లాడటం మానేసింది .
ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే గండరగండ హనుమ ఆమె మనసులోని సంశయం అర్ధం చేసుకొని .సుమధుర వాక్కులతో ‘’అమ్మా !రాముడు సూర్య తేజస్సున్నవాడు చంద్రునిలా ప్రజకు ఆహ్లాదం కలిగిస్తాడు .కుబేరునిలా సకల లోకాదీశ్వరుడు .విష్ణు పరాక్రమ శాలి. సత్య మధుర భాషణలో దేవగురువు బృహస్పతి .-‘’ఆదిత్య ఇవ తేజస్వీ లోకకాంత శ్శశీ యథా-రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథా’’
సౌందర్య రమణీయ ,కాంతి మంతుడు .మన్మధుని మరో రూపు ,నిగ్రహానుగ్రహ సమర్ధుడు .
‘’రూపవాన్ సుభగః శ్రీమాన్ కందర్ప ఇవ మూర్తిమాన్ –స్థాన క్రోధఃప్రహర్తా చ శ్రేష్ఠో లోకే మహారథః’’
బంగారు లేడి రూపం చూపించి రాముని ఆశ్రమానికి దూరం చేసి ,ఎవ్వరూ లేని సమయంలో నిన్ను అపహరించి తెచ్చిన రావణుడు దీని ఫలితంగా రాముని చేతిలో మరణిస్తాడు .అలాంటి తేజో శౌర్య పరాక్రమమూర్తి శ్రీరాముని దూతను నేను .నీ కుశలం అడగమన్నాడు రాముడు .తమ్ముడు నీకు ప్రణామాలు తెలియ జేశాడు .మా వానరరాజు సుగ్రీవుడు నీ క్షేమం అడిగాడు .వారు ముగ్గురు నిన్ను తలవని రోజు లేదు తల్లీ .-
‘’తద్వియోగేన దుఖార్త స్స త్వాంకౌశల మబ్రవీత్ –లక్ష్మణస్య మహా తేజా స్సుమిత్రానంద వర్ధనః –అభి వాద్య మహాబాహూ స్సత్వాంకౌశల మబ్రవీత్
‘’నిత్యం స్మరతి రామస్త్వాంససుగ్రీవ స్సలక్ష్మణః-దిష్ట్యాజీవసి వైదేహి రాక్షసీ వశ మాగతః
రాక్షసులమధ్య చిక్కి దీనంగా బతికి ఉన్నావు .కొద్దిరోజులలో ఆసోదరులు సుగ్రీవ సైన్యంతో ఇక్కడికి వస్తారు .నేను సుగ్రీవ మంత్రి హనుమ అనే కోతిని .నీ అన్వేషణలో ఈ మహా సముద్రం దాటి ఇక్కడికి వచ్చాను .
‘’అహం సుగ్రీవస్య సచివో హనుమాన్నామ వానరః –ప్రవిష్ఠో నగరీ౦ లంకాంలంఘయిత్వా మహోదదిం ‘’
నా పరాక్రమం తో రావణుడి తలపై పాదం పెట్టి వచ్చినట్లు,లంక దేవతను ప్రసన్నం చేసుకొని లంక ప్రవేశించాను .నేను ముమ్మాటికీ వానరుడనే రావణాసురుడను కాను .నీ అనుమానం వదిలి నామాట విశ్వ సించు సీతమ్మ తల్లీ ‘’అన్నాడు .-‘’
‘’కృత్వా మూర్ధ్ని పదన్యాసం రావణస్య దురాత్మనః –త్వాం ద్రష్టు ముపయాతో –హం సమాశ్రిత్య పరాక్రమం ‘
‘’నాహమస్మి తథా దేవి యథా మా మవాగచ్ఛసి –విశంకా త్యజ్యతా మేషాశ్రద్ధ త్చ్వవదతో మమ ‘’
ఇది 39శోకాల 34వ సర్గ .
ఇందులో హనుమ రావణుడు ఏమో మాయా రూపం లో వచ్చాడేమో అనే సందేహం సీతకు కలగటం అత్యంత సహజం .పూర్వం సన్నాసిగా వచ్చి మోసం చేశాడు .ల౦కలో అందరూ కామరూప విద్యలో ఆరితేరిన వారే .కనుక నమ్మక పోవటం లో ఏమీ దోషం లేదు .ఒకటికి రెండు సార్లు ఎసర్టైన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది .పూర్వం మాయ లేడి మోసం గ్రహించక రాముడిని తొందరపెట్టి పంపటం ,రాముడికి ఏమీ కాదని మరిది చేబిత అతని మాటలలో దోషం ఆపాదించి వెంటనే పంపటం, చివరికి లక్ష్మణ రేఖ దాటటం, సీత చేసిన తొందర పాటు నిర్ణయాలే .వాటి ఫలితమే కొంప కొల్లెరై లంకావాసం గతి పట్టింది .ఇప్పుడు నిదానించాలి అని గ్రహించింది .వానరుని శంకి౦చినా నెమ్మది మీద సత్యం గ్రహించి మరో తోదరపాటు చర్యకు పాలుపడకుండా సవ్య౦గా ఆలోచించి అసలైన అడుగు వేసి ఫలితం పొందింది .ప్రమాదో ధీమతా మపి అని అన్నారు అందుకే .ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తేనే ఆపదలో పడకుండా ఉండగలుగుతాం .లేక లేడికి లేచిందే పయనం అయితే లాంకావాసమే గతి అవుతుంది .
హనుమకూడా చెప్పిందే చెప్పి విసుగు కలిగించకుండా రామ కత బహు రక్తిగా చెప్పాడు ఆయన అవతార విశేషం చెప్పకనే చెప్పాడు .రాముడు వస్తాడు దుఖం తొలగించి రావణ వధ చేస్తాడు అనే సానుకూల వార్తా చెవినవేసి ఆమెకు తో శ్రీరామ కథామృత పానం చేయించాడు .మహర్షి ఆ అమృతం మనకూ అందించి ధన్యులను చేశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-5-20-ఉయ్యూరు