సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-32
బహు సంతోషి ఐన సీతాదేవి హనుమతో వాత్సల్యంగా ‘’నువ్వు రాముడిని ఎక్కడ కలిశావ్ .కోతులైన మీకు నరులైన రామలక్ష్మణులతో స్నేహం ఎలా కుదిరింది .సోదరుల లక్షణాలేమిటో గుర్తులేమితో చెబితే నా దుఖం ఉపశమిస్తుంది అనగా హనుమ ‘’రాముడి చిహ్న లక్షణాలు లక్ష్మణు వీ సమానమే .రాముడు సర్వాంగ సుందర మూర్తి .కనులు తామర రేకులు .సకలజీవులకు మానసిక ఆనందం కలిగిస్తాడు .దాక్షిణ్యం ఆయన సహజ లక్షణం .సూర్య సదృశ తేజస్సున్నవాడు .సహనం లో భూమి కి సమానం. తెలివిలో బృహస్పతి, కీర్తికి దేవేంద్రుడు .ధర్మ రక్షకుడు .శత్రు పీడకుడు.సకల ప్రపంచాన్ని కాపాడే వాడు .ఐహికాముష్మిక భావ సంపన్నుడు .యజుర్వేదాసక్తి పరుడు .సర్వవేద వేదా౦గవేది.విశాలమైన మూపు ,పెద్ద బాహువులు ,శంఖం వంటి మెడ,శుభకర ముఖం కనపడని మెడ క్రింది సంధి ఎముకలున్నవాడు. కొసలలో యెర్రని నేత్రాలున్నవాడు. భేరీ ధ్వనిలాంటి క౦ఠస్వరం .’’నీల మేఘచ్చాయ బోలు దేహము’’ వాడు .సమ౦గా విభజింపబడిన అవయవ పొంకం ఉన్నవాడు .శ్యామల వర్ణుడు .సాముద్రిక శాస్త్రం లో చెప్పినట్లు వక్షస్థలం,మణికట్టు ,పిడికిలి దార్ధ్యం ఉన్నవాడు కేశాగ్రాలు ,వృషణాలు మోకాళ్ళు మూడు సమానంగా ఉంటాయి .ఎత్తైన ఉదరం ,నాభి చుట్టూ ఉన్న ప్రదేశం ,రొమ్ము కలవాడు గోళ్ళు అరచేతులు కనుగొనలు ఎర్రగా ఉన్నవాడు .పాద రేఖలు ,శిరోజాలు ,లింగమణినున్నగా ఉన్నవాడు. స్వరం నడక నాభి గంభీరంగా ఉంటాయి .
ఉదరం పై మూడు మడతలు ,పల్లంగా ఉన్న చూచుకం ,స్తనాలు పాద రేఖలున్నవాడు .దీర్ఘం కాని లింగం బలుపు లేని పొత్తికడుపు ,మూడు సుడులతో ఉన్నతల .బొటన వ్రేలి మొదట ఉన్న నాలుగు రేఖలు చతుర్వేద విదుడని తెలియ జేస్తాయి. నుదురు ,పాదాలు ,అరచేతులలో నాలుగు రేఖలున్నవాడు .96అంగుళాల ఎత్తు,బాహువులు ,మోకాళ్ళు ,తొడలు ,చెక్కిళ్ళు సమానంగా ఉన్నవాడు .సమానమైన 14 జతల అవయవాలున్నవాడు .కోర దంతాలు నాలుగు. సింహం ,పులి ,ఏనుగు వృషభం వంటి నడక ఉన్నవాడు. దొండపండు వంటి పెదవులు ,బలమైన చెక్కిళ్ళు ,పొడవైన ఎత్తైన ముక్కు కలవాడు .కేశ నేత్ర ,దంత చర్మ పాద తలాలలో నిగనిగలున్నవాడు .పొడవైన వెన్నెముక ,శరీరం ,వ్రేళ్ళు ,చేతులు ముక్కు కళ్ళు చెవులు ప్రజనం ఉన్నవాడు
‘’పద్మాకృతి ముఖం కళ్ళు ,నోరు ,నాలుక ,పెదవులు ,దౌడలు స్తనాలు గోళ్ళు చేతులు పాదాలు అనే పది అవయవాలు ,రొమ్ము తల నుదురు మెడ భుజాలు మూపు ,బొద్దు ,ప్రక్కలు వీపు స్వరం అనే పది విశాల అవయవాలవాడు .తేజస్సు ,యశస్సు ,సంపద ,మూడు వ్యాపించిన వాడు .పరిశుద్ధ మాతా,పితృ వంశాలున్నవాడు .పూర్వాహ్ణ మధ్యాహ్న ,అపరాహ్న కాలాలలో ధర్మార్ధ కామాలు ఆచరించే వాడు .సత్య ధర్మాలు ఆసక్తిగా ఆచరిస్తాడు .ఆర్జించిన ధనాన్ని యోగ్యులకు ఇచ్చేవాడు .దేశాకాలాలను ఎరిగి ప్రవర్తిస్తాడు .అందరికి ఆనందం కలిగిస్తాడు .రాముని తమ్ముడు లక్ష్మణుడు ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డ .పరాజయం లేని వాడు .అనురాగ రూప గుణాలలో అన్నరామునికి సమానమైన వాడు .వీరిద్దరూ నిన్ను వెతుకుతూ మమ్మల్ని కలుసుకొన్నారు .కిష్కింధ వానర రాజు అన్న వాలివలన రాజ్యం కోల్పోయిన ప్రియ దర్శనుడైన సుగ్రీవుడు ,ఋష్యమూక పర్వతం పై ఉండగా రామలక్ష్మణులు ఆయన్ను కలుసుకొన్నారు .రాజ్యభ్రస్టు డైన సుగ్రీవుని మేము సేవిస్తాము ‘’అని
రామలక్ష్మణ సాముద్రిక లక్షణాలు ఏకరువు పెట్టి ,రాజ్యం అన్నవలన కోల్పోయిన సుగ్రీవుని సోదరులు కలిసిన విషయమూ చెప్పేశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-20-ఉయ్యూరు