సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-33
హనుమ చెబుతున్నాడు ‘’రామ లక్ష్మణులు విల్లంబులతో ఋష్యమూక పర్వత సుందర ప్రదేశాలను చూస్తూ ఉండగా సుగ్రీవుడు భయపడి శిఖరం పైకి పోయి ,నన్ను వారి దగ్గరకు పంపగా నేను వారిని చేరి నమస్కరింఛి సుగ్రీవుని పరిస్థితి తెలియజేయగా ,వారు సంతోషించగా వారిద్దర్నీ బుజాలపై కూర్చో పెట్టుకొని సుగ్రీవుని చేరి ,వీరి వృత్తాంతం ఆయనకు వివరంగా చెప్పగా ,వారు పరస్పరం మాట్లాడుకొని స్నేహ హస్తం చాచుకొని ఒకరి విషయాలు ఒకరికి చెప్పుకొని గుండె బరువు తీర్చుకొనగా రాముడు సుగ్రీవుని ఓదార్చగా ,రామానుజుడు మా రాజుకు రామ వృత్తాంతం చెప్పగా, సుగ్రీవుడు దుఖభాజనుడై ,తమకుదొరికిన నేను ఏరి ఇచ్చిన నీ ఆభరణాలు వారిద్దరికీ చూపగా ,చూసి రాముడు స్పృహ తప్పితెప్పరిల్లి ఒడిలో పెట్టుకొని ఏడ్చినేలపై పడి పోయాడు .లక్ష్మణుడి కూడా చూపించి మళ్ళీ సుగ్రీవుడికి ఇచ్చేశాడు .నీ వియోగ దుఖాన్ని మాన్చటానికి ఎవరి తరమూ కాలేదు .వాలిని సంహరిస్తానని రాముడు ,నిన్ను వెదికిస్తానని సుగ్రీవుడు శపథం చేశారు .తర్వాత కిష్కింధకు వచ్చి వాలిని రాముడు చంపి ,సుగ్రీవుని కి రాజ్యం అప్పగించాడు .నేను వారిద్దరూ పంపిన దూతను .అన్నమాటప్రకారం సమస్త వానర సైన్యాన్ని నాలుగు దిక్కులు వెతకమని సుగ్రీవుడు ఆజ్ఞాపించి పంపాడు .వాలి కొడుకు అంగదుడు ,మూడవ వంతు సైన్యం తో మేము భూమిపై వెతుకుతూ వింధ్య పర్వతగుహ చేరి బయట పడే మార్గం తెలీక కొన్ని రోజులు ఉండిపోయాం .తర్వాత బయటపడి మళ్ళీ అన్వేషణ సాగించి నువ్వుకనపడకపోయే సరికి ప్రాయోప వేశం చేదామని అనుకోగా అంగదుడు బాగా బాధపడగా అందరం మరణమే శరణ్యం అనుకోగా మా పాలి దైవంలా జటాయువు అన్న సంపాతి మా బాధ చూసి అక్కడికి వచ్చి తన తమ్ముడి మరణ వార్త విని,ఎవరు రుచంపారని అడిగితే ,రావణుడు అని చెప్పగా దుఃఖించి అరుణపుత్రుడైన సంపాతి నిన్ను రావణుడు లంకకు తీసుకొని వెళ్ళాడని చెప్పాడు .ఇక ఆలస్యం చేయకుండా మళ్ళీ బయల్దేరాం .
అందరం సముద్ర తీరం చేరి భయపడగా ,వారి భయాన్ని పోగొట్టి నూరు యోజనాలు యెగిరి వచ్చి లంకలో ప్రవేశించాను .జరిగింది అంతా పూస గుచ్చినట్లు చెప్పాను. నేను నిజంగా రామదూత హనుమాన్ నే .రామ లక్ష్మణులు క్షేమం .అనుక్షణం రాముడు నిన్నే తలుస్తాడు .సుగ్రీవాజ్ఞ తో నేనొక్కడినే ఇక్కడికి వచ్చాను .నా భాగ్య వశం తో నిన్ను చూడగలిగాను .రామసోదరులు సుగ్రీవ సైన్యంతో త్వరలో ఇక్కడికి వచ్చి రావణ సంహారం చేస్తారు –
‘’రాఘవశ్చ మహావీర్యః క్షిప్రం త్వా మభి పత్స్యతే-సమిత్ర బాంధవం హత్వా రావణం రాక్షసాధిపం .
.ఉత్తమపర్వత౦ మాల్యవంతం పై నా తండ్రి కేసరి అనే వానర శ్రేష్టుడు దేవతల ఆజ్ఞచేత గోకర్ణం వెళ్లి ,అక్కడ శ౦బసాదుడు అనే రాక్షసుని చంపాడు .ఆ కేసరికి ,అంజనాదేవికి వాయుదేవుని వరంతో జన్మించిన వాడను హనుమను ,వాయు సుతుడను నేను-
‘’మాల్యవాన్నామ వైదేహీ గిరీ ణా ముత్తమో గిరిః-తతోభ్యగచ్ఛద్గోకర్ణం పర్వతం కేసరే హరిః
‘’హతే సురే శంయతి శంబ సాదనే –కపి ప్రవీరేణ మహర్షి చోదనాత్ –తతోస్మి వాయు ప్రభవో హాయ్ మైథిలి-ప్రభావత సత్ప్రతి మశ్చవానరః ‘’
‘’అని సవిస్తరంగా చెప్పగా సీత శోకం పోయి రాహువు వదలిన చంద్రునిలా ప్రకాశించింది .హమ్మయ్య ఇప్పుడు సీతకు వానరుడు రావణుడు కాదు నిజమైన కపి వరుడే అనే నమ్మకం కలిగి౦ది .’’అమ్మా ! చెప్పాల్సింది అంతా చెప్పేశా ఇప్పుడు నేనేమి చేయాలో ఆనతివ్వు . నేను వాయు దేవునితో సమానమైన ప్రభావమున్నవాడిని .సందేహించకుమమ్మా జానకీ మాతా ‘’అన్నాడు అత్యంత వినయంగా అనిల తనయుడు రామభక్త హనుమాన్ .
ఇది 89శ్లోకాల 35వ సర్గ .
సీతకు మొత్తం సీను అంతా అర్ధమైంది .బైస్కోపులో చూపించినట్లు చెప్పాడు కదా .తానేమీ తక్కువ వాడిని కానూ అనీ చెప్పాడు .పంచభూతాలలో భూదేవి సుత సీత అయితే, మరో భూతం వాయువు సుతుడు హనుమ . అంతటి పరాక్రమ వంతుడు. పవిత్ర మాల్య పర్వతం తండ్రి ఆవాస భూమి .కనుక తనపుట్టుక ఉన్నతమైందే .సీత సహనం భూదేవి సహనం అయితే హనుమ పరాక్రమం ఎదురు లేని జంఝా మారుతం .కనుక ధైర్య సాహసాలకు కొదవలేదు .అందుకే ఇంతకష్టసాధ్యమైన పని చేసి లంకలోకి సముద్రం లంఘించి వచ్చి ప్రవేశించాడు .ఇప్పటిదాకా తనకు తప్ప ఎవరికీ కనిపించని నేర్పుతో ప్రవర్తించాడు .రామ సుగ్రీవాజ్ఞ ఔదల దాల్చి వచ్చి సఫల మనో రధుడయ్యాడు సీతామాత దివ్య దర్శనం తో .ఇక కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్నట్లు రామ సోదరులు రావటం ,లంకకు చేటు కలిగించటం తధ్యం అని సీత గట్టిగా నమ్మి సందేహాలన్నీ తీరి ఇక అతనితో మనసు విప్పి మాట్లాడుతుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-5-20-ఉయ్యూరు