సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-35
హనుమ మాటలకు సీత ‘’రాముడు నా వియోగానికి దుఖిస్తున్నాడని నువ్వు చెప్పిన మాటలు విషం కలిపిన అమృతం లాగా ఉంది .బాగా- ఐశ్వర్యం కలిగినా ,భరించరాని కష్టం వచ్చినా మనిషి స్వతంత్రుడు కాలేడు,దైవం వాడిని తాళ్ళతో కట్టినట్లు ఈడ్చుకు పోతుంది.దైవం నివారింప శక్యం కానిది .కనుకనే నేనూ రాముడూ ఆపదలలో చిక్కాం –
‘’ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే-రజ్జ్వేవ పురుషం బద్ధ్వా కృతాన్తః పరి కర్షతి ‘’
‘’విదిర్నూన మసంహార్యః ప్రాణినాం ప్లవగోత్తమ -సౌమిత్రిం మాం చ రామంచ వ్యసనైః పశ్య మోహితాన్ ‘’ఇచ్చిన గడువు ఏడాది మాత్రమె ఎపుడు రాముడు వస్తాడో నన్ను ఎప్పుడు తీసుకు వెడతాడో .ఇప్పుడు పదో నెల గడుస్తోంది .ఈపాటికే నన్ను చంపేసేవాడు క్రూర రావణుడు .తమ్ముడు విభీషణుడు నన్ను విడిపించి రామునికి నన్ను సమర్పించమని హితవు చెప్పాడు .వాడు వినలేదు .వాడి వాలకం చూస్తె వాడు మృత్యువుకు ఎర అయ్యేట్లు కనిపిస్తోంది ‘
విభీషణుడిపెద్దకూతురు’’ అనల ‘’ తల్లి పంపగా నాదగ్గరకు వచ్చి పై విషయం చెప్పింది
‘’జ్యేష్టా కన్యా నలా నామ విభీషణ సుతా కపే-తయా మమేద మాఖ్యా త౦ మాత్రా ప్రహితయాస్వయం ‘’
నా అంతరాత్మ పరిశుద్ధమైనది .రాముడు తప్పక వస్తాడు అని చెబుతోంది .రాముడు లోకో త్తరకార్య నిర్వాహ దక్షుడు దానికి తగ్గ పౌరుష ,బల ,క్షమ,శౌర్య ధైర్యయుక్తి గుణ విశేషాలు
విశిష్టంగా ఉన్నవాడు –
‘’ఉత్సాహః పౌరుషం సత్వ మానృశంస్యం కృతజ్ఞతా –విక్రమశ్చప్రభావశ్చ సంతి వానర రాఘవే ‘జనస్థానం లో తమ్ముడు తోడు లేకుండానే రాముడొక్కడే 14వేల రాక్షసులను సంహరించాడు .అలాంటి మహా వీరునితో పగ పెట్టుకొని బట్టకట్ట కలిగే వాడు ఎవడు ఉంటాడు ?-‘’అంటూ చాలా ఎమోషనల్ గా ,ఎక్కువగా మాట్లాడుతున్న సీతను చూసి హనుమ మళ్ళీ అనునయించటం మొదలుపెట్టాడు –
‘’జనస్థానే వినాభ్రాత్రా శత్రుః కస్తస్య నో ద్విజేత్ –న స శక్యస్తు లయితుం వ్యసనైః పురుషర్షభః ‘’
‘’ఇతి సంజల్ప మానాంతాం రామార్ధే శోక కర్శితాం –అశ్రు సంపూర్ణ నయనా మువాచ వచనం కపిః’’
‘’అమ్మా నేను వెళ్లి నీ విషయం చెప్పగానే వానర భల్లూక సైన్యాలతో రాముడు వెంటనే బ,యల్దేరి వస్తాడు .ఒక వేళ,రాడనీ కానీ ,గడువు దాటాక వస్తాడేమో అనే అనుమానం నీకు ఉంటె ‘నువ్వు నా వీపు మీద కూర్చో .వెంటనే సముద్రం దాటి రాముడి దగ్గరకు చేరుస్తాని .నువ్వే కాదు సకల లంకా రాజ్యాన్నీ రావణుడితో సహా మోసుకు వెళ్ళే శక్తి సామర్ధ్యాలున్న వాడిని నమ్ము .హోమ ద్రవ్యాన్ని అగ్ని ఇంద్రునికి చేర వేసేట్లుగా నేను నిన్ను రాముడికి సమర్పిస్తాను .సందేహించక నా వీపు ఎక్కి మహా సముద్రం దాటి వేద్దాం .నా వెంటబడి వచ్చి నన్ను ఆపగల మొనగాడు ఇక్కడ లేడు .ఇక్కడికి యెంత సునాయాసంగా వచ్చానో అంతే తేలికగా నిన్ను తీసుకుపోగలను ‘’అని సందేహ నివృత్తి చేసి ,పరిష్కార మార్గం సూచి౦చ గానే సీతాదేవి పులకిత గాత్రియై ,’’వానరా ! నువ్వు నన్ను చాలా దూరం మోసుకు తీసుకు పోదామని భావిస్తున్నావు .ఇందులో నీ బుద్ధి సూక్ష్మత కంటే ‘’కపిత్వం ‘’ఎక్కువగా ఉన్నది .నీది చిన్న శరీరం ,దానితో ఇంతపెద్ద నన్ను ఎలా మోసుకు పోవాలను కొంటున్నావయ్యా పిచ్చి కపీ .’’అనగానే గురుడికి బల్బు వెలిగి ఇంతటి అవమానపు మాట ఇదివరకు ఎవరూ అనలేదని ,అదొక కొత్త పరాభవంగా భావించాడు .అప్పటిదాకా ‘’ప్లవగోత్తమ ‘’అని గౌరవించిన సీత అమాంతంగా’’ కపీ’’ అనటం గుండెకు బల్లెం గుచ్చుకున్నంత బాధ కలిగించింది .ఆమెకు నమ్మకం కలిగించాలి .లేకపోతె మొదటికే మోస౦ కలిగింది .వెంటనే తన శరీరాన్ని పెంచటం ప్రారంభించాడు .అది మేరు పర్వతం మందర పర్వతం అంతపెరిగి ప్రజ్వరిల్లే అగ్నిలాగా ప్రకాశిస్తూ వామనుడు త్రివిక్రముడైనట్లు కనిపించాడు .-ఒకసారి హనుమ విశ్వ రూపాన్ని దర్శిద్దాం మనం కూడా –
‘’మేరు మందార బభౌ దీప్తానల ప్తభః –అగ్రతో వ్యవతస్ధే చ సీతాయా వానరోత్తమః ‘’
‘’హరిః పర్వతసంకాశ స్తామ్ర వక్త్రో మహాబలః –వజ్ర దంష్ట్ర నఖో భీమో వైదేహీ మిద మబ్రవీత్
‘’చూశావా అమ్మా నా విశ్వ రూపం .వనాలు పర్వతాలు కోటలు ,ప్రాకారాలు ,పురద్వారాలతో ఉన్న ఈ లంకను ,రావణుడి తో సహా ఎత్తుకొని తీసుకుపోయే సామర్ధ్యం నాది .ఇక ఊగిసలాట అనుమానం వదిలి స్థిర బుద్ధితో నేను చెప్పినట్లు చేసి శీఘ్రంగా రామ దర్శనం చేసుకో ‘’అన్నాడు .
ఇంతింతై వటుడింతయై అని వామనుడు పెరిగినట్లు పెరిగిన మహా భక్త చింతామణి హనుమ విశ్వరూపిగా పెరగటం చూసి సీత సంభ్రమ ఆశ్చర్యాలతో ‘’మహా కపీ ! నీ ధైర్య శౌర్య పరాక్రమ వాయు వేగాల అగ్ని సదృశ అద్భుత తేజస్సు తెలుసుకొన్నాను .కనుకనే సముద్రం దాటి రాగలిగావు .నన్ను మోసుకొని సముద్రం దాటే శక్తి నీకుంది అని నాకు అర్ధమైంది .కానీ అంతా మంచే జరుగుతుందని అనుకోరాదు కీడెంచి మేలు ఎంచమన్నారు .నీ వాయు వేగానికి తట్టుకొనే సామర్ధ్యం నాకు లేదు. తెలివి తప్పి జారి పడిపోవచ్చు.అప్పుడు సముద్ర తిమింగిలాలు మొసళ్ళు నన్ను తినేయచ్చు .రక్షించాల్సిన వ్యక్తీ మరొకడున్నప్పుడు నీకుఆపద రావచ్చు .రాక్షసులు చూస్తె రావణ ఆజ్ఞతో నిన్ను వెంటాడుతారు .నన్ను మోసుకొని పోతూ ఆకాశం లో ఆయుదాలులేకుండా వాళ్ళతో ఎలా పోరాడగలవు ?నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తుంటే భయపడి నీ వీపునుంచి జారి నేలమీద పడిపోతానేమో అప్పుడు రాక్షసులు నన్ను తీసుకు పోవచ్చు .నీ బలపరాక్రమాలు నాకు తెలిసినా జయాప యాలు దైవా ధీనాలు కదా .కనుక ఎటు చూసినా నన్ను తీసుకు పోయే నీ ప్రయత్నం వృధా అవుతుంది .నువ్వు సర్వ రాక్షస సంహారం చేయగల సమర్దుడవే అనుమానం లేదు .కాని నువ్వు రామ దూతవు .రాముడు చేయాల్సిన సంహార కార్యం నువ్వు చేస్తే రాముని కీర్తి మసక బారు తుంది కదా .లేకపోతె నీ భయంతో నన్ను రాక్షసులు ఇంకో చోట దాచి పెట్టవచ్చు .నేనెక్కడ ఉన్నానో ఎవరికీ తెలియకపోవచ్చు .కనుక ఇలా చూసినా నీ ఆలోచన సత్ఫలితమివ్వదు.నాపతి దేవుడు నీతో లంకకు రావటమే సర్వ విధాలా ఉత్తమం ,నా బ్రతుకుపైనే రామసోదరుల సుగ్రీవాదుల వంశ క్షేమం ఆధార పడి ఉంది .
నాకు ప్రాణాపాయం కలిగితే రామ సోదరులకు నా ఆశ లేక కృశించి వానర భల్లూకాలతో సహా ప్రాణాలు విడుస్తారు .నీ మనసులో ఒక సందేహం ఉండి ఉండచ్చు .నువ్వు పరపురుడివి కదా నిన్ను తాకుతూ నేను కూర్చోవాలికదా మరి అలాంటప్పుడు రావణుడు ఎత్తుకొచ్చినప్పుడు అతని స్పర్శ తగలలేదా అను కోవచ్చు నువ్వు .నాపతి శరీరం తప్ప వేరొక పురుషుని శరీరం నేను తాకను తాకలేదు కూడా .రావణుడు బలాత్కారంగా నన్ను జనస్థాన౦ నుంచి ఎత్తుకొచ్చినప్పుడు నేను ఆశక్తురాలను నా భర్త దగ్గర లేడు.దుఃఖ పరవశత్వంతో నాకు శరీర స్పృహ లేనేలేదు . నేనేమీ చేయలేని స్థితి .
‘’భర్తు ర్భక్తిం పురస్కృత్య రామా దన్యస్య వానర –న స్ప్రుశ్యామి శరీరం తు పుమ్సో వానర పుంగవ’’
‘’ యదహం గాత్ర సంస్పర్శ్య౦ రావణస్య బలాద్గతా-అనీశా కిం కరిష్యామి వినాథా వివశా సతీ .రాముడే రావాలి ఆయనే లంకరాజునుచంపాలి .రామ సోదరులకు ఎదురు నిలిచే వారు లేరు .కనుక నాయనా హనూ! .రామ లక్ష్మణ సుగ్రీవ కపి భల్లూక సైన్యంతో నువ్వు కూడా కలిసి త్వరలో రండి .నా శోకాన్నితీర్చండి .’’అని విస్పష్టంగా సందేహ రహితం గా సీతాదేవి హనుమకు చెప్పింది .
‘’సమే హరి శ్రేష్టసలక్ష్మణ౦ పతిం –సయూధపం క్షిప్ర మిహోప పాదయ –చిరాయ రామం ప్రతి శోక కర్శితాం –కురుష్వ మాంవానర ముఖ్య హర్షితాం ‘’
ఇది 66 శ్లోకాల 37వ సర్గ
ఇందులో హనుమ బలపరాక్రమ విశ్వ రూప ప్రదర్శనకు ముందు సీత తడిని అనేక సార్లు ‘’కపి ‘’అనే పిలిచింది .చిన్న కోతితనను మోసుకు పోవటం ఏమిటి అని ఎద్దేవాచేయటమే కాదు అతని చపలత్వ కోతి ఆలోచనలనూ నిర్మొహమాటంగా చెప్పింది .హనుమ విశ్వరూపం చూశాక పూర్తి నమ్మకం కలిగి అతడిని వానర శ్రేస్టా,మహా కపీ ,కపి సత్తమ ,హరి శ్రేష్టఅని అత్యంత గౌరవంగా సంబోధించింది .హరి ఎలా విశ్వ రూపం ప్రదర్శించాడో ఈ హరి అంటే కపి వానరుడు కూడా విశ్వరూపం చూపించాడు .భగవంతుడికి భక్తుడికి భేదం లేదనీ తెలియ జేశాడు .వాల్మీకి మహర్షికూడా కపికి సాఫ్ట్ కార్నర్ గా సంబోధనలు మార్చాడు .
తాను వివశనై ఉన్నానుకనుక రావణుడు ఎలా తెచ్చాడో తనను అని చెప్పిహనుమ సందేహం తీర్చి౦ది .’’ఎగిరిపోతే ఎంత బాగుంటుందో’’అను కొంటె సీత జీవితం కొల్లేరే .అక్కడే సంయమనం బుద్ధి లోకజ్ఞత ప్రదర్శించింది .వీపు మీద మోసుకు పొతే వచ్చే ప్రమాదాలన్నీ నీళ్ళలో పడితే జలచరాలకు ఆహారం అవటం భూమిమీదపడితే మళ్ళీ రాక్షుల పాలుకావటం ఈసారి మరింత కనపడరాని చోటు లో దాస్తే కనుక్కోవటం ఎవరికీ తెలియదనే వాస్తవం చెప్పింది .అయినా నువ్వెవడివి’’ కోన్ కిస్కా’’?మా ఆయనే రావాలి ఆయనే నన్ను రక్షించి రావణ సంహారం చేయాలి .ఆయనకు దక్కాల్సిన కీర్తి వేరొకరికి దక్కరాదు అనే మనో నిశ్చయం వస్తాడనే పూర్తినమ్మకం తెలిపింది .అంతటి పరాక్రమ వంతుడు హనుమ సాయంగా ఉంటె రామకార్యం సఫలమే కాని విఫలం కాదు అని భావించింది .ఆమె దుఖం త్వరలో తీర్చటానికి హనుమ చెప్పిన సూక్ష్మలో మోక్షం సూచన బానే ఉన్నా దానిలో ఉన్న ఇబ్బందులు ఆలోచించలేని ఆవేశ పరత్వం కపిత్వం మరోమారు మనకు కనిపిస్తుంది .ఆవేశం కన్నా ఆలోచన మిన్న అనే సత్యం సీత వాక్కులలో ప్రతిధ్వనిస్తోంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-5-20-ఉయ్యూరు