ఎవరీ దాల్భ్యుడు?
పౌరాణిక మహా భక్తశిఖామణులలో ముఖ్యులను నిత్యం స్మరించి తరించమని మనవారు ఒక శ్లోకం చెప్పారు .
శ్లో. ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్
రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్
“పుణ్యా”నిమాం “పరమభాగావతాన్” స్మరామి
ఈశ్లోకం బట్టీ పడతాం చదువుతాం చేతులెత్తి వారికి నమస్కరిస్తాం .నిన్న ఎందుకో పై శ్లోకం నాకు స్పురణకు వచ్చింది .చటుక్కున ఇందులో అందరు మహానుభావులూ, తెలిసినవారే మరి దాల్భ్యుడు గురించిన చరిత్ర తెలియ లేదే అనే ప్రశ్న బయల్దేరింది .నాకే కాదు చాలామందికి తెలిసి ఉండక పోవచ్చు అని పించి ,ఆయనకోసం దుర్భిణీ వేసి వెదకటం ప్రారంభిస్తే ఎడారిలో ఒయాసీస్ లాగా కొద్ది సమాచారం లభించింది .దీనినే అందరికీ పంచుదాం అని పించి తెలియ జేస్తున్నాను .ఇంతకంటే అదనపు సమాచారం ఉంటే తెలియ జేసి సమగ్రం చేయండి .
చాలాకాలం క్రితం నైమిశారణ్య మహర్షులు ఒక హోమం నిర్వ హించటానికి పూనుకొని ధృతరాష్ట్ర మహా రాజు దగ్గరకు వెళ్లి కొంత ధనం కోరారు .ఈ మహర్షులకు నాయకుడు దాల్భ్యుడుఅనే మహా తపస్సంపన్నుడైన మహర్షి .ఈయననే ‘’బక ‘’అంటారు .ఈయనే రాజును డబ్బు అడిగింది .రాజు డబ్బు ఇవ్వకపోవటమే కాదు ,ఆయన్ను అవమానించాడు కూడా .ఈ పరాభవాన్ని సహించలేక దాల్భ్యమహర్షి ప్రతీకారం చేయాలని భావించి హోమం తలపెట్టి చేసి అందులో హవిస్సుగా ధృత రాష్ట్ర సామ్రాజ్యాన్ని అగ్నికి సమర్పించాడు .ఈ యాగాన్ని ‘’పృధూదక’’లో ‘’అవికీర్ణ మహా తీర్ధం ‘’లో చేశాడు .దీనితో ధృత రాష్ట్ర సామ్రాజ్యం పతనం చెందటం ప్రారంభించింది .మంత్రి ,పురోహిత,కార్తాంతిక ముఖ్యులను సంప్రదించి ఇలా జరగటానికి కారణం విచారించాడు .వారందరూ దీనికి కారణం దాల్భ్యుని హోమం అని ముక్తకంఠంగా చెప్పారు .కంగారు పడ్డ మహారాజు అంతులేని ధనరాసులతో పరివార సమేతంగా దాల్భ్యుడు హోమం చేసిన ‘’అవకీర్ణ మహా తీర్థానికి ‘’వెళ్ళాడు.తాను తెచ్చిన సంపద అంతా దాల్భ్యమహర్షి పాదాల చెంత ఉంచి, తప్పు మన్నించమని వేడుకొన్నాడు .ఉదార హృదయం తో రాజు తప్పు మన్నించి, దాల్భ్యుడు మళ్ళీ హోమం నిర్వహించి అందులో హవిస్సుగా పాలు ,తేనె, సమర్పించగా ,సామ్రాజ్యంలో చనిపోయినవారంతా పునరుజ్జీవితులయ్యారు అని వామన పురాణ0లోని 39 వ అధ్యాయం లో ఉంది .అంతటి శక్తి సంపన్నుడు దాల్భ్యమహర్షి .
మహా భారతం లో సభాపర్వం 4వ అధ్యాయం ,11వ శ్లోకం లో యుధిస్టిరుని కొలువులో దాల్భ్యమహర్షి ఉన్నట్లు తెలుస్తోంది .మరొక చోట సత్యవంతుని తండ్రి ద్యుమత్సేనుని దాల్భ్యుడు సందర్శించి సత్యవంతుడు చిరాయువు కలిగి ఉంటాడని ఆశీర్వ దించినట్లు వనపర్వం 298అధ్యాయం 17వ శ్లోకం లో ఉన్నది.
దల్భుని కుమారుడు దాల్భ్యుడు .దార్భ్య అనీ అంటారు .దండ్రి నుంచి వచ్చిన పేరు .పంచ వింశ బ్రాహ్మణం లో కేశి అనీ ,ఛాందోగ్య ఉపనిషత్,జైమినీయ ఉపనిషత్ బ్రాహ్మణంలో చైకితాయన అనీ ,ఛాందోగ్య కథక సంహితలో ‘’వాక లేక బక ‘’గా పిలువబడినాడు .
దాల్భ్య మహర్షి 160శ్లోకాల ‘’శ్రీ విష్ణు రపామార్జన స్తోత్రం ‘’రాశాడు.అపామార్జన అంటే శుద్ధి చేయటం ,పాపాలు తొలగించటం అని అర్ధం . .ఇందులో దాల్భ్య ,పులస్య సంవాదం ఉంటుంది –మొదటిశ్లోకం –
‘’భగవన్ప్రాణినః సర్వేవిషరోగాద్యుపద్రవైః –దుస్టగ్రహోప ఘాతశ్చసర్వకాల ముప ద్రుతాః’’
చివరి శ్లోకం –
‘’ధన్యో యశస్వీ శత్రుఘ్నః స్తవోయం ముని సత్తమ –పఠతాం,శృణుతాం చైవ దదాతి పరమాం గతిం’’
‘’ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ,విష్ణు రహస్యే ,పులస్త్య దాల్భ్య సంవాదే –శ్రీ విష్ణో రపామార్జన స్తోత్రం సంపూర్ణం ‘
‘’ భక్త మాల’’ గ్రంథం లో విప్ర వరుడైన దాల్భ్యుడు దత్తాత్రేయ మహర్షి ఉపదేశం తో సీతారాముల భజన స్తోత్రం అత్యంత భక్తీ శ్రద్ధలతో ఆర్తిగా చేశాడు .ప్రీతి చెందిన శ్రీరామ ప్రభువు దర్శనం అనుగ్రహించాడు .శ్రీహరి ఆశీస్సులు పొంది దైహిక ,దైవిక ,భౌతిక తాపాలు తొలగించుకొని ,సర్వ కార్య సిద్ధుడు అయ్యాడు .బహుశా ఈ మహాభక్త దాల్భ్యుడే మన భక్త శిఖామణుల శ్లోకం లో స్థానం సంపాదించి ఉంటాడు.
నేను 23-6-14న రాసిన ‘’బ్రాహ్మణాలలో రాజులు’’ వ్యాసం ప్రకారం –
‘’ వ్రతర్దనుడు అనే రాజు యజ్ఞ విధానాన్నిగురించి యాజకులతో చర్చించి నట్లు కౌశీతకీ బ్రాహ్మణం లో ఉంది .ప్రవాహ జైవాలి అనే పాంచాల రాజు శ్వేత కేతువు కు సమకాలికుడు .ప్రవాహ జైవాలి, శీలా కశా వత్యుడు ,చైకితాన దాల్భ్యుడు అనే ఇద్దరు క్షత్రియులతో వాదం చేసినట్లు ఛాందోగ్యం చెబుతోంది .దాల్భ్యుని సోదరులు ‘’బక దాల్భ్యుడు’’ జైమినీయ బ్రాహ్మణం ,చాన్దోగ్యాలలోను కేశి దాల్భ్యుడు కౌశీతకి బ్రాహ్మణం లోను కనిపిస్తారు.ఈ ముగ్గురి తల్లి ఉచ్చైశ్ర వసుడు అనే కౌరవ రాజు సోదరి .తండ్రి శతానీకుడు .వీరందరి ప్రసక్తి జైమినీయ బ్రాహ్మణం లో ఉన్నది .
ద్రుపద మహా రాజు కూడా యాగ చర్చ చేసినట్లు అతని బిరుదు ‘’యాజ్ఞ సేనుడు ‘’’ద్వారాను ,అతనికుమారు లైన ‘’సుత్వా యాజ్ఞ సేనుడు ‘’,శిఖండి యాజ్ఞ సేనుడు ‘’ద్వారా తెలుస్తోంది .ద్రౌపదికి యాజ్ఞ సేన అనే బిరుదున్న సంగతి తెలిసిందే .వీరంతా యాగ తత్వజ్ఞులే ,కేశి దాల్భ్యుని సమకాలికులే.’’
ముసలితనం వచ్చి యాదవవంశం నశిస్తుంది. శ్రీకృష్ణుడు అవతారం చాలించగా.. అష్టమహిషులు అగ్ని ప్రవేశం చేశారు. అర్జునుడు పదహారువేలమందిని తీసుకుని హస్తినాపురానికి వెళుతుండగా.. చోరులు అతనికి ఓడించి ఆ స్త్రీలను అపహరిస్తారు. దాల్బ్యుడు, ఆ స్త్రీలు వున్న చోటుకి రాగా వారు అతనిని చూసి.. ‘‘స్వామీ! మేము శ్రీకృష్ణుని భార్యలమయి అంత బతుకు బతికినా.. మాకు ఈ చోరుల చేతిలో పరాభవం కలగడానికి కారణమేంటి’’ అని అడుగుతారు.
అప్పుడు ఆ ముని.. ‘‘కాంతలారా! పూర్వం మీరు వైశ్వానరుని పుత్రికలు. యవ్వనమదంతో వుండి, ఒకసారి జలక్రీడలు ఆడుతుండగా.. అటువైపు వచ్చిన ఒక నారదునిని ఆపి ‘‘మేము నారాయణునికి భార్యలము కావాలని కోరుకుంటున్నాము. దానిని ఉపాయం చెప్పు’’ అని అన్నారు. వినయవిధేయతలు లేని మీ అందరినీ చూసి, ఆ నారదుడు కోపంతో తన మనసులో ఇలా అనుకుంటాడు.. ‘‘చైత్రవైశాఖ మాసంలో శుద్ధ ద్వాదశీ దినంలో వ్రతం ఆచరించి, బంగారు పరికరంతో రెండు శయ్యలను విప్రులకు దానమిస్తే.. మీరు రాబోయే 28వ మహాయుగంలో శ్రీకృష్ణునికి భార్యలు అవుతారు. మీ మర్యాదలేని ప్రవర్తన వల్ల వేశ్యలవుతారు’’ అని పలికి వెళ్లిపోయాడు.
అలా ఆ విధంగా నారదుడు చెప్పిన విధంగా, రెండు శాపాలతో మీరు చోరుల చేతిలో పడి వేశ్యాత్వం పొందారు. ఇప్పుడైనా మీ ఇళ్లకు వచ్చే విటులని శ్రీహరి రూపంగా భావించి, వేశ్యాధర్మాన్ని పాలించి, తరించండి’’ అని దాల్భ్యుడు బోధించగా.. శ్రీకృష్ణుని భార్యలు వేరే గతిలేక వేశ్యలుగానే బ్రతికి, తమ దేహాలు చాలించి ముక్తి పొం
ఇంతటి అద్భుత విషయ చరిత్ర ఉన్న దాల్భ్య మహర్షిని మనం పట్టించు కోకపోవటం మన తప్పిదమేకాదా –
దాల్భ్య మహర్షి సూక్తి
సమాధిలో గోచరించు దసవిధినామములకు భ్రమింపకుము
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-20-ఉయ్యూరు .