సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-36
హనుమ మనసు సంతృప్తి చెంది సీతతో ‘’అమ్మా నిన్ను చూస్తేనే శుభాలు కలుగుతాయి. స్త్రీ స్వభావ భయాలకు ,పతివ్రతా లక్షణాలకు తగినట్లు గా మాట్లాడావు .వీపుమీదఎక్కి నూరు యోజనాల సముద్ర౦ దాటటం స్త్రీలకు శక్తికి మించిన పనే .రాముడిని తప్ప పర పురుషుని తాకను అని నువ్వు చెప్పిన మాట నీకే తగినది .నేను చూసిన నీ రామ విరహం ,రావణుని బెదిరింపు , నీ తృణీకారం నీ ఆత్మహత్యా ప్రయత్నం అన్నీ రాముడికి నివేదిస్తాను .నీ అంతు లేని దుఖానికి అనేకకారణాలు స్వయంగా చూసిన నేను నాతో తీసుకు పోతాను అన్నాను కాని అన్యధా భావించ వద్దు .లంకలో ప్రవేశించటం సముద్రం దాటటం చాలా కష్టం కనుక ,నిన్ను సముద్రం దాటించే సమర్ధత నాకు ఉండటం వలన, నేను అలా మాట్లాడాను .వెంటనే నిన్ను రాముడి దగ్గరకు తీసుకు వెళ్ళాలన్న ఆలోచన రామునిపై భక్తీ,స్నేహాలవలన అలా చెప్పాను .నాతో రావటానికి ఉత్సాహం నువ్వు చూపకపోతే ,నేను ఇక్కడ నిన్ను చూశాను అని చెప్పటానికి తగిన అభిజ్ఞానం అంటే గుర్తు నాకు ప్రసాదించు ‘’అన్నాడు హనుమ .
రాముడికి ,తనకు ఏకాంతం లో జరిగిన వృత్తాంతం చెప్పబోయిన సీత బాష్పోద్రేకం తో మాటలు తడబడుతూ నెమ్మదిగా ‘’ఇప్పుడు నీకు నేను చెప్పే ఈ అభిజ్ఞానాన్ని నా రాముడికి చెప్పు.చిత్రకూటం లో ఉండగా ఒక రోజు ఆపర్వతానికి ఈశాన్యం లో మందాకినీ నదీ సమీపాన సిద్ధులు నివశించే ,కందమూలాలు, జలం పుష్కలంగా ఉన్న తాపస ఆశ్రమం లో మేము ఉండగా జరిగిన కథను నామాటలతో ‘’నాథా!ఫలపుష్పాలున్న వనం లో విహరించి అలసి చెమటతో ఉన్న నీ తొడమీద కూర్చున్నాను .అప్పుడొకకాకి మాంసా పేక్షతో వచ్చి ,నా స్తనాంతరం పొడవటం ప్రారంభించి మాటి మాటికీ పొడుస్తూ ఎక్కడో దాక్కునేది .నేను మొలత్రాడు లాగి పట్టి ,నా వస్త్రాన్ని బిగుతుగా కట్టుకొని ,ఆకాకిని పారద్రోలే ప్రయత్నం చేస్తుండగా ,నా విఫల ప్రయత్నాన్ని చూసి నువ్వు నవ్వావు .దానికి ముందు నేను సిగ్గు పడ్డా ,కాకి మళ్ళీ నన్ను గీరటానికి వస్తే ,కోపం తో తరిమేసి మళ్ళీ నీదగ్గరకొచ్చి నీ తొడపై కూర్చున్నాను .కోపించి అలసిన నన్ను నువ్వు ఊరడి౦చావు .కన్నీరు కారుస్తూ .తుడుచుకొంటూ కాకిపై కోపం చూపిస్తూ ఉన్న నన్నుచూశావు ‘’
‘’ హనుమంతా !కాకిపెట్టిన బాధ, శ్రమకు అలసి రాముడి తొడపై పడుకున్నాను .తర్వాత రాముడు కూడా నా తొడపై తలపెట్టి కొంచెంసేపు విశ్రాంతి తీసుకొన్నాడు .మళ్ళీ ఆకాకి గోల చేయటం మొదలు పెట్టి,అప్పుడే లేచిన నన్ను అది మళ్ళీమళ్ళీ స్తనా౦తర౦ గీరగా ,రక్తం కారి రాముడు తడిసిపోయాడు .అది ఏ మాత్రంభయపడక నన్ను బాధిస్తూనే ఉన్నది .భరించలేక రాముడిని నిద్ర లేపాను .స్తనాల మధ్య కాకి చేసిన గాయం చూసి నిట్టూరుస్తూ రాముడు ‘’ఎవరు ఇ౦త దారుణానికి ఒడిగట్టారు ?’’అని అడిగి నాలుగు వైపులా చూడగా రక్తసిక్తమైన గోళ్ళతో ఉన్న కాకి కనిపించింది. ఆ కాకి ఇంద్రుని కొడుకు వాయు వేగంగా పోగలవాడు భూమి మీదకు వచ్చి ఈపని చేసి అదే వేగంతో పారిపోయాడు .రామునికి తీవ్రమైన కోపం వచ్చి దాన్ని తీవ్రంగా శిక్షించాలనుకొని ,తన ఆసనం నుంచి ఒకదర్భను తీసి బ్రహ్మాస్త్రం తో మంత్రించి కాకాసురునిపై వదిలాడు.ఆదర్భాస్త్రం కాకిని వెంబడించగా భయపడి రక్షణ కోసం ని వైపులకూ అన్ని లోకాలకు పరిగెత్తగా దర్భ దాన్ని వెంబడిస్తూనేఉంది .మూడులోకాలలోని దేవతలు మహర్షులు దాని తండ్రి తల్లి బంధువులుఎవరూ రక్షణ ఇవ్వలేదు .తిరిగి తిరిగి,ఆత్మ రక్షణకోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై మళ్ళీ రాముడే దిక్కు అని శరణు వేడి పాదాలపై పడి పోయింది .దయాసిందు రాముడు ‘’నా బ్రహ్మాస్త్రం వృధా కాదు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు ‘’అని అడిగితె కాకి ‘’నా కుడి క౦టిని నీ బ్రహ్మాస్త్రం తో హింసించు ‘’అని కోరితే ఆవాయసం కుదడికంటిని బ్రహ్మాస్త్రం పోగొట్టింది .చావు తప్పి ప్రాణాలు నిలిచి కుడికంటిని పోగొట్టుకొని అ కాకి బతికి పోయింది .
‘’కాకి మీదనే బ్రహ్మాస్త్రం వేసినవాడివి ,క్రూర రావణుడిని క్షమిస్తున్నవేమిటి ?నాపై దయ చూపి త్వరగా వచ్చి వాడిని చంపి నా దుఃఖ నివారణ చేయి ‘’
‘’మత్క్రుతే కాకమాత్రేతుబ్రహ్మాస్త్రం సముదీరితం –కస్మాద్యో మాం హర త్త్వత్తః క్షమాసే త౦ మహీపతే ‘’ గుర్తు చేసిన తెలివైన స్త్రీ సీత .
మహీపతే అంటే రాజా అని సంబోధించి రక్షణ రాజధర్మం
‘‘’హనుమా ‘!గొప్ప పరాక్రమ శాలి రాముడు రాక్షసులను ఎందుకు ఉపెక్షిస్తున్నాడు నాకోసం ఆమాత్రం చెయ్యలేడా ఈ తాత్సారం దేనికి ? నేనేదో పాపం చేసి ఉంటాను .అందుకేరక్షించే సమర్ధత ఉన్నా రామ సోదరులు రాలేదు ‘’అని విలపించింది సీత .ఆమె ను ఊరడిస్తూ ‘’అక్కడ రాముడూ తమ్ముడూ దురంతా దుఖం లో ఉన్నారు వారికి నువ్వు ఇక్కడ ఉన్నట్లు తెలీదు .వారు రావటం లంక నాశనమవటం తధ్యం ‘’అన్నాడు హనుమ .మళ్ళీ సీత ‘’రాముడి క్షేమమ అడిగానానని ప్రనమిల్లానని చెప్పు .లక్ష్మణ సమేతంగా అక్కడి వారందర్నీ కుశల అడిగానని తెలుపు .ఇంకొక నెల రోజులు మాత్రమె బతికి ఉంటానుఅని గట్టిగా నా నాదునికి చెప్పు ‘’అని తన చీర కొంగున ముడి పెట్టి దాచిన చూడామణి తీసి హనుమకు ఇవ్వగా తీసుకొనిభక్తితో వ్రేలికి పెట్టుకొని ,నమస్కరిస్తూ సీత చుట్టూ ప్రదక్షణాలు చేసి మనసులో రాముడిని తలచుకొని తిరుగు ప్రయాణానికి సిద్ధపడి .పెనుగాలికి కంపించి ,ఆ గాలి తాకుడు నుంచి విముక్తమైన కొండ లాగా మనసంతా సుఖం నిండి ఉన్నాడు .
‘’మణివర ముప గృహ్య త౦ మహార్హం –జనక నృపాత్మజయా ధృతం ప్రభావాత్ –గిరిరివ పవనావధూత ముక్త –స్సుఖిత మనాఃప్రతి సంక్రమం ప్రపేదే’’.
ఇది 72 శ్లోకాల 38వ సర్గ .
ఇప్పటివరకు రాముడు ఇచ్చిన ఉంగరం అంటే అంగుళీయకం సీత కు హనుమ ఇవ్వటం హనుమ కు సీత తన చూడామణి ప్రదానం చేసి రాముడికి గుర్తుగా పంపటం జరిగింది
తెలుగు దేశం లో తక్కువే కాని తమిళదేశం లో మణి తో పెరున్నవారు చాలామంది ఉన్నారు .మణిరత్నం వగైరా ..చూడామణి చిన్నగా ఉంటుంది కదా హనుమ వ్రేలికి ఎలా తొడుక్కున్నాడు అనే అనుమానం వస్తుంది అంటే అప్పటికి తన మహోన్నత రూపు తగ్గించుకొని మామూలు వానరంగా మారి ఉంటాడని బిట్వీన్ ది లైన్స్ మనం అర్ధం చేసుకోవాలి .
హనుమ కూడా తానూ సీతతో వీపు మీద కూర్చోపెట్టుకొని సముద్రం దాటిస్తాను అన్నమాట కు క్షమాపణ చెప్పుకొన్నాడు .బుద్ధిమంతుల లక్షణం అది తొందరపడినా తర్వాత తప్పు తెలుసుకొని లెంపలు వాయిన్చుకోవాలి ఇది లోక సహజం .పర పురుషుని తాకను అని ఆమె చెప్పిన మాటకూ శిరసువంచి నమస్కరించి తన సంస్కారం తెలియజేశాడు .ఇందులో సీత రామ పరాక్రమాన్ని చాలాసార్లు తనివి తీరా వర్ణించి,తప్పక వస్తాడనే నిశ్చయానికి చేరింది
అభిజ్ఞానం గా సీత చెప్పిన కాకి వృత్తాంతంఆమె పడిన బాధ వేదన కు దృష్టాంతం .కొంత సూటిగా కొంత వేరుగా చెప్పటం లో కథగమనం కుదిరింది .ఆఫ్టరాల్ కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన భర్త తనకోసం ప్రయోగించాకపోవటం ఏమిటని నిలదీసింది .అవును అవసరం వచ్చినప్పుడు అలా కడిగి పారేస్తేనేకాని ఉపశమనం పొందటం కుదరదు .కాకి ఏక కన్ను కాకి ఎందుకయిందో మనకు తెలుస్తుంది .కుడి కన్ను బ్రహ్మాస్త్రానికి బలి అయింది .లోకం లూకేకన్నున్నవాడిని ‘’ఏకాకన్నయ్య ‘’అంటారు .రోజులు మారాయి సినిమాలో ఆ పేరుతొ ఒక కేరక్టర్ ఉంది .
కాకాసురుడు అనిలోకం లో ప్రతీతి .అంటే వాడు రాక్షసుడు .కాని సీత వాడిని ఇంద్రుని కొడుకు అన్నది .ఇంద్రుడు అదితి కొడుకు .ఈలంకే ఏమిటో తెలీదు .వదిలేద్దాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-20-ఉయ్యూరు