సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-38
వెళ్లి పోతున్న మహాత్మ హనుమాన్ తో సీతాదేవి ‘’సగం వయసు వరకు పెరిగి ,ఆతర్వాత నీళ్ళు లేక శోషించి ,దైవికంగా కురిసిన వానతో కోలుకున్న పైరులాగా ,చాలా ప్రియ వచనాలు పలికిన నిన్ను చూసి చాలా సంతోషం కలిగింది .
‘’త్వాం దృష్ట్వా ప్రియవక్తారం సంప్రహృష్యామి వానర –అర్ధ సంజాతసస్యే వ వృష్టిం ప్రాప్య వసుంధరా ‘’
చాలాసందర్భోచిత దివ్య ఉపమానం ప్రయోగించి సీతతో చెప్పించాడు మహర్షి వాల్మీకి .
‘’త్వరలో రామ దర్శనం సంఘటిల్లేట్లు చూడు .’’రామా !కాకి మీదతృణంప్రయోగించి దాని కన్ను హరించిన నువ్వు నన్ను పోయావా .మరో విషయం కూడా గుర్తుకొచ్చింది . .పూర్వం నేనునా నుదుట అలంకరించు కొన్న తిలకం గండం అనే పర్వత పార్శ్వం దగ్గర అరణ్యం లో తిరుగుతుంటే చెమటకు కరిగింది .అప్పుడు రామానువ్వు మణిశిలతో చేయబడిన తిలకాన్ని అలంకరించావు .ఈ రెండవ అభిజ్ఞానం కూడా తప్పకగుర్తుంచుకో . .
‘’మనశ్శిలాయా స్తిలకో గండపార్శ్వే నివేశితః –త్వయా ప్రణష్టే తిలకే తమ్ కిల స్మర్తు మర్హసి ‘’
మరో అభిజ్ఞాన౦ ఏదైనా ఇవ్వమని అడిగాడు హనుమ .దానికి ఆమె తానూ తలలో భద్రంగా దాచుకొన్న చూడామణి ని ఇచ్చాను దీన్ని చూసి రాముడు నీ మాటలపై విశ్వాసం తప్పక చూపిస్తాడు .’’అనగా సంతోషించి శరీరం పెంచి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే సీత మళ్ళీ ‘’
రాక్షసులమధ్య చిక్కి ఉన్న నన్ను ఎందుకు తిరస్కరిస్తున్నావు .దివ్య చూడామణిని ఇప్పటిదాకా చాలా జాగ్రత్తగా కాపాడుకొన్నాను .ఇక్కడి కష్టాలను దాన్ని చూస్తూ సహిస్తూ నిన్ను చూసిన ఆనందాన్ని దానివలన పొందుతున్నాను .శ్రీమంతమైన రత్నాకరమైన సముద్రంలో పుట్టిన దివ్య మణి అది.దాన్ని నీకు ప్రత్యర్పణం చేస్తున్నాను .ఇక శోకం తో ఎక్కువ కాలం ఉండలేను .రాక్షసబాధలు ,ములుకుల్లాంటి మాటలు దుస్సహాలుగా ఉన్నాయి.నీకోసం వీటిని సహిస్తున్నాను .శత్రునాశక రామ రాజా ! ఒక్క నెలరోజులే బతికి ఉంటాను.
‘’ధారయిష్యామి మాసం తు జీవితం శత్రు సూధనా –ఊర్ధ్వం మాసా న్న జీవిష్యే త్వయా హీనా నృపాత్మజ’’
రాజా అనటంతో రాజ ధర్మం గుర్తు చేసింది సీత .ఆర్తత్రాణ పరాయణత్వం జ్ఞప్తికి తెచ్చింది
.నాపై రావణ దృష్టి యోగ్యంగా లేదు .నువ్వు ఆలస్యం చేస్తున్నావని విని క్షణంకూడా జీవించలేను మహా ప్రభూ ‘’అన్నది .
ఆమాటలకు చలించిన హనుమకన్నీరు కారుస్తూ ‘’దేవీ !నీ వియోగదుఖం తో రాముడు అన్ని పనులకు విముఖుడుగా ఉన్నాడు .సత్యప్రమాణ౦ గా చెబుతున్నాను రాముడు దుఖిస్తే తమ్ముడూ ఏడుస్తున్నాడు .
‘’త్వచ్ఛోక విముఖో రామో దేవి సత్యేన తే శపే-రామే దుఖాభి భూతే తు లక్ష్మణఃపరి తప్యతే ‘’
ఎంతో శ్రమపడితే కాని నీ దర్శనం కాలేదు .ఇది దుఖి౦చేసమయం కాదు .ఈక్షణమే నీ దుఖం అంతమౌతుంది’’అన్నాడు మళ్ళీ ఆమె ‘’రాముడు ఎలానన్ను ఈ దుఃఖ సముద్రం దాటిస్తాడో దానికి తగినట్లుగా ఆయనతో మాట్లాడు ,నాశోకం ,రాక్షసుల బెదిరింపు వెళ్ళగానే క్షణం ఆలస్యం చేయకుండా చెప్పు .నీ ప్రయాణం సుఖమగుగాక ‘’అన్నది
‘’బ్రూయాస్తురామస్య గత స్సమీపం –శివశ్చ తే ద్వాంతుహరి ప్రవీర ‘’
సీత ఇలా పలకగానే ఆమె సందర్శనం తో తాను కృతార్ధుడ నయ్యానని ఉప్పొంగుతూ ,ఇంకా చేయాల్సిన పని కొద్దిగా మిగిలి ఉందని గ్రహించి హనుమ ఉత్తర దిశగా బయల్దేరాడు
‘’సరాజపుత్త్ర్యా ప్రతి వేదితార్ధః –కపిః కృతార్ధః పరి హృష్ట చేతాః-అల్పావ శేషం ప్రసమీక్ష్య కార్యం –దిశం హ్యుదీచీం మనసా జగామ ‘’
ఇది 24శ్లొకాల 40 వ సర్గ .
హనుమను ప్లవగోత్తమా ,హరిపున్గవం ,హరి గణోత్తమ అంటూ చాలా ప్రైజింగ్ గా సంబోధించింది .ఆయనమనసూ చల్లబడింది .మాయాబజార్ సినిమాలో ‘’అదే మన తక్షణ కర్తవ్యమ్ ‘’అని ఆర్ నాగేశ్వరరావు మాటమాటికీ అన్నట్లు సీత రాముడికి వెళ్ళిన తక్షణమే తన స్థితి తెలియబర్చమని పదే పదే చెప్పి పంపించింది .రెండు అభిజ్ఞానాలు కాదు మూడోది కూడా అంటే గండశిలపర్వత౦ దగ్గర ఆమె నుదుట మణిశిలా తిలకం అద్దటం జ్ఞాపకం చేసింది .పుణ్య స్త్రీ నుదుట క్షణకాలమైనా బొట్టు లేకపోవటం అశుభం కనుక రాముడు వెంటనే స్పందించి స్వయంగా తిలకం పెట్టాడు .అది స్త్రీకి ఎంతో శుభం సౌభాగ్యదాయకం సర్వ మంగళకరం .దాన్ని జ్ఞప్తికి తెచ్చింది అంటే తనమా౦గల్యాన్ని మళ్ళీ కాపాడే సమయం వచ్చింది అని మరోసారి గుర్తు చేసింది .ఈ మూడూ చాలక ఇంకోటి ఏదైనా ఇమ్మన్నాడుహనుమ .ఆమె అక్కర్లేదు చూడామణి చూడగానే రాముడికి కర్తవ్యం వెంటనే బోధపడుతుంది అని చెప్పింది దాన్ని ఇంతకాలం ఎంత భద్రంగా దాచుకొన్నదో వివరిస్తూ ,దాని పవిత్రతనూ,దివ్యత్వాన్నీ వివరించింది .
హనుమ వాయు మార్గాన తిరిగి వెడుతున్నాడుకనుక ‘’బాన్ వాయెజ్ ‘’కూడా చెప్పి ప్రయాణం సుఖకరం కావాలని దీవించింది.హనుమంతుడు కూడా మనలాగే ఒట్టు పెట్టాడు దేనిమీద ?సత్యం మీద. అందుకే మనకు లోకం లో ‘’సత్యప్రమాణకం’’గా అనే మాట వచ్చింది . సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-5-20-ఉయ్యూరు