సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-39
తనను విపరీతంగా అభినందించిన సీతాదేవిని విడిచి ప్రయాణానికి బయల్దేరుతూ మనసులో ‘’రావణుడి నివాసానికి సంబంధించిన పని ఇంకా కొంచెం మిగిలే ఉన్నది .’’అనుకొన్నాడు ఇంతకు ముందు సర్గలోనే ఆఅభిప్రాయం ‘’అల్పావశేషం ప్రసమీక్ష కార్యం ‘’అని మనకు అక్కడ సస్పెన్స్ కలిగించి ఇక్కడ దానికి తెర దించాడు .మనసులో ఇంకా’’రాక్షస బలాబలాలు ,రావణ హృదయం తెలుసుకోవాలి .దీనికి సామ దాన భేదోపాయాలు కుదరవు దండోపాయమే శ్రేష్టం –దండం దశగుణం భవేత్ .రాక్షసులు సామోపాయానికి లొంగరు.సమృద్ధిగా సంపదలతో ఉన్నారుకనుక దానం కూడా వారి యెడల వ్యర్ధమే .బలగర్వితులు కనుక భేదానికి లొంగిపోయే ఘటాలు కాదు .కనుక చతుర్ధ ఉపాయం పరాక్రమమమే ఉపయోగించక తప్పదు .రాక్షసులలో కొందరిని చంపితే మిగిలినవారు ఎలాగైనా కొంత మెత్తపడతారు .నిర్దేశించిన పని చెడకుండా అనేకపనులు సాధించేవారే కార్యాచరణ యోగ్యులవుతారు –
‘’కార్యే కర్మణి నిర్దిస్టే,యో బహూన్యపి సాధయేత్ –పూర్వ కార్యా విరోదేన స కార్యం కర్తు మర్హసి ‘’
ఒకేకారణం తో చిన్నపని కూడా సాదిమలేము .మహాకార్యం ఎలా సాధ్యం ?ఎవడు అనేక హేతువులతో కార్యసాధన మొదలు పెడతాడో అతడు ఆపనిని సాధించటం లో సమర్ధుడు –
‘’న హ్యేకస్సాధకో హేతుః స్వల్ప స్యాహీప కర్మణః –యోహ్యర్ధం బహుదా వేద స సమర్దోర్ద సాధనే ‘’
ఇక్కడ ఉండగానే మా యొక్క,శత్రువుల యొక్క యుద్ధ తారమ్యం తెలిసి ,బలాబల నిశ్చయం చేసి సుగ్రీవుని దగ్గరకు వెడితే నే స్వామి ఆజ్ఞ పూర్తిగా నెరవేర్చిన వాడినౌతాను .
‘’పరాత్మ సమ్మర్ధ విశేష తత్వ విత్ –తతః కృతంస్యా న్మమ భర్తృ శాసనం ‘’
‘’నాకు ఇప్పుడు రాక్షసులతో అప్రయత్నంగాయుద్ధం ఎలా జరుగుతుంది ?ఇలా యుద్ధం జరిగితేనే రావణుడికి తనబలం ,మా రామ సుగ్రీవ బలం తెలుసుకో గలడు.ఇప్పుడు నేను రావణ ,మంత్రి సహిత సేనానులను యెదిర్చి ,సీత విషయం లో అతని మనో నిశ్చయం ,వాడి బలం పూర్తిగాతెలుసుకొని మాత్రమె లంకనుంచి నిష్క్రమిస్తాను .ఇది రావణ ఉద్యానం నందనవనంలా శోభాయంగా ఉన్నది .అగ్ని ఎండుకట్టెను కాల్చినట్లు నేను ఈ వనాన్ని దహించి పాడు చేసి రావణుడికి కోపం తెప్పిస్తాను .అతడికి కోపం వచ్చి పెద్ద సైన్యం నామీదకు పంపిస్తాడు .వాళ్ళతో యుద్ధం చేసి ,నా పరాక్రమ విక్రమాలను చూపించి ఆ సైన్యాన్ని పూర్తిగా చంపి కిష్కింధకు వెడతాను ‘’అని నిశ్చయం చేసుకొన్నాడు .
తన ఊరువుల వేగం తో వనం లోని చెట్లను విరవటం మొదలుపెట్టి ,పక్షులు తీగలతో క్రిక్కిరిసిన ఆ ప్రమదా వనాన్నితుత్తునియలు చేశాడు .కాసేపట్లో ఆవనం విరిగిన చెట్లు ,కట్టలు తెగిన కొలనులు,పిండి చేయబడిన కొండలతో రోతగా కనిపించింది .లతా ,చిత్ర గృహాలు నశించి మహా సర్పాలు క్రూరమృగాలు చచ్చి ఎక్కడపడితే అక్కడ పడి.దావానలం చేత తగలబెట్టబడినట్లు , వ్యాకులం చెందిన స్త్రీలాగా ,ఉన్నాయి .సౌందర్య వనం శోభకోల్పోయి ,విహార సీమ వల్లకాడుగా మారింది .దీనివలన రావణ హృదయానికి వ్యధ కలిగించి ,మహా బలవంతులైన రాక్షసులతో తానొక్కడే యుద్ధం చేయాలని సంకల్పింఛి ,అశోకవన బహిర్ద్వారం చేరాడు హనుమ .
‘’త తస్య కృతార్ధ పతే ర్మహాకపి –ర్మహద్ద్వ్యళీకం మనసో మహాత్మనః –యుయుత్సు రేకోబహుభి ర్మహాబలైః-శ్రియా జ్వలన్ తోరణ మాస్థితః కపిః’’
మొదటిపాదం లో మహాకపి అని రెండవ పాదం లో చివర కపి అనటం లో ఉద్దేశ్యం ఏమిటి ?మొదటి దానిలో ఆయన ఆంతర్యం కనిపిస్తే ,రెండవ దానిలో ఆయన చేసినపని కపిత్వం కనిపిస్తుంది .
ఇది 21శ్లోకాల 41వ సర్గ .
ఇందులో కార్య సాధకుడు ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. అది లోకం లో అందరికీ అనుసరణీయం .కృష్ణ రాయబారం లోకూడా కృష్ణస్వామికి కౌరవులకు పా౦డవుల బలం చెప్పి ,కౌరవుల బలం స్వయం గా తెలుసుకోవటమే ధ్యేయం .దీనికి త్రేతాయుగం లో నే హనుమ మార్గ దర్శనం చేశాడని భావించవచ్చు . మొత్తం మీద’’ చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు ‘’అనే సామెత సృస్టింఛి ఇచ్చాడు మనకు హనుమ.సారీ ఆయనేమీ ఇవ్వలేదు .మనమే ఆయన పనికి దాన్ని కల్పించుకున్నాం .మంచి జరిగితే సామెత సార్ధకం .లేకపోతె పని పాడు చేశాడనే అర్ధం వస్తుంది .రెండువైపులా పదును ఉన్న సామెత ఇది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-5-20-ఉయ్యూరు