ప్రపంచ దేశాల సారస్వతం
107-చైనీస్ సాహిత్యం -2
2-కన్ఫ్యూషియస్ యుగం –క్రీ.పూ.202-క్రీ.శ .220-మిహ్ వాంగ్ టీ కాలం లో తొక్కి పడేసిన కన్ఫ్యూషియస్ రచనలను హాన్ వంశీకులు బాగా పునరుద్ధరించి నందుకు దీనికి కన్ఫ్యూషియస్ యుగం అని పేరు వచ్చింది .కొత్త రచనలుకూడా ఎక్కువగా వచ్చాయి .ఐతిహాసిక రచనలు ఎక్కువ .స్యూమా చిన్ రాసిన ‘’పీ –ఛీ ‘’అంటే ఇతిహాస రచన ముఖ్యమైనది .మొదటి నుంచి తనకాలం వరకు ఉన్న చైనాచరిత్రను 120అధ్యాయాలలో రాశాడు .దీన్ని పరమ ప్రామాణిక రచనగా గుర్తించారు .ఈయన తర్వాత 200ఏళ్ళకు పుట్టిన ‘’పాన్ ప్యావ్ ‘’అక్కడి నుంచి మొదలు పెట్టి తనకాలం వరకు రాయటం ప్రారంభించి అకాల మృత్యువు పొందటం తో మధ్యలో ఆగిపోయింది .అతడి సోదరి మేడం చావ్ సోదరుడిపేరనే రాసి పూర్తి చేసి౦ది .తర్వాత శిన్ షూ -కొత్త రచనలు పేరుతో రాజనీతి గ్రంథం,చ్యాయి ‘’హ్వాయ్ నాన్ జూ’’పేరిటతావో మతవివరణ గ్రంథం ల్యూ అన్,కన్ఫ్యూషియస్ వాదాన్నీ ,టావో మతం తో సమన్వయ పరుస్తూ చూన్ చ్యూ ఫాన్ లూ అనే గ్రంథంవచ్చాయి . తుంగ్ చుంగ్ షూ కాల్పనిక వాదం తో మంచి శైలిలో పద్యకావ్యాలు రాశాడు .స్యూమా శియంగ్ జూఇతని సమకాలికుడు .మెయ్ షెన్ రాజకుమారుల భోగలాలస జీవితాన్ని వర్ణిస్తూ కావ్యం రాశాడు .హాన్ రాజుల కాలం లోనే క్రీ.శ.120లో’’ ష్వోవెన్.’’ అనే వ్యుత్పత్తి వివరణ శబ్దార్ధ నిఘంటువు వచ్చింది .
3-బౌద్ధ టావో మతప్రభావ యుగం –క్రీశ .220-590-.220లో హాన్ సామ్రాజ్యం మూడు ముక్కలై ,265లో ఈ మూడిటినీ జయించి చీన్ వంశీయులు జయించి సామ్రాజ్యం ఏర్పాటు చేశారు .దేశం లో శాంతి భద్రతలు ఏర్పరచటంలో విఫలం చెంది 420 లో అంతరించింది .తర్వాత 590వరకు అయిదు రాజవంశాలు కొంత ప్రదేశాన్ని పాలించాయి .కొంతప్రాంతం టపా అనే టర్కీ రాజవంశ పాలనలో ,ఉండటం ఎక్కడా స్థిర ప్రభుత్వాలు లేకపోవటం వలన దేశం అల్లకల్లోలమై అంధకారం అలముకొన్నది .అప్పుడే బౌద్ధ ,టావో మతాలు ప్రజలలో ఆధ్యాత్మిక భావాన్ని ప్రసారం చేసి మనసులకు కొంత ఊరట కలిగించాయి .కుమార జీవ అనే భారతీయ బౌద్ధపండితుడు ,చిహ్ శీన్ మొదలైన చైనా పండితులు సంస్కృతం లో ఉన్న బౌద్ధగ్రంథాలను చైనీస్ భాషలోని అనువాదం చేశారు .టావ్ మతగ్రంధం’’టావ్ టే చింగ్ ‘’కు అనేక వ్యాఖ్యానాలు రాశారు .ప్రకృతి పై అనేకరకాల కవిత్వాలు అనేకకవులు రాశారు .వీరిలో టాన్ చైన్ ముఖ్యుడు .వృక్ష పుష్ప పక్షి పర్వతాదులలో జీవిత రహస్యాలను ఆవిష్కరించి న భావకుడాయన. వృక్ష ,భూ విజ్ఞాన శాస్త్ర రచనలూ వచ్చాయి .ఈ యుగం చివరలో వెన్ శ్వాన్ఒక ప్రసిద్ధ సంకలన గ్రంథం ప్రచురించాడులియాంగ్ రాజవంశానికి చెందిన శ్యావో టుంగ్-500-531.4వ శతాబ్ది వరకు ఉన్న ఉత్తమ రచనలన్నీ ఇందులో చేర్చాడు .దీన్ని కావ్య ,లేఖ ,వ్యాస మొదలైనవాటిగా వర్గీకరించాడు .
4-కావ్యోల్లసన యుగం –క్రీ.శ.590-960-దేశం లోని కల్లోలాన్ని నివారించి ‘’సూయీ ‘’వంశీయులు 590లో ఏక ఛత్రాధిపత్య పాలన జరిపారు .618లో ఈరాజవంశాన్ని కూల్చి టాంగ్ వంశీయులు పాలన సాగించారు .చక్రవర్తి టాయ్ చుంగ్-627-694లలితకళలను పోషించి ఆదరించాడు .మూడుమతాలను సమానంగ రాజపోషణ కలిగించాడు .అతని తరవాత వాళ్ళుకూడా అలాగే పాలన చేశారు .ఈకాలం లోనే చైనీయ సంస్కృతి కొరియా ,జపాన్ మొదలైన దేశాలలో వ్యాపించింది .పద్యకావ్యాలకు ఎక్కువ ఆదరణ కలిగింది .గేయం బహుముఖ వ్యాప్తి చెందింది .కొత్తకొత్త వృత్తాలు సృష్టించికవిత్వాలు రాశారు .ఇవన్నీ తర్వాతకాలం లో ఒక సంకలన గ్రంథంగా వచ్చింది .ఈయుగం లో దాదాపు 2200మందికవులు ,48,000 కావ్యాలు రాశారు .వీరిలో వాంగ్ వై,లీపో,పోచూయి , తూపూ ముఖ్యులు .వచనరచనా కొంత వచ్చింది దీనికి కొత్తశైలి నిర్మాత హాన్ హ్యూ .ఈ శైలిని అనుసరించి రాసినవాడు –హూచింగ్ య్వాన్ ,.గణిత ఖగోళ శాస్త్ర గ్రంధ రచనా సాగింది .
5-సారస్వత సంపన్నతా యుగం –క్రీ.శ .960-1280-టాంగ్ వంశం 906లో టప్పు మన్నది .కొంతకాలం అస్థిరత రాజ్యమేలింది .960లో శుంగ్ వంశం సామ్రాజ్యాదిపత్యం తీసుకొని 13వశతాబ్దం వరకు అవిచ్చిన్నంగా పాలించింది .ఈ యుగ ముఖ్యకవులలో చూశి ,ఔయంగ్ శ్యూ,స్యూమాశ్వాంగ్ ,సూషీ ,లూయౌ ,లీ యిఅన్..చూశి కన్ఫ్యూ షియస్ వాదానికి కొత్త అర్ధాన్ని ,వ్యాఖ్యానంతో రాశాడు .కవి రాజకీయ వేత్త వ్యాస రచయితా కూడా .టాంగ్ వంశ రాజచారిత్ర తోపాటు ,అనేక పద్యకావ్యాలు వ్యాసాలూ రాశాడు .టాంగ్ వంశ పతనం వరకు చైనా చరిత్ర ను ఆకర్షణీయశైలిలో రాసినవాడు సూ మా క్వాంగ్ .సూషి కవి కవితా శిల్ప నిపుణుడు ,లేఖగాగ్రణి ,గేయ వ్యాస రచయిత.12వ శతాబ్ది అగ్రేసర కవి-లూయౌ .కవిత్వంలో దేశభక్తి రంగరి౦ చాడు.అగ్ర శ్రేణి కవయిత్రి –లీయీ అన్ .చాలా గ్రంథాలురాసినా కొన్నే లభించాయి.
6-నవలా-నాటక ( రూపక )యుగం -1280-1368-సాహిత్య పోషణ చేసిన సుంగ్ వంశం మంగోలుల ధాటికి ఆగలేకపోయింది 1277లో మంగోల్ నాయకుడు కుబ్లాయ్ ఖాన్ చైనా గద్దె ఎక్కాడు .చైనీయ సంస్కృతిని పోషించాడు .కాని అగ్రశ్రేణికవులు ఈ విదేశీయుని సేవి౦చ టానికి మనసొప్పక మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయి వాస్తవితకు దూరంగా కల్పనా కథా రచన చేశారు .అవి ఈనాటినవలలను పోలి ఉన్నందున నవల అనే అన్నారు .మూడురాజ్యాల ముచ్చట అనే –సాన్ క్వోచి ,మానవులంతా సోదరులు అనే –ష్విహూ చ్వాన్అనే నవలలు ఉత్తమోత్తమాలుగా భావిస్తారు .సామాన్య భాషలో అందరికీ అర్ధమయ్యేట్లు రాయబడ్డాయి .కథా బిగి౦పు లేకపోయినా శైలి ఆకర్షణీయం .నీతి బొధనే ఈనవలల ముఖ్యోద్దేశ్యం .రచయితలగురించి మాత్రం తెలియదు.
మంగోలు రాజులు నాటకకళాపోషకులు .కనుక రూపక రచన ప్రోత్సహించారు చైనీ భాషలో .రాజపోషణ ఉన్నందున అనేకులు చాలానాటకాలు రాశారు .అందులో 100ప్రామాణిక నాటకాలున్నాయి .ఇవే తర్వాతకాలం లో ఐరోపాభాషలలోకి అనువాదం చెందాయి .ఉత్తమ నాటకాలలో ‘’శిశ్యాంగ్ చీ’’ అంటే పడమటింట ముచ్చట ముఖ్యమైనది. విద్యావంతయువకుడు ఒక అంద గత్తేతో జరిపిన ప్రణయ వ్యవహారమే ఇది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-5-20-ఉయ్యూరు