సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-40
‘’అల్పకార్య మిదం శేషం ‘’అని గురువుగారు హనుమ అన్నమాట లోకంలో ఒక నానుడిగా కూడా ఉన్నది –ఐనను పోయిరావలయు అస్తినకు ‘’అన్నట్లుగా .అల్పకార్యం అని చెప్పినా బృహత్ కార్యంతో అశోక వనధ్వంశం చేసి మొదటి సారి రాక్షసరాజుపై చావు దెబ్బకొట్టాడు .అక్కడి నుంచి ఇక ఏది చేసినా ప్రణాళికా బద్ధంగా నే చేసి రావణుడి క్రోధానికి కారకుడై ,లంకకే చేటుతెచ్చే పను పనులుతన వీర శౌర్య పరాక్రమ బుద్ధి బలాలతో చేశాడు .ఒక్కో పనితో ఒక్కో చావు దెబ్బ కొట్టాడు చచ్చిన వాళ్ళకే కాక వాళ్ళను పంపిన ఆయనకు కూడా .ఆ వైభోగం దర్శిద్దాం .
పక్షుల,మృగాల చెల్లాచెదరైన వాళ్ళ భయ ఆర్తనాదాలు విరిగి విరుగుతున్న చెట్ల ధ్వని విని చూసి రాక్షస స్త్రీలు నిద్ర లేచి అశోకవనం లో హనుమను చూశారు .ఇప్పటిదాకా సీతఃకు ఒక్కదానికి మాత్రమె కనిపించాడు .ఇప్పుడు అందరికి కనిపించి సత్తా చూపుతున్నాడు .వాళ్ళను చూడంగానే గురుడు రెచ్చిపోయి వాళ్ళను భయ పెట్టేట్లు పెద్ద రూపం పొందాడు .పర్వత సన్నిభ హనుమ ఆకారం చూసి వాళ్ళు సీతను ‘’ఎవడు వాడు ఎక్కడి నుంచి ఎందుకు వచ్చాడు ?నీతో ఏం మాట్లాడాడు ?భయం లేకుండా చెప్పు ?’’అని ప్రశ్నించారు
‘’కోయం కన్య కుతోవాయం కిన్నిమిత్త మిహాగాతః -కథం త్వయాసహానేన సంవాదః కృత ఇత్యుత ?’’
‘’ఆచక్ష్వనో విశాలాక్షీమా భూత్తే సుభగే భయం –సంవాద మసితా పా౦గే త్వయా కిం కృత వానయం ?’’
రక్కస వనితల ‘’టోన్’’మారింది మర్యాదగా సీతను విశాలాక్షీ ,అసితాపాంగే,కన్యా అనే విశిష్ట విశేషణాలతో సంబోధించారు .
సీత ఏం చెప్పాలి ?ఏం చెబితే ఏం కొంప మునుగుతుందో ?అని తెలిసి లౌక్యంగా నెపం వాళ్ళమీదే నెట్టి ‘’ఏమో !భయంకర రాక్షసులగురించి తెలుసుకొనే శక్తి నాకు ఎక్కడిది ?అతడు ఎవరో ఏమి చేయాలనుకున్నాడో మీరే తెలుసుకోండి పాముకాళ్ళు పాముకే తెలుస్తాయి ఇందులో అనుమానం లేదు .అతడిని చూసి నేను భయపడ్డాను .ఎవరో నాకు తెలీదు .కామరూపంతో వచ్చిన రాక్షసుడే అనుకొంటాను ‘’అన్నది .
‘’రాక్షసాంభీమ రూపాణాంవిజ్ఞాతే మమ కా గతిః-యూయమే వాభి జానీత యోయం యద్వాకరిష్యతి –అహి రేవ హ్యహేః పాదాన్విజానీతిన సంశయః ‘’
‘’అహమప్యస్య భీతాస్మి నైనం జానామి కోన్వయం-వేద్మి రాక్షస మే వైనం కామరూపిణ మాగత౦ ‘’
ఇది పూర్తి అబద్ధమే అయినా అతికి నట్లు సరిపోయింది .ఆడవాళ్ళు అబద్దాలాడితే గోడకట్టినట్లు ఉంటుంది అనే లోకోక్తి ఇలాంటి వారివల్లే వచ్చి ఉంటుంది .అయినా అబద్ధానికి కొన్ని ఎక్సెంప్సన్షన్ లు ఇచ్చారు మనపూర్వులు –ప్రాణ విత్త మాన భంగమందు బొంక వచ్చు నదిప ‘’మూడుకు ఇస్తే ఇంకెన్నైనా చేర్చవచ్చు కదా.ఇప్పుడు ఒక మహా కార్యం జరగాలి .అది తనమాన ప్రాణాలకు సంబంధించినది .ఇప్పుడే రట్టు చేస్తే రామకార్య భంగమవుతుంది ,దానివలన రాక్షసుల రాక్షసత్వం పెంపు ,మానవుల మానవత్వం కుదింపు జరిగి ధర్మానికే నష్టం కలుగు తుంది .కనుక సీత మాట్లాడిన తీరు సర్వతో భద్రమైనది .కనుక గుణ దోష చర్చ అప్రస్తుతం .
సీత మాటలకు భయపడిన రాక్షసా౦గనలు కొందరు అక్కడే ఉండి ,కొందరు భయంతో పరుగెత్తి కొందరు రాజుకు నివేదించటానికి వెళ్ళారు .వీళ్ళు రావణుడితో ‘’రాజా !అశోక వనం లో భయంకర శరీరం తో అంతులేని పరాక్రమ తో ఉన్న వానరుడు ఒకడు సీతతో మాట్లాడాడు .ఆమెను మేము అడిగితె వాడి గురించి తెలియ జేయటానికి ఇష్టపడలేదు . వాడు ఇంద్రలేక కుబేర దూతకాని లేక సీతాన్వేషణకు రాముడు పంపిన దూత కాని కావచ్చు .సీత కూర్చున్న చోటు కాక మన ప్రమదావనం సర్వం నాశనం చేశాడు .సీతను కాపాడటానికి అలా చేశాడా లేక అలసటతో ఇక చేయలేక పోయాడో తెలీదు .అయినా వాడికి శ్రమ ఏమిటి ?ఆమెను కాపాడటానికే అలా చేశాడు .సీత కూర్చున్న శింశుపా వృక్షాన్ని ఏమీ చేయలేదు.కనుక వాడి కి తీవ్ర దండన విధించు .ప్రాణాలపై ఆశలేనివాడుతప్ప సీతతో ఎవడు మాట్లాడగలడు?’’అన్నారు .తీవ్రకోపం పొంది తనతో సమాన బలం ఉన్న రాక్షస కింకరులను హనుమంతుని పట్టుకోమని ఆనతిచ్చి పంపాడు .
80వేల మంది ఆ రాక్షస కింకరులు భయంకర ఆకారాలతో యుద్ధం చేయాలనే ఉత్సాహంతో హనుమపైకి అగ్నిలో దూకిన మిడతల్లాగా వచ్చి పడ్డారు . ఈఉపమాన౦ వలన వాళ్ళ చావు తప్పదు అని ముందే చెప్పాడు మహర్షి వాల్మీకి .హమ్మయ్య యుద్ధం చేసే అవసరం వచ్చింది అని సంబరంతో హనుమ శరీరం పెంచి కొండలాగా నిలబడి తోకను నేలమీద కొట్టి స్వేచ్చగా తోక కదిలి౦చగా ఆ భయంకర శబ్దానికి భయంతో పక్షులు ఎగిరిపోయాయి .అప్పుడు హనుమ –‘’జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః –దాసోహం కోసలేన్ద్రస్య రామ స్యాక్లిస్ట కర్మణః అని మొదలుపెట్టి పూర్వం లాగా 6శ్లోకాలు చదివాడు.చివరగా –
‘’సమృర్దార్దో గమిష్యామి మిషతాం సర్వ రక్షసాం-తస్య తన్నాద శబ్దేన తే భవన్ భయ శంకితాః’’’’అంటే సకల రాక్షస సమక్షం లో నేను ఈ లంకను పీడించి,సీతా దేవికి నమస్కరించి ,నాప్రయత్నాన్ని ఫలవంతం చేసుకొని పోతాను .అని గర్జించాడు .ఈ మహా గర్జనకు అక్కడికి యుద్ధానికి వచ్చిన కిమ్కర రాక్షసులు భయపడి హనుమ ఎత్తైన సంజమబ్బులాగా కనిపించాడు .అయినా ప్రభువు ఆజ్ఞప్రకారం హనుమతో వివిధ ఆయుధాలతో తలపడ్డారు .బయట ద్వారం వద్ద ఉన్న పెద్ద గద తీసుకొని హనుమ ఆకాశం లోకి యెగిరి ,రాక్షసులని మోదాడు .ఆరాక్షస కింకరులు అందర్నీ నేలమట్టం చేసి మళ్ళీ బహిర్ద్వారం పై కూర్చున్నాడు .భయంతో కొందరు రాజు దగ్గరకువెళ్ళి చెప్పారు .అంతమంది చావు వార్త విని కొంచెం కంపించి మహా బల పరాక్రమ వంతుడు ,అసాధ్యుడు సహస్ర పుత్రుని హనుమపైయుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు రావణుడు . ఇది 43శ్లోకాల 42వ సర్గ
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-5-20-ఉయ్యూరు