ప్రపంచ దేశాల సారస్వతం
107-చైనీస్ సాహిత్యం -3
6-ప్రామాణిక గ్రంథ యుగం -1368-1890-విదేశీ మంగోలులపై తిరుగు బాటు చేసి చైనీయులు 1368లో వాళ్ళను సాగనంపిన మింగ్ వంశనాయకుడు చక్రవర్తి అయ్యాడు .వీరి పాలన 1644వరకు సాగింది .పాలన సుస్థిరమై శాంతిభద్రతలతో దేశం ఉన్నందున మళ్ళీ లలితకళలకు వికాస కలిగింది .కాని సాహిత్యం లో చెప్పుకోదగిన వికాసం రాలేదు .కొన్ని నవలలు నాటకాలు వచ్చినా ,అవి పూర్వయుగ అనుకరణలే .కాని ‘’యుంగ్ లోటా టైన్’’ ఒక విజ్ఞానసర్వస్వం కూర్చాడు .1403 చక్రవర్తి ఈ బృహత్ ప్రణాళికకు 2వేలమంది రచయితలను సహాయకులుగా నియమించి ప్రోత్సహించాడు .అది 22,800పేజీలతో వెలువడిన అసాధారణ గ్రంథం .కాని ముద్రణఖర్చు తడిసి మోపెడు అవుతుందని అచ్చు కాలేదు .ఆకాలపు వాంగ్ యాంగ్ మింగ్ తాత్వికకవి .సృజన శీలతను గుర్తించాడు .ఇంద్రియజ్ఞానం కంటే విశిష్టమైన జ్ఞానం ఉన్నాదని విశ్వసి౦చాడు .ఈభావాలు జపాన్ లో బాగా వ్యాప్తి చెందినా చైనా పండితులకు నచ్చలేదు .శ్వూశ్వాంగ్ చిఅనే క్రైస్తవ రచయిత’’నుంగ్ చెంగ్చవాన్ షూ’’అంటే బృహత్ సంహిత అనే మహా గ్రంథాన్ని60సంపుటాలుగా రాశాడు .దీనిలో వ్యవసాయం ,పశుపోషణ ,వివిధ శాస్త్ర సంబంధ విషయాలు ఉన్నాయి .
ఇంతలో చైనా ను మంచూ సైన్యం ముట్టడించి మింగ్ వంశపాలనకు గుంటకట్టి గంట వాయించింది .మంచూ పాలకులు చైనీయుల సంస్కృతిని గౌరవించి ఆదరాభిమానాలు పొంది ప్రజా పాలన చేశారు .ఈ రాజులలో ఖాంగ్ శీ -1662-1722,చీన్ లూంగ్ 1736-96లు సాహిత్యాభి వృద్ధికి విశేషంగా తోడ్పడ్డారు .పూర్వ గ్రంథాలన్నీ మళ్ళీ ముద్రణ పొందించారు .ఒక్కొక్కదానిలో 200 పేజీలున్న 1,628 సంపుటాలలో ఒక ‘’సచిత్ర విజ్ఞాన సర్వస్వం ‘’వచ్చింది .2200మంది కవుల రచనల సంకలనం తోపాటు సమగ్ర చైనీయ సాహిత్య సంబంధిత 18వేల పేజీల పద ప్రయోగ కోశం ,ప్రామాణిక నిఘంటువు ,771పేజీలలో చైనీయ సామ్రాజ్య సమగ్ర చరిత్ర ,300మంది పండితులతో 10,223 పేజీల చైనీయ సాహిత్య సమగ్ర చరిత్ర గ్రంథాలు వచ్చాయి .వీటిలో చివరది 1773లో మొదలై 1782నాటికి 9ఏళ్ళలో పూర్తయింది .ఇందులో ప్రామాణిక గ్రంధాలు,ఇతిహాసాలు ,తత్వ శాస్త్రాలు,సామాన్య సాహిత్యం అనే నాలుగు విభాగాలున్నాయి .
ఈ యుగం లో ఇలాంటి సంకలిత గ్రంథాలు మాత్రమె కాక ,స్వతంత్ర రచనలూ చేసిన కవులున్నారు .వారిలో శీ ,కుఎన్ వులు ప్రముఖులు .హ్వాంగ్ చుంగ్ శీ అనే రచయిత ఆనాటి వివిధ తాత్విక వాదాలను చర్చిస్తూ ‘’’’మెంగ్ జ్యూ క్యూ ‘’గ్రంథం రాశాడు .కు యెన్ వు కవీ పరిశోధకుడుకూడా .కొత్త రచనా ప్రక్రియ చేబట్టిన సాహిత్య విమర్శక అగ్రేసరుడు ,కావ్య రచనావేత్త’’ య్వాన్ మీ ‘’ .తత్వ శాస్త్రం లో నూతన విషయాలను ఆవిష్కరించినవాడు టాయ్ చెన్..నాటక రచనలో అగ్రేసరుడు’’చాంగ్ షిహ్ .‘’ప్రపంచ ప్రసిద్ధ నవల –చ్వాన్ హంగ్ లౌమేంగ్ ‘’అంటే యెర్ర మందిరం లో ఒక కల రాశాడు .చాన్ శ్యూచిన్ .100అధ్యాయాల మహా నవల’’ ‘’ హ్వాయ్వాన్—అంటే అద్దం లో పువ్వులు’’రాశాడు లీ హూ చెన్.1800నుంచి 1890వరకు చైనీయసాహిత్య చరిత్రలో అంధకార యుగం .ఆడపాదడపా రచనలు వచ్చినా ‘’లైట్ తీసుకోనేవే ‘’
7-ఆధునిక యుగం -1890నుండి ఉన్నకాలమే ఆధునిక యుగం .ఖాంగ్ యూ లీ ,ల్యాంగ్ ఛీ చాన్ లు సంస్కరణ ఉద్యమం నడిపారు .విజ్ఞాన సాహిత్య రాకీయాలలో రావలసిన మార్పులను గురించి ప్రచారం చేశారు .వీళ్ళకు ముందే ‘’సన్యట్ సేన్’’దేశం లో ప్రజాస్వామ్యం రావాల్సిన అవసరాన్నితెలియ జేస్తూ విస్తృతంగా ఉద్యమం చేశాడు .తనసిద్ధాంతాలను గ్రంథాలుగా రాసి ప్రచారం చేశాడు .
క్రమంగా ప్రజలు మాట్లాడుకొనే సామాన్య భాష పై ఆదరం పెరిగింది సామాన్యభాష సాహిత్యభాష కావాలని’’ హూ షిహ్’’పండితుడు ఆందోళన లేవ దీయగా,విజయవంతమై రచనలో అనేక ప్రక్రియలు వచ్చాయి .ఈపరిణామాలన్నీ ‘’మే4ఉద్యమం ‘’లో ఊపిరి పోసుకోన్నాయి .మొదటి ప్రపంచయుద్ధం ముగిశాక జరిగిన ఒడంబడికను అనుసరించి చైనాలోని షాంటంగ్ ప్రాంతం లో జపాన్ ప్రభుత్వం ఉండేట్లు నిర్ణయం జరిగింది .దీన్ని ప్రతిఘటిస్తూ 1919 మే4 న ప్రారంభమైన ఉద్యమమే మే4ఉద్యమం చైనీయుల ఐక్యత సాధించటానికే సాహిత్యం ఉపయోగపడాలనేది ముఖ్య ఉద్దేశ్యం .దీన్ని మనస్పూర్తిగా రచయితలూ అనుసరించారు. నిత్యజీవిత విషయాలను సరళ సులభ శైలిలో రాయటం కూడా ఇందులో భాగమే .దీన్ని బాగా వ్యాప్తి చెందించి రాసిన వారిలో –లూశున్,చెన్టూష్యూ,చైన్శ్వాన్టుంగ్,హూసీ లు .లూశాన్ ప్రజాహృదయాలను విపరీతంగా ఆకర్షించాడు కమ్యూనిస్ట్ సిద్దాన్తవ్యాప్తికి రచన దోహదమైంది .యువ రచయితలలో చూచ్యు పాయ్ ముఖ్యుడు .
కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడి ఉద్యమమహానాయకుడు ‘’మావ్ సే టుంగ్’’. సాహిత్య ఉద్దేశ్యాన్ని చర్చించి ఒక వివరణ పత్రాన్ని 1941లోఎనాన్ నగరంలో ప్రసంగించటం వలన ‘’ఎనాన్ ప్రసంగం ‘’గా పేరు పొందింది .దీన్ని ప్రచురించాడు .కార్మిక కర్షక సైనిక జనాలకోసం సాహిత్యం ఉండాలని చెప్పాడు .ఏది చెప్పినా హేతువాదంతో చెప్పటం తో అందరూ ప్రేరితులయ్యారు .ఇలాంటి నవ్యరచయితలలో చ్వాంగ్ క్వాంగ్ జ్యూ ,హోయెహ్ పిన్ ,టైన్ హాన్,ఇన్ వూ ,పాటింగ్ మావ్ టున్,క్వామోజో మొదలైనవారు ఎందరో ఉన్నారు .1950లో చైనాలో ప్రజాగణ రాజ్య నూతన ప్రభుత్వం ఏర్పడి మావో ను అనుసరించిరచనలు వచ్చాయి .అనేక విదేశీ రచనలు చైనీస్ భాషలోకి అనువాదాలయ్యాయి .విశ్వ సాహిత్యం లో చైన్స్ సాహిత్య అరుణ పతాక రెపరెప లాడింది .
తర్వాత సాహిత్యం లో వచ్చిన పరిణామాలు ,సమకాలీన రచనలగురించి తరువాతతెలుసుకొందాం .
సశేషం