సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-41
రావణ కింకరులను హతమార్చిన హనుమ ఇకపై ‘’కిం కర్తవ్యమ్ ‘’అని ఆలోచించి ‘’అశోకాన్ని విరచి శోక వనం చేశాను .ఇక చైత్య ప్రాసాదాల పనిపట్టి నేలమట్టం చేయాలి ‘’అనిమేరుపర్వత శిఖరాయమాన చైత్య ప్రాసాదం ఎక్కి మారుతి మరోమార్తా౦డుడిలాగా ,పారియాత్రం అనే కులపర్వత౦ లాగా భాసి౦చాడు .లంక అంతా వినిపించేట్లు పెద్దపెద్ద శబ్దాలు చేసి ఒడలు చరచుకొన్నాడు .ఆ ధ్వనికి కర్ణ భేరులు బ్రద్దలై పక్షులు పారిపోయాయి కావలివారికి స్పృహ తప్పింది .మళ్ళీ రికార్డ్ పెట్టాడు –
‘’రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః –దాసోహం కోసలేన్ద్రస్య రామ స్యాక్లిస్ట కర్మణః ‘’
సునాయాస కార్యసాధకుడు రాముడికి దాసుడిని వాయుపుత్రుడను హనుమంతుడను శత్రు సైన్య వినాశ కారణుడను.వేలాది రాళ్ళతో వృక్షాలతో నేనుకొడితే వెయ్యిమంది రావణులైనా నాకు యుద్ధం లో సాటికారు
‘’న రావణ సహస్రంమే యుద్ధేప్రతిబలం భవేత్ –శిలాభిస్తుప్రహరతః పాదపైశ్చ సహస్రశః ‘’
లంక నాశనం చేసి ,సీతకు మొక్కి ,రాక్షసులు చూస్తుండగానే సఫలతతో తిరిగి వెడతాను ‘’అని బిగ్గరగా అరచి అందరికి గుండె దడపుట్టించి భయభ్రాంతులను చేశాడు .ఇది విన్న చైత్య రక్షకులైన వందమంది వివిధ ఆయుధాలతో హనుమపై దూకారు .హనుమ భీకరంగా మారి నూరుబంగారు అంచులున్న ఆమహా ప్రసాదస్తంభాన్ని వేగంగా పీకి పారేసి దాన్ని గిరగిరా తిప్పగా అందులో అగ్నిపుట్టి అదంతా తగలబడిపోయింది .హనుమ అదే వేగంతో వందమంది రాక్షకులను పరిమార్చాడు .’’సుగ్రీవాజ్ఞ పాలించే మహా బలవంతులైన వానర ప్రముఖులు నా వంటి వారు వేలాది మంది భూమండలమంతాతిరుగుతున్నారు .మేమంతా సుగ్రీవాజ్ఞాను వర్తులమే .అందులో కొందరు 10ఏనుగులబలం , మరికొందరు వంద ఏనుగుల బల౦ ,కొందరు ఒఘమ్ అనే సంఖ్య ఉన్న ఏనుగుల బలమున్నవారు కోట్లాది వానర భల్లూక సైన్యంతో మారాజు సుగ్రీవుడువచ్చి మిమ్మల్ని మట్టి కరిపిస్తాడు .ఇక్ష్వాకురాజు రాముడి తో వైరం తో ఉన్న కారణంగానే మీరూ మీలంకా,మీరాజు రావణుడు ఇక హుళక్కే అని భావించండి ‘’అని అరచి జబ్బలు చర్చి చెప్పాడు మహా బలహనుమ .
‘’మాదృశానాం సహస్రాణి విసృస్టానిమహాత్మనాం –అటంన్తి వసుధాం కృత్ష్నాం వయమన్యేచ వానరాః’’
‘’దశనాగ బలాః కేచిత్కేచి ద్దశ గుణోత్తరాః-కేచిన్నాగ సహస్రస్య బభూవు స్తుల్య విక్రమాః’’
‘’సంతిబౌఘబలాః కేచి త్కేచి ద్వాయు బలోపమాః-అప్రమేయ బలా శ్చాన్యే‘త్రాసన్హరి యూధపాః’’
‘’నేయమస్తి పురీ లంకా న యూయం న చ రావణః –యస్మా దిక్ష్వాకు నాథేన బద్ధం వైరం మహాత్మనా ‘’
ఇది 25శ్లోకాల 43 వ సర్గ
ఇప్పటికి వందమందిరాక్షస కింకరులు,వందమంది చైత్య రక్షకులు హనుమ చేతిలో హతమయ్యారు .ఈ కౌంట్ క్రమంగా కరోనా మరణాల సంఖ్యలా పెరుగుతుంది తర్వాత తర్వాత .ఇక్కడ హనుమ ఏమి సాధించాడు ?చెట్లు చేమలు విరిస్తే కోతి చేస్టలుగా మిగిలిపోతుంది కనక మహా బలవంతుడు చేయాల్సిన పని చేయాలని చైత్య ప్రసాద విధ్వంసంతో అది సరిపోతు౦దనుకొని అదీ చేసి ఎదురొచ్చిన రాక్షకులను అందర్నీ చంపేశాడు .తానెవరో ,తన నాయకుడు ఎవరో ,వానర బలం ఎంతటిదో అరచి అరచి మరీ అందరికి లౌడ్ స్పీకర్ ప్రకటన లాగా చెప్పాడు .ఈ వార్తలన్నీ రాక్షసరాజుకు చేరాలనేదే ఉద్దేశ్యం .ఇంతటి వినాశనానికి కారణం కేవలం రాక్షసులు రాక్షరాజు రావణుడు మహా పరాక్రమశాలి ఇక్ష్వాకు వంశకులదీపం శ్రీరాముడితో వైరం పెట్టుకోవటమే అని దాని ఫలితం అందరి వినాశనమే ననీ తెగేసి అరచి చెప్పాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-5-20-ఉయ్యూరు