ప్రపంచ దేశాల సారస్వతం
108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం
ఆంగ్లభాష –యాంగిల్స్ ,సాక్సన్స్ అనే జర్మానిక్ జాతిప్రజలు క్రీ,శ 5వ శతాబ్దిలో ఉత్తర ఐరోపా నుంచి వచ్చి ,బ్రిటిష్ దీవుల్ని ఆక్రమించి స్థిరపడ్డారు .వీళ్ళ భాషనే ‘’ఆంగ్లో –శాక్సన్’’భాష అంటారు .దీనికే’’ ఓల్డ్ ఇంగ్లిష్’’ అనే పేరు పెట్టుకొన్నారు .11వ శతాబ్దిలో నార్మన్, ఫ్రెంచ్ దేశస్తులు బ్రిటన్ దేశాన్ని ఆక్రమించి ,ఈ రెండు దేశాలభాషల కలయికతోఆంగ్లో శాక్సన్ భాష అనేక మార్పులు పొంది ,ఇప్పటి ఇంగ్లిష్ గా క్రమంగా రూపు దాల్చింది .
ఆంగ్లసాహిత్యం –దీనికున్న ప్రాచుర్యం ఏ జీవ భాషకూ లేదు .ప్రక్రియా వైవిధ్యంలోనూ ముందుంది .అనేక సాంస్కృతిక చారిత్రకకారణాలవలన ఇంగ్లిష్ భాష ప్రపంచమంతా పాకి అంతర్జాతీయ భాష కూడా అయింది .ఆంగ్లో శాక్సన్ భాషలో వచ్చిన కావ్యాలలో నశించినవి పోగా మిగిలినవాటిలో ‘’బీ ఉల్ఫ్ ‘’అనే వీర గాథాకావ్యం ముఖ్యమైనదిగా భావిస్తారు .ఇందులో వీరుడైన బీ ఉల్ఫ్ శౌర్యపరాక్రమాలు వర్ణించ బడ్డాయి .8వ శతాబ్దిలో ఒక అజ్ఞాతకవి తనకాలం లో ఉన్న గీతాలను ఆధారంగా దీనికి కావ్య రూపం తెచ్చాడని భావన .ఇలాంటి శకలాలే ‘’ది వా౦డరర్’,’’’ ది సీ ఫేరర్’’ .వాన్డరర్ లో తనకు ఆశ్రయమిచ్చి పోషించిన యజమాని చనిపోతే ,బ్రతుకుతెరువు కోసం సముద్రాలు దాటి సుదూరం పోయి వెనుకటి తన సుఖస్థితిని ,ఇప్పటి దుఖాన్ని తలచుకొంటూ మానవ జీవిత అనిశ్చిత పరిస్థితిస గురించి చేసిన వ్యాఖ్యానం .సహజ సిద్ధ గీతాలతో మనసును యిట్టె ఆకర్షించేది .ప్రకృతిని ,బలవంతులైన శత్రువులను ప్రతిఘటిస్తూ జీవించే ఆనాటి ప్రజల నిరాశా మయ మానసిక దృక్పధం ఆనాటికావ్యాలలో ఎక్కువగా కనిపిస్తుంది .
ఆంగ్లో –శాక్సన్ భాషా కవులు కాడ్మన్,క్విన్ ఉల్ఫ్ లు కొన్ని మంచి కావ్యాలురాసిన క్రైస్తవులు .యార్క్ షైర్ లోని విట్టీ చర్చి లో గుర్రాలకాపరి కాడ్మన్ . పండుగ రోజుల్లో అందరు ఒక చోట చేరి తామురాసిన ప్రార్ధనలు గానం చేస్తుంటే ,తనకు ఆశక్తి లేకపోవటం తో సిగ్గుపడి తలవంచుకొని వెళ్లి పోయేవాడు కాడ్మన్.కాని ఒక రోజు గుర్రపు శాలలో పడుకొని ఉండగా ఒక దేవదూత ప్రత్యక్షమై పాడమని ఆదేశించింది .ఏమిపాడాలని ప్రశ్నిస్తే ,’’సృష్టి ప్రారంభం గురించి పాడు ‘’అనగా ,ఒక్కసారి నిద్రలేచి ,తనకు అప్రయత్నంగా కవితా శక్తి ఏర్పడిందని గ్రహించి దైవాజ్ఞచేత విశ్వ సృష్టిపై గొప్ప కావ్యం రాశాడు .అలాగే భోగ లాలసతో విలాస జీవితం గడిపే క్వీన్ ఉల్ఫ్ కు ఒక రోజు క్రీస్తు శిలువ కనిపించట౦ తో దృష్టిమారి ఆధ్యాత్మిక భావం ప్రవేశించి ‘’డ్రీం ఆఫ్ ది రూడ్’’కావ్యం రాసినట్లు చెప్పుకొన్నాడు .అప్పటికి కవిత్వం లో అంత్య ప్రాస నియమం లేదు .ఆ కొరతను తీర్చి వీనుల విందుగ కావ్యం రాశాడు ఉల్ఫ్ .
కవిత్వం పుట్టాక కొంతకాలానికి వచనం వచ్చింది .9వశతాబ్దిలో రాజు ఆల్ఫ్రెడ్ వచన రచన ను ప్రోత్సహించాడు .పండితులకు మాత్రమె అర్ధమయ్యే లాటిన్ కావ్యాలను సామాన్యులకోసం రాజే స్వయంగా ఆంగ్లో –శాక్సన్ లోకి అనువాదం చేసి దేశానికీ భాషకు గొప్ప ఉపకారం చేశాడు .అతనికాలం లో ‘’ఆంగ్లో –శాక్సన్ క్రానికల్ ‘’ఆ నాటి చరిత్రగా వచనశైలికి ప్రమాణంగా వచ్చింది , ఆల్ఫ్రిక్ ,ఉల్ఫ్ స్టాన్ అనే మతాచార్యులు మరికొన్ని వచన రచనలు చేశారు .ఆల్ఫ్రిక్ రచన కవిత్వానికి దగ్గరగా ఉంటూ శైలిలో రమణీయత సాధించింది .
11వ శతాబ్దిలో నార్మన్ దండయాత్ర జరిగి ,ఫ్రెంచ్ భావాలకు ఇంగ్లాండ్ లో ప్రాదాన్యమేర్పడి,ఇంగ్లిష్ వెనకబడింది .దీనితో 150ఏళ్ళు ఇంగ్లీష్ కావ్య రచన మందగించింది .సాహిత్యసృస్టి మందగించినా , ఇంగ్లిష్ భాషలో నార్మన్ ఫ్రెంచ్ ప్రభావం వలన అనేక మార్పులు వచ్చి కొత్త వికాసం పొందింది .15వ శాతాబ్ది చివరవరకు అది ‘’మిడిల్ ఇంగ్లీష్ ‘’పేరుతొ పిలువబడింది . ఈకాలం లోనే ‘’బ్రుట్’’,ఒర్మ్యులం ,కర్సర్ మండి’’అనే పద్యకావ్యాలూ ,’’ఆయన్ బైట్ ఆఫ్ ఇన్విట్’’అనే వచనరచనా వచ్చాయి .13వ శతాబ్దం లో ‘’దిఔల్ అండ్ ది నైటింగేల్’’కావ్యం రచింపబడి ,ఫ్రెంచ్ పద్ధతిలో అనుప్రాసకు ప్రాణం కల్పించబడింది .14వ శతాబ్దిలో ‘’పెర్ల్’’,క్లేన్ నెస్’’,పేషెన్స్’’,’’సర్ గావయన్ అండ్ ది గ్రీన్ నైట్ ‘’అనే నాలుగు పద్యకావ్యాల వ్రాతప్రతి దొరికింది .కవిపేరు తెలియదు .కావ్యాలలోని మాండలీకాలను బట్టి కవి వెస్ట్ మిడ్లాండ్ వాడు అని ఊహించారు .ఇందులో పెర్ల్ కరుణ రసప్రధాన కమనీయకావ్యం .కవికి కలలో పసితనం లోనే చనిపోయిన తన చిన్నారి శిశువు మార్గరెట్ ,నదికి అవతలి ఒడ్డునకనిపించగా పితృ మమకారం తో ఆమెను కలుసుకోవాలని వేగంగా నదిని ఈదు తుంటే స్వప్న భంగమై ,తనబిడ్డ అమరత్వం పొందిందని ఊరట పొందుతాడు .రెండవ ‘’సర్ గానయర్ ‘’కావ్యం వీరపురుషుల సాహసకార్యాలు విలాసినుల జాణతనంతో కలిసి మాంచి రోమాన్స్ కుమ్మరించి,రొమాంటిక్ కావ్యాలకు ప్రేరణ అయింది .ప్రకృతి, సమకాలీన జీవితం సరససున్దరంగా వర్ణితం .అదే కాలం లో విక్లిఫ్ కవి బైబిల్ ను మొదటిసారిగా ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రాసాద్ -5-6-20-ఉయ్యూరు