బక దాల్భ్యుడు -8
చైకితాన్య లేక బ్రహ్మదత్త చైకితాన్య పేరు వైదిక సాహిత్యంలోఉపనిషత్తులు ,లేక బ్రాహ్మణాలలో వినిపిస్తుంది.వారు ఒకరుకాదు ఇద్దరు అనిపిస్తుంది .ఛాందోగ్య ఉపనిషత్ -1.8-9లోమాత్రమే చైకితాన్య దాల్భ్య పేరు మిగిలినవాటిలో బ్రహ్మదత్త లేక దాల్భ్య పేరు వస్తుంది .కనుక బ్రహ్మదత్తుడు చైకితాన్య దాల్భ్యుడి కొడుకు అయి ఉంటాడు .ఉద్గాత విషయ చర్చలొ ఈపేరు వచ్చింది.ఈచర్చ ముగ్గురు సామవేద నిపుణులు –చేకితాన దాల్భ్య ,శీలక సాల్వావత్య ,ప్రవాధన జైవాలి మధ్య జరిగింది .మొదట శిలాక -చైకితాన్యుని సామవేది మరోలోకానికి వెళ్ళటానికి ఆధారం ఏమిటి అని ప్రశ్నిస్తాడు . స్వర్గం సామవేద మాధుర్యానికి నిలయం కాదని శిలాకుని భావం .మరోలోకం వెళ్ళినవాడు మళ్ళీ ఈలోకానికే రావాలి అనీ అంటాడు .ఈ రెండిటిని త్రోసిరాజని రాజు ప్రవాహనుడు ఉపనిషత్ ను౦చి ఉదాహరణ ఇస్తాడు .అంతేకాక ఈ లోకం ఆధారభూతం కాదనీ ,చివర ఆధారం ఆకాశం లో ఉందని ,అదే అంతరిక్షంలో ఉండే బ్రహ్మం అనీ వివరిస్తాడు .
ఇక్కడ చేకితానుడు ఉద్గాత విషయం లో అపరిపక్వ దశలో ఉన్నట్లు తెలుస్తుంది .బ్రహ్మదత్త చైకితాన్య కు కొన్ని ప్రత్యేక సామాలు పలకటం లో సరైన సామర్ధ్యం లేదని తెలుస్తోంది .కురు దేశీయులు కూడా బ్రహ్మదత్త సామర్ధ్యాన్ని మెచ్చలేదు .పై అధ్యాయం లోనే రాజు జైవాలి మరొక గాలూనస అర్క శాక్యాయన అనే సాలావాత్యతో కలిసి చర్చించాడు .జె .యు. బి.1.59లో చైకితాన్యుడిని బ్రహ్మదత్తగా ఉద్గాతగా చెప్పబడింది .బ్రహ్మదత్తుడు కురు యాగనిపుణుడు అభిప్రతారిన కాక్ష్యసేనిని కలిసినట్లు ,శౌనక పౌరోహిత్యాన్ని’’మధుపర్క కాండ’’ లో కాదన్నట్లు ఉన్నది .అవమానపడిన శౌనకుడు సామవేద జ్ఞానంపై ప్రశ్నలు సంధిస్తే ,బ్రహ్మదత్తుడు ప్రతిదానికీ అద్భుతమైన సమాధానాలు చెప్పాడు .ఇక్కడకూడా ప్రత్యర్ధులు కురు దేశం వారే .కనుక బ్రహ్మదత్త చైకితాన్యుడు పా౦చాలుడు అని అర్ధమౌతోంది.
బృహదారణ్యక ఉపనిషత్ 1.3.24,జెబి1.337-38లలోకూడా ఉదంతాలున్నాయి మొదటి దానిలో దాల్భ్యుని పేరు లేదు .అక్కడ యాగ వేదాంతం,ఉద్గాత స్వభావం లపైనే చర్చ .ఇందులోనే 1.3.24లో బ్రహ్మదత్తుని సామవేత్తగా సోమరసం త్రాగినవాడిగా చెప్పింది .ఇక్కడా ఉచ్చారణ విషయ చర్చమాత్రమే .బ్రహ్మదత్త స్వావాస్య మాధుర్యం తో చేసిన గానం పై ,గాలూనులు అభ్యంతరం చెప్పగా ,అతడు దానికి మూలం వివరించాడు .ఇక్కడకూడా శ్వావాశ్వుడు అర్కానసుడికొడుకుగానే చెప్పబడి,సమిధలకోసం బయటకు వెడితే ,అతని స్పర్ధదారులు సత్రయాగం చేసి స్వర్గం చేరారు –ప్రాతిసత్రానః ‘’.అక్కడినుంచే స్తోభగానం చేస్తూ ,అతడినీ రమ్మని పిలిచారు .వీటన్నిటిలో ఒకే దాల్భ్యుడు అనేక సందర్భాలలో కనిపిస్తాడు .బ్రహ్మదత్త సత్రయాగ బృందం లో ఉన్నాడని చైకితాన్యుడు సామవేదగాన నిపుణుడు అనీ ,సత్రయాగంలో స్తోభ గానం చేసేవాడని తెలుస్తోంది .శ్వావశ్వకూడా ఈయాగం చేసేవాడే .ఒక శ్యావశ్వ రహవీతిదార్భ్య అనే పేరున్న యాగ యజమానికూడా .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-6-20-ఉయ్యూరు
బక దాల్భ్యుడు -9
వేదం లో చెప్పబడిన చివరి దాల్భ్యుడు నాగారి దాల్భ్యుడు .జెబి1.257లో ఒక బ్రాహ్మణుడు ఆహుతులను ఏ దిక్కులో వేయాలి అని అడిగితె నాగారి దాల్భ్యుడు యజమాని సౌఖ్య సంపదలకోసమైతే ఊర్ధ్వంగా వేయాలి అని చెప్పాడని ఉన్నది –‘’తద్ ధా నాగారినం దాల్భ్యం బ్రాహ్మణః ప్రప్రచ్ఛకద్యర్ యజ్ఞాఇతి ‘’-‘’ఊర్ధ్వ ఏవ పురుషం అన్వయత్తా ఇతి’’-‘’యా యు ఏనం ప్రత్యాన్చం వేద ప్రత్యయన్ భూతిం భవతి ‘’.ఇంతకంటే అతనిగురించి వివరం లేదు .బౌదాయన శ్రౌత సూత్రం ప్రవరలు, గోత్రాల జాబితాలో దార్భ్య ,దార్భి ,దార్భ్యాయన పేర్లున్నాయి .దార్భ్య పేరు ప్రవరలో హరిత భరద్వాజులుగా చెప్పబడింది .దార్భి పేరు ప్రవరలో రెండు సార్లు వచ్చింది .భారద్వాజులలో దార్భ్యులుగా ,అయాస్య గౌతములలో దార్భి గా ఉన్నది .వీటిలో ఇంటిపేరు దార్భ్యయాన అనీ ,ప్రవరలలో దార్భాయనులు అనీ వీరి గోత్రాలు వత్స భార్గవ ,మరియు లౌకాస్య భార్గవ అని ఉన్నది .
రథ దాల్భ్యులలో రహవీతి,రహప్రోతలు క్షత్రియులు .రహ వీతివిషయం లో ఋషులకు రాజర్షులకు అంటే బ్రాహ్మణులకు క్షత్రియులకు మధ్య అతి దగ్గర సంబంధం కనిపిస్తోంది.అంటే రాజ కుటుంబాలు బ్రాహ్మణ కుటుంబం వారిని వివాహమాడి వారినుంచి యాగరహస్యాలు సంపాదించి ఉంటారు .అందులో నిష్ణాతులై బ్రాహ్మణ యాగ వేత్తలను చర్చలలో ఓడించినట్లుకూడా అర్ధమౌతోంది .
చైకితాన ,బ్రహ్మ దత్త చైకితానలు మాత్రం సామవేద గాయకులు .మనం చూసిన అనేక విషయాలలో చైకితాయన అనే ఆయన బకఅనబడే గ్లావ(గాలవ ) మైత్రేయుడే.ఈ ఇద్దరు సామగాయకులే .పోటీలలో ఒకసారి గెలుపు మరో సారి ఓటమి పొందారు .ఇద్దరూ ఉద్గీతలోని వేదాంత రహస్యాలు చర్చి౦చినవారే ,సత్రయాగ సమూహాలతో సంబంధమున్నవారే .బక,కేశినులతర్వాత బ్రహ్మదత్త చైకితాన్య వస్తాడు .ఇతనికి కురు రాజులతో బంధం ఉంది(పా౦చాలురతో కూడానా ?) . ఇప్పటిదాకా మనం వేద సాహిత్యంలో బదాల్భ్యుని గురించిసవివరంగా చర్చించాం .ఇక ఇప్పుడు ‘’వేదానంతర సాహిత్యం’’ లో బకదాల్భ్యుని గురించి తెలుసుకొందాం .
వేద సాహిత్యానంతరం –అంటే ముఖ్యంగా మహాభారతం ,పురాణాలలో అని అర్ధం .తర్వాత జాతక కధలు ధర్మశాస్త్రాలు చూద్దాం .
బకదాల్భ్యుడు –
మహాభారత ,వామన పురాణం సారో మహాత్మ్యం లో బకదాల్భ్యుని గురించి ఉన్నది .ఈ రెండిటిలో సరస్వతి నదికి అనేక తీర్దాలున్నాయి .భారతం శల్యపర్వం లో బలరాముడు ద్వారకనుంచి కురుక్షేత్రానికి తీర్ధయాత్ర చేశాడు .వామనం లోరోమహర్షణుడు రుషి సమూహాలకు సరస్వతి నదీ తీర్దాలగురించి వివరిస్తాడు .బక దాల్భ్యుడు హోమం నిర్వహించినచోటు అవకీర్ణ తీర్ధం .కాని తీర్ధ వర్ణన లో అతడిపేరు మనకు కనిపించదు.మహాభారతం వేదానికి అనుసరించి రాయబడింది కనుక ఇందులోనిదే యదార్ధం .అప్పటికి బకుడు నైమిశ ఋషులతో ,సత్రయాగాలు చేస్తున్నాడు .బక -ధృత రాస్ట్రుని కలవకముందే నైమిశం లో 12ఏళ్ళ విశ్వజిత్ యాగం చేశాడు .పాంచాలురు ఇచ్చిన కానుకల జాబితా కూడా ఉన్నది .గోవులు 21.(కథా సంహితలో కానుకలు కురురాజులిచ్చినట్లు గొవులు27అని ఉంది)రాజు పశువు మరణం ‘’యద్ర చయామృతా’’అంటే అనుకోకుండా ,అకస్మాత్తుగా చనిపోయాయి .భారతం లో కూడా బకదాల్భ్యుడు మృత పశువు మాంసాన్నిరాజు వినాశనం కోసం ఆహుతిచ్చాడు .యాగవేడికి అక్కడి పశు హింసకు ఋషికి ఆగని క్రోధం రావటమే .సంహితలో, భారతం లో కూడా బకుడు బయటివాడు సత్రయాగ నిర్వాహకుడు ,వేత్త అతనికి రాజు కోపం తెప్పించి ఉండాల్సి౦ది కాదు అనిపిస్తుంది .నిగ్రహానుగ్రహ సమర్ధుడు కనుక వేదకాండ ప్రకారమే శిక్షించాడు .మళ్ళీ పునరాహూతి అందించి అదే విధంగా అనుగ్రహమూచూపాడు .ఈ విషయంలో వామనపురాణ౦ రెండు నీతులు బోధించింది .ఒకటి బ్రాహ్మణులను అవమాన పరిస్తే ,శిక్షతప్పదు.రెండవది అవకీర్ణ తీర్ధం లో భక్తీ శ్రద్ధలతో స్నానం చేస్తే కోరిక నెరవేరుతుంది .
భారతం సభాపర్వం లో మరో చోట యుధిస్టిరుని నూతన సమావేశ మందిరం లో సందర్శించ టానికి వెళ్ళిన మహర్షుల పెద్ద జాబితాలోబకదాల్భ్యుని పేరుకూడా ఉన్నది .అరణ్యపర్వం లో ఆయనే మహర్షుల సమూహానికి నాయకుడుగా వెళ్లి ద్వైతవనం లో ఉన్న పాండవులతో మాట్లాడినట్లున్నది .అక్కడి అరణ్యం అంతా వేదమన్త్ర ఘోషతో దద్దరిల్లుతుంటే బకదాల్భ్యుడు ‘’అగ్నికి ఆహుతులిచ్చే సమయం ఆసన్నమైంది ‘’అన్నాడు –‘’బ్రాహ్మణానాం తపస్వినాం హోమ వేలాం’’..అక్కడ ద్వైతవన సరస్సువద్దఅపుడు భ్రుగు,ఆంగీరస ,వశిష్ట ,కాశ్యప,అగస్త్య కుటుంబాలకు చెందిన మహర్షులంతా పాండవులతో ఉన్నారు .ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియులమధ్య ఉండాల్సిన సహకారం గోచరించి౦ది .చివరకు బకదాల్భ్యుడు ఇతర బ్రాహ్మణులతో కలిసి ధర్మరాజును మనసారా కీర్తించి ,ఆశీర్వదించి సెలవు తీసుకొన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-6-20-ఉయ్యూరు