సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-45
పంచ సేనానులు,వారి మహా సైన్యాలు హనుమ చేతిలో పంచత్వం పొందిన స౦గతి విని ఆగ్రహావేశాలతో తన దృష్టిని యుద్దోన్మత్తుడు, తనకుమారుడు అక్షకుమారునిపై నిలుపగా అర్ధం చేసుకొన్న అతడు బ్రాహ్మణుల ఆహూతులతో వృద్ధి చెందినదీప్తానలం లాగా వేగంగా కదలివెళ్ళాడు హనుమపై యుద్ధానికి .
ఆహూతులిస్తేనే అగ్ని ప్రజ్వరిల్లుతుంది .లేకపోతె ఆరిపోతుంది .సూచ్యార్ధ సూచన ఇది
‘’స తస్య దృష్ట్యర్పణసంప్ర చోదితః –ప్రతాపవాన్ కాంచన చిత్ర కార్ముకః –సముత్పపా తాథ సదన్యుదీరితో-ద్విజాతి ముఖ్యై ర్హవిషేవ పావకః ‘’
బాలసూర్యకాంతికలవాడై ,మేలిమి బంగారు జాలీలతో అలంకరింప బడిన ఆకాశ సూర్య సంచారంలాగా దూసుకుపోయే రథంఎక్కి వెళ్ళాడు .అతని ఎనిమిది గుర్రాలు మనో వేగం కలవి.అతని రథంలో అన్ని రకాల ఆయుధాలు చక్కగా అమర్చబడిఉన్నాయి .స్వర్ణ కేతనాలు రెపరెప లాడుతున్నాయి .ఇలా మందీ మార్బలంతో అక్షకుమారుడు బహిర్ద్వారం వద్ద ఉన్న హనుమపైకి దాడి చేయటానికి వెళ్ళాడు .సింహ నేత్రాలవంటి కళ్ళు న్న అక్షుడు ప్రళయాగ్ని లాగా ప్రజా నాశనం చేసే హనుమను చూడగానే కొంచెం ఆశ్చర్యం, కాస్త తత్తరబాటు పడి ,మహాకపిని గౌరవంగా చూశాడు అంటే తనకు సమానబలుడితో యుద్ధం చేస్తున్నందుకు గర్విస్తున్నాడు .ఒకవీరుడు మరొక వేరుని పట్ల చూపాల్సిన గౌరవం అది .చక్కగా పాటించాడు -‘’స సతం సమాసాద్య హరిం హరీక్షణో-యుగాంత కాలాగ్ని మివ ప్రజాక్షయే – అవస్థితం విస్మిత జాత సంభ్రమ –స్సమైక్ష తాక్షో బహుమాన చక్షుషా ‘’
అక్షుడు తనబలం ఎదిరి బలం బేరీజు వేసుకొని ,వసంత సూర్యుడిలాగా వృద్ధి చెంది ,హనుమ యుద్ధం లో అసాధ్యుదని అతని పరాక్రమం బట్టి గ్రహించి ,కోపం తో స్థైర్యాన్ని కూడగట్టుకొని ,జాగ్రత్తగా మూడు బాణాలతో హనుమను కొట్టిగర్వించి ,హనుమ గర్వితుడని శ్రమను లేక్కచేయడని ,శత్రు భంజకుడని గ్రహించాడు చూసిన కాసేపట్లోనే .అంటే ఎంతటి సూక్షబుద్ధికలవాడో తెలుస్తోంది –
‘’తతః కపిం తమ్ ప్రసమీక్ష్యగర్వితం –జితశ్రమంశత్రు పరాజయోర్జితం-అవైక్షతాక్ష స్సముదీర్ణమానస-స్సబాణ పాణిః ప్రగృహీత కార్ముకః ‘’
ఈ ఇద్దరి భీకరయుద్ధం దేవ దానవులకు కూడా భయం కలిగించింది.భూమిభయపడి పెద్దధ్వని చేసింది .సూర్యతాపం లేదు వాయువు స్తంభించింది .ఆచలాలైన పర్వతాలు చలించాయి .ఆకాశం రోది౦చగా సముద్రం క్షోభిల్లింది –అంటే ఏదో ప్రళయం రాబోతున్నాడని సూచన అన్నమాట
–‘’స్సురా సురాణామపి సంభ్రమ ప్రదః ‘’
‘’రరాస భూమి ర్నతతాపభానుమాన్ –వవౌ న వాయుఃప్రచాచాల చాలః
‘’’’’కపేః కుమారస్య చ వీక్ష్య సంయుగం –ననాదచ ద్యౌరుదిరశ్చచుక్షుభే’’
మంచిములుకున్న ముందుభాగం బంగారు రంగున్న వెనకభాగం కల విషసర్పావంటి మూడు బాణాలు శరసంధాన వేత్త అక్షుడు హనుపై ప్రయోగించడు .ఆమూడుబాణాలు శిరసుపై నాటుకొని రక్తం కారి ,వృత్తాకారపు కన్నులు తడిసిపోయి హనుమ అప్పుడే ఉదయించిన సూర్యునిలాగా బాణాలనే కిరణాలమాలతో కూడిన సూర్యునిలా విరాజిల్లాడు –
సతై శ్శరైర్మూర్ధ్నిసమం నిపాతితైః-క్షర న్న సృగ్దిగ్ధ వివృత్త లోచనః –నవోదితాదిత్య శ్శరా౦శు మాన్ –వ్యరాజ తాదిత్య ఇవా౦శుమాలికః ‘’
అక్షకుమారుని యుద్దోద్ధతికి హనుమ సంతోషించి ,శరీరం పెంచి తీక్షణమైన కంటి చూపుతో అతడి సేనను ,వాహనాలను కాల్చాడు –అందుకేనేమో ఇవాల్టి సినిమాలలో ‘’కంటి చూపుతో చంపేస్తాను ‘’అనే డైలాగ్ పాప్యులర్ అయింది .వాల్మీకి భిక్ష ఇది .
‘’స మండరాగ్రస్థ ఇవా౦శు మాలికో –వివృద్ధకోపో బలవీయ సంయుతః –కుమార మక్షం సబలం సవాహనం –దదాహ నేత్రాగ్ని మరీచిభిస్తదా’’
వాడుకూడా రెట్టించిన ఉత్సాహంతో పర్వతం మీద మేఘం వాన కురిపించినట్లు బాణాలతో హనుమను కప్పేశాడు .హనుమ స్వేచ్చగా ఆకాశ౦ లో తిరుగుతూ హర్షం తో సింహనాదం చేశాడు .బాలుడైనరాక్షసకుమారుడు తనపరాక్రమానికి తానె గర్విస్తూ ,గడ్డితో కప్పబడిన పెద్ద బావి మీదకు ఏనుగు దూకినట్లు దూకాడు .ఇక్కడ కూడా వాడి చావును చెప్పకనే చెప్పాడు .ఏనుగులను బంధించే ఉపాయం ఇది .
వాడిబాణం దెబ్బలకు హనుమ మైండ్ బ్లాకై భుజాలు తొడలు విదిలించి శత్రుభీకరంగా ఆకాశంలోకి యెగరగా అతడిని వెన్న౦టి వీడూ ఆకాశం చేరాడు .వాడి ‘’వాడి బాణాల’’నడుమ వాయువులాగా కదుల్తూ శరఘాతాన్ని తప్పించుకొన్నాడు హనుమ .అక్షపరాక్రమం వీక్షించి మనసులో సంతోషించి ,ఆదరంగా వాడినిచూసి చింతించాడు.అంటే వాడి పరాక్రమాన్ని పొగిడాడు కాని బాలుడు నా చేతిలో చచ్చిపోతున్నాడు అని బాధపడ్డాడు కూడా అన్నమాట
బాలుడైనా మహా యోదులుచేస్తున్నట్లు అన్ని యుద్ధ విధానాలూ వాడు ప్రయోగిస్తున్నాడు అలాంటి వాడిని చంపటానికి మనసు రాకుండా ఉంది అనుకొన్నాడు హనుమ జాలిగా
‘’అబాలవద్బాల దివాకర ప్రభః –కరోత్యయం కర్మ మహ న్మహాబలః –న చాస్య సర్వాహవ కర్మ శోభినః –ప్రమాపణే మే రతి రత్ర జాయతే ‘’
వాడి పరాక్రమ౦ చూసి సురాసురులైనా భయపడుతారు అనుకొన్నాడు .కాని ఇక ఉపేక్షిస్తే తనశరీరం వాడికి బాణార్పితంఅవుతుందని గ్రహించి ,చివరికి అక్షకుమారుని చ౦పాలనే నిర్ణయానికి వచ్చాడు .అంటే యెంత గుంజాటన పడ్డాడోవాడిని చంపటానికి వాడిని చూసి వాడి పరాక్రమాన్ని చూసి .ఇక క్షణం ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో ఆకాశం లోనే వాడి 8గుర్రాలను రథాన్ని అరచేతితో కొట్టగా అవి అప్పచ్చుల్లా , అప్పడాల్లా అక్కడినుంచి న భూమిపై పడి ప్రాణాలు కోల్పోయాయి. రథం ముక్కలైంది .రథాన్ని వదిలి కత్తి,విల్లు తీసుకొని రుషి తన తపో బలంతో శరీరం వదిలి స్వర్గానికి వెళ్ళినట్లు ఆకాశానికి ఎగిరాడు కుమారా అక్షయ .వాయు వేగం తో వాడిని సమీపించి వాడి పాదాలు గట్టిగా పట్టుకొని వెయ్యి సార్లు తిప్పి నేలపైకి విసిరేశాడు .వాడు సర్వా౦గాలూ నుజ్జు నుజ్జుకాగా నేలకూలి చచ్ఛి తండ్రికి ఒణుకు పుట్టించాడు .హనుమ పరాక్రమానికి ఆకాశ దేవతాగణ౦ ఋషులు మొదలైనవారు ఆశ్చర్యపడ్డారు .దేవేంద్రుని కొడుకుకు సాటి తేజస్సుతో నెత్తురు రులాంటి యెర్రని నేత్రాలతో ఉండే అక్షకుమారుడిని క్షయం చేసి హనుమ ప్రళయకాల యముడిలాగా మళ్ళీ బహిర్ద్వారం దగ్గరకు చేరాడు విజయగర్వంతో- –‘’నిహత్య తమ్ వజ్రి సుతోప మప్రభం –కుమార మక్షం క్షత జోప మేక్షణం –తమేవ వీరో భిజగామ తోరణం –కృతక్షణః-కాలఇవ ప్రజాక్షయే ‘’.
ఇది 39శ్లోకాల 47వ సర్గ
ఇందులో ఇద్దరూ మహావీరులే .ఒకరిని చూసి మరొకరు గౌరవించుకోవటం ఆశ్చర్యం కలిగించేవిషయం .హనుమపెద్దవాడు కనుక అతికి ఈవిషయం తెలిసి ఉండచ్చు .కాని అక్షకుమారుడు బాలుడు .అతడికి ఈవిషయం తెలియటం అతడి సంస్కారం .అందుకే ఇద్దరూ నమస్కారానికి అర్హులే ఇక్కడ .వాడి పరాక్రమం చూసి మహా ముచ్చట పడ్డాడు హనుమ .వాడు ప్రయోగించిన సకల యుద్ధ విదానాలకు ‘’ఫిదా ‘’అయ్యాడుకూడా .అతని ముచ్చట ఎంతదాకా వెళ్లిందీ అంటే ఆబాలుడిని చంపటానికి మనసు రావటం లేదు అని చెప్పటం దాకా వెళ్ళింది .ఐతే అదియుద్ధం .ఎదిరి పరాక్రమానికి జేజేలు కొట్టుకొంటూ కూర్చుంటే ,వాడు ఊరుకోంటాడా ?ఉతికి ఆరేస్తాడు . సూక్ష్మగ్రాహి కనుక వెంటనే గ్రహించి ఆలస్యం చేయకుండా చంపాలని నిర్ణయానికి వచ్చి ,వేగంగా కదిలి వాడి ప్రాణాలు భీభత్సంగా హరించి తండ్రి రావణుడికి వణుకు పుట్టించాడు .కాళ్ళు పట్టి గిరగిరా వెయ్యి సార్లు తిప్పితే వాడిప్రాణాలు గాలిలోనే కలిసిపోయి జీవచ్చవంగా నేలమీద పడి చచ్చాడు .అక్షకుమారవధలో హనుమ మరో టెక్నిక్ అవలంబించాడన్నమాట .మంచి కసిపెంచే యుద్ధం మనకు చూపించాడు వాల్మీకి మహర్షి. రెండుపాత్రలను సమానంగా పోషించాడు .బలవీర పరాక్రమ ప్రదర్శన చూపించాడు .హనుమ రణ కండూతిమరికొంచెం తీరింది .
మహర్షి దగ్గర ఒక గొప్పతనం ఉన్నట్లు నాకనిపించింది .మంచి సంతోష సమయాలలో అనుష్టుప్ ను చాలా గొప్పగా వాడి కావ్య సౌందర్యం పెంచుతాడు .లంకలో చంద్రోదయం అయిఅనప్పుడు అలానే వర్ణించాడు .ఇప్పుడు ఈ సర్గ అంతా అనుష్టుప్ లోనే శ్లోకాలు రాసి అక్షయకుమారుని అక్షీణపరాక్రమానికి జేజేలు పలికించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-6-20-ఉయ్యూరు
—