ప్రపంచ దేశాల సారస్వతం
108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -2
చాసర్ మహాకవి ఇంగ్లీష్ భాషను మహా కావ్య రచనకు అనుకూలంగా సంస్కరించి ,పునరుజ్జీవన ఉద్యమానికి ఊపిరులూది ,ఇతర యూరోపియన్ భాషలలోని మంచి సంప్రదాయాలను స్వీకరించి ,కొత్త అలంకారాలతో భాషకు నగలు సమకూర్చాడు .రసాలంకార కృతులకు మార్గ దర్శిగా నిలిచాడు .డి బుక్ ఆఫ్ ది డచెస్ ,దిహౌస్ ఆఫ్ ఫ్రేమ్,ట్రాయిలస్ అండ్ క్రేసీడ్ కావ్యాలు రాశాడు .ఆయన రాసిన ‘’కాంటర్ బరీ టేల్స్’’లో ప్రతిభ శతపత్ర పద్మం లా వికశించింది .లండన్ నుంచి కేంటర్ బరీ కి యాత్రగా వెళ్ళే క్రైస్తవులు మార్గమధ్యమంలో కాలక్షేపానికి చెప్పినట్లు భావిస్తూ రాసిన కథలివి .వివిధ యాత్రికుల రూపు రేఖలు మనో వృత్తులను,శీలం, హావభావాలను అద్భుతంగా చిత్రించాడు .చాసర్ రాజాస్థాన ఉద్యోగిగా ,సైనికుడుగా ,తరచూ దేశాటనం చేసినవాడుగా తనా అనుభావాలను రంగరించి రాసిన కావ్యం .అతిసహాజ వర్ణనలకు నిలయం .చర్చి పెద్దలు మతం మాటున చేసే దుర్నీతిని మెత్తమెత్తగా మందలించాడు .సరస వ్యంగ్య హాస్యకావ్యంగా దీన్ని మలిఛి ‘’ఆంగ్ల సాహిత్య పిత ‘’అనిపించాడు చాసర్ .1343లోపుట్టి 1400లో మరణించాడు .
చాసర్ కాలం లో అంతటి ప్రతిభ ఉన్న సమకాలిక కవులు లేరు .జాన్ గవర్ ,విలియంలాంగ్ లాండ్ లు సంఘ దురాచారాలపై కావ్యాలు అల్లారు కాని కావ్యగుణ౦ లేదు .వచనరచనలో ‘’దిట్రావెల్స్ ఆఫ్ మాంటి విల్’’ప్రసిద్ధమైనది.దాదాపు వందేళ్ళు చాసర్ నే అనుకరించి కవులు రాశారు .వీరిలో జాన్ విడ్ గేట్,విలియం డన్బార్ లు మాత్రమె లెక్కలోకి వస్తారు .క్రమంగా మార్గకవిత మందగించి దేశికవిత అంటే జానపదం ప్రాధాన్యం పొందింది .జానపద గీతాలలో ‘’చేవ్వీ చేజ్’’,సర్ పాట్రిక్ స్పెన్స్ ‘’ముఖ్యమైనవి 15వ శతాబ్దం లో కింగ్ ఆర్ధర్ గురించి చిత్ర విచిత్ర కథలను సేకరించి సర్ జాన్ మెలోరి ‘’మోర్ట్ డి ఆర్ధర్ ‘’అనే వచన కథాకావ్యం రాశాడు.
విలియం కాక్ స్టన్ మొదటిసారిగా ముద్రణా యంత్రాన్ని స్థాపించి ,కొత్త తరహాపుస్తకాలు ముద్రించి ,సాంస్కృతిక పునరుజ్జీవనానికి విశేష కృషి చేశాడు .విలియం టెండేల్ మైల్స్,కవర్ డేల్ లు బైబిల్ ను ఆకర్షణీయ శైలిలో ఇంగ్లిష్ లోకి అనువదించి ఆకర్షణీయంగా ముద్రించారు .అదేసమయంలో సర్ థామస్ మూర్ ‘’యుటోపియా ‘’అనే వచనరచన చేసి ఆదర్శ సమాజ చిత్రణ చేశాడు .16వ శతాబ్దిలో సర్ థామస్ వయట్ ,ఎర్ల్ ఆఫ్ సర్రేకవులు ఇటాలియన్ చందోరీతిని అనుసరించి ఇటాలియన్ ప్రణయ కవిత్వాన్ని ఇంగ్లీష్ లో అనువ’’దించి’’ గేయకవితకు పట్టాభి షేకం చేశారు .ఇవే కాల్పనికోద్యమ లతకు పూసిన తొలిపుష్పాలు .
క్రైస్తవ మత ప్రచారానికి చర్చి లలో పర్వదినానలో మత సంబంధ నాటక ప్రదర్శనలు నిర్వహించారు.బైబిల్ కథలు అపోజిల్స్ దివ్య లీలలు ప్రదర్శించేవారు .వీటికి మిస్టరీలు అని మిరకిల్ ప్లేస్ అనీ అన్నారు .హాస్యం కూడా జోడించేవారు .క్రమంగా వీటిని చర్చికి బయట బజారులలో నిర్వహించారు .కొంతకాలానికి ‘’మొరాలిటి ప్లేస్’’అనే కొత్తనాటకాలు వచ్చాయి .పుణ్యపాప ధర్మాధర్మాలే పాత్రలుగా కల్పించి ధర్మ బోధకు ఉపయోగించారు .వీటిలో ‘’ఎవిరి మన్’’విశిష్టమైనది .వ్యంగ్య విమర్శతో ‘’ఇంటర్ లూడ్స్ ‘’కూడా వచ్చాయి .వీటిలో జాన్ హేవుడ్ రాసిన ‘’ఫోర్ పీస్ ‘’చెప్పుకో తగినది .క్రమంగా మతానికి దూరమై వినోదమే ప్రధానమైంది .
16వ శాతాబ్దానికి గ్రీక్ లాటిన్ నాటకాలు ఆధారంగా ఇంగ్లీష్ నాటకాలను తీర్చి దిద్దారు .సర్వా౦గ సుందర నాటకాలలో నికాలస్ ఉడాల్ రాసిన ‘’రాయిస్టర్ ,డాయిస్టార్’’అనే సుఖా౦తనాటకం ,టామస్ సాక్విల్,టామస్ నార్టన్ కలిసిరాసిన ‘’గార్బోడక్’’మొదటి ట్రాజెడి.నాటకానికి అధిక ప్రాధాన్యత కలిగింది .అందుకే ఈ శతాబ్దం జగత్ ప్రసిద్ధ నాటకాలకు భూమిక అయింది .మొదటి ఎలిజబెత్ రాణి పాలించిన 16వ శతాబ్ది ఉత్తరార్ధం ఇంగ్లీష్ సాహిత్యానికి స్వర్ణయుగం .దేశామంతానవ చైతన్యం వెల్లి విరిసింది .అనేక రంగాలలో దేశం అగ్రగామి అయింది .జాతీయత కొత్త చిగుళ్ళు తొడిగింది .ప్రజల ఆనంద ఉత్సాహాలు సాహిత్యంలోనూ ప్రతిధ్వనించి ప్రతిఫలించింది .మహాకవులు అనేకులు రచనలు చేశారు .యూరప్ ను చుట్టుముట్టిన సాంస్కృతిక పునరుజ్జీవనం ఇంగ్లిష్ సాహిత్యంపై గొప్ప ప్రభావం కలిగించింది .
ఎడ్వర్డ్ స్పెన్సర్ కాల్పనిక కవిత్వ లక్షణాలను అవగాహన చేసుకొని సౌందర్య భరితకావ్యాలు రాశాడు .లలితకోమల పదాలతో హృదయాలను ఆకట్టుకొన్నాడు అద్భుత శబ్ద చిత్రాలు సృష్టింఛి రసానంద పారవశ్యం కలిగింఛి తనకు తానె సాటి అనిపించుకొన్నాడు స్పెన్సర్.అతని ప్రతిభకు గీటు రాళ్ళు –‘’ది షేఫెర్డ్స్ కాలెండర్ ,యామోరెట్టీ,ఎపిథ లేమియం లఘుకావ్యాలు .కాని ఆయనకీర్తి స్తంభానికి మూలాధారం ‘’ది ఫెయిర్ క్వీన్ ‘’కావ్యం .ఇంగ్లీష్ జాతి అనుభవించిన విజయోత్సవాలను ఈ కావ్యం తేజోమయం చేసింది ‘’అతని అతులిత మాధురీ మహిమ తరతరాలకవులను ప్రేరేపించింది .శబ్ద చిత్ర కల్పనా, శయ్యా సౌభాగ్యం స్పెన్సర్ ను ‘’పొయట్స్ పొయెట్’’అంటే కవీనాం కవిః ని చేశాయి .మన పెద్దనామాత్యుడు గుర్తుకొస్తాడు .ఆకాలం లో శృంగారం అంగాంగం లో పరవళ్ళు తొక్కింది .డేనియల్,డ్రేటన్,కామ్పియన్ వీరిలో ముఖ్యులు ఇటాలియన్ సానెట్ ను ఆంగ్లం లో తీసుకొని ప్రణయకవిత్వం తో ర౦గ రించారు .స్పెన్సర్ కు మిత్రుడు ,ఆప్తుడు సర్ ఫిలిప్ సిడ్నీ ‘’ఆస్ట్ర ఫెల్ అండ్ స్టెల్లా’’ప్రణయకావ్యం రాశాడు .ఇతడే ‘’ది ఆర్కేడియా’’అనే సుదీర్ఘ వాచన కథను,’’ది అపాలజీ ఫర్ పొయెట్రి’’అనే విమర్శ గ్రంథం కూడా రాశాడు .ఇంగ్లిష్ సాహిత్యం లో కావ్య ప్రయోజనానికి దిక్సూచి సిడ్నీ రచనే .
సశేషం